Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 45


    పెళ్ళి చేసుకొంటే అనవసరపు జంఝాటం.
    "నీ నిర్ణయం గురించి చెప్పాల్సిన టైమొచ్చింది-" అంది మధురనాయకి మాట రెట్టిస్తూ.
    ఇంటికి తిరిగి వెళ్ళడంకంటే అలివేలును పెళ్ళిచేసుకొనడమే మేలనిపించింది వేణుకు. ఆ విషయమే చెబుదామనుకుంటూండగా-లోపలికి పనిమనిషి వచ్చి-"మీకోసం యెవరో వచ్చారమ్మా!" అంది.
    "ఎవరు?"
    "పేరు రాఘవులని చెప్పారు..."
    "రాఘవులంటే మా నాన్న పేరు. నేనిక్కడున్న ట్లాయనకెలా తెలిసిందో-" అన్నాడు వేణు ఆశ్చర్యంగా.
    "నువ్వూ వస్తావా?" అంది మధురనాయకి.
    "రాను నువ్వే వెళ్ళి మాట్లాడు...." అన్నాడు వేణు.
    "ఏం మాట్లాడను?"
    "నీ యిష్టం-నీ నిర్ణయానికి నేను కట్టుబడతాను..."
    
                                       3

    అందమైన ఆ డ్రాయింగ్ రూం నలువైపులా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అది సినిమాల్లో చూసే గొప్పవాళ్ళ యిళ్ళలా వుంది తప్ప వేశ్యా గృహంలా లేదు.
    అప్పుడు మధురనాయకి లోపలకు వచ్చింది. ఆమెను చూస్తూనే లేచి నిలబడ్డ్డాడు రాఘవులు.
    మధురనాయకి రాజమాతలా ఉంది తప్ప వేశ్యమాతలా లేదు.
    ఆమె అతడికి నమస్కరించి-"కూర్చోండి!" అంది.
    రాఘవులు కూర్చున్నాడు. ఆమె అతదికేదురుగా కూర్చుని-"చెప్పండి-" అంది.
    "మా అబ్బాయి వేణు ఇక్కడున్నాడని తెలిసింది-"
    "ఎలా తెలిసింది?"
    "చెబితే మీరు నమ్మరు. ఒక సన్యాసి దివ్యదృష్టితో చూసి చెప్పాడు...."
    మధురనాయకి నవ్వి-"సన్యాసుల దివ్యదృష్టికి మా యిల్లు తప్ప మరేమీ కనిపించవు.....వేణు అనే కుర్రాడిక్కడే వున్నాడు-" అంది.
    "వాణ్ణి తీసుకొని పోదామని వచ్చాను-"
    "అతఃడు రానంటున్నాడు...."
    "వాడితో నేనో సారి మాట్లాడాలి-"
    "అతడు మీతో మాట్లాడనంటున్నాడు-...."
    రాఘవులు ముఖం ఎర్రబడింది. ఏదో అనాలని ఉద్రేకంలో మాట రాక ఆగిపోయాడతడు.
    "మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా వుంది. మీ అబ్బాయి వేణు మానసికంగా బాగా చెడిపోయాడు. బహుశా పెంపకం లోపం అనుకుంటాను-...." అంది మధురనాయకి నిట్టూర్చుతూ.
    "మీ కెలా తెలుసు?"
    "మీ అబ్బాయి గురించి నాకు తెలిసినది చెబుతాను- వినండి!" అంటూ మధురనాయకి అతడికి పార్కులో తనకు వేణు పరిచయమయినప్పట్నుంచి అంతవరకూ యేం జరిగిందో చెప్పింది.
    రాఘవులి ఆవేశం తగ్గింది-"వాడు చెడిపోతున్నాడు. ఎలా బాగుచేయాలో తెలియడంలేదు-" అన్నాడు దిగులుగా.
    "నిదానంగా వింటే ఉపాయం నేను చెబుతాను-...."
    రాఘవు లాశగా ఆమెవంక చూశాడు.
    "వేణు-ఎలాంటి జులాయి పనులు చేస్తాడో మీ రూహించలేరు. అతణ్ణి అదుపు చేయడం మీవల్ల కాదు. నేనైతే అనుక్షణం అతడి ప్రవర్తనను కనిపెట్టడానికి కో వస్తాదును నియమిస్తాను. ప్రవర్తన అదుపుతప్పినప్పుడల్లా వస్తాదు అదుపు చేస్తాడు....
    "అందువల్ల మీకు ప్రయోజనం!"
    "నా యింట్లో అలివేలు ఓ అమ్మాయుంది. ఆమె గురించి మీకేమీ అబద్ధం చెప్పను. అందమయిన పిల్ల ఒకే ఒక్కసారి తప్పు చేసింది. అదీ ఓ మగాడి మాయ మాటలను నమ్మి! ఆమెకు సమాజంలో నలుగురాడవాళ్ళకు లాగా బ్రతకాల నుంది. అలాంటి అవకాశం లేకపోతే చావాలనుకుంటోంది. ఆమెను బ్రతికించాలని నా కోరిక. అది నావల్ల కాదు. మీ వల్లనే అవుతుంది-...."
    "ఎలా?" అన్నాడు రాఘవులు.
    "అలివేలును మీ యింట్లో పెట్టుకోండి. మీ బంధువు లమ్మాయని చెప్పుకోండి. ఆమెను వేణు కిచ్చి పెళ్ళి చేయండి వేణు జీవితంలో స్థిరపడేలా నేను చూసుకుంటాను-...." అంది మధురనాయకి.
    "అలివేలుకీ మీకూ ఏమిటి సంబంధం?"
    "మనిషి మంచితనం కలిగించే సంబంధం!"
    "బహుశా అలివేలు మీ కూతురనుకుంటాను. ఆ విషయం చెప్పుకోలేరు బయటి ప్రపంచానికి...." అన్నాడు రాఘవులు.
    "నా కిద్దరు కూతుళ్ళు. గవర్నమెంటు హాస్పిటల్లో పురుడు పోసుకున్నాను. వాళ్ళకు తండ్రెవరో చెప్పలేను కానీ తల్లిని నేనేననడానికి తిరుగులేని ఋజువులున్నాయి. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా?"
    రాఘవులు మాట్లాడకుండా ఆమెవంకే చూశాడు.
    "నా ఆధ్వర్యంలోనే వాళ్ళిద్దరూ సగౌరవంగా వేశ్యావృత్తిని కొనసాగిస్తున్నారు. దాంపత్య జీవితం నా తత్వానికీ సరిపడదు-...."
    "ఇదంతా ఎందుకు చెప్పినట్లు?"
    "అలివేలు ణ అకూతురే అయితే ఆమెను కూడా చిన్నతనం నుంచీ వేశ్యావృత్తికి అనుగుణంగా ప్రోత్సహించి ఉండేదాన్ని. నేను నమ్మిన సిద్దాంతాన్నీ, నేను ప్రయోజనం పొందుతున్న వ్యాపారాన్నీ - ఇతరులపై రుద్దేచౌకబారు స్వార్ధం కాదు నాది అలివేలును నే నాదుకున్నాను. ఆమెను బ్రతికించాలనుకుంటున్నాను....."
    "కానీ తెలిసి తెలిసి......చెడిన ఆడదాన్నెవరు చేరదీస్తారు?"
    "ఒకసారి అలివేలును చూడండి అప్పుడామె గురించి మాట్లాడండి.....అంది మధురనాయకి.
    అలివేలును చూడ్డానికి రాఘవులామె ననుసరించాడు.
    ఓ గదిలో సోఫాలో కూర్చుని ఇంగ్లీషు నవల చదువు కుంటోంది ఓ యువతి. ఆమె వయసిరవైకి మించదు. ముఖంలో పసిపాపల అమాయకత్వం, బుగ్గల్లో గులాబీలో ఎర్రదనం. తనువులో విద్యుల్లత మెరుపు. చీర కట్టడంలో ఓ సొగసు. లేచి నిలబడడంలో ఓ ఆకర్షణ.
    "ఈమె పేరు అలివేలు!" అంది మధురనాయకి.
    "నమస్తే!" అంది అలివేలు. అప్పుడామె పలువరస తళుక్కుమని మెరిసి ఎర్రని పెదాల్లో ప్రతిఫలించి-తిరిగి మూసుకుపోయింది.
    "నువ్వు చదువుకోమ్మా!" అని మధురనాయకి రాఘవుల్ని బయటకు తీసుకుని వెళ్ళిపోయింది.
    "ఆమె సినీనటి అయితే-జనమామె దర్శనానికి తపించిపోయేవారు ఆమె రాజకీయాల్లో ప్రవేశిస్తే పార్టీ నాయకులామె చుట్టూ ప్రదక్షిణాలు' చేస్తూండేవారు. వేశ్య అయితే ప్రతినిత్యం ఆమెకు కనకాభిషేకాలు జరిగేవి. ఆమెలో మీరిప్పుడు చెడిన ఆడదాన్ని చూస్తున్నారు. మీ మీద జాలిపడడం మినహాయించి నే నేమీ చేయలేను-" అంది మధురనాయకి.
    "మీరు నిజమే చెప్పారు. కానీ ఆమె చెడిన ఆడది కాకుండా పోదుకదా!"
    "మీ అబ్బాయి వేణు కూడా చెడినవాడే కదా!"
    "వాడు మగాడు...."
    మధురనాయకి ముఖం ఎర్రబడింది-"మీ అభిప్రాయం మార్చుకున్నాకనే మళ్ళీ ఈ గడప తొక్కండి. ప్రస్తుతానికి వెళ్ళండి-" అంది.
    రాఘవులు వెంటనే-"ఈ విధంగా మా అబ్బాయి వేణు బాగుపడతాడని మీ రనుకుంటే నేను తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను-...." అన్నాడు.
    "మంచి మనసుతో చేసిన యే పనైనా సత్ఫలితాలనే యిస్తుంది......నేను చెప్పినట్లు చేస్తే మీ అబ్బాయి బాగుపడతాడు-...." అంది మధురనాయకి నమ్మకంగా.

                                      4

    అలివేలు రాక చుట్టుపక్కల వాళ్ళలో కొంత సంచలనాన్ని కలిగించింది. చాలామంది ఆడవాళ్ళామెను చూడ్డానికి వచ్చి ఆమె గురించి ఆరాలు తీశారు. పార్వతమ్మ ఆమె దూరపు వరుసలో తనకు మేనకోడలవుతుందని-తల్లీతండ్రీ పోగా తనింటికి తీసుకుని వచ్చాననీ చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS