Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 47


    పార్వతమ్మకు బదులేం చెప్పాలో తెలియలేదు.
    అప్పట్లో ఆమెకు అలివేలు గురించిన అసలు కథ తెలియదు.
    వేణు చటుక్కున పార్వతమ్మకు పాదాభివందనం చేశాడు.
    "ఏమిట్రా యిది!" అంటూ కొడుకును లేవనెత్తింది పార్వతమ్మ.
    "నిన్ను చూస్తే నా కెంతో సంతోషంగా వుందమ్మా!" అన్నాడు వేణు.
    "ఎందుకని?"
    "మధురనాయకి అనే ఆమె వేశ్యగానే ఈ ఊళ్ళో చాలామందికి తెలుసు. కానీ సమాజానికి ఆమె చేస్తున్న సేవ ఉడతాభక్తికి మించినది. అందానికి అప్సరస అయిన అలివేలును తన స్వార్ధానికి కూడా ఉపయోగించుకోకుండా-ఆమె కోసం నన్ను కూడా బాగుచేయాలని సంకల్పించి ఫలితం సాధించిందామె. సంప్రదాయాల కనుగుణంగా జీవిస్తూన్న నీవు-చెడును కొడుకు దూపంలో కూడా భరించలేక ఇంట్లోంచి బయటకు గెంటినప్పుడు-నువ్వు-నా కన్నతల్లి వైన నువ్వు మధురనాయకి కాలిగోటికి కూడా సరిపోవాలని వ్యక్తివైనందుకు నా కెంతో బాధ కలిగింది.
    అయితే చెడిపోయిన ఆడదాని తెలిసి కూడా అలివేలును యేడాది నుంచి కన్నబిడ్డలా ఆదరించి అభిమానించ గలుగుతున్న నువ్వు-ఆ మధురనాయకి కంటే యెన్నో రెట్లు గొప్పదానివి, ఎందుకంటే మూఢనమ్మకాలతో, సంప్రదాయపు వాసనలతో, సదాచారా లనబడే అనాచారాలతో-ప్రాణంలో ప్రాణంగా పెరిగిన మనిషివి నువ్వు. నీలో యింతటి విశాల హృదయం అపూర్వం-" అన్నాడు వేణు.
    కన్నకొడుకులో ఇంతటి ఆలోచనాశక్తి ఉన్నదని తెలియని పార్వతమ్మ ఆశ్చర్యంగా అతడివంకే చూస్తూండి పోయింది. అయితే అతడి పొగడ్తలామెకు సంతోషాన్ని మాత్రం కలిగించలేదు.

                                     6

    "అబ్బాయా పిల్లంటే చాలా మోజులో వున్నాడు. వాడిలో యిప్పుడు మంచి మార్పు వచ్సినట్లనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్ళి జరిపించడమే మంచి దేమో-లేకుంటే మనసు పాడై మళ్ళీ పాత బుద్ధులు వచ్చేస్తాయేమో మన వేణుకి-" అంది పార్వతమ్మ.
    "అలాంటి భయాలేం పెట్టుకోకు. అయినింటి సంబంధాలు క్యూలో నిలబడి వుంటే అలవేలులాంటి పిల్లను చేసుకునే కర్మ మనకేం పట్టిందీ-" అన్నాడు రాఘవులు.
    "అయితే మనమిప్పుడేం చేయాలి?"
    "అబ్బాయి మనసా పిల్లమీద పూర్తిగా విరిగిపోవాలి-"
    "అదెలా సాధ్యం?"
    "నువ్వు వాడికి నచ్చజెప్పు- ఆ పిల్ల బుద్ధి మంచిది కాదని!"
    "చెబుతాను కానీ వాడది నమ్మొద్దూ?"
    రాఘవులు కాసేపాలోచించి-"అలివేలుని సుందర్రాజు దగ్గరికి సంగీతానికి పంపించు-" అన్నాడు.
    "సుందర్రాజా-.....వాడి కసలే మంచి పేరులేదు-"
    "మంచి పేరు లేదు కాబట్టే?!" అన్నాడు రాఘవులు.
    భర్త ఆలోచన పార్వతమ్మకు కొంతవరకూ అవగతమయింది.
    సుందర్రాజు సంగీత మేస్టరు, బాగా పాడతాడని పేరు. కాని ఆడపిల్లలను చూస్తూ కూర్చోలేడు. బుద్ధిగడ్డి తింటూనే ఉంది-యెంతమంది గడ్డి పెట్టినప్పటికీ కూడా! చూసి చూసి యెవరూ ఆడపిల్ల ల్నతడి దగ్గరకు పంపించరు.
    "అలివేలు ఒప్పుకుంటుందా?"
    "అబ్బాయికి సంగీతమంటే యిష్టమని చెప్పు!" అన్నాడు రాఘవులు-"సుందర్రాజు గురించి ఆమె కెలాగూ తెలియదు-...."
    "సరే-సంగీతానికి వెడుతుంది-అప్పుడు?" అంది పార్వతమ్మ.
    "ఆ సంగతి నేను చూసుకుంటాను-" అన్నాడు రాఘవులు.
    పార్వతమ్మ అలివేలు దగ్గర కెళ్ళింది.
    రాఘవులు సుందర్రాజు దగ్గర కెళ్ళాడు.
    "సుందర్రాజూ! మా యింట్లో అలివేలని ఓ అమ్మాయుంది. దూరపుబంధువు లమ్మాయి. మెరుపు తీగలా వుంటుంది. అద్భుతమయిన గొంతు. నీకు శిష్యురాలిని చేయాలని నా కోరిక యెందుకో తెలుసా?" అన్నాడు రాఘవులు.
    "ఎందుకు?"
    "నువ్వామెను పెళ్ళి చేసుకుంటే ఈడూ జోడూ బాగుంటుంది. ఇద్దరూ ఉమ్మడి కచేరీలు చేసి లక్షలార్జించవచ్చు-....." అన్నాడు రాఘవులు.
    అందమయిన పిల్లను పెళ్ళాడి-ఆ పిల్లకు సంగీతం నేర్పి-ఆమె ద్వారా లక్ష లార్జించాలన్న కోర్కె సుందర్రాజుకు వయసొచ్చినప్పట్నించీ వుంది. అతడి వయసిప్పుడు ముప్పై. ఇంతవరకూ యే అందగత్తె అతణ్ణి కరుణించలేదు.
    "ఆ అమ్మాయి నన్ను పెళ్ళి చేసుకుంటుందా?"
    "అంత సులభంగా ఒప్పుకోదు. ప్రస్తుతానికి మా వాడిమీద కన్నేసింది. ఆ పిల్ల అందానికి లొంగిపోతా డేమో మా వాడని భయం. నీ దగ్గరికి పాఠాలకు పంపిస్తాను. నువ్వామెను వశపర్చుకోగలిగితే నీకే యిచ్చి పెళ్ళి చేస్తాను-...."
    "ఓహో-అదన్న మాట కథ!"
    "నీ కిష్టం లేదంటే చెప్పు అలివేలుకు వేరే సంబంధం చూడగలను....."
    "నా దగ్గరకు పంపించండి. మీ కింక వేరే సంబంధం చూడాల్సిన అవసరముండదు-" అన్నాడు సుందర్రాజు.
    ఇలాంటి ప్రోత్సాహమేమీ లేకుండానే సుందర్రాజు మనసు చెడ్డది. రాఘవులగ్నికి ఆజ్యం పోశాడు.
    పార్వతమ్మ అలివేలును సుందర్రాజు దగ్గర సంగీతం నేర్చుకునేందుకు ఒప్పించింది. అలివేలతడివద్దకు సంగీతానికి వెళ్ళ నారంభించింది.
    
                                        7

    సుందర్రాజు అలివేలుతో మొదటి రోజెంతో జాగ్రత్తగా వున్నాడు. ఆమె అందం మాత్రం అతడికి వెర్రెత్తించింది. రెండోరోజు తాళం పేరు చెప్పి తన చేతుల్ని ఆమె తొడలపై వేశాడు మృదువుగా ఆమె తొలగించింది. క్రమంగా జావళీలకు అర్ధాలు వివరిస్తూ చనువు పెంచసాగాడు.
    "మేస్టారూ-మీ వరస బాగోలేదు...." అంది అలవేలొక రోజున.
    "అది నేను కట్టిన వరస కాదు-అన్నమయ్యది-" అన్నాడు సుందర్రాజు.
    "నేను చెబుతున్నది మీ వరస గురించి-"
    "ఏ వరస?" అన్నాడతడేమీ ఎరుగనట్లు.
    "మీ ప్రవర్తన బాగోలేదు-....."
    "నేనేం చేశాను?"
    బదులివ్వకుండా కోపంగా అతడివంక చూసింది అలివేలు.
    "ఏం చేశానో చెప్పు-" అన్నాడు సుందర్రాజు.
    "మీకే తెలుసు-...."
    "తెలిసినా సరే-నీ నోట వింటే బాగుంటుంది...."
    సుందర్రాజు ధైర్యానికి అలివేలు ఆశ్చర్యపడింది. తానతడి ప్రవర్తనకు అభ్యంతరం చెప్పింది. అతడేం చేశాడో తన నోట వినాలనుకుంటున్నాడు.
    ఆమె మౌనం వహిస్తే అలుసుగా తీసుకుని సుందర్రాజామె భుజం చుట్టూ చేయివేశాడు.
    "వదులు-" అంది అలివేలు.
    "వదలను-" అన్నాడు సుందర్రాజు.
    ఆమె విదిలించుకోబోయింది. అతడామె కంటే బలవంతుడు.
    ఆమె తిట్టింది. అతడామెకంటే మొండివాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS