Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 46


    వచ్చిన మొదటిరోజునే అలివేలు పార్వతమ్మ మనసు దోచుకుంది అన్ని పనుల్లోనూ ఆమెకు సాయం చేసింది. సేవలు చేసింది.
    వేణు మాత్రం అలివేలువైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. ఇంట్లో అలివేలుముందతడు పెద్దమనిషి తరహాగా మసిలేవాడు. అందుకు కారణముంది. అతడు పెద్దమనిషి తరహాగా ప్రవర్తించడం లేదని అలివేలు నుంచి ఫిర్యాదు వస్తే వేణుకు బాగా దేహశుద్ధి జరుగుతుందని మధురనాయకి ముందే బెదిరించింది.
    వేణు ఇంట్లోంచి బయటకు వెళ్ళినపుడు తన పాత స్నేహితులతో తిరిగేవాడు. అలా రెండురోజులు జరిగేక-ఒకరోజున అతడు బార్లోకి దూరబోతుండగా-వస్తాదులాంటి మనిషి పట్టుకుని ఆపి-"ఈ ఊళ్ళో యే బార్లో నిన్ను చూసినా మక్కెలిరగదంతాను-" అని హెచ్చరించాడు. అతడప్పుడు మధురనాయకి యింటికి వెళ్ళాడు.
    "ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా?" అంది మధురనాయకి వెంటనే.
    "అంటే?" అన్నాడు వేణు అర్ధంకాక.
    "నీకు రెండే రెండు అవకాశాలు...." అని నవ్వింది మధురనాయకి-"జులాయిగా తిరిగే అవకాశం మాత్రం నీకులేదు-...."
    "ఉద్యోగం చేస్తే మంచి జీతం దొరుకుతుందా?"
    "నీ చదువుకు తగ్గ జీతమే దొరుకుతుంది....వ్యాపారం చేస్తానంటే మాత్రం అది వేరే సంగతి.....ఎంతైనా సంపాదించుకోవచ్చు....."
    "ఏ వ్యాపారం చేయను?"
    "చేస్తానంటే నేను చెబుతాను....."
    "చేస్తాను"
    "అయితే వెళ్ళి బిజినెస్ మాగ్నెట్ మాధవరావును కలువు నేను చెప్పానని చెప్పు-"
    వేణు మాధవరావు దగ్గరకు వెళ్ళాడు.
    "ప్రెస్ ప్రారంభించు-మంచి ఆర్దర్సు వచ్చేలా చేస్తాను...." అన్నాడు మాధవరావు.
    మాధవరావు, మధురనాయకిల ఆశీర్వాదంతో నెల రోజుల్లో ప్రెస్ ప్రారంభించాడు వేణు. ఆర్ధికంగా మధురనాయకి, వ్యాపారపరంగా మాధవరావు అతడికి సాయపడ్డారు. ఏడాదిలోనే అతడు వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు.
    కొడుకులో వస్తున్న మంచి మార్పు పార్వతమ్మకు సంతోషాన్ని కలిగించింది "అంత సన్యాసి మహిమ!" ఆనుకున్నదామె.
    రాఘవులికీ యిప్పుడెంతో సంతోషంగా ఉంది. కొడుకు సంపాదన సామాన్యమైనది కాదు. ఇప్పుడు రాఘవులి సంపాదన చిన్నదనిపిస్తోంది.
    ఒకరోజున వేణు మధురనాయకి ఇంటికి వెళ్ళి-"నాలోని మార్పు నీకు నచ్చిందా?" అన్నాడు.
    "ఈ ప్రశ్న నువ్వు అలివేలు నడుగు...." అంది మధురనాయకి.
    "ఆమెను నేను పెళ్ళి చేసుకుంటాను-...."
    "అప్పుడే కాదు-...."
    "ఎందుకని?"
    "నువ్వు ముందు నా బాకీ తీర్చాలి!" అంది మధురనాయకి.
    "బాకీ తీర్చకుండా పెళ్ళి చేసుకోకూడదా?"
    "బాకీ తీర్చడం నీ బాధ్యత. పెళ్ళి మరో బాధ్యత. ఒక బాధ్యత పూర్తి కాకుండా మరో బాధ్యతను చేపట్టడం మంచిది కాదు.....అదీకాక నే నిలా యింకా యెంతోమందికి సాయపడుతూంటాను. నాకు డబ్బవసరం, నా డబ్బు నీవంటి వారివద్ద చిక్కుపడిపోకూడదు" అంది మధురనాయకి.

                                   5

    "అలివేలు చాలా మంచిపిల్ల మనింట్లో పాదం పెట్టి నప్పట్నించీ అన్నీ లాభాలే!" అంది పార్వతమ్మ.
    "అవును-యే యింటి కోడలవుతుందో-.....వాళ్ళు చాలా అదృష్టవంతులు-..." అన్నాడు రాఘవులు.
    "మనిల్లుండగా-యే యింటికో యెందుకు వెడుతుందీ?" అంది పార్వతమ్మ ఆశ్చర్యపోయి.
    "బాగుంది-కులం, గోత్రం తెలియని పిల్లను మనింటికోడలు చేసుకుంటా మేమిటి....?" అన్నాడు రాఘవులు.
    "అయితే మాత్రం-మనింటి కోడలు చేసుకుందామనే కదా-మీ రా అమ్మాయిని తెచ్చారు? నాకు నచ్చితే మనవాడి కిచ్చి పెళ్ళి చేద్దామని కూడా అన్నారు. అలివేలు నా కెంత నచ్చిందో మాటల్లో చెప్పలేను...." అంది పార్వతమ్మ.
    "అయితే యిన్నాళ్ళూ దాచిన అసలు విషయం కూడా చెబుతాను. ఆ పిల్ల మంచిది కాదు. చెడి పోయింది. వేరే దారిలేక మనింట్లో పెట్టాను-...." అంటూ రాఘవులప్పుడామె అసలు విషయం వివరించి చెప్పాడు.
    పార్వతమ్మ వెంటనే.....-"ఛీ ఛీ ఛీ....యెంత మోసం!" అంది.
    "అలవే లెలాంటిదో తెలిస్తే నువ్వామె నింట్లో వుంచుకుందుకంగీకరించవు. అందుకని నేనామె గురించిన కొంత నిజాన్ని దాచిపెట్టి మనింటికి తెచ్చాను. అప్పుడంతకుమించి వేరే దారిలేదు మనకి...."
    "ఇప్పుడేం చేయాలి?" అంది పార్వతమ్మ.
    "మంచి సబంధాలొస్తున్నాయి మనవాడికి. కట్నం కూడా యాభైవేలకు తక్కువొచ్చేలా లేదు. మన మెలాగో అలా ఈ పిల్లను వదుల్చుకోవాలి.....-"
    "ఎలా వదుల్చుకుంటాం?" అంది పార్వతమ్మ కంగారుగా.
    "ముందు మనవాడికా పిల్లమీద ఎలాంటి అభిప్రాయముందో తెలుసుకో!" అన్నాడు రాఘవులు.
    "వాడెప్పుడూ పొరపాటున కూడా ఆ పిల్లవంక కన్నెత్తి చూడడండీ-బహ్సుహా వాడి కిష్టం లేదనుకుంటాను-...." అంద పార్వతమ్మ.
    "అలా కాదు- ముందుగా అడిగి తెలుసుకో. వాడి కిష్టం లేకపోతే మన పని సగానికి సగం సులభంమవుతుంది-...." అన్నాడు రాఘవులు.
    ఆ రాహ్రి పార్వతమ్మ యధాలాపంగా కొడుకు దగ్గర పెళ్ళి ప్రసక్తి తీసుకువచ్చింది.
    "నా పెళ్ళికింకా ఆగాలమ్మా-వ్యాపారంలో మరికాస్త నిలదొక్కుకోవాలి-"
    "అదిసరే-పెళ్ళి కెలాగూ ఆగొచ్చు ఈలోగా పెళ్ళి చూపులకంటూ వెళ్ళడంలో తప్పులేదు. చాలామంది మనమీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు....."
    వేణు ఆశ్చర్యంగా-"ఇంకా నాకు పెళ్ళిచూపులేమిటి? నేను పెళ్ళి చేసుకునే అమ్మాయి అలివేలేకదా!" అన్నాడు.
    పార్వతమ్మ ఆశ్చర్యంగా "నువ్వు అలివేలును పెళ్ళిచేసుకుంటావా? నే నిధి ఊహించలేదు-" అంది.
    "ఇందులో ఆశ్చర్యమేముంది? అంతా అనుకున్న దేగా?" అన్నాడు వేణు.
    "అలివేలు చెడిపోయిన పిల్లని నీకు తెలియదా?"
    "ప్రతి మనిషీ తప్పులు చేస్తాడు. నేనూ కొన్ని తప్పులు చేశాను. ఇప్పుడు నేను బాగుపడ్డాను. అయినా ఇప్పటికీ పాత విషయాలు గుర్తుచేస్తూ నన్నెవ్వరైనా చెడిపోయినవాడని అంటే నేను భరించలేనమ్మా-" అన్నాడు వేణు.
    "అలివేలు బాగుపడిందని నమ్మక మేమిటి?" అంది పార్వతమ్మ.
    "అందుకు తిరుగులేని ఋజువొకటుంది-" అన్నాడు వేణు.
    "ఏమిటది?-...." అంది పార్వతమ్మ కుతూహలంగా.
    "అలివే లీ యింట్లో అడుగుపెట్టి యేడాది దాటింది. ఎప్పుడూ ఆమెను మెచ్చుకోవడం తప్ప వేలెత్తి చూపలేదు నువ్వు. అంతగా నీ అభిమానం పొందిన ఆమె పవర్తనను నా బోటివాడెక్కడ శంకించగలడు?" అన్నాడు వేణు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS