Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 49


    "అయితే ఆలోచించి రేపు చెబుతాను" అన్నాడు శేఖరం.
    ప్రసాద్ అనుమతి లేకుండా అతనింతవరకూ ఏ పనీ చేయలేదు. ప్రసాద్ తెలివితేటలపైనా, విచక్షణాజ్ఞానం పట్ల అతడికి అంతులేని గురి వున్నది. అందువల్ల శేఖరం చాలాసేపు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాడు.
    నిన్నటి అనుభవం కారణంగా అతడి మనసు దేవాలయానికి వెళ్ళమని పురిగొల్పుతోంది. సాయంత్రం అయ్యే సరికి అతను ప్రసాద్ చెప్పిన ప్రకారం చేయడమే శ్రేయస్కరమని నిర్ణయించుకున్నాడు. కానీ రాత్రి భోజనాలు చేసేసరికి అతని ఆలోచన మారింది. ఏదో ఆవేశం అతన్నావహించగా సినిమాకని వంకబెట్టి అతను యిల్లు కదిలాడు.
    ఈ పర్యాయం అతడి జేబులో క్లోరోఫాం సీసాకూడా వున్నది.
    అన్ని ఆలయాల్లోకీ దొంగతనానికి అనువయినది రామాలయం ఒక్కటే.
    రామాలయం చిన్నగుడి. రాముడికీ, సీతకూ బంగారు ఆభరణాలున్నాయి. ఆలయ ప్రాంగణంలోనే పూజారి వుంటున్నాడు. పూజారి ముసలివాడు. ఒంటరిగాడు. ఆదాయము తక్కువ కావడంవల్ల ఆలయానికి రక్షణకూడా ఏమీలేదు. ఇలాంటి ఆలయాలమీద దొంగల దృష్టి వెంటనే పడదు. ఎందుకంటే చాలామంది దొంగలు దేవుడికి భక్తులే!
    శేఖరం పూజారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఓపిగ్గా ఓమూల కూర్చున్నాడు.
    ఓ రాత్రివేల పూజారి అల్పాచమనానికి తలుపు తీసుకుని బయటకు వచ్చారు. ఆయనకు దైవభక్తి మెండు. అంచేత కాస్త దూరంగానే వెళ్ళాడు. శేఖరం చటుక్కున యింట్లో దూరాడు. పూజారి మంచం మీద తలగడ క్రిందవున్న తాళాల గుత్తి తీసుకుని జేబులో వేసుకున్నాడు. మళ్ళీ బయటకు వద్దామా వద్దా అని ఆలోచించి లోపలే ఓ మూలగా వుండిపోయాడు.
    పూజారి లోపలకు వచ్చి తలుపు గడియ వేసుకుని పడుకున్నాడు. కొద్దిక్షణాల్లోనే ఆయన గుర్రుతో గదంతా నిండిపోయింది.
    శేఖరం కొద్దిగా క్లోరోఫాం జేబురుమాలుమీద పోసి పూజారిని సమీపించి ఆయన ముక్కుకు నొక్కిపెట్టి గట్టిగా అదిమాడు. పూజారి ఉలిక్కిపడ్డట్లుగా లేవబోయాడు కానీ అంతలోనే ఆయనకు స్పృహ తప్పింది.
    శేఖరం వుత్సాహంగా గదిలోంచి బయటపడ్డాడు.
    తన దగ్గరున్న తాళాల సహాయంతో గర్భగుడికి వెళ్ళాడు.
    అప్పుడతనికి ప్రసాద్ మాటలు గుర్తుకు వచ్చాయి-"దేవుడిజోలికి వెళ్ళకు. మిత్రుడిని మోసం చేయకు. సర్వనాశనమైపోయే ప్రమాదముంది...."
    శేఖరం విగ్రహాల్ని చూశాడు. ఎవరో శిల్పి అందంగా చెక్కి అక్కడ పెడితే అంతా దేవుడంటున్నారు. ఈ దేవుడి జోలికి పోవద్దని ప్రసాద్ అంత తెలివయిన వాడు కూడా తనను హెచ్చరించాడు.
    రాముడికి, సీతకు, లక్ష్మణుడికి-ఆఖరికి ఆంజనేయుడికి కూడా ఏవేవో ఆభరణాలున్నాయి. ఇదెంత అన్యాయం. ఎందరో ప్రజలు తిండికిలేక మాడి చస్తూంటే ఏమి చేయలేని ఈ విగ్రహాలకు దేవుళ్ళని పేరుపెట్టి నగలు ధరింపజేస్తున్నారు మూర్ఖులు!
    శేఖరం ఆలోచిస్తున్నాడు. ప్రజలు నిజంగా మూర్ఖులే నేమో! చూస్తూ చూస్తూ ఒక ముష్టివాడికి అయిదుపైసలు ఇవ్వలేని అమ్మ ఒకసారి పార్వతీదేవికి వెండికళ్ళు సమర్పించుకుంది. ఇలా యెందరో యెన్నో సమర్పిస్తూంటే ఈ దేవుడు మనిషికంటే సిరిసంపదలతో తులతూగుతూ వున్నాడు తప్ప మనుషులకేమీ చేయడంలేదు.
    శేఖరాని కిప్పుడు మిత్రుడి సలహా గురించిన అనుమానం లేదు. దేవుణ్ణి గురించిన భయంలేదు. తన అవసరానికి ఏ నగలు తీయాలా అని ఆలోచిస్తున్నాడు.
    మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదో, మొత్తం నగలన్నీ ఊడ్చుకు పోవడం మంచిదని అనుకున్నాడు శేఖరం.
    త్వరగా అతను వ్యవహారంలోకి దిగాడు. అయితే అతనిక్కడ చాలా తెలివిగా వ్యవహరించాడు. చూడగానే పోయాయని తెలిసేవికాక చిన్నచిన్న ఆభరణాలన్నీ తీసుకుని జేబులో వేసుకున్నాడు. వాటిలో గాజులు, గొలుసులు కూడా వున్నాయి. సుమారు అయిదారువేల రూపాయల వస్తువులని తన జేబులో వేసుకుని మళ్ళీ తలుపులు యథాతధంగా తాళం వేసాడు.
    ఎక్కడా తన వేలిముద్రలు, ఆధారాలు వదలకుండా జాగ్రత్తపడుతూ అతను పూజారి ఇంట్లోకివెళ్ళి మళ్ళీ తలగడ కింద తాళాలు పెట్టేసాడు. తలుపు దగ్గరగా లాగిగెడవేసే పద్ధతి అతనికి తెలుసు. అలాగే చేసి బయటకు వచ్చేసిన శేఖరం తనలో తనే నవ్వుకొని "ఈ దొంగతనం ఎలా జరిగిందో-దేవుడి క్కూడా తెలియదు" అనుకున్నాడు.
    రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ నగల్ని తన పెరట్లో రహస్యంగా దాచాడు శేఖరం. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాడు.
    మర్నాడుదయం ఇంట్లో కాఫీ తాగాక శేఖరం ముందు ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. అప్పటి కక్కడ రామాలయం పూజారి వున్నాడు. ఆయన్ను చూస్తుంటే కళ్ళనీళ్ళ పర్యంతం అయింది శేఖరానికి. ఆయన చంటిపిల్లాడికన్న దారుణంగా ఏడుస్తూ జరిగిన ఘోరం గురించి ప్రసాద్ కు వివరిస్తోన్నాడు. ప్రసాద్ గంభీరంగా అంతా వింటున్నాడు. అక్కడ ఒకరిద్దరు పెద్దలుకూడా వున్నారు.
    ప్రసాద్ శేఖరాన్ని చూస్తూ-"రా, కూర్చో!" అని జరిగింది అతనికీ చెప్పాడు. శేఖరం ఆశ్చర్యాన్ని నటిస్తూ అంతా విని-"దేవుడి జోలికి వెళ్ళినవాడు బాగుపడడు" అన్నాడు.
    "బాగుపడ్డంమాట అటుంచు. వాడు సర్వనాశనమవుతాడన్నదే నా బాధ!" అన్నాడు ప్రసాద్.
    "వెంటనే పోలీస్ రిపోర్టియ్యి...." అన్నాడు శేఖరం బింకంగా.
    "పోలీస్ రిపోర్టిస్తే వాళ్ళనుమానం నామీదే వుంటుంది. పరిస్థితులలా వున్నాయి. కానీ ఎవ్వరూలేని నేను అంతడబ్బు ఏం చేసుకుంటాను?" అన్నాడు పూజారి.
    "పూజారిగారూ! మీరు విచారించకండి. మిమ్మల్ని అనుమానించడం ఆ దేవుడ్ని తన్నినంత పాపం. మీ సంగతి నాకు తెలుసు. ఈ దొంగతనం గురించి పోలీసు రిపోర్టు యిస్తే మీరు యిబ్బందిలో పడతారని నాకు తెల్సు అదీగాక రామాలయంలో దొంగతనం జరిగిందంటే ఆ రాముడికీ అప్రతిష్టే! అందుకని పోయిన ఆ నగలన్నీ నేను చేయించి యిస్తాను. మీరు బాధపడకండి. ఆ రాముడి దయవల్ల తరతరాలకూ తరగని ఆస్తి మాకుంది...." అన్నాడు ప్రసాద్.
    నేను తెల్లబోయాను. నిన్న ఓ అభాగ్యురాలి గురించి ఆరొందలడిగితే లేదన్నాడు ప్రసాద్. ఈరోజు దేవుడనే రాతి బొమ్మకోసం ఆరువేలివ్వడానికి సిద్దపడుతున్నాడు. ఏమిటీ విచిత్రం?
    పూజారి అసలు దేవుణ్ణి మరిచిపోయాడు. ప్రసాదే దేవుడని ఆయన భావించాడు. అక్కడున్న పెద్దలుకూడా ప్రసాద్ ధర్మబుద్దిని ప్రశంసించగా-"గుడికి ధర్మకర్తను నేను. ఆ మాత్రం బాధ్యత స్వీకరించకపోతే ఎలా?" అని "పూజారిగారూ- ఇంకమీదట మీరు కాస్త జాగ్రత్తగా వుండండి" అని హెచ్చరించాడు ప్రసాద్.
    అంతా వెళ్ళిపోయాక శేఖరం ప్రసాద్ ని నిరసనగా మాటాడాడు-"అహా-మీ దైవభక్తి ప్రశంసనీయం..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS