Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 47


                                   కొత్తదొంగ

    శేఖరానికి ప్రసాద్ గురుతుల్యుడు. మంచిచేసినా చెడు చేసినా ప్రసాద్ తో చెప్పకుండా, అతన్ని సంప్రదించకుండా ఏమీ చేయడు శేఖరం.
    శేఖరం బియ్యే ప్యాసయ్యాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. దొరకలేదు. లంచమిస్తే ఉద్యోగం దొరుకుతుందంటే అప్పుచేసిన డబ్బుతెచ్చి లంచమిచ్చాడు. కానీ మోసపోయాడు. ఆ నష్టం పూడ్చడంకోసం కోమటి కొట్లో పద్దులు రాశాడు. ఆ పద్దుల్లోని అన్యాయాన్నతను సహించలేకపోయాడు. కానీ అప్పు తీర్చడంకోసం పది నెల్లు ఆ పని చేశాడు. అప్పు తీరగానే ఆ ఉద్యోగం మానేశాడు.
    తర్వాత శేఖరం చిన్న వ్యాపారం ప్రారంభించాడు. న్యాయంగా వ్యాపారం చేయడంవల్ల చాలా నష్టాలు కనబడ్డాయతనికి. ఎందరో అధికార్లు, ఎన్నో లంచాలు.....ఈ కారణంగా వ్యాపారస్థుడికి న్యాయంగా వుందామన్నా కుదిరేలా లేదు. అందులోని సాధక బాధకాలర్ధంకాగానే శేఖరం వ్యాపారాన్ని కట్టిపెట్టి-పెట్టుబడికని తెచ్చిన అప్పు తీర్చివేశాడు.
    ఇంతవరకూ శేఖరం తండ్రికి ఏమాత్రమూ ఉపయోగపడలేదు. శేఖరం తండ్రికి కొడకు సంపాదించకపోయినా ఫరవాలేదనుకునేటంత ఆస్తిలేకపోయినా అభిమానంమాత్రం వుంది. ఆయనెప్పుడూ కొడుకును దేనికీ పల్లెత్తుమాటనలేదు.
    అంతవరకూ చేసిన పనులన్నీ ప్రసాద్ తో సంప్రదించే చేశాడు శేఖరం.
    ప్రసాద్ కు ఆస్తి వుంది. ఉద్యోగమూ వుంది. నీడ పట్టున వుండడంవల్లనేమో ప్రతి విషయాన్నీ అటూ ఇటూ కదిపి కుదిపి ఆలోచించగల సమర్ధత వుందతనికి. ప్రసాద్ ఎదుటివాళ్ళ కెప్పుడూ సలహాలివ్వడు. వాళ్ళేమైనా చేయాలంటే కాదనడు. అందులోని మంచిచెడ్డలు వివరించి చెప్పిదాన్నిబట్టి ఆలోచించుకోమంటాడు.
    శేఖరం ప్రసాద్ ని కలిసి - "గురువుగారూ! డబ్బు సంపాదించడానికి 'మోసం, అన్యాయం తప్పదని తెలిసి పోయింది. అలాంటప్పుడు వ్యాపారం. ఉద్యోగం అనేపేర్లమరుగున డబ్బు సంపాదించడం నాకిష్టం లేదు. తిన్న గానే రంగంలోకి దిగుదామనుకుంటున్నాను...." అన్నాడు.
    "అంటే ఏం చేస్తావ్?" అనడిగాడు ప్రసాద్.
    "దొంగతనం చేద్దామనుకుంటున్నాను-" అన్నాడు శేఖరం.
    "పట్టుబడకుండా చేయగలిగితే దొంగతనం మంచిదే!" అన్నాడు ప్రసాద్ శేఖరం మాటలకు ఏమీ చలించకుండా.
    శేఖరం ఆశ్చర్యపడుతూ-"అయితే మీ రంగీకరిస్తున్నారా?" అన్నాడు.
    "ఊఁ కానీ నా ఇంట్లో మాత్రం చేయవద్దు" అన్నాడు ప్రసాద్.
    శేఖరం సంతోషంతో ప్రసాద్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
    "ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, గొప్పవాళ్ళింట్లో దొంగతనం చేసినా వాళ్ళకు నష్టమేమీ కలగదు. అయితే వాళ్ళకు రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా వుంటాయి. మధ్య తరగతి వాళ్ళకు రక్షణ ఏర్పాట్లు తక్కువ. వాళ్ళింట్లో దొంగతనంచేయాలనుకుంటే మనసులో దయాదాక్షిణ్యాలకు చోటివ్వకూడదు."
    "దొంగతనాల్లో ఆరితేరేవరకూ మధ్యతరగతి ఇళ్ళనే దోస్తాను. నా మనసులో దయాదాక్షిణ్యాలకు ఇసుమంతైనా చోటులేదు" అంటూ శేఖరం అక్కణ్ణించి ఉత్సాహంగా బయల్దేరాడు. తన గురువుగారి ఆమోదం అంత సులభంగా లభిస్తుందని అతడనుకోలేదు.
    శేఖరం ఆ రాత్రే ఓ ఇంటికి వెళ్ళాడు. ఇంటామె భర్త ఆరోజే ఊరుకు వెళ్ళడమూ - ఇంట్లో ఆమె ఒక్కర్తి మాత్రమే వుండడమూ తెలుసుకునే అతనా ఇంటి నెన్నుకున్నాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతనామె ఇంటి తలుపుతట్టాడు. ఆమె తలుపుతీసే సమయానికి ముఖం కనిపించకుండా రుమాలు అడ్డం పెట్టుకున్నాడు.
    ఆమె తలుపుతీసి-"ఎవరు?" అనబోయి ఆగిపోయింది. అతడి చేతిలోని కత్తిచూసి అప్రయత్నంగానే ఆమె వెనుకడుగు వేసింది.
    శేఖరం ముందడుగువేసి-"అరవడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి" అంటూ లోపలకు ప్రవేశించి తలుపు గడియవేసి-"నేను దొంగను-దొంగతనానికి వచ్చాను" అన్నాడు. ఇదే అతనికి మొదటి దొంగతనం కావడంవల్ల చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి.
    ఆమె భయంతో వణికిపోతూ  ఏదో మాట్లాడాలని ప్రయత్నించి విఫలురాలైంది.
    తన్నుచూసి ఆమె వణుకుతోందని అర్ధమయేక శేఖరానికి వణుకు తగ్గింది - "నువ్వేమీ భయపడకు. నిన్నేమీ చేయను. నాకు డబ్బు కావాలి. అంతే!" అన్నాడతను.
    "డబ్బా?" అందామె ఇంకా వణుకుతూనే.
    "అవును" అన్నాడు శేఖరం.
    "నన్ను చంపేసినా ఫరవాలేదు. డబ్బు మాత్రం అడక్కు" అందామె.
    "నిన్ను చంపితే నాకేం వస్తుంది. నాకు డబ్బే కావాలి?" అన్నాడు శేఖరం. లోలోపల అతను నవ్వుకున్నాడు కూడా. చావుకు భయపడని మనిషైతే ఈపాటికి గట్టిగా అరిచికేకలు పెట్టి వుండేది. తను చంపుతాడన్న భయముండడం వల్లనే చెప్పినట్లు వింటోంది.
    "ఇంట్లో డబ్బులేదు" అందామె.
    "అది నేను వెతుక్కుంటాను. నువ్వలా బుద్దిగా కుర్చీలో కూర్చో" అన్నాడు శేఖరం. ఆమె కుర్చీలో కూర్చున్నాక అతడామెను కుర్చీకి తాళ్ళతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కాడు. తర్వాత నెమ్మదిగా ఇల్లంతా శోధించాడు. ఇంట్లో యెక్కగా అతనికి డబ్బుగానీ, నగలుగానీ, ఖరీదైన సామాను కానీ కనబడలేదు. అతను వెతకడానికింక మంచం ఒక్కటే మిగిలింది.
    అది పూర్వకాలపు పందిరి మంచం మంచం పరుపు ఎత్తగానే తలదిక్కున అతఃడికి మంచంలోకి అమర్చబడి వున్న ఓ పెట్టె కనబడింది. శేఖరానికి ఉత్సాహం వచ్చింది. దానికి తాళంకూడా లేదు.
    ఆ పెట్టెలో ఓ భరిణ వుంది. ఆ భరిణలో రెండు గాజులున్నాయి. గాజులు రెండూ తళతళ మెరుస్తున్నాయి. అవి తప్పక బంగారానివే అయుండాలి. బంగారానివి కాకపోతే అంత భద్రంగా దాచరు.
    శేఖరం గాజులు రెండూ జేబులో వేసుకుని భరిణ మళ్ళీ పెట్టిలో పెట్టబోయి ఆగిపోయాడు. అక్కడ ఆ స్థానంలో ఒక చిన్న వుత్తరం వుంది. దానిపైన పెద్ద అక్షరాలతో - "ప్రియమైన అరుణా!" అని వుంది.
    అది తప్పకుండా ఒక భర్త భార్యకు రాసిన ఉత్తరమై వుండాలని ఊహించాడు శేఖరం. ఆ ఉత్తరం చదవడానికథను కొద్ది క్షణాలు తటపటాయించాడు. అతనిలోని సంస్కారం ఓ మూల వెన్ను తడుతూంటే - దొంగ వయ్యావు, నీకు సంస్కారమేమిటిలే-అంటూ అంతరాత్మ వెక్కిరించింది.
    శేఖరం ఆ ఉత్తరాన్ని చదివాడు.
    అరుణ భర్త ప్రభాకరం ఆ ఉత్తరం భార్య అరుణకు రాశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS