"ఆలస్యం చేశానా?" అన్నాడు వేణు.
"నా మనసుకు ఆలస్యం. వాచీ ప్రకారం కాదు-....."
"ఏమిటో చెప్పాలన్నావు?"
"ఇన్నాళ్ళూ దాచిన నిజమొకటి బయటపెట్టాలను కుంటున్నాను-"
"ఏమిటది?"
"మధురనాయకి మీ నాన్న గురించి చెప్పిన విశేషం నువ్వు నాకు చెప్పావు అప్పుడే నేను నీకు నిజం చెప్పేయాల్సింది-"అంది అలివేలు.
"ఏమిటది?"
"చాలాకాలంగా మీ నాన్న నా వెంట బడుతున్నాడు-"
వేణు తెల్లబోయి-"ఏమిటీ?" అన్నాడు.
అలివేలతడికి క్లుప్తంగా రాఘవులు ప్రవర్తన గురించి చెప్పింది.
"మా నాన్న అలాంటివాడంటే నమ్మలేను-" అన్నాడు వేణు.
"అందుకే చెప్పడానికి తటపటాయిస్తున్నాను. మగాళ్ళంతా ఇంతే!"
"ఇన్నాళ్ళూ ఆగి-ఇప్పుడే యెందుకు చెప్పావు?" అన్నాడు వేణు అనుమానంగా ఆమె వంక చూస్తూ.
"ఎందుకంటే ఈ రాత్రికి మీ నాన్న నాకు శోభనం ముహూర్తం పెట్టాడు కనుక!"
"ఏమిటీ?"
అలివేలు అదోలా నవ్వి ఊరుకుంది.
"ఛీ.....ఛీ...." అన్నాడు వేణు.
ఆమె మాట్లాడకుండా అతడి వంకే చూసింది.
"నువ్వేమన్నావు?"
"ఏం చేయాలో తెలియక-ఇప్పుడునీకు చెప్పుకొంటున్నాను...."
"అమ్మకు తెలుసా?"
"అత్తయ్యకు తెలిసినా చూసీచూడనట్లూరుకుంటుంది. ఏదో విధంగా నీకూ నాకూ పెళ్ళి తప్పిపోవాలన్నది-ఆమె కోరిక!"
"ఛీ....ఛీ...." అన్నాడు వేణు.
"నావల్ల తప్పు జరిగిందని మీ ఇంట్లో నేనంటే చిన్న చూపు. నేనైతే వయసులో వున్న ఆడపిల్లను. పెళ్ళి పేరు చెబితే మోసపోగలను. కానీ మీ నాన్న కేమవసరం? ఆయనెందుకు తప్పుచేయాలనుకుంటున్నాడు?"
"ఆయనకు తెలుసు-నేను నిన్ను పెళ్ళి చేసుకొంటా నని! కొడుకు భార్య కూతురితో సమానం....! మనపెళ్ళి చెడగొట్టడానికే అయినా-ఆయన యెన్నుకొన్న పద్ధతి జుగుప్సాకరంగా వుంది. అడిగిన వెంటనే నువ్వాయన్ను సాచి లెంపకాయ కొట్టవలసింది-" అన్నాడు వేణు.
"అలా కొడితే నామాటెవరు నమ్ముతారు? అందరి దృష్టిలోనూ నేను చెడిన ఆడదాన్ని మీ నాన్న మర్యాదస్థుడు. నేనే యేదో చేశానంటారు. అందరూ యేమను కొన్నా నీ దృష్టిలో నేను చెడ్డదాన్ని కాకూడదు. అందుకే మీ నాన్నను నా గదికి ఆహ్వానించానీ రాత్రికి."
వేణు తెల్లబోయి-"నువ్వేదైనా నాటక మాడుతున్నావా?" అన్నాడు.
"నాటకం నాదే అనుకో! రాత్రి మీ నాన్న గదికి వచ్చి నాతో సరసల్లాపాలు మొదలెడితే అందులో ఆయన తప్పుందంటావా లేదా? సిగ్గులేక నేను పిలిచాననుకో ఆ వెనువెంటనే అంగీకరించడమేనా? అయన సంస్కారం?"
"అయామ్ సారీ అలివేలూ! నువ్వాయన్ను పిలుస్తావని నేననుకోను. ఆయన నీ గదికి వచ్చి తప్పుగా ప్రవర్తిస్తే-ఆ తప్పంతా పూర్తిగా ఆయనదే! అసలే నేనావేశపరుణ్ణి... ఆ సమయంలో నేనేం చేస్తానో నాకే తెలియదు....."
"ఈ రాత్రి ముందుగానే నా గదికి వచ్చి మంచం కింద దాక్కో ఏం జరుగుతుందో గమనించు. తర్వాత నేనేం చేయాలో సలహా ఇవ్వు...." అంది అలివేలు.
అప్పుడే వేణు పిడికిళ్ళు బిగుసుకోవడం అలివేలు గమనించింది.
11
ఆ రాత్రి ఉక్కగా వుందని తన మంచం పెరట్లో వేయించుకొన్నాడు రాఘవులు తనకు సాయంగా వుంటుందని పార్వతమ్మ మంచంకూడా పెరట్లో వేయించాడు.
సాధారణంగా పార్వతమ్మ అలివేలు-ఓ గదిలో పందిరి మంచంమీద పడుకొంటారు. ఆ రాత్రికి అలివేలు మాత్రమే పందిరి మంచంమీద పడుకుంది.
భార్యకూ, కొడుక్కూ మంచినీళ్ళలో నిద్రమాత్రలు కలిపిచ్చాడు రాఘవులు తండ్రిని వేయి కళ్ళతో కనిపెడుతున్న వేణు తనుమాత్రం ఆ మంచినీళ్ళు తాగలేదు. అతడు పెరట్లో పడుకొనేందుకూ అంగీకరించలేదు. పందిరి మంచం గదినానుకొనే వున్న గదిలో పడుకుంటానన్నాడు. తను నిద్రమాత్రల నీళ్ళు తాగినట్లే తండ్రిని భ్రమపెట్టి నిద్ర ముంచుకువస్తోందని తన గదికి వెళ్ళి-అక్కణ్ణించి పందిరి మంచం గదిలోనికి వచ్చి మంచం క్రింద కూర్చున్నాడు.
పార్వతమ్మ నిద్రకు పడగానే రాఘవులు లోపలకు వచ్చాడు. ఉత్సాహంగా అలివేలుతో కబుర్లు ప్రారంభించాడు. అలివేలు నర్మగర్భంగా మాట్లాడుతూంటే తనుమాత్రం సరసభాషణలు మొదలెట్టాడు.
అతడి చనువు పెరుగుతోంది.
అలివేలు అభ్యంతర పెడుతోంది.
రాఘవులు తన గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణనలో అసభ్య పదజాలాలు దొర్లుతున్నాయి. తన కొడుకును కించపరుస్తునాడు. వాడు నీకు తగ్గవాడు కాదు-నేనే నీకు తగినవాణ్ణి అంటున్నాడు.
రాఘవులప్పుడు నిషాలో ఉన్నాడు. అలివేలిచ్చిన ప్రోత్సాహపు నిషా అది! అలివేలును చూస్తున్న నిషాఅది! అలివేలుపై కోర్కె పుట్టించిన నిషా అది!
అతడి నిషా అతడి మాటలను, చేతలను అదుపు తప్పిస్తోంది. ఓ స్థితికి వచ్చేక అలివేలు ప్రతిఘటించడం మొదలెట్టింది. రాఘవులు బలం చూపించసాగాడు. ఆ వయసులో కూడా అతడి బలం అలివేలు బలాన్ని మించింది.
వేణులో ఆవేశం పెరిగింది. మంచంకింద చిన్న ట్రంకు పెట్టి వుంది. దాన్నతడు కసిగా బయటకొక తోపు తోశాడు.
చప్పుడుకు రాఘవులులిక్కిపడిలేచాడు.
అలివేలు మంచం దిగి బట్టలు సవరించుకుంది.
వేణు మంచం కిందనుంచి బయటకు వచ్చి లేచి నిలబడి తండ్రిని పట్టుకుని కుదుపుతూ-"నువ్వు మనిషివి కాదు. రాక్షసుడివి-...." అన్నాడు.
"నువ్విక్కడి కెలా వచ్చావ్?" అన్నాడు రాఘవులు తెల్లబోతూ.
"ఎలాగో వచ్చాను....నీకు నీ వయసు గుర్తుందా? వావివరుసలు గుర్తున్నాయా?" అన్నాడు వేణు.
అలివేలు అక్కణ్ణించి వెనక్కు వెళ్ళింది. మంచం కింద నుంచి సూటిగా వెళ్ళి గోడకు తగుల్కున్న చిన్న ట్రంకు మూతవిడి వుంది. ఆమె పెట్టిని సరిచేస్తూ లోపలి గుడ్డలనోసారి విదిపింది.
ఖంగుమన్న శబ్దమైంది.
పనసకాయ కత్తి ఒకటి నేలమీద పడిన శబ్ధమది!
వేణు వెనక్కు తిరిగి ఆ కత్తిని చూశాడు.
"ఇందులో నా తప్పేమీలేదు. ఈ అలివేలు కులట......ఇదే నన్ను ప్రోత్సహించి గదిలోకి రప్పించుకుంది...." అన్నాడు రాఘవులు తడబడుతూ.
"ఛీ....ది రమ్మంటే మాత్రం నీ బుద్దేమయింది?"
అలివేలు ఆ తండ్రీ కొడుకులను.....పనసకాయ కత్తిని మార్చి మార్చి చూస్తోంది. వేణు ఆమె నుద్దేశించి-"అలివేలూ! అమ్మను పీల్చుకుని రా! ఈ నీతిపరుడి అసలు రంగు బయట పెడతాను...." అన్నాడు.
అలివేలు గదిలోంచి బయటకు వెళ్ళింది. ఆమె పార్వతమ్మను నిద్రలేపుతూండగా హృదయవిదారకమైన ఆర్తనాదం ఒకటి వినబడింది.
12
"శభాష్ అలివేలూ!" అంది మధురనాయకి.
ఆ గదిలో ఆమె, అలివేలు కాక-మరో వ్యక్తి వున్నాడు. అతడు కాషాయాంబరాలు ధరించి ఉన్నాడు.
