మధురనాయకిదిప్పుడో పెద్ద సంస్థ. ఆమె ఆధ్వర్యంలో అయిదువందల అందాల పడుచులున్నారు. వారికి సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగులకుండే సదుపాయాలన్నీ వున్నాయి. చెప్పాలంటే అంతకుమించిన సదుపాయాలు వారివి.
మధురనాయకి సంస్థలోని వేశ్యలందరికీ ఉచిత భోజనవసతి సదుపాయాలున్నాయి. వారి ఆరోగ్యాన్ని కాపాడ్డానికి డాక్టర్లున్నారు. వారి వద్దకువచ్చే విటుల ఆరోగ్యాన్ని పరీక్షించడానికీ డాక్టర్లున్నారు.
విటుల నాకర్షించే బాధ్యత వేశ్యలది. వారి వారి సంపాదనలో కొంత శాతం సేవింగ్సు. కొంత శాతం మధురనాయకికి, కొంత శాతం మెయింటెనెన్సుకు పోగా యిరవై శాతం జీతంగా యిస్తుంది.
అటు విటులకూ, ఇటు వేశ్యలకూ ప్రమాదరహితమూ, లాభకరమూ, ఆరోగ్యప్రదమూ, గౌరవనీయమూ అయిన పద్ధతిలో నడుస్తోంది మధురనాయకి సంస్థ.
ఆకర్షణ తగ్గినవారికీ, వయసుమీరినవారికీ రిటైరయ్యే సదుపాయముంది. జీవితంలో మరోవిధంగా స్థిరపడాలనుకునేవారికికూడా మధురనాయకి ఆర్దికంగానూ, ఇతర విధాలుగానూ సాయపడుతుంది.
మధురనాయకి కథ మరోసారి తెలుసుకుందాం.
రాఘవులు కొడుకు వేణు ప్రస్థుతం ఆమె యింట్లో ఉన్నాడు.
వేణుకీ ఆమెకూ విచిత్రంగా పరిచయమయింది.
ఒకరోజున మధురనాయకి పార్కులో కూర్చుని వుంది. అక్కడ వేణు ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడు. ఆమె అతణ్ణి చెప్పుతీసి కొట్టింది. ఆ దృశ్యం మధురనాయకి చూసి తనే వేణు దగ్గరకు వెళ్ళింది.
"పాపం-నీకు అవమానమయింది కదూ!" అందామె.
"ఇది నాకు అవమానమేం కాదు- అలవాటే!" అన్నాడు వేణు తడుముకోకుండా.
"అలవాటే అయితే-ఇది మంచిదికాదు-" అంది మధురనాయకి.
"మంచో, చెడో-నేను మానుకోలేను-" అన్నాడు వేణు.
"మానుకునే ఉపాయం నేను చెబుతాను వింటావా?"
"వినను-...."
"ఎందుకని?"
"ఆడవాళ్ళంటే నాకు సరదా - నా సరదా నాకుండాలి...."
"నీ సరదా నీకుంటుంది....."
"ఎలా?"
మధురనాయకి అతడికి తన సంస్థ గురించి చెప్పుకుంది.
వేణు ఆశ్చర్యపడ్డాడు-"ఇది నిజమా?" అన్నాడు.
"డబ్బుంటే చాలు-ఇది నిజమే అవుతుంది....." అంది మధురనాయకి.
అప్పుడు వేణు జేబులో డబ్బుంది. అతడు మధురనాయకి వెంట వెళ్ళాడు. మధురనాయకి అతడిని డాక్టరు వద్దకు పంపింది. వేణు వైద్య పరీక్షకు నిరాకరించాడు.
"వైద్య పరీక్ష ఇక్కడ తప్పనిసరి!" అంది మధురనాయకి.
"వేశ్యలకు వైద్యపరీక్ష కానీ నాకెందుకు?" అన్నాడు వేణు.
"వేశ్యకు పురుషపదం విటుడు-" అంది మధురనాయకి.
వేణు అంగీకరించి వైద్యపరీక్షకు సిద్దపడ్డాడు. అతడి ఆరోగ్యం మంచిదేనని తేలేక ఓ యువతి వద్దకు మధురనాయకి అతణ్ణి పంపింది.
కాసేపటికి అతడు బయటకు వచ్చి మధురనాయకిని కలుసుకున్నాడు.
"ఎలా వుంది నా ఉపాయం?" అంది మధురనాయకి.
"బాగోలేదు-" అన్నాడు వేణు.
"ఏం?"
"నాకు వేశ్య పనికిరాదు-స్త్రీ కావాలి-...."
"వేశ్య స్త్రీ కాదా?"
"నా దృష్టిలో కాదు-...."
"స్త్రీ అంటే నీ దృష్టిలో ఎవరు?"
"డబ్బు గురించికాక - నన్ను నన్నుగా ప్రేమించి ఇష్టపడే మనిషి...."
మధురనాయకి వెంటనే - "నిజమే! నీకు వేశ్యపనికిరాదు-" అంది. వేణు వెళ్ళిపోబోతోంటే ఆపి-"ఆడది నిన్ను నిన్నుగా ఇష్టపడాలంటే నడి బజార్లో చెయ్యి పట్టుకొనడంవల్ల జరిగే పనికాదు-" అంది.
"మరెలా జరుగుతుంది?"
"ఓ స్త్రీని ఎన్నుకో-ఆమెకోసం ఏమైనాచేయి....."
"ఏమైనా అంటే?"
"ఉదాహరణకు అలివేలు కథ చెబుతాను...." అంది మధుర నాయకి.
వేణు వినసాగాడు.
అలివేలు ఓ మధ్యతరగతి అమ్మాయి. పక్కింటి కుర్రాడి మాయమాటలకు లోబడి-అతడికి తనువు నర్పించింది. అతడు వేరే పెళ్ళి చేసుకున్నాడు. అలివేలు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అదృష్టంకొద్దీ మధుర నాయకికి దొరికింది. ఆమె అలివేలును వేశ్యావృత్తికి ప్రోత్సహించింది. అలివేలు ఒప్పుకోలేదు. తను సమాజంలో నలుగురి ఆడవాళ్ళకులాగే బ్రతుకుతానంది.
"అలివేలు ఇప్పుడు నా దగ్గరే వుంది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వ్యభిచారానికి ప్రోత్సహించలేను. ఆమెను నువ్వు పెళ్ళి చేసుకుంటావా?" అంది మధురనాయకి.
"చెడిన ఆడదాన్ని నేను పెళ్ళిచేసుకోవాలా?" అన్నాడు వేణు.
"అలివేలు చెడిపోలేదు. నిక్షేపంలా వుంది-"
"నా దృష్టిలో ఆమె చెడిపోయినట్లే లెక్క!"
"అలివేలు దృష్టిలో నువ్వూ చెడిపోయిన వాడికిందే లెక్క! పార్కుల్లో ఆడపిల్లల చెప్పుదెబ్బలు తినేవాళ్ళూ, నా యింట్లో వేశ్యాసంపర్కాన్నాశించేవాళ్ళూ-చాలా మంది దృష్టిలో చెడిపోయినట్లే లెక్క...."
"అలాంటి లెక్కల్ని నేను లెక్కచేయను...."
"లెక్కచేసినప్పుడే మళ్ళీ నా యింటి గుమ్మం తొక్కు వెళ్ళు...." అంది మధురనాయకి తీవ్రంగా. వేణు మొండితనం ఆమెకు చిరాకు కలిగించింది.
వేణు వెళ్ళిపోయాడు. సరిగ్గా రెండురోజులకే అతడు మధురనాయకి-ఇంటి గడప మళ్ళీ తొక్కాడు.
అంత త్వరగా అతడు వస్తాడని ఊహించని మధుర నాయకి ఆశ్చర్యపోయి-"అలివేలు విషయంలో నీ మనసు మార్చుకున్నావా?" అంది.
"నీ యింట్లో రెండ్రోజులుండనీ-" అన్నాడు వేణు.
"ఎందుకు?"
"అలివేలును పెండ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులున్నాయి. ఇంట్లో మావాళ్ళిష్టపడరు. నేనార్దికంగా స్వతంత్రున్నికాదు...." అన్నాడు వేణు.
"నీ కాళ్ళమీద నిలబడాలన్న కోరిక నీకుంటే-నిలబెట్టే ప్రయత్నం నేను చేయగలను....." అంది మధురనాయకి.
"ఎలా?"
"సంఘంలో నాకు గౌరవముందో లేదో తెలియదు. కానీ పలుకుబడి వుంది. నీకుద్యోగామిప్పించగలను. నిన్నో చిన్న వ్యాపారస్తున్ని చేయగలను. అయితే నీకోసం మాత్రం కాదు అలివేలు జీవితానికి రక్షణకోసం...."
"ఆలోచించుకునేందుకు నాకు రెండ్రోజుల వ్యవధి కావాలి....."
మధురనాయకి అతడిని రెండ్రోజులపాటు తనింట్లో వుంచుకుంది. ఇప్పుడా రెండ్రోజూలూ అయిపోయాయి.
"నువ్వొచ్చి అప్పుడే రెండ్రోజులయింది-"అందామె.
వేణుకు ఏం చెప్పాలో తోచలేదు. ఆ యింట్లో సకల సదుపాయాలూ వున్నాయి. అతడికి సుఖంగా వుంది. తల్లిదండ్రుల్నెదిరించి అక్కడకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యంలేదు. అలాగనీ అలవేలును పెళ్ళి చేసుకోవాలనీ లేదు.
