ప్రభాకరం ఉద్యోగం ఊడింది. అది నిలబెట్టుకోవడానికతను అయిదొందలు ఎవరికో లంచమిచ్చాడు. ఉద్యోగం నిలబడింది కానీ అది మళ్ళీ ఏ క్షణాన్నయినా ఊదవచ్చు. అది శాశ్వతంగా నిలబడడంకోసం అతనికింకో వెయ్యి రూపాయలు కావాలి.
"మానాన్న ఆస్తంతా దుర్వ్యసనాలకు తగలేసాడు. అమ్మ నగలన్నీ అన్యాయంగా అమ్మేశాడు. అందుకే పెళ్ళికి నీకు రెండంటే రెండుగాజులు మాత్రం చేయించగలిగాను. అప్పుడు నేను అమ్మకు వాగ్దానం చేశాను. ప్రాణం పోయినాసరే పెళ్ళాం నగలు తాకట్టు పెట్టనని. అలా అని అమ్మమీద ఒట్టుకూడా వేశాను. ఇప్పుడు నా దగ్గర నాలుగొందలు మాత్రం వున్నాయి. ఇంకో ఆరొందలు కావాలి. రెండు రోజులపాటు నీకు కనిపించను. తర్వాత వస్తాను. ఈలోగా నువ్వీ గాజులు తాకట్టు పెట్టి మిగతా డబ్బు సిద్ధంచేసి వుంచు. ఉద్యోగం స్థిరపడ్డాక అన్ని ఖర్చులు మానుకునయినా సరే నీ గాజులు విడిపిస్తాను. గాజులు తాకట్టు పెట్టనని అమ్మకిచ్చిన మాటను ఈవిధంగా నిలబెట్టుకుంటున్నందుకు నాకు సిగ్గుగా వుంది. నన్ను క్షమిస్తావు కదూ!"
ఇదీ ఆ వుత్తరం.
ఉత్తరం చదువుతూనే శేఖరానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఉత్తరంలోంచి దీనంగా చూస్తున్న ప్రభాకరం అతని కళ్ళముందు నిలబడ్డాడు. అంతలోనే అతనికి కోపం కూడా వచ్చింది. ప్రభాకరం ఉదయం అనగా వెళ్ళిపోయాడు. ఇంతవరకూ ఈమె గాజులనెందుకు తాకట్టుపెట్టలేదు. భర్త వుద్యోగం నిలబడడం యీమెకు యిష్టం లేదా?
శేఖరం తిన్నగా అరుణ దగ్గరకు వెళ్ళి-"నీ పేరు అరుణ. అవునా?" అన్నాడు.
అవునన్నట్లు తలూపిందామె.
శేఖరం ఆమె కట్లు విప్పి నోటి గుడ్డలు తీసేసాడు.
"నీ భర్త రాసిన వుత్తరం చదివాను. నీ గాజులు నాకు అక్కరలేదు. కానీ నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇంత వరకూ అవెందుకు తాకట్టు పెట్టలేదు?" అనడిగాడతను తీవ్రంగా.
ఆమెకు దుఃఖం ఆగినట్లు లేదు. ఒక్కనిముషం వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత తఃమాయించుకుని-"యేం చేసేది? ఆయనింకా అవి బంగారపు గాజులే ననుకుంటున్నారు. ఆయన వుద్యోగం పోయినప్పుడు ఇంటి అనవసరాలు గడపడం కోసం వాటిని నేనేనాడో ఆమ్మేసాను. ఆయనకా విషయం తెలియదు. అప్పట్లో నేనిచ్చిన డబ్బు నా పొదుపరితనంతో దాచిందని నమ్ముతున్నారు. ఇప్పుడేమి చేయాలో పాలుపోవడం లేదు" అంది.
శేఖరం షాక్ తిన్నాడు. ఆ గాజుల మీద యింకా యే మాత్రం మోజువున్నా అది ఈ దెబ్బతో పోయింది.
మధ్య తరగతి సంసారాల్లో డబ్బుకు సంబంధించి యెలాంటి విషాదగాధలు?
ఆమె కుపకారం చేయాలని శేఖరాని కనిపించింది కానీ తన వల్ల ఏమవుతుందని ఊరుకున్నాడతను.
"వీలుపడితే రేపు నీకు డబ్బు తెచ్చిస్తాను. నెమ్మది మీద నాకు తీర్చుదువు గాని...." అన్నాడు శేఖరం ఆమె వంక జాలిగా చూసి.
"నాకు డబ్బిచ్చే ఉద్దేశ్యం వుంటే మళ్ళీ నువ్వు మాత్రం రావద్దు. ఎవరయినా ఆడవాళ్ళ ద్వారా పంపించు" అంది అరుణ.
ఆమె మాటలో ఎన్నో అర్ధాలు గోచరించాయి శేఖరానికి. ఒక మగవాడు మరో ఆడదానికి సాయపడగల స్థితికింకా ఎదగలేదు మన మధ్యతరగతి వ్యవస్థ. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలోకూడా ఆమె తను డబ్బు ఇస్తానంటే భయపడుతోంది. ఇంతకీ తను ఇవ్వగలడో లేదో తెలియనే తెలియదు.
శేఖరం నిరుత్సాహంగా ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు. ప్రసాద్ చెప్పిన మాటల్లోని సత్యం అతనికి గోచరించింది. మధ్యతరగతి వారి ఇండ్లలో దొంగతనాలు చేయాలంటే ఆ మనసుకు దయాదాక్షిణ్యాలు వుండకూడదు. అలా తయారు కావడం తన వల్ల కాదు.
ఆ రాత్రి మరికొన్ని గొప్పవాళ్ళ ఇండ్లముందు కూడా తచ్చాడాడు కానీ భయంకరంగా మొరిగే కుక్కలు, తుపాకీతో నిలబడ్డ వాచ్ మన్లు, గాజుపెంకులు గుచ్చిన ప్రహరీ గోడలు అతన్ని చాలా భయపెట్టాయి. సుమారు మూడు గంటల ప్రాంతంలో ఇల్లుచేరి పడుకున్నాడతను.
మర్నాడు లేస్తూనే అతను ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు.
"ఏమిటి విశేషాలు?" అన్నాడు ప్రసాద్.
"ఓ ఆరొందలు అప్పుగా కావాలి."
"ఎందుకు?"
శేఖరం రాత్రి జరిగిన కథ చెప్పాడు. అంతా విని ప్రసాద్ నిట్టూర్చి - "నీలాంటి వాడు దొంగతనానికి వెళ్ళడంవల్ల వున్న సమస్యలు పరిష్కారంకావు సరికదా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అరుణలా కష్టపడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది వున్నారు. అందర్నీ ఆదుకోవడము మనవల్ల కాదు, నీ సంగతేదో నువ్వు చూసుకోవడం మంచిది-" అన్నాడు.
"అలాంటివాళ్ళు చాలామంది వున్నారు. అరుణ సంగతి నాకు తెలిసింది కదా?" అన్నాడు శేఖరం.
"తెలుసుకోవాలనుకుంటే అరుణ సంగతికేం కర్మ-ఇంకా చాలావున్నాయి. ఆ మాటకొస్తే మీ నాన్నే వున్నాడు" అన్నాడు ప్రసాద్.
శేఖరానికి చురుక్కుమంది. చెల్లెలు పెళ్ళీడుకొచ్చింది. ఓ పక్క సంబంధాలు చూస్తూనే ఇంకోపక్క కట్నండబ్బు కోసం ప్రయత్నిస్తోన్నాడు తండ్రి. తన నాయన యేమీ అనడంలేదు, అడగడం లేదు-కానీ ఎదిగిన కొడుకుగా తనాయనకు ఏం సాయపడుతున్నాడు?
"అవును-నిజమే!" అన్నాడు నెమ్మదిగా శేఖరం.
"అరుణకయినా, నీ తండ్రికయినా సాయపడాలనుకుంటే అందుకు మార్గం అప్పులు కావు. స్వయం సంపాదన...." అన్నాడు ప్రసాద్.
"సరే-గురువుగారూ-ఈరోజు దేవాలయంలో దొంగతనం చేస్తాను...." అన్నాడు శేఖరం.
"దేవాలయంలోనా?" తడబడుతూ అన్నాడు ప్రసాద్.
తన గురువుగారు అంతలా తడబడటం శేఖరమెప్పుడు చూడలేదు.
"అవును-ఏం?" అన్నాడతను.
"దేవుడి జోలికి వెళ్ళినవాడూ, స్నేహితుని కన్యాయం చేసినవాడూ సర్వ నాశనమై పోతాడు."
శేఖరం నిరుత్సాహ పడ్డాడు. "మీరు దేవుణ్ణి నమ్ముతారా?" అన్నాడు.
"నమ్మడమేమిటి? రామాలయానికి తరతరాలుగా మా వంశమే గదా ధర్మకర్తృత్వం వహిస్తున్నది" అన్నాడు ప్రసాద్ హుందాగా-"ఆ దేవుడి చలవ వల్లనే మేమూ పచ్చగా వున్నాం."
"జనతాపార్టీ పవర్లోకి వస్తే కొందరికి లాభం. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే కొందరికి లాభం. అందరికీ లాభంగా వుండే పార్టీ ఈ దేశంలో యింకా పుట్టినట్లులేదు. దేవుడి వ్యవహారానికీ ఈ పార్టీల వ్యవహారానికీ అట్టే తేడా కనబడటం లేదు నాకు. దేవుడు మీకు మంచి చేసాడు కాబట్టి మీ రాయన్ను నమ్ముతున్నారు. నాకు చేయలేదు కాబట్టి నేనాయన్ని ద్వేషిస్తాను. దేవాలయంలో దొంగతనం చేస్తాను. సాధారణంగా దేవుడి దగ్గరకు చేరేది దొంగసొమ్మేకదా-అందులో నేనూ కాస్త వాటా తీసుకోడంలో తప్పులేదు" అన్నాడు శేఖరం.
"నా మాట విని కాస్త శ్రద్దగా ఆలోచించు. నీ పాడు ఆలోచన మాను" అంటూ మొదటిసారిగా సలహా నిచ్చాడు ప్రసాద్.
