వెంకన్న వివరాల కోసం చూశాడు. అందులో ముగ్గురు స్నేహభావంతో వచ్చినవారు. అతడికి బాగా తెలిసినవారు.
ఇంక అయిదుగురున్నారు. ఆ అయిదుగురూ ఏవో కేసుల గురించి వచ్చినవారే! వెంకన్న వాళ్ళ ఫోటోల కోసం చూశాడు. తనవద్ద నున్న విశాల కేసులోని అనుమానితుల జాబితా చూశాడు. అందులోని ఏ ఒక్కరూ ఈ అయిదు ఫోటోలలోనూ సరిపోలడంలేదు.
వెంకన్న అయిదు ఫోటోలనూ చూస్తూ తల కొట్టు కుంటున్నాడు.
విశాల హత్యకూ ఆ అయిదుగురిలో ఒక్కరికీ ఏదో సంబంధముంది?
ఏమిటది?
వెంకన్న ఆ అయిదుగురినీ కలుసుకుని మాట్లాడాలనుకున్నాడు. అడ్రసుల కోసం చూశాడు.
అందులో ముగ్గురే ఆ వూళ్ళో వుంటున్నారు. మిగతా యిద్దరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు.
ముగ్గురిలో ఇద్దరు వెంకన్నకు సులభంగా దొరికారు. వాళ్ళతో మాట్లాడ్డం వల్ల వెంకన్నకు పనికివచ్చే సమాచార మేమీ లభించలేదు. మూడో వ్యక్తి మాత్రం ఆ అడ్రసులో దొరకలేదు.
వెంకన్న చుట్టుపక్కల వాకబుచేశాడు. ఒకొక్కరే తెలియదంటున్నారు. ఆఖరికి ఓ పనిమనిషి "ఆ సదానందం బాబుగారా-ఆయన ఈ వీధిలో యెవరితోటీ మాట్లాడే వాడు కాదు. పక్క వీధి ముకుందారావు బాబుతో రోజూ సాయంత్రం గంటల తరబడి కబుర్లు చెప్పేవారు" అంది.
వెంకన్న ముకుందరావు కలుసుకున్నాడు.
"అతడు రోజూ నా వద్దకు వచ్చేవాడు. రెండేళ్ళ క్రితం కాబోలు మెయిన్ రోడ్లో ఓ ఫ్యాన్సీ షాపు ఓపెన్ చేశాడు. పేరు ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్స్. ఓపెనింగుకి నన్ను పిలిచాడు. మళ్ళీ మేము కలుసుకోలేదు."
"అతడింకా ఆ ఫ్యాన్సీస్టోర్సు నడుపుతున్నాడా?" అన్నాడు వెంకన్న.
"అతడు నడుపుతున్నాడో లేదో తెలియదు-కానీ ఆ స్టోర్సు మాత్రం ఇంకా వుంది-" అన్నాడు ముకుందరావు.
వెంకన్న ఫ్యాన్సీ స్టోర్సుకి వెళ్ళాడు. అందులో కూర్చున్న వ్యక్తితో-"సదానందంగారు లేరా?" అన్నాడతడు.
"నేనే సదానందాన్ని" అన్నాడతడు.
వెంకన్న చిరాగ్గా అతడి వంక చూసి - "నే నడిగేది ఈ షాపు ప్రొప్రయిటర్ సదానందం గురించి-" అన్నాడు.
"నేనే ప్రొప్రయిటర్ని" అన్నాడతడు.
వెంకన్న చప్పున తన జేబులోని ఫోటో ఒకటి తీసి అతడికి చూపించి-"మరి ఇతడెవరు?" అనడిగాడు.
ఆ వ్యక్తి ఫోటో చూసి కంగారు పడ్డాడు-"మీరెవరు?" అన్నాడు.
"ముందు నువ్వెవరో చెప్పు" అన్నాడు వెంకన్న.
"నా పేరు సదానందం."
"నీ పేరు సదానందం కావచ్చు. కానీ ఈ షాపుకి ప్రొప్రయిటర్ నువ్వు కాదు. ఆ విషయం ఋజువు చేయగలను...." అన్నాడు వెంకన్న.
అతడు తడబడి-"ఒక్క క్షణం ఆగితే మనం మాట్లాడుకుందాం" అన్నాడు.
"ఎందుకు?"
"సేల్సుమన్ భోంచేసి వస్తాడు-" అన్నాడు సదానందం.
సేల్సుమన్ రాగానే ఇద్దరూ ఎదురుగా వున్న పార్కులోకి నడిచారు.
"నాకు ఊరూ పేరూ లేదు. సదానందం కారణంగానే నాకు ఓ దారి కనబడింది. రెండేళ్ళ క్రితం అతడు ఈ షాపు ఓపెన్ చేసి తన పేరులో నన్ను చలామణీ కమ్మన్నాడు. అలాగే అవుతున్నాను. ఓపెనింగ్ సెరమనీకి మాత్రం అతడున్నాడు...."
"ఇప్పుడు సదానందం ఏమయ్యాడు?"
"తెలియదు అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుసుకుని అడిగి డబ్బు తీసుకుని వెడుతూంటాడు...."
"నీకు తెలుసు ఏదో దాస్తున్నావు?" అన్నాడు వెంకన్న.
"నాకేమీ తెలియదు" అన్నాడతడు.
"సదానందం గురించి నాకు చాలా తెలుసు. అతడి గురించి దాచడంవలన నీకు కూడా ప్రమాదం" వెంకన్న హెచ్చరించాడు.
"మీ కింకా వివరాలు కావాలంటే పార్వతి చెప్పగలదు."
వెంకన్న అడిగి పార్వతి వివరాలు తెలుసుకున్నాడు.
పార్వతి ఏదో ఆఫీసులో స్టెనోగా పని చేస్తోంది. ఇరవై రెండేళ్ళు అందంగా ఆకర్షణీయంగా వుంటుంది. ఇంకా పెళ్ళి కాలేదు. సదానందం తరచు ఆమెను కలుసుకుంటూంటాడు.
"సదానందం నిన్ను కలుసుకుని ఎంత కాలమయింది?"
"రెండు నెలలు."
వెంకన్న పార్వతిని కలుసుకున్నాడు.
"వారం రోజుల క్రితం సదానందం నన్ను కలుసుకున్నాడు-" అని చెప్పిందామె. ఆమెచేత ఈ సమాచారం చెప్పించడానికి వెంకన్నకు పావుగంట పట్టింది.
"ఇప్పుడతడెక్కడున్నాడు?"
"నాకు తెలియదు" అంది పార్వతి.
ఆమె కనులు చూస్తూంటే ఆమెకు తెలుసుననే అనిపించింది వెంకన్నను-"సదానందం చాలా ప్రమాదంలో వున్నాడు. నేనతడిని అర్జంటుగా కలుసుకోవాలి-"
కానీ పార్వతి ఏమీ చెప్పలేదు.
వెంకన్న అక్కన్నుంచి వెళ్ళిపోయినట్లు నటించి ఆ యింటిమీద నిఘా వేశాడు. కొద్ది క్షణాల్లో పార్వతి అతడు ఊహించినట్లే ఇంటినుంచి బయల్దేరింది హడావుడిగా.
అతడామెను అనుసరించాడు.
హోటల్ పుష్పక్ లో ఏడో నంబరు గదికి వెళ్ళి అయిదు నిముషాలు మాత్రం గడిపిందామె.
వెంకన్న ఏడోనంబరు గదిలోని వ్యక్తి గురించి రిసెప్షనిస్టు వద్ద వాకబు చేశాడు. అందులో ఒక స్త్రీ వుంటోంది. పేరు వనజ.
వెంకన్న వనజను కలుసుకున్నాడు.
"ఎవరు నువ్వు? నాతో నీకేమిటి పని!" అంది వనజ.
"నా పేరు వెంకన్న. నేను డిటెక్టివును...." అన్నాడు వెంకన్న.
"నాతో నీకేమిటి పని?"
"సదానందం ఎక్కడ?"
"ఏ సదానందం?"
"ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్సు ప్రొప్రయిటరు...."
"నాకు తెలియదు...."
"నీకు తెలుసు...." అన్నాడు వెంకన్న.
వనజ చిరాకు పడుతోంది. వెంకన్న జిడ్డులా పట్టుకున్నాడు. చివరికామె కోపంగా "ఇదో పెద్ద న్యూసెన్సుగా వుంది. మర్యాదగా వెళ్ళకపోతే నిన్ను గెంటించవలసి వుంటుంది" అంది.
"అలాంటి ప్రయత్నం చేస్తే నేను జైలుకైనా వెడతానుగానీ నలుగురిలో నీ బట్టలు విప్పి పోతాను" అన్నాడు వెంకన్న.
"ఏమిటా మాటలు-నీకు సభ్యత తెలియదా?"
"అన్నీ తెలుసు నాకు. నువ్వు ఆడవేష మెందుకు వేశావు?"
వనజ ఆశ్చర్యంగా-"ఏమిటి నువ్వనేది?" అన్నది.
"నిన్ను చూస్తూనే - నువ్వే సదానందానివని నేను గుర్తుపట్టాను" అన్నాడు వెంకన్న.
ఆమె నిట్టూర్చి-"మీరు పొరబడ్డారు" అంది.
"అంటే?"
"సదానందం నా అన్నయ్య-మా ఇద్దరివీ ఒక్కటే పోలికలు...."
"నేను నమ్మను...."
"మిమ్మల్నెలా నమ్మించేది?"
"నీకు సిగ్గు లేకపోతే-ఇక్కడే తేలిపోతుంది. సిగ్గున్న పక్షంలో నాతో మా యింటికి పద. సదానందం వేలిముద్రలతో నీ వేలిముద్రలు పోల్చి...."
