Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 43


    "ఎలా వెడతామండీ?" అంది సరళ.
    "అదీ వాడే చూసుకుంటాడు. అయినా వాడు చెప్పిన బంగళా ఎక్కడుందో నేనూహించగలిగాను. చందనపురంలో వాడుపోయేముందు మనమో బంగళాలోలేమూ. అదేవాడు చెప్పింది.....ఒకవేళ మనకు మళ్ళీ గోపీ కనిపించకపోయినా నేరుగా అక్కడికే వెళ్ళిపోదాం. రాజు అక్కడ మనకే ఏర్పాట్లు చేశాడో చూద్దాం." మామూలుగా అన్నప్పటికీ అతడి మాటలు సరళను సవాలు చేస్తున్నట్లే ఉన్నాయి.
    "నిజమగా మనకు వాడక్కడ ఏర్పాట్లు చేశాడంటారా?" అంది సరళ. ఆమెకు చందనపురం బంగళా గుర్తుకువచ్చింది. అక్కడి కొడుకుమాటలు తల్చుకోగానే ఆమెకు ఏడుపువచ్చి "భగవంతుడు మనుషులకీ అర్దాంతరపు చావెందుకు పెట్టాడో?" అంది.
    "ముందు రాజును పిలు.....మన నిర్ణయం చెప్పు. వాడేమీ మాట్లాడకపోతే అప్పుడు మనం చందనపురం వెళ్ళివద్దాం...." అన్నాడు వరప్రసాద్.
    "ఏమిటో - నాకు భయంగా ఉందండీ....." అంది సరళ.
    "భయమెందుకు సరళా? వాడు మనబాబు. ఇప్పుడు ప్రాణాలు లేవుగదా అని వాడికి భయపడడం అన్యాయం కదూ..." అన్నాడు వరప్రసాద్. అతడీ మాటలు మనస్ఫూర్తిగానే అన్నాడు.
    "రాజూ!" అంది సరళ.
    "అమ్మా!"
    "విన్నారా-వాడు పలికాడు...." అంది సరళ.
    వరప్రసాద్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి- "నిజం సరళా! వాడి పిలుపిప్పుడు నాకూ వినిపించింది. రాజూ! ఎన్నాళ్ళయిందిరా నీ గొంతు విని.....ఈ గొంతు ముందే వినివుంటే ఎప్పుడో వచ్చేవాణ్ణి కదురా నీ దగ్గరికి" అన్నాడతడు.
    "నాన్నా! నా కిప్పుడెంతో సంతోషంగావుంది. నా కోసం అమ్మ నిన్ను ఒప్పించగలిగింది. మీ ఇద్దరూ మన స్ఫూర్తిగా నా దగ్గరకు రావడానికి ఒప్పుకున్నారు...."
    "బాబూ......పోయిన ప్రతిమనిషీ ఇలా వచ్చి మాట్లాడగలిగితే ఎంత బాగుంటుందిరా?" అన్నాడు వరప్రసాద్. అతడి కనులలో ఆనందబాష్పాలున్నాయి.
    "నాన్నా! ఇదేమీ అసాధ్యంకాదు. పోయినవాడికీ మిగిలినవాడికీ మరువలేని అనుబంధముండాలి. పోయాక కూడా ఆత్మ మిగిలిన వారినే తల్చుకోవాలి. మిగిలినవారి మనసులో పోయినవాడి స్థానం చెక్కు చెదరకూడదు. అప్పుడొకరితో ఒకరు సంభాషించుకోవడం సాధ్య పడుతుంది. అమ్మదీ నాదీ అటువంటి అనుబంధం. ఆ అనుబంధంతో నేను నిన్ను కూడా సాధించుకున్నాను. నేను నిజంగానే మీ కోసం బంగళా ఏర్పాటు చేశాను. మీ రనుకున్నట్లు-అది చందనపురం బంగళాయే! మనమిప్పుడక్కడికే వెడదాం."
    "ఎలా వెడతాం?"
    "కళ్ళు మూసుకోండి...."
    వరప్రసాద్, సరళ కళ్ళు మూసుకున్నారు. అప్పుడేం జరుగుతుందో తెలుసుకోవాలని వారికి కోరికగా వుంది.
    
                                    10

    ఫోన్లో తెలిసిన సమాచారానికి సీతాకరరావు షాక్ తిన్నాడు.
    కొద్ది నెలలక్రితం చందనపురం బంగళాలో దెయ్యం పవేశించిందట. ఇప్పుడా బంగళా ఖాళీగా ఉంటోంది. ఎవరూ ఉండడంలేదు. ఎవరైనా ఉండడానికి ప్రయత్నిస్తే బెదిరిపోతున్నారు.
    "ఇది చాలా విచిత్రంగా వుంది. మానవాతీత శక్తులను నమ్మాలా?" అనుకున్నాడు సీతాకరరావు. అయన దెయ్యం గురించిన కారణాలు సేకరించాడు.
    ఆ బంగళాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుందట మానభంగం కారణంగా. ఆమె దెయ్యమై తిరుగుతోందని అంతా చెప్పుకొంటున్నారు. ఈ వార్త పేపర్లో కూడా వచ్చిందిట.
    అప్పుడు సీతాకరరావుకింకో అనుమానం వచ్చింది. పేపర్లో ఈ వార్తను సరళ కూడా చూసి ఉంటుంది. అందులోని దెయ్యం తన కొడుకేనని ఆమెకు అనిపించింది. అప్పట్నించీ ఆమె భ్రమ ప్ర్రారంభమయింది.
    అంతే జరిగి ఉండాలి!    
    అక్కడ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అది కొందరిని అక్కడ దెయ్యం భ్రమలో ఉంచింది. ఆ భ్రమ సరళలో మరో భ్రమను రేపింది.
    ఆ భ్రమ ఈ రోజుతో అంతమైపోతుంది.
    ఏం జరిగిందో తెలుసుకోవాలని సీతాకరరావుకూ ఆత్రుత కలిగింది. ఆయన వెంటనే వరప్రసాద్ ఇంటికి వెళ్ళాడు.
    తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి.
    తోసుకొని లోపలకు వెళ్ళాడాయన.....
    పిలిస్తే ఎవరూ పలకలేదు. ఇల్లంతా కలయతిరగగా ఓ బెడ్ మీద దంపతులిద్దరూ పక్క పక్కగా పడుకొని కనపడ్డారు.
    ఇద్దరి వదనాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇద్దరూ కళ్ళుమూసుకొని వున్నారు.
    సీతాకరరావు ఇద్దర్నీ పిలిచాడు.....పలకలేదు.
    ముట్టుకొని చూశాడు. ఉలిక్కిపడ్డాడు.
    వారి శరీరాలు మంచుకన్న చల్లగా వున్నాయి.
    ఆయన వెంటనే డాక్టరుకోసం పరుగెత్తాడు. డాక్టరు వచ్చి చూశాడు.
    ఇద్దరివీ ప్రాణాలు పోయాయి. సహజ మరణం......
    ఇదీ డాక్టరు తేల్చి చెప్పిన విషయం.....
    సీతాకరరావు ఆలోచిస్తున్నాడు.....
    రాజు నిజంగా తల్లిదండ్రులను పిలిచాడా? ఆ పిలుపుకు అంగీకరించమని తను చెప్పిన సలహాయే వారి ప్రాణాలు తీసిందా?
    సీతాకరరావు ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు.
    చందనపురం బంగళాలోని దెయ్యాలు మాత్రం ఎవరికీ లొంగడం లేదన్న వాడుక బయల్దేరింది.
    వరప్రసాద్ ఆస్తికి వారసుడైన గోపీకి-ఆ యింట్లో మళ్ళీ ఏ దెయ్యమూ కనబడలేదు.


                                -: అయిపోయింది :-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS