వరప్రసాద్ మరి కాసేపాలోచించి-"ఆఁ గుర్తు కొచ్చింది...." అన్నాడు.
"ఏమిటి?" అన్నాడు సీతాకరరావు కుతూహలంగా.
"రాజు పోవడానికి సరిగ్గా నెలరోజులకుముందు...." అన్నాడు వరప్రసాద్ కొడుకు గుర్తుకురావడంవల్లనేమో అతడి గొంతు పూడుకుపోయింది.
"ఊఁఏమయింది?"
"స్నేహితుడి పెళ్ళికి చందనపురం వెళ్ళాం. అక్కడ అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితుడు తగిలాడు. అతడో వ్యాపారస్థుడికి సెక్రటరీగా వుంటున్నాడు. ఆ ఊళ్ళో ఆ వ్యాపారస్థుడికో చక్కటి బంగళా వుంది. అయన చందనపురం వచ్చినపుడక్కడ బసచేస్తాట్ట. ప్రస్తుతం నా స్నేహితుడేదో పనిమీద చందనపురం వచ్చాడు. మమ్మల్నా బంగళాలో వుండమని బలవంతపెట్టాడు. ఆ స్నేహితుడి కారణంగా స్నేహితుడి పెళ్ళయినాక నాలుగు రోజులు అదనంగా ఆ బంగళాలో ఉండిపోయాం విశాలమైన గదులు ఖరీదైన ఫర్నిచర్, కనుసన్నల్లో మసిలే పనివాళ్ళు.....అక్కడున్న కాసిని రోజులూ స్వర్గంలో వున్నట్లే గడిచిపోయింది...." అన్నాడు వరప్రసాద్.
"ఆ బంగళా గురించి రాజేమైనా అన్నాడా అప్పుడు!"
"అన్నాడు వాడా జీవితాన్ని మర్చిపోలేకపోయాడు. ఇలాంటి బంగళా మనకెందుకు లేదని పదేపదే అడిగాడు. మనకంత డబ్బులేదని చెప్పాను. పెద్దయ్యాక తాను బాగా డబ్బు సంపాదించి ఇలాంటి బంగళాకట్టించి మమ్మల్నిద్ధర్నీ సుఖపెడతానన్నాడు...." ఈ మాటలనగానే వరప్రసాద్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి - "వాడెంతసేపూ మా గురించే ఆలోచించేవాడు. మానుంచి వాడేమీ ఆశించేవాడు కాదు. మమ్మల్నేమీ అడిగేవాడు కాదు. ఎప్పుడూ పెద్దయ్యాక మాకోసం తనేం చేయాలా అనే ఆలోచించేవాడు. వాడి ఊహల నిండా బంగళాలు, కార్లు ఉండేవి. వాడి ఆలోచనల్లో తన సుఖానికి చోటుండేది కాదు. మా సుఖం గురించే యెప్పుడూ ఆలోచించేవాడు. ఎన్ని కలలు కన్నాడో తను పెద్ధవడం గురించి....వాడలాగే పోయాడు.....మేమిలా మిగిలాం."
సీతాకరరావు ముఖంలో సంతోషం కనబడింది-"సందేహంలేదు. రాజు కన్న కలలు ఆ బంగళాలో ప్రతిఫలించాయి. ఆ బంగళా గురించి ఎన్నోసార్లు తల్లికి చెప్పివుంటాడు అది నీ భార్య మనసులో దృఢంగా నాటుకుపోయింది. తన కొడుక్కు తనమీదున్న ప్రేమ కామె యెంతో పొంగిపోయేది....అలాంటి పరిస్థితుల్లో కొడుకు పోయాడు. ఆమె అంతరాంతరాలలో రాజు, వాడి కోరిక అలా నిలిచిపోయేయి. అదే ఆమెను క్రమంగా భ్రమలోకి దింపింది...." సీతాకరరావు సాలోచనగా - "ఇందులో సందేహమేమీ లేదు. నీ భార్య భ్రమపడుతోంది రాజు ఇంకెవరికీ కనపడడని ఆమెకు తెలుసు. అందుకే వాడే తనింకెవరికీ కనపడనన్నాడనీ, ఎవరితోనూ మాట్లాడనన్నాడనీ చెబుతోంది. ఇదంతా ఆమె కావాలని చేయడంలేదు. ఆమె మనసు ఆమెచేత ఆమెకు తెలియకుండా చేయిస్తోంది. ఆమె మనసామెను ఊహాలోకాల్లోకి పంపుతోంది...."
"అయితే మా ఇంట్లో జడుసుకున్న రంగమ్మ, పాపాయమ్మ, గోపీలను కూడా ఆమె బెదిరించిందంటారా? ఇది నేను నమ్మలేదు. సరళ అలాంటి మనిషి కాదు...."
"నీ భార్య తానెవరినీ బెదిరించలేదు. అయితే రాజు గురించిన ఆలోచనలామెను బలంగా ఆక్రమించుకున్నాయి, ఆ ఆలోచనల బలంతో ఆమె ఇతరులను బెదిరించగల్గుతోంది. దీన్ని సజెస్టిప్ హిప్నాటిజం అంటారు. సరళ తనకు తెలియకుండానే-ఇతరులలో దెయ్యమున్నదన్న భ్రాంతిని కలిగించింది. తాము చూడని రూపానికి రూప కల్పనచేసింది. దెయ్యాన్ని చూసి నువ్వు భయపడడం ఆమె మనసుకిష్టం లేదు. అందుకే దెయ్యమెప్పుడూ నీకు కనబడలేదు. ఆమె మనసు యే ప్రయోగాన్నయినా ఇతరులమీదనే చేస్తోంది-"
"మీరు చెప్పేది నిజమేనంటారా?"
"ఆలోచించి చూడు.....నిజానిజాలు నీకే స్పురిస్తాయి. నువ్వు బంగళా గురించి చెప్పేక నీ భార్య గురించిన నా అనుమానం రూఢి అయింది."
వరప్రసాద్ ఆలోచిస్తున్నాడు. అతడికి నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది.
"గోపీ-నీకు తెలుసుగదా! రాజు నీయీడువాడే.....దురదృష్టం కొద్దీ అర్దాంతరంగా పోయాడు. అయితే వాడి ఆత్మ దెయ్యమై ఈ యింట్లోనే తిరుగుతోంది. వాడు నిన్నుచూసి అసూయపడుతున్నాడు. నిన్నీ యింట్లోంచి తరిమేయాలని నిన్ను బెదిరిస్తున్నాడు. ఇలాంటి చోట నువ్వుండగలవా?" అంది సరళ గోపీతో.
ఈ మాటలామె గోపీ శ్రేయస్సుకోరి చెప్పిందా లేక గోపీని రాజు విషయం నమ్మి చాలని చెప్పిందా?
ఇదేనా సజెస్టివ్ హిప్నాటిజం?
"సీతాకరరావుగారూ! నాకు మీ మాటలపై నమ్మకం కుదిరింది. ఇది పూర్తిగా మనస్తత్వానికి సంబంధించిన విషయం. ఇప్పుడు సరళను సరైన దారిలో పెట్టాలంటే ఏం చేయాలో మీరే చెప్పాలి. వస్తుతః ఆమె చాలా మంచిది. గోపీకి ఏమేం మందులివ్వాలో నాకు మరీ మరీ చెప్పింది. మధ్యమధ్యలో నిద్రలేచి వచ్చి దూరాన్నించే గోపీ యోగక్షేమాలడుగుతూండేది.....ఇది దృష్టిలో ఉంచుకుని మీ సలహా చెప్పండి...." అన్నాడు వరప్రసాద్.
"ఒక్కటే ఉపాయం నీ భార్యతో కలిసి రాజు దగ్గరకు వెళ్ళడానికి నువ్వంగీకరించు" అన్నాడు సీతాకరరావు.
"అప్పుడేం జరుగుతుంది?"
"నీ భార్యకు భ్రమతొలగిపోతుంది...."
"ఎలా?"
ఇంతవరకూ ఆమె ఒక విషయం నమ్ముతోంది. తను నమ్మిన విషయాన్ని నువ్వు నమ్మవని ఆమె నమ్మకం. అదే ఆమె భ్రమకు బలం. నువ్వొప్పుకున్నావంటే ఆమె నిన్ను రాజు దగ్గరకు తీసుకునివెళ్ళాలి. అదామెకు సాధ్యంకాదు. అప్పుడామె భ్రమనుంచి వాస్తవంలోకి వస్తుంది."
"అసలిదంతా ఎందుకు జరుగుతోందంటారు?" అన్నాడు వరప్రసాద్ బాధగా.
"ప్రాణాధికంగా ప్రేమించిన బిడ్డ పోతే-ఆ బిడ్డను మరిచిపోవాలన్న భవనకు కొందరు తల్లులు తట్టుకోలేరు. మనిషిపోతే మాత్రం ఆత్మ ఉండదా? ఆ ఆత్మతో మాత్రం కలిసుండడమెందుకు సాధ్యపడదు?.....ఈ విధంగా ఆలోచించి ఈ భ్రమకు లోనవుతున్నది నీ భార్య...."
"సరే.....నేను మీరు చెప్పినట్లే చేస్తాను. ఏం జరిగిందీ వచ్చి మీకు చెబుతాను...." అన్నాడు వరప్రసాద్.
"వెళ్ళేముందు చందనపురంలోని ఆ బంగళా వివరాలు కూడా నాకు చెప్పు...." అన్నాడు సీతాకరరావు.
"ఎందుకు?"
"ఇప్పుడా బంగళాలో ఎవరుంటున్నారో తెలుసుకుంటాను.....అక్కడ నిజంగా మీ రాజు ఉంటున్నాడేమో కనుక్కుంటాను."
"అది సాధ్యమా?"
సీతాకరరావు నవ్వి-"చూద్దాం!" అని - "మీరు బంగళాకు ప్రయాణమైతే తప్ప ఇక్కడికి రానవసరం లేదు. నేనే మిమ్మల్ని చూడ్డానికి వస్తాను-మధ్యాహ్నానికి!" అన్నాడు.
9
"ఇంతసేపయిందేమిటండీ.....గోపీని దిగబెట్టి రావడానికి!" అంది సరళ చిరాగ్గా.
"ఏం-అలా ఉన్నావు మళ్ళీ రాజు కనిపించాడా?" అన్నాడు వరప్రసాద్.
"లేదు. నా మనసంతా ఏదోలాగుంది. పరాయిపిల్లాణ్ణి తెచ్చి యింట్లో పెట్టుకున్నాం. వాడికి మనసులో ఎన్నో ఆశలు రేపాం. ఇప్పుడు వాణ్ణి దిగవిడిచి రావలసివచ్చింది."
"బాధపడకు సరళా! మనకు మనరాజుకంటే ఎవరూ ఎక్కువకాదు. వాడికింకా ఏ సరదాలూ తీరలేదు. నూకలు చెల్లిపోయాయి. వాడు మననిపిలవడమే ఒక అదృష్టం......మనం వాడిదగ్గరకు వెళ్ళిపోదాం...."
