క్లూ
సీతమ్మ, రాజమ్మ నోట్ బుక్సు పట్టుకుని సిద్దంగా వున్నారు.
"చెప్పండి!" అన్నాడు వెంకన్న.
"చెప్పడానికి ఏమీలేదు. మోహన్ నిరపరాధి-అంతే అన్నాడు సూర్యారావు.
వెంకన్న నవ్వి "మోహన్ పైన నాకేమీ పగలేదు. అసలతడెవరో కూడా నాకు తెలియదు. నా క్లయింట్ కాళీ ప్రసాద్ హత్యానేరంలో యిరుక్కున్నాడు. అందువల్ల ఆ హత్యకేసును పరిశోధించాల్సి వచ్చింది. పరిశోధనలో మోహన్ హంతకుడని తేలింది. అందుకు బలమైన సాక్ష్యాదారాలున్నాయి" అన్నాడు.
"సాక్ష్యాధారాలు మనకి నిజాన్ని చూపించే సాధనాలు. కానీ వాటికవి నిజాలు కావు" అన్నాడు సూర్యారావు.
"పోనీ నిజాలేమిటో మీరు చెబుతారా?" అన్నాడు వెంకన్న.
"చెప్పను" అన్నాడు సూర్యారావు.
వెంకన్న నవ్వి "మీరు వచ్చిన పనేమిటో నాకు తెలియలేదు" అన్నాడు.
సూర్యారావు గొంతు సవరించుకున్నాడు "విశాల అనబడే యువతి హత్యచేయబడింది. కాళీప్రసాద్ హంతకుడిగా అనుమానించబడ్డాడు. అతడు మీ సాయం కోరాడు. మీ రతడు నిర్దోషి అని నిరూపించడమే కాక మోహన్ అనబడే అతఃడిని హంతకుడిగా నిరూపించబోతున్నారు. మోహన్ ని హంతకుడిగా నిరూపించకపోయనా కాళీప్రసాద్ నిర్దోషిగా బయటపడే స్థాయికి వచ్చింది కేసు.
మోహన్ విషయంలో మీరు సంపాదించిన సాక్ష్యాధారాలు పోలీసులకు చేరకూడదు. ఫలితంగా నేను మీకు లక్ష రూపాయలనిస్తాను. అయితే డబ్బు తీసుకుని హంతకులను వదిలిపెట్టరు మీరు. కానీ మోహన్ హంతకుడు కాదు. అతడి దురదృష్టం కొద్దీ హంతకుడిగా అనుమానించబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే జాలితలచమంటున్నాను-"
"డిటెక్టివ్ వెంకన్న జాలి హంతకులపై ఉండదని తెలుసు గదా."
"తెలుసు కానీ మోహన్ హంతకుడు కాదు."
"అవునని నేనంటున్నాను."
"ఆ విధంగా ఓ నిర్దోషిని ఉరికంబ మెక్కిస్తున్నారు."
"నాకు తెలిసినంతవరకూ మోహన్ దోషి. అతడు నిర్దోషి అయితే అతడిని ఉరికంబ మెక్కించిన పాపం మీకే కానీ నాకు చెందదు" అన్నాడు వెంకన్న.
"మీరు సంపాదించిన సాక్ష్యాధారాలపైన మీ కంతనమ్మకం కూడదు వెంకన్నగారూ!" అన్నాడు సూర్యారావు.
"నేను నీటిలో జాడలు తీయగలను. నేను తీసిన జాడలను నేను నమ్ముతాను. చిన్న క్లూ ఆధారంగా పెద్ద విషయాన్ని పట్టగలను అది నా గొప్పతనం కాదు. భగవంతుడిచ్చిన శక్తి" అన్నాడు వెంకన్న.
"అయితే అసలు హంతకుడెవరో మీకు చిన్న క్లూ యిస్తాను. ఆ ఆధారంగా ఆ హంతకుడి పేరు, వివరాలు తెలుసుకుని నాకు చెప్పండి. అప్పుడూ మీకు లక్షరూపాయలు ముడుతుంది. ఎటొచ్చీ ఇద్దరు హంతకుల్నీ మీరు కరుణించాలి. అదీ నా కోరిక!"
"అసలు హంతకుడు బయటపడితే హంతకులిద్దరెందుకవుతారు? హంతకుడొక్కడే? అతణ్ణి బయటపెట్టాలా కూడదా అన్నది నా అభీష్టం-"
"నా ఉద్దేశమదికాదు. ఇద్దరి సాక్ష్యాధారాల గురించీ మీరు బయటపెట్టకూడదు...."
"మీరేదో క్లూ గురించి అన్నారు" అన్నాడు వెంకన్న.
"అవును ఆ క్లూ మీకు పరీక్షలాంటిది. హంతకుడెవరో నాకు తెలుసు. నే నిచ్చే క్లూలో అతడిని మీరు గుర్తించగలిగితే - మీరు నీటిలో జాడలు తీయగలరని నేను నమ్ముతాను. మీ రతడిని గుర్తించలేకపోతే మోహన్ గురించిన సాక్ష్యాధారాలను రహస్యంగా వుంచాలి. మీకు ముట్టవలసిన లక్ష ఎలాగూ ముడుతుంది" అన్నాడు సూర్యారావు.
"మీరిచ్చే క్లూలో మోసముండకూడదు" అన్నాడు వెంకన్న.
"మోసముండదు....అబద్దముండదు...." అన్నాడు సూర్యారావు.
"చెప్పండి" అన్నాడు వెంకన్న.
"విశాలను నిజంగా హత్య చేసినవాడు ఒక పర్యాయం ఏదో సందర్భంలో మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాడు" అన్నాడు సూర్యారావు.
"ఇది క్లూ అనిపించుకోదు" అన్నాడు వెంకన్న.
"పూర్తిగా వినండి" అన్నాడు సూర్యారావు "సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం సెప్టెంబరు 17వ తేదీన ఆ హంతకుడు మీ ఆఫీసుకు వచ్చి మీతో మాట్లాడి వెళ్ళాడు. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. కానీ జరిగినది."
"ఎలా తెలిసింది మీకు?" అన్నాడు వెంకన్న.
"ఎలా తెలుసునని అడక్కండి. తెలిసింది మాత్రం నిజం...."
వెంకన్న ఆలోచనలో పడ్డాడు.
"ఇది క్లూ అంటారా, కాదంటారా?" అన్నాడు సూర్యారావు.
"ఇది క్లూ అనడంలో సందేహంలేదు. కానీ ఒకోసారి క్లూ కంటే-ఆ క్లూ ఎలా వచ్చిందో అన్న విషయం పరిశోధనకు బాగా ఉపకరిస్తుంది."
"అది మామూలు విషయంలో....కానీ నీటిలో జాడలు తీసే మీ వంటివారి విషయంలో కాదు...."
"డిటెక్టివ్ లెవరైనా నీటిలో జాడలు తీయగలిగినప్పుడే ఎవరైనా డిటెక్టివ్ వృత్తిని చేపట్టాలి" అన్నాడు వెంకన్న.
"సరే-అయితే నీటిలో జాడలు తీయండి. నేను వస్తాను" అంటూ లేచాడు సూర్యారావు.
"మీరొక డిటెక్టివ్ ను సవాలుచేసి వెడుతున్నారు. అందువల్ల మీకే ప్రమాదం వాటిల్లినా నేను చేయగలిగిన దేమీ వుండదు" అన్నాడు వెంకన్న.
2
సూర్యారావు వెళ్ళిపోయాక వెంకన్న అతడు త్రాగిన మంచినీళ్ళ గ్లాసును లోపలకు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వచ్చాడు. రాజమ్మతో "ఈ గ్లాసు నెంబరు నాలుగే కదా" అన్నాడు. ఆమె తల వూపింది.
డిటెక్టివ్ వెంకన్న ఇంట్లో ఒక ఏర్పాటుంది. అతడింటికి కొత్తవారెవరొచ్చినా ఆటోమేటిక్ కెమెరా ఫోటోలు తీయడానికీ, గొంతు రికార్డు చేయడానికీ, వేలిముద్రలు తీసుకునేందుకూ ఏర్పాట్లున్నాయి. ఇదంతా సమాచారంగా సేకరించాక ఆ వ్యక్తి ఫోటో, వేలిముద్రలు-ఓ పుస్తకంలో జతపర్చడం జరుగుతుంది.
ఆ విధంగా సూర్యారావు ఆ రోజు వెంకన్న రికార్డు లలో కెక్కాడు.
గ్లాసునుంచి వేలిముద్రలు తీసుకొనడం అయినాక వెంకన్న ఉత్సాహంగా పాతడైరీలు తీశాడు. సెప్టెంబరు 17వ తేదీ-సూర్యారావు చెప్పినరోజు-తన యింటికి ఎనమండుగురు వచ్చారు. అందరూ పురుషులే!
