Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 50


    "అందువల్లనే గదా నేనీనాడు ఇంత పచ్చగా వున్నాను" అన్నాడు ప్రసాద్ చలించకుండా.
    నిజమేనేమో అనిపించింది శేఖరానికి. ఇంతకాలం గురువుగారి మాటలు పాటించి ఇప్పుడాయనపట్ల దురభిప్రాయం ఏర్పరచుకోవడం తప్పేమోనని అతననుకున్నాడు.
    "అయితే ఎప్పుడు చేయిస్తారు నగలు?" అనడిగాడు శేఖరం ప్రసాద్ ని.
    "నిన్న, ఈ రోజు బంగారం కొట్లన్నీ సెలవు. వాళ్ళ వాడెవడో పోయాడని మూసేశారు. రేపే వెడతాను...." అన్నాడు ప్రసాద్ తాపీగా.
    ప్రసాద్ వెళ్ళే బంగారపుకొట్టు అతనికి తెలుసును. దానికి బాగా దూరంగా ఓ సందులో ఇంకో బంగారపు కొట్టువుంది. అమ్ముకునేవాళ్ళు, తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా అక్కడికే వెడుతూంటారు. శేఖరం తన తల్లి నగలు తాకట్టుకి అక్కడికే వెడుతూంటాడు.
    మర్నాడు శేఖరం ఓ నగ తీసుకుని తాకట్టుకి వెళ్ళాడు.
    "అమ్మకానికా, తాకట్టుగా?" అనడిగాడు షాపువాడు.
    "అమ్మకానికే?" అంటూ నగను బైటకు తీసి చూపించాడు శేఖరం.
    షాపువాడు దాన్ని ఎగాదిగా పరిశీలించి చూసి-"ఎక్కడిదండీ మీకిది?" అనడిగాడు.
    "మా అమ్మగారిది!" అన్నాడు శేఖరం.
    షాపువాడు వెటకారంగా శేఖరంవంక చూసి-"గిల్టుదని తెలియకుండానే వేసుకున్నారా దీన్ని మీ అమ్మగారు? లేక మీరు దీన్నావిడకు చెప్పకుండా తీసుకొచ్చారా?" అనడిగాడు.
    శేఖరానికి మతిపోయినట్లయింది - "ఏమన్నారు?" అన్నాడు.
    "ఇది గిల్టు నగ..." అన్నాడు షాపువాడు తాపీగా.
    ఎరిగున్నవాడు కాబట్టి సరిపోయింది-లేకపోతే ఇంకా ఎన్ని మాటలనేవాడో?
    దేవుడికి ఆభరణం గిల్టునగా? దేవుణ్ణి నమ్మే ప్రసాద్ ధర్మకర్తగావున్న రామాలయంలోని దేవుడి నగ గిల్టు నగ!
    శేఖరం ఇంకా ఏదో ఆలోచిస్తూండగానే ఒకావిడ షాపులోనికి వచ్చింది. ఆమె శేఖరాన్ని చూడలేదు.
    శేఖరం ఆమెను చూస్తూనే గుర్తుపట్టాడు అరుణ అని. ఆమె తనను చూస్తుందన్న భయంతో వెంటనే ఆ గిల్టు నగను అందుకుని షాపులోంచి బైటకు వచ్చేశాడు. కానీ అక్కణ్ణించి దూరం వెళ్ళలేదు. అతని చెవులు షాపులోని సంభాషణ వినడంకోసం పదునెక్కుతున్నాయి.
    "రెండు తులాలకు అర్ధణా ఎత్తుతక్కువుందమ్మా-తాకట్టా...-?"
    "తాకట్టయితే ఎంతొస్తుంది?"
    "ఎంత కావాలో చెప్పండమ్మా-బంగారం మంచిది. అమ్మితే మళ్ళీ ఇలాంటిది మీకు దొరకదు...."
    "ఏడొందలు కావాలి!" అందామె.
    శేఖరం ఒక్క క్షణంకూడా అక్కడ నిలబడలేదు.
    తను మంచితనం చూపించుకున్నా విశ్వసించలేక తన ఇంట్లోని గాజులు బంగారానివైనప్పటికీ నకిలీవని అబద్దమాడిందామె? తన బంగారాన్ని దక్కించుకోవడానికి ఆమె ఆడిన అబద్దం అది.
    భక్తులిచ్చిన బంగారాన్ని గిల్టు నగలుగా మారుస్తూన్న ప్రసాద్ వంశాన్ని తరతరాలుగా ధర్మకర్తలుగా వ్యవహరించనిస్తున్నాడు భగవంతుడు. అవి గిల్టు నగలు కాబట్టే ప్రసాద్ పూజారిని అనుమానించడంలేదు. పోయినవి మళ్ళీ చేయించి ఉదారుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు.
    దేవుడి జోలికి వెడితే సర్వనాశనమై పోతావని హెచ్చరిస్తూన్న ప్రసాద్ పచ్చదనానికి కారణం అతడు దేవుడు జోలికి వెళ్ళడమే!
    ఒక ఆడది తన బంగారాన్ని కాపాడుకోవడం కోసం అబద్దమాడింది. దేవుడామాత్రంకూడా చేయలేక దొంగలకే తనమీద పెత్తనం ఇచ్చుకుని అసహాయుడై చూస్తున్నాడు.
    ఈ దేవుడికి భయపడ్డమెందుకు?
    అయితే మళ్ళీ ఏ దేవుడి దగ్గరకు వెళ్ళనా గిల్టునగలే దొరుకుతాయన్న భయంతో ఇప్పుడు శేఖరం డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదీ ప్రసాద్ ఇంటిలోనే ప్రారంభించాలని కూడా అనుకున్నాడు. తను చెప్పినదానికి భిన్నంగా చేసే ప్రసాద్ ని మాత్రం శేఖరం మళ్ళీ సంప్రదించలేదు.


                                 -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS