Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 46


    వెంకన్న ఏదో అనబోతూండగా - "అన్నయ్య వేలి ముద్రలు మీవద్ద వున్నాయా?" అన్నది వనజ.
    "ఉన్నాయి" అన్నాడు వెంకన్న.
    "డిటెక్టివులు-మీవద్ద సిగ్గుపడి ప్రమాదం తెచ్చుకోలేను" అన్నదామె. ఆమె ఆడదేనని ఋజువు కావడానికి కొద్దిక్షణాలు పట్టింది.
    "అయామ్ సారీ..." అన్నాడు వెంకన్న.
    "ఇట్సాల్ రైట్...." అంది వనజ.
    "ఇప్పుడు మీ అన్నయ్య గురించి చెప్పండి" అన్నాడు వెంకన్న.
    "అన్నయ్య పరారీ అయి తిరుగుతున్నాడు. వాడు విశాల అనే అమ్మాయిని హత్యచేసినట్లు తిరుగులేని సాక్ష్యాలున్నాయి...." అంది వనజ.
    "విశాల హత్య నేను పరిశోధిస్తున్నాను. మీ అన్నయ్యకూ ఆ హత్యకూ ఏ సంబంధమూ లేదు...." అన్నాడు వెంకన్న.
    "లేదు..." అంది వనజ-"కానీ కోర్టుగురించి నే నంటున్నాను...."
    "నేనూ కోర్టుమాటే చెబుతున్నది....." అన్నాడు వెంకన్న.
    "విశాల అన్నయ్యమీద అబద్దపు టారోపణలు చేస్తోంది. అతడు తన్ను ప్రేమ పేరు చెప్పి మోసం చేశాడంది. కోపంలో అన్నయ్య ఆమెను చంపేస్తానని అన్నాడు. ఆ మాటలు రికార్డయ్యాయి. మర్నాడే ఆమె హత్య చేయబడింది. హత్యకుపయోగించబడిన కత్తి అన్నయ్యది. దాని మీద అన్నయ్య వేలిముద్రలు కూడా వున్నాయి...."
    విశాలను చంపిన కత్తిమీద ముగ్గురి వేలిముద్రలున్నాయి. అందులో కాళీప్రసాద్ వీ మోహన్ వీ గుర్తించబడ్డాయి. ఈ విషయం వెంకన్నకు గుర్తుంది.
    "అసలా విశాల ఎవరు?" అన్నాడు వెంకన్న.
    "ఆమె సూర్యారావు మనిషి...." అంది వనజ.
    "సూర్యారావు మనిషా?" వెంకన్న ఆశ్చర్యపడ్డాడు.
    వనజ తమ కథ చెప్పింది.
    సదానందం, వనజలను పది సంవత్సరాల వయసప్పుడు సూర్యారావు చేరదీశాడు. సదానందాన్ని తన కనుగుణంగా తీర్చిదిద్దాడాయన. పదహారేళ్ళ వయసు రాగానే వనజను క్యాబరే నర్తకిని చేశాడు. మొదట్లో సదానందానికి అర్ధం కాలేదు. తన చెల్లి ఎంత ఘోరమైన జీవితం గడుపుతున్నదో తెలిశాక అతఃడు సూర్యారావు నుంచి విడిపోవాలనుకున్నాడు. అయితే సూర్యారావు వనజను హెచ్చరించాడు - "నీ అన్నకు బుద్ది చెప్పకపోతే అతఃది ప్రాణాలే పోగలవని."
    వనజ ఆ హెచ్చరికకు భయపడి అన్న కాళ్ళావేళ్ళాపడి బ్రతిమాలింది. అతడు వినకుండా వేరే వుండసాగాడు. అప్పుడు సూర్యారావు సదానందంతో - "నువ్వో ఫ్యాన్సీ స్టోర్సు ప్రారంభించు. నా స్మగ్లింగుకు సహకరించు, బాగా డబ్బు సంపాదించుకో ఆ తర్వాత రెండు లక్షలు నా కిచ్చి నీ చెల్లెల్ని విడిపించుకో" అన్నాడు. సదానందం ఒప్పుకున్నాడు. తను కాకుండా వేరెవరిచేతనో షాపు ప్రారంభీంప జేశాడు. సూర్యారావును వ్యాపారంలో మోసం చేసి పదిలక్షలు కాజేశాడు. తను అజ్ఞాతంగా వుండసాగాడు.
    వనజకోసం రెండు లక్షలు సంపాదించడానికి అతడు అడ్డమైన పనులూ చేయడానికి సిద్దపడతాడని సూర్యారావు అనుకుంటే కథ మరోలా జరిగింది.
    "నా చెల్లెలెలాగూ చెడింది. దాన్ని నేను విడిపించుకుని బాగుచేసేదేమీ లేదు-" అనేవాడు సదానందం. అతడు రహస్యంగా సూర్యారావుకు సంబంధించిన సమాచార మంతా సేకరిస్తున్నాడు. ఏదో ఒకరోజున అతడి బ్రతుకు బయటపెట్టాలని అనుకుంటున్నాడు.
    అప్పుడు సూర్యారావు మాస్టర్ ప్లాన్ వేశాడు. విశాల అనే అమ్మాయిని సదానందం హత్యచేయాలనుకుంటున్నట్లు ఆధారాలు సృష్టించాడు. ఆ విశాలను చంపించాడు. ఇప్పుడు సదానందాన్ని వేటాడతాడు.
    "అయితే సదానందం ఎక్కడ?"
    "వారం రోజుల క్రితం వాడు పార్వతిని కలుసుకున్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు. వాడికోసమే నేనిక్కడ మకాం పెట్టాను" అంది వనజ.
    "ఇక్కడ మకాంపెట్టి ఏం ప్రయోజనం?"
    "వాడు పార్వతికోసం వస్తాడు. పార్వతి వాణ్ణి నా దగ్గరకు పంపుతుంది...."
    "మీ అన్నయ్య ఎక్కడుంటాడో చెప్పలేవా?"
    వనజ కళ్ళొత్తుకుని-"అసలు వాడు బ్రతికున్నాడో లేదో చెప్పలేను" అంది.
    "అంటే?"
    "వాడా సూర్యారావు చేతిలో హతమయుండవచ్చు-" అన్నదామె.
    వెంకన్న అక్కణ్ణించి బయటకు వచ్చాడు. హోటలు రిసెప్షనిస్టుని కలుసుకుని ఏదో మాట్లాడాడు.

                                                     3

    "నమస్కారం-సూర్యారావుగారూ-నేను వెంకన్నను మాట్లాడుతున్నాను. సదానందం దొరికాడు...." అన్నాడు వెంకన్న-"మీరు వచ్చేటప్పుడు అన్నప్రకారం లక్షరూపాయలూ తీసుకురండి-"
    ఓ పావు గంటలో సూర్యారావు వెంకన్న ఆఫీసులో వున్నాడు.
    "వెంకన్నగారూ-నేనిచ్చిన చిన్న క్లూ ఆధారంగా మీరు హంతకుడి పేరు సదానందం అని తెలుసుకున్నారు. ఇటీజ్ సింప్లీ మార్వెలస్.....ఇంతకీ ఆ సదానందం ఎక్కడ?" అన్నాడు సూర్యారావు ఆశ్చర్యానందాలతో.
    వెంకన్న అతడిచ్సిన డబ్బు లెక్కపెట్టుకుని-ఇంట్లో పద్మావతీ దేవికీ ఇచ్చివచ్చాడు.
    "సదానందం-ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్సు ప్రొప్రయిటరు-"
    "ఆ సంగతి నాకూ తెలుసు....కానీ..."
    "నన్ను పూర్తిగా చెప్పనివ్వండి..." అన్నాడు వెంకన్న.
    విశాలకు అందంతోపాటు విచ్చలవిడితనం వుంది. ఆ విధంగా ఆమె కాళీప్రసాద్, మోహన్, సదానందంలతో పరిచయం పెట్టుకుంది. ముగ్గురికీ అసలు విషయం తెలియగానే ఆమె హత్యా కావించబడింది. హత్యలో ఇరుక్కున్న మోహన్ సూర్యారావుకు దగ్గర బంధువు. విశాలను హత్య చెసిందెవరో సూర్యారావుకు తెలుసు. అందుకని సూర్యారావు మోహన్ ని రక్షించాలనుకున్నాడు. హత్యచేసిన వ్యక్తినీ రక్షించాలనుకున్నాడు. ఓ క్లూ ఇచ్చాడు.
    "కానీ మిస్టర్ సూర్యారావ్! మీరు మీ ప్రియురాలు వనజను రక్షించుకోలేరు. అయామ్ సారీ ఫర్ దిస్...." అన్నాడు వెంకన్న.
    "ఏమిటి మీరనేది?" అన్నాడు సూర్యారావు ఆశ్చర్యంగా.
    "మిస్టర్ సూర్యారావ్ - నేను ముందే చెప్పాను-డిటెక్టివులను సవాలు చేయడంవల్ల ప్రమాదమని..." అని సీతమ్మవంక తిరిగి- "మైడియర్ అసిస్టెంట్....ఈయన కథ ఈయనకు నువ్వే నీ తీయని కంఠంతో వినిపించు-" అన్నాడు.
    సూర్యారావు సదానందాన్ని చిన్నప్పట్నించీ చేరదీసి పెంచాడు. అతడి చెల్లెలు వనజను క్యాబరే డ్యాన్సర్ని చేశాడు. సదానందం చచ్చుమనిషి. దేనికీ ప్రతిఘటించలేడు. అతడు సూర్యారావు చెప్పినట్లే ఆడేవాడు. వనజ తెలివైనది. ఆమె తన తెలివితేటలతో సూర్యారావు హృదయంలో స్థానం సంపాదించుకుని అతడికి ఉంపుడుకత్తె అయింది.
    తన స్మగ్లింగ్ వ్యవహారాల కోసం సూర్యారావు కొంతకాలం వనజను పురుష వేషంలో వేరే వుంచాడు. అప్పుడే ఆమె ఒకసారి డిటెక్టివ్ వెంకన్నను కలుసుకొనడం కూడా జరిగింది. వనజ సదానందం పేరుతో చలామణీ అవుతూ- అన్నకు ఓ ఫ్యాన్సీ స్టోర్సు ప్రారంభించింది. ఆమె స్నేహితురాలు పార్వతికి ఆమె గురించి అంతా తెలుసు. ఆమె కష్ట సుఖాలను స్నేహితురాలితో పంచుకునేది.
    ఈలోగా సూర్యారావు విశాల వలలో పడ్డాడు. వనజను నిర్లక్ష్యం చేయనారంభించాడు. వనజకు సూర్యారావు రహస్యాలు చాలా తెలుసు. భార్య స్థానం లేకపోయినా ప్రియురాలి స్థానమైనా భద్రంగా వుండాలని కోరుకున్న దామె. ఒకరోజు ఆవేశంలో విశాలను చంపిందామె.
    అప్పుడు సూర్యారావు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ ప్రపంచంలో లేని సదానందాన్ని ఆ హత్యలో ఇరికించాలనుకున్నాడు. ఆ ప్రకారం వెంకన్నకు ఓ చిన్న క్లూ ఇచ్చాడు.
    "ఇప్పుడు మీ ప్రియురాలితో పాటు మీ నేరాలుకూడా బయటపడతాయి...." అన్నాడు వెంకన్న.
    సూర్యారావు ముఖంపాలిపోయింది-"మీ గొప్పతనం మీద నాకు నమ్మకముంది కానీ వనజను సదానందంగా అనుమానిస్తారనుకోలేదు. సదానందం కోసం విడవకుండా వెతుకుతుంటారనీ - ఆ విషంగా అటు వనజ, ఇటు మోహన్ కూడా రక్షించబడుతారనీ అనుకున్నాను" అన్నాడు నీరసంగా.
    "మీ ప్లాను గొప్పదే-నేనూ వనజను సదానందంగా గుర్తించకపోదును. తన వేలిముద్రలు పరీక్షిస్తాననీ, తన అన్న వేలిముద్రలు నావద్ద వున్నాయనీ అనగానే ఆమె-స్త్రీ సహజమైన సిగ్గును కూడా విడిచి తను ఆడదానినని నాకు నిరూపించాలనుకుంది. అప్పుడే నాకు అనుమానం కలిగింది" అన్నాడు వెంకన్న.
    "పాపం-మోహన్ ని రక్షించడం కోసం...." అంది రాజమ్మ నిట్టూర్చుతూ.
    "ఏం చేస్తాం-ఏ రోజునైనా చేసిన పాపానికి శిక్ష ననుభవించడం ఎవరికీ తప్పదు...." అన్నాడు వెంకన్న.


                                  -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS