సన్యాసి ఆ కత్తిని చేత్తో పట్టుకొని తీక్షణంగా పార్వతమ్మ వంకచూశాడు. తర్వాత కత్తిని గాలిలో కెత్తాడు. కళ్ళు మూసుకున్నాడు. ఏదో మంత్రోచ్చారణ చేసి నెమ్మదిగా కత్తిని క్రిందకు దించి కళ్ళు తెరిచాడు.
"ఏం చేశారు స్వామీ?" అంది పార్వతమ్మ.
సన్యాసి కత్తిని పార్వతమ్మకు అందించి-"చూడు!" అన్నాడు.
కత్తిమీద కుంకుమరేఖలున్నాయి. పార్వతమ్మ వాటినిచూసి ఆశ్చర్యపడింది.
"మాత ఆశీర్వాదం లభించింది-"అని-"ఇంట్లో చిన్న పెట్టె యేదైనా ఉందా?" అన్నాడు సన్యాసి.
పార్వతమ్మ అక్కణ్ణించి వెళ్ళి అడుగున్నర పొడవు, అరడుగు ఎత్తు-ఉన్న ట్రంకుపెట్టెని తెచ్చి ఆయన ముందుంచింది.
"ఇందులో ఏమున్నాయి?"
"పాత గుడ్డలుంటే తీసేశాను స్వామీ!"
"ఫరవాలేదు అది తీసుకునిరా" అన్నాడు సన్యాసి ఆమె పాతగుడ్డలు తెచ్చాక వాటి మధ్యలో కత్తిని వుంచి పెట్టెలో పెట్టి మూతవేసి గొళ్ళెం వేశాడు. తర్వాత పార్వతమ్మ నడిగి తాళంకప్పను తెప్పించివేశాడు. తాళం చెవిని తీసుకొని దొడ్లోకి నడిచాడు. పార్వతమ్మ ఆయన్ననుసరించి వెళ్ళింది.
"ఇప్పుడు తాళాన్ని గాలిలోకి ఎగరేస్తాను. అది గాలిలోనే కలిసిపోతుంది. క్రిందపడదు-" అంటూ సన్యాసి తాళం చెవిని గాలిలోకి ఎగరేశాడు. పార్వతమ్మ ఆశ్చర్యంగా గాలిలోకి చూసింది.
తాళంచెవి తూనీగలా ఎగిరిపోతున్నట్లామెకు తోచింది. అది క్రిందకుమాత్రం పడలేదు.
అప్రయత్నంగా పార్వతమ్మ చేతులు జోడించి సన్యాసికి నమస్కరించి-"తమరు నిజంగా మహానుభావులు-"అంది.
"నీ పొగడ్తలతో నాకు పనిలేదు. నేను చేయగలిగింది చేశాను. ఆ పెట్టితాళాన్నిప్పుడెవ్వరూ తెరవలేరు" అన్నాడు సన్యాసి.
"నా కొడుక్కు ప్రాణభయం తప్పినట్లేనా స్వామీ!"
"నీ కొడుక్కు అర్దాంతరపుచావు ఆ కత్తివల్ల తప్ప జరగదు-"
పార్వతమ్మ తృప్తిగా నిట్టూర్చి-"నా కొడుకు ప్రాణాలు నిలబెట్టారు. ఏమిచ్చినా మీ ఋణం తీరదు-" అంది.
"అదంతా నీ భ్రమ-నీ కొడుక్కి చావు రాసిపెట్టి ఉన్న క్షణాన ఆ పెట్టి తాళం దానంతటదే తెరుచుకుంటుంది-...." అని-"నీ కొడుకు ప్రాణాలు తన ప్రవర్తన వల్లనే కాపాడబడతాయి. నేను కత్తిని మంత్రించానంటే అందువల్ల ఒక్కటే ప్రయోజనం. ఆ కత్తితో చావు లభిస్తే అతడీజన్మలో చేసిన పాపాలన్నీ క్షాళణమైపోతాయి. మరో జన్మవరకూ వేధించవు-.....మరి నేను వెడతాను-" అన్నాడు సన్యాసి.
"స్వామీ! మా అబ్బా యెక్కడున్నదీ తమరు వివరించలేదు-" అంది పార్వతమ్మ కంగారుగా.
సన్యాసి ఆమెకు వేణు వున్న యింటి చిరునామా గురించి సవివరంగా చెప్పి వెళ్ళిపోతూ-"కాసేపట్లో నీ భర్త ఉసూరుమంటూ వస్తాడు. అతన్నలాగే బయటకు పంపివేయక-ముందు కడుపునిండా భోజనం పెట్టు. నీకు శుభమవుతుంది-" అన్నాడు.
సన్యాసి వెళ్ళిపోగానే పార్వతమ్మ పరుగున వంటింట్లోకి వెళ్ళింది. భర్తవచ్చేలోగా త్వరగా వంట చేయాలని ఆమె తాపత్రయం.
అయితే వంటింట్లో ఆమె వండిన వంటకాలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆశ్చర్యంతో పార్వతమ్మ నిశ్చేష్టురాలయింది.
తను సన్యాసికింట్లో వండిన వంటకాలన్నీ ఊడ్చి పెట్టేసింది. ఇప్పుడవన్నీ ఎలా తిరిగొచ్చాయి? అసలు సన్యాసి నిజంగా తనింటికి వచ్చాడా-కలగన్నదా?
ఇలా ఆలోచిస్తూండగానే తలుపుతట్టిన శబ్దమై మామూలు మనిషయింది పార్వతమ్మ. ఆమె ఒక్క ఉదుటున వెళ్ళి తలుపుతీసింది.
రాఘవులు వీదిగుమ్మం దగ్గర నీరసంగా నిలబడి ఉన్నాడు.
"అబ్బాయి కానీ ఇంటికొచ్చాడా?" అన్నాడు దిగులుగా.
"రాలేదు. ముందు లోపలకు రండి-" అంది పార్వతమ్మ. ఆమె భర్తకు జరిగిందంతా అప్పుడే చెప్పదల్చుకోలేదు. చెబితే రాఘవులు వెంటనే మళ్ళీ బయటకు వెళ్ళిపోతానంటాడని ఆమె భయం.
"ఎక్కడున్నాడో-ఏం చేస్తున్నాడో?" అంటూ రాఘవులు లోపలకు వచ్చాడు.
పార్వతమ్మ బలవంతంగా అతడిచేత భోజనం తినిపించింది. అతడితోపాటే తనూ భోంచేసింది. భోజనాలయ్యాక జరిగింది చెప్పింది.
"నువ్వు కలగంటున్నావా?" అన్నాడు రాఘవులు.
పార్వతమ్మ భర్తకు చిన్న ట్రంకుపెట్టి చూపించింది. రాఘవులా తాళంచూసి-"దీనికేముంది? మన దగ్గర మారుతాళం చెవి వుందిగా!" అన్నాడు.
"అయ్యో! ఆ విషయమే మరిచాను-" అంది పార్వతమ్మ.
కత్తిమీది కుంకుమరేఖలు చూడాలని రాఘవులు కుతూహల పడ్డాడు. అందుకని అతడు మారుతాళాలుండే గుత్తి తెచ్చాడు. సులభంగానే తాళం చెవిని గుర్తుపట్టాడు. అయితే ఆ తాళం చెవి కప్పులో దూరింది తప్ప-అటూ తిరగలేదు.
"అంతా సన్యాసి మహిమ!" అంది పార్వతమ్మ.
"నమ్మడానికి కష్టంగా వుంది-" అన్నాడు రాఘవులు.
పార్వతమ్మ ట్రంకుపెట్టెని పడకగదిలో మంచంకింద పెట్టింది. భర్తతో-"ఇప్పుడు స్థిమితంగా వెళ్ళి వేణును తీసుకొనిరండి-" అంది.
"నే నెప్పుడూ వేశ్యావాటికకు వెళ్ళలేదు. కొడుకు గురించి వెళ్ళాల్సి వస్తోంది-" అన్నాడు రాఘవులు బాధగా.
"ఏమైతేనేం? వాడి జాడంటూ తెలిపింది గదా...."
"కొడుకు కోసం తండ్రి వేశ్యావాటికకు వెళ్ళడం చాలా అవమానకరమైన విషయం. వాడక్కడ లేకుంటేనే నే నెక్కువ సంతోషిస్తాను" అన్నాడు రాఘవులు.
"అలాగనకండి-వాడి జాడ తెలిస్తే ఎన్ని అవమానాలైనా మనం భరించవచ్చు-" అంది పార్వతమ్మ.
రాఘవులు ఉసూరంటూ బయల్దేరాడు.
2
'నువ్వొచ్చి అప్పుడే రెండ్రోజులయింది-"అంది మధురనాయకి.
మధురనాయకికి ఆ ఊళ్ళో వేశ్యమాత అన్న పేరుంది. ఆ ఊరి వేశ్యలుకూడా ఆమెను తల్లిగా భావిస్తారు. వేశ్యాసంపర్కం కోరేవారామెను సంప్రదించడంలో యెన్నో లాభాలున్నాయి.
వేశ్యాకులంలో పుట్టింది మధురనాయకి. వేశ్యగానే బ్రతికింది కానీ నీతినీ నిజాయితీని నమ్ముకుంది. ఆమె అందం ఆమెకు డబ్బును సంపాదించి పెట్టింది. నిజాయితీ ఆ కులంలోకూడా ఆమెకు గౌరవాన్నంపాదించింది.
ధూమపానంకంటే, మద్యపానంకంటే - వేశ్యావృత్తి తప్పుకాదంటుంది మధురనాయకి. మద్యం, ధూమం మగవాడికి శారీరావసరాలు వుంది. స్త్రీ పురుషులకు శారీరకంగా పరస్పరావసరం వుంది. శారీరకావసరానికి పెళ్ళి ఒక పద్ధతి. వేశ్య సంపర్కం మరొకపద్ధతి. అయితే సమాజంలో పెళ్ళికి గౌరవస్థానముంది. వేశ్యకు లేదు. వేశ్యకు మించిన అవమానం మోసపోయిన ఆడదానిది.
పురుషుడిచే మోసపోవడం - స్త్రీకి అనాదినుంచీ అనుభవం. అలా మోసపోయిన ఆడవాళ్ళలో అప్పటి కప్పుడు జీవితాలనంతం చేసుకున్నవారున్నారు. తెగిన గాలిపటాలై ముదనష్టపు చావుకు గురైనవాళ్ళూ వున్నారు.
చెడిన ఆడవాళ్ళకు మధురనాయకు ఆశ్రయమిస్తుంది. వారిని మానసికంగా వేశ్యావృత్తికి ప్రోత్సహిస్తుంది. "చెడిన ఆడది"-అన్న పాదం అర్ధరహితమైనది. అది సమాజం స్త్రీని బలహీనపర్చడానికి వాడే పదమని చెబుతుంది.
