"ఇందులో నేను చేసిందేమీ లేదు. అంతా మీరు చెప్పినట్లు జరిగింది-" అంది అలివేలు మధురనాయకి వంక చూస్తూ.
కాషాయాంబరధారి అలివేలువంకే చూస్తూ-"నా కిద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ చదువులకు సరస్వతులు అందంలో దేవకన్యలు. అమ్మా నాన్నా లేని కారణంగా వాళ్ళను నా ప్రాణంగా పెంచాను. ఎలా పడ్డారో వాళ్ళిద్దరూ రాఘవులు పన్నిన ఉచ్చులో పడ్డారు. ఒకరికి తెలియకుండా ఒకరిని గుళ్ళో దొంగపెళ్ళి చేసుకున్నాడు రాఘవులు. సమయం వచ్చేదాకా పెళ్ళి విషయం రహస్యంగా ఉంచాలన్నాడు.
ఇలాంటి రహస్య మెంతోకాలం దాగదు. వాళ్ళిద్దరూ గర్భవతులయ్యారు. ఇద్దరికీ భర్త ఒకడేనని తెలిసేక చెల్లెలి కోసం అక్క ప్రాణాలు తీసుకుని త్యాగం చేసింది. అప్పుడు రాఘవులు తనకు అప్పటికే పెళ్ళయిందనీ-నా చెల్లెలి గురించి తనకేమీ తెలియదనీ చెప్పాడు. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చీటీ రాసి నన్ను వదిలి వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దరూ మోసపోయారని తెలుసుగానీ ఎవరివల్ల మోసపోయారో నాకు తెలియదు. జీవితమంటే విరక్తి పుట్టింది. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు బ్రతుకుతూ, బ్రతకడానికి ప్రాణాలు నిలబెట్టుకుంటూ రోజులు గడుపుతూన్న నాకు-అనుకోకుండా నా రెండో చెల్లి దర్శన మయిందిక్కడ. ఆమెను మధురనాయకి రక్షించి బ్రతికించిందని తెలిసి సంతోషించాలో ఏడ్వాలో అర్ధం కాలేదు.
మధుర నాయకి నా కథ విని రాఘవులుకి బుద్ధి చెప్పాలంది. నా చెల్లి ద్వారా నాకు రాఘవులు ఆచూకీ తెలిసింది. రాఘవులి కెలా బుద్ది చెప్పాలా అని ఆలోచిస్తూండగా వేణు మాధవనాయ కింట్లో ప్రవేశించాడు. అప్పుడు నేను పార్వతమ్మ యింట్లో సన్యాసిగా ప్రవేశించాను. నాకు వచ్చిన హిప్నాటిజంతో నాలో మహిమ లున్నట్లామెను భ్రమపెట్టాను. చెడిన ఆడదిగా నువ్వు రాఘవులింట్లో ప్రవేశించావు వేణు బాగుపడ్డాడు. రాఘవులి అసలు రంగు బయటపడింది...."
మధుర నాయకి నిట్టూర్చి-"మోసపోయిన ఆడపిల్లలు ఆత్మహత్యలు మాని-హత్యలు చేయాలి. అప్పుడే మగాడిలో భయం పుడుతుంది. ఈ ప్రపంచంలో నే నెవరి నైనా క్షమించగలను కానీ స్త్రీని మోసం చేయాలనుకున్నవాడిని క్షమించలేను. అలాంటి వాళ్ళను వెతికి వెతికి వేటాడాలన్నది నా శపథం!" అంది.
"చెడిపోయిన కొడుకు బాగుపడ్డాడు. బాగుపడిన తండ్రి చెడిపోయాడు. చెడి బాగుపడ్డ కొడుకు బాగుపడి చెడిన తండ్రిని-ఆవేశం పట్టలేక కత్తితో పొడిచి చంపేశాడు.....శిక్ష బాగుంది కదూ!" అన్నాడు. కాషాయం బరధారి.
"బాగుపడిన కొడుకు వైభవం కళ్ళారా చూసుకోవాలని యే తండ్రికైనా ఉంటుంది. ఆ అవకాశానికి దూరం కావడానికి మించిన శిక్ష ఏ తండ్రికీ వుండదు. ఆ కొడుకే తండ్రిని హత్య చేయడం.....ఊహ కందనంత భయంకర శిక్ష.....అంది మధురనాయకి.
"స్త్రీ సంక్షేమాన్ని కోరి మీరింత దారుణానికి ఒడిగట్టగలిగారు. కానీ ఆ స్త్రీలలోనే పార్వతమ్మ వంటి త్యాగమూర్తులూ వున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళకు ప్రాణం పోస్తున్నారో, మంచితనానికి బాసట అవుతున్నారో నా కర్ధం కావడంలేదు-" అంది అలివేలు సాలోచనగా.
"పార్వతమ్మ త్యాగం కూడా స్త్రీ సంక్షేమానికే!" అంది మధుర నాయకి-"తను తప్పు చేస్తూ-కూతురు లాంటి పిల్లని కాంక్షిస్తూ-అందుకా పిల్ల బుద్దినే తప్పు పట్టిన తండ్రి ప్రవర్తన కొడుకులో ఎలాంటి ఆవేశాన్ని రెచ్చగొట్టిందో కళ్ళారా చూసిన పార్వతమ్మ-కొడుకు చేసినది మంచిపనే అని గ్రహించింది. ఆమెపై సన్యాసి మాటల ప్రభావమూ వుంది.
ఆ కత్తి కొడుకు ప్రాణాలు తీస్తుందంటే అర్ధం-అతడు దానితో హత్య చేయబడతాడనే కాదు. దానితో హత్య చేసినా-హంతకుడై ఉరితీయబడతాడు కదా! కొడుకు చంపింది ఓ దుర్మార్గున్ని! అందుకే ఆమె కొడుకును కాసేపు శాంతించమంది. ఈలోగా ఓ చీటీ రాసింది. రాఘవులు చేయబోయిన తప్పును వివరిస్తూ-ఆ ఆవేశంలో తనే అతన్ని చంపానని రాసింది. తర్వాత రాఘవులు హత్యచేయబడ్డ కత్తితో తన ప్రాణాల నంతం చేసుకుంది. హంతకుడు వేణు హంతకుడు కాకుండా తప్పించుకున్నాడు. అతడి ప్రవర్తన అతడి తల్లి చేత త్యాగాన్ని చేయించింది-...."
అలివేలు ఆలోచిస్తోంది.
వేణు హత్యకేసు నుంచి తప్పించుకున్నాడు. కానీ అతడి మనసు తప్పించుకోగలదా?
హంతకుడయిన వేణును తన భర్తగా అంగీకరించగలదా?
....కాలమే అన్ని గాయాలూ మాన్పగలదు. అన్ని పశ్నలకూ బదులివ్వగలదు.
మరో ఆరోమాసాల తర్వాత వేణు అలివేలును పెళ్ళి చేసుకున్నాడు.