Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 48


    "ఇది చాలా అన్యాయం-"అందామె అసహాయంగా.
    "నువ్వు నాకు సహకరిస్తే నీ కన్యాయం జరుగదు-" అన్నాడు సుందర్రాజు.
    "అంటే?"
    "నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను-...."
    "ఈ మాట ముందే చెప్పాల్సింది. నీవంటి సంగీత విద్వాంసున్ని పెళ్ళిచేసుకొనే అవకాశం నా అదృష్టంగా భావిస్తాను-" అంది అలివేలు.
    సుందర్రాజు ముఖం వికసించింది-"ముందుగా చెప్పకపోవడం నా పొరపాటే?" అన్నాడు.
    "ఈ రోజుకు నన్ను వదిలిపెట్టు పెద్దలు అనుమతిస్తే మనం గుళ్ళో పెళ్ళి చేసుకుందాం. పెళ్ళికి ముందిలా నాకు నచ్చదు-...."
    "పెద్దల అనుమతి గురించి నువ్వు బెంగపడకు. రాఘవులు మన పక్షమే!" అన్నాడు సుందర్రాజు.
    "నీకెలా తెలుసు?"
    "నిన్నాయన నా దగ్గరకు సంగీతానికి పంపింనదెందుకనుకున్నావ్?"
    అలివేలుకు క్షణంలో అంతా అర్ధమయింది అయితే ఆమె బయటపడకుండా-"మాటమాత్రంగా విషయ మింట్లో చెప్పడం నాకు మర్యాద! నన్నాదరించినవారి ఆశీర్వాదం పొందకుండా యే నిర్ణయం తీసుకోలే -" అంది.
    సుందర్రాజామె మాటలు నమ్మాడు ఆరోజుకామెను వదిలిపెట్టాడు.
    
                                     8

    ఇట్లు చేరుకున్నాక అలివేలు బాగా ఆలోచించింది. విషయాన్ని వేణుదాకా వెళ్ళనివ్వకూడదని ఆమె అనుకొంది. అందుకే ఫోన్ లో మధురనాయకికి జరిగింది చెప్పింది.
    మధురనాయకి మనుషుల్ని పంపించింది. సుందర్రాజుకు దేహశుద్ధి జరిగింది. మరోసారి అలివేలు జోలికి వెడితే ప్రాణాలుకూడా దక్కవన్న హెచ్చరికకూడా అందింది.
    సుందర్రాజు రాఘవులికి చెప్పుకొని లబోదిబో మన్నాడు. ఏం జరిగివుంటుందో రాఘవులూహించాడు.
    "నువ్వోపని చేయి. తన ప్రియుణ్ణి కలుసుకుందుకు అలివేలు నీ ఇల్లు ఎన్నుకుందనీ--నువ్వది కొనసాగనివ్వక పోతే ఆమె ప్రియుడు నిన్ను చావదన్నాడనీ వేణుకు చెప్పు."
    "అందువల్ల నాకేం ప్రయోజనం?"
    "ఏమిటా? అలివేలు ఆశలన్నీ మావాడిమీదే-నువ్వాదారి మూసేయాలి. అప్పుడామెకు నువ్వు తప్పవేరే దిక్కుండదు-....."
    సుందర్రాజుకీ పథకం నచ్చింది. అతడు రాఘవులు చెప్పినట్లే చేశాడు. అతడు చెప్పింది విని వేణు ఆశ్చర్యపడ్డాడు. అయితే అతడు తొందరపడకుండా నిదానించాడు. ముందుగా మధుర నాయకిని కలుసుకొని అలివేలు బుద్ధి మంచిది కాదన్నాడు.
    మధుర నాయకి అతడు చెప్పింది విని -"అసలు జరిగింది తెలిస్తే నువ్వాశ్చర్యపడతావు మీ నాన్నకు అలివేలు నీ భార్య కావడం ఇష్టంలేదు...." అంటూ జరిగింది వివరంగా చెప్పింది.
    "అలివేలు చేసిన తప్పేమిటి?" అన్నాడు వేణు ఆశ్చర్యంగా.
    "చెడిన ఆడది-"
    "నాకు లేని అభ్యంతరం మా నాన్నకెందుకు?"
    "మీ నాన్న పెంపకంలో నువ్వు ఇరవై యేళ్ళకు పైగా పెరిగావు. ఆ పెంపకం నిన్నెలా తీర్చిదిద్దిందోనీకు తెలుసు. కొద్దిరోజుల పరిచయంతో నేను నిన్నెంత ఎత్తుకు తీసుకొనిపోయానో నీకు తెలుసు. మీ నాన్నకు నావంటి స్నేహితులు లేక సంస్కారంలో ఎదగలేక పోతున్నాడు-" అంది మధురనాయకి నిరసనగా.
    "నీకు భయంలేదు. నాన్న నెదిరించైనా సరే-నేను అలివేలును పెళ్ళి చేసుకుంటాను-" అన్నాడు వేణు.
    "అలాగే-కానీ ముందు నా బాకీ తీర్చినాకనే నీ పెళ్ళి-ఈ విషయం మర్చిపోకు-" అంది మధురనాయకి.
    వేణు నిట్టూర్చి ఊరుకున్నాడు.
    "దిగులుపడకు. నువ్వు అలివేలునోకంట కనిపెట్టి కాపాడుకుంటూండు. నీవల్లకాని పనుంటే నా దగ్గరకు రా!" అంది మధురనాయకి.

                                   9

    "ఎవరూ?" అన్నాడు రాఘవులు.
    ఇంట్లో ఆయనొక్కడే వున్నాడు. పార్వతమ్మ పొరుగింటికి వెళ్ళింది. ఆ రోజాయన ఆఫీసుకు సెలవు వేణుమాత్రం ప్రెస్ పనిమీద బయటే తిరుగుతున్నాడు.
    కుంటుకుంటూ లోపలకు వచ్చింది అలివేలు.
    "ఏమయింది?" అన్నాడు రాఘవులు.
    అలివేలు ఆయన దరిదాపుల్లో మసలడం అరుదుగా జరిగేది. ఆమె యెప్పుడూ పార్వతమ్మనంటిపెట్టుకొని తిరిగేది. అరుదుగా రాఘవులు కళ్ళపడడం జరిగేది.
    "కాలిలో ముల్లు దిగింది మామయ్యా!" అంది అలివేలు.
    పిన్నీసుతో ఆమె పాదాల్లో ముల్లును వెతకడానికి ప్రయత్నించిన రాఘవులికప్పుడు హృదయంలో యేదో ముల్లు గుచ్చుకుంది. తను భ్రమపడుతున్నాడో నిజంగా జరుగుతోందో తెలియదు గానీ అమాయకంగా నటిస్తూనే రాఘవుల్ని రెచ్చగొట్టింది అలివేలు.
    ఆరోజుకది ప్రారంభం మాత్రమే!
    క్రమంగా రాఘవులలో అలివేలుపట్ల మోజు కలిగింది. పెరిగింది. ఆమెనతడు స్త్రీగా గుర్తించాడు. ఆ గుర్తింపతడిలో కొత్త కోర్కెలు చిగురింపజేసింది.    చివరకు వీలున్నప్పుడల్లా ఆయన కాస్త చనువు చూపించసాగాడు.
    అలివేలు ఆయన్ను ప్రోత్సహించిందే తప్ప నిరుత్సాహపర్చలేదు.
    జగన్మోహినీ అవతారానికి పరమశివుడు చలించి పోయాడు. భస్మాసురుడు భస్మమయ్యాడు. రాక్షసు లమృతాన్నే వదులుకున్నారు.
    రాఘవులుకి వావివరుసలు గుర్తుంటాయా?
    ఆయన తన మనసులోని తప్పును గుర్తించడానికి బదులు-అలివేలు గత జీవితంలోని తప్పును వెదకసాగాడు.
    అలా వారంరోజులు గడిచేసరికి ఒకరోజున ఆయన అలివేలుతో-"నువ్వు చాలా అందగత్తెవి-" అన్నాడు.
    "నా సంగతి నువ్వు చెప్పావు. నీ సంగతి నేను చెప్పనా?" అంది అలివేలు.
    "ఊఁ" అన్నాడు రాఘవులు.
    "వేణుకి నువ్వు తండ్రిలాకాక అన్నయ్యలా కనిపిస్తావు-" అంది అలివేలు.
    అప్రయత్నంగా రాఘవులు చేయి తన గుబురుమీసాల పైకి వెళ్ళింది.
    "చెప్పాలంటే నాకు నువ్వంటే నే యిష్టం-" అంది అలివేలు.
    రాఘవులు తెల్లబోయాడు.
    "అత్తయ్యిష్టపడితే నాకు నిన్ను రెండో పెళ్ళి చేసుకోవాలనుంది-...."
    రాఘవులు చితానుచితాలు మరచి, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి అలివేలును కౌగలించుకొన్నాడు. ఆమె అతణ్ణి మృదువుగా విదుల్చుకొని-"ఇదికాదు సమయం!" అంది.
    "మరెప్పుడు?"
    "ఈ రాత్రికి...." అంది అలివేలు.
    "నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?" అన్నాడు రాఘవులు.
    "ఊఁ."
    "ఎందుకని?"
    "నీ కొడుకు వేణు గతం మంచిదికాదు. అతడంటే నాకు అసహ్యం. నువ్వెంతో మంచివాడివి. ఉన్నతుడివి. నీవంటి వాడికిల్లాలినైతే ఇహమూ, పరమూను...."

                                  10

    ప్రెస్ నుంచి తిన్నగా పార్కుకు వెళ్ళాడు వేణు. అప్పుడక్కడ అలివేలు యెదురుచూస్తూ వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS