Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 43


    "ఏదిమాత్రం తేలికని?"
    "వ్యయప్రయాస లెన్నో ఉంటాయి."
    "ఉండనివ్వు, సునీతా! మనకు నష్టం వస్తుందంటావు. రాసి ఒక మంచి పని చేపట్టినపుడు లాభమా? నష్టమా? అన్న దృష్టి అనవసరం."
    సునీత కాగితాన్ని చూస్తున్నది. నీలకంఠం గప్ చిప్ అయ్యాడు.
    "సునీతా, ప్రెస్ ఎలాగూ మన చేతిలో ఉంది. మొదట తెలుగులోనే వేద్దాం. ఇంగ్లీషు తరవాత. ఏమంటావు?"
    "నాకు సాయంత్రంవరకు టైమివ్వండి, వేణూ."
    "ఓ. ఎస్! పోస్టు వచ్చి ఉంటుంది. వస్తాను." వేణు కిందికి వెళ్ళాడు. మరికొంతసేపటికి నీలకంఠం గూడా కిందికి దిగాడు.
    ఇది కరుణతో చెప్పింది. కరుణ విప్పారిన నేత్రాలతో, "ఇంకేమే? మంచిదేగా? దీనికి పెద్ద ఆలోచన లెందుకు?" అన్నది.
    ఆర్తి నడిగింది. సునీత ఇష్టానిష్టాలకే వదిలిందామె. రాధ నడిగితే, "తప్పకుండా వేయించు!" అంటూ తనుకూడా మిగతావాళ్ళతో ఏకీభవించింది. అంతలో వేణుకూడా వచ్చాడు.
    "రే! నువ్విక్కడ కొలువుదీరావా?"
    "తాత్కాలికంగా!"
    "అందరికీ టాంటాంవేసి అభిప్రాయసేకరణ చేస్తున్నావా? మొత్తం ఓట్ల మెజారిటీ ఎంత? ఎవరు గెలిచారు?"
    "ప్రతి పాదించినవారే!"
    "గుడ్! అలా ఉండాలి మరి. స్నానంచేసి వస్తాను. కూర్చో!"
    రాధకు ఓ పట్టాన గ్రాహ్యంకాలే దీమాటలు. సునీత విడమరిచి చెప్పింది. వేణు రాగానే సునీత ఆలస్య మయిందంటూ నమస్తే చెప్పి వెళ్ళింది.    
    వారంరోజుల్లో అన్ని ఏర్పాట్లూ పూర్తి అయినాయి.
    సునీతే ఖర్చులన్నీ చేస్తున్నది. ఎంత డబ్బు అడిగినా వేణు ఇస్తూనే ఉన్నాడు. బిల్లులన్నీ అతని పేరుమీదే వ్రాయించింది సునీత. వేణు అలాగే చెప్పాడు. ఆమె అనుకున్నది ఒక్కటే -వేణు ఇచ్చాడని తను ఎంత అంటే అంత ఖర్చు చెయ్యకూడదు; ప్రతిపైసా అతనికి అదా చెయ్యాలని.
    ఆర్తి రెండు మూడుసార్లు హెచ్చరించింది, ఎక్కువ శ్రమపడుతున్నావని. సునీత అప్పటి కేదో చెప్పినా, తిరగటం తప్పలేదు. ఒకరోజు ఆర్తి దగ్గిర నుండి చిన్న చీటీ తెచ్చి ఇచ్చాడు వేణు.
    "నువ్వు తిరిగి టైపిస్ట్ గానే పనిచెయ్యి. నీలకంఠం గారితో చెప్పాను. వారు నీకు కష్టం కలగనివిధంగా, ఏ పనిని విభాగించి టైమ్ టేబిల్ ఇస్తానన్నారు. అడిగి తీసుకో!
                                                                                                   -ఆర్తి."
    అవే వాక్యాలు, అంతకన్నా ఎక్కువ లేవు. రెండవ రోజు నీలకంఠం ఒక కాగితంమీద ఏదో వ్రాసి ఇచ్చాడు. చదువుకుంది. "ఎనిమిదికల్లా స్నానపానాదులు ముగించెయ్యాలి. లేవటం ఆరున్నరకు. ఒక గంట ఇంటికి వచ్చిన పత్రికలు చదవటం. తొమ్మిదిన్నరకల్లా ఆఫీసు చేరుకుని పన్నెండువరకూ పనిచెయ్యాలి. ఒకటిన్నరకు భోజనం చేసి వెళ్ళాలి. సాయంత్రం అయిదువరకు మళ్ళీ ఆఫీసులో! అయిదునుండి ఏడువరకు ఆమె ఇష్టం. ఆరున్నరకల్లా ఆశ్రమానికి వెళ్ళి ప్రార్ధనలో పాల్గొని, ఏడుంబావుకల్లా ఇల్లు చేరాలి. ఎనిమిదిన్నరకు రాత్రి భోజనం ముగిసిపోవాలి. తొమ్మిదిమ్ముప్పావు వరకూ చదవటం-ఆమె ఇష్టం-ఏదన్నా చదువు కోవచ్చు. పదికల్లా నిద్ర.
    ప్రతి సోమవారమూ, బుధవారమూ, శుక్రవారమూ తప్పనిసరిగా లైబ్రరీకి వెళ్ళి అవసరమైన పుస్తకాలు రిఫర్ చేసి రావాలి.
    ఆదివారాలు, ముఖ్యమైన సెలవుదినాలు ఆమె ఇష్టం. అత్యవసరమైతే కార్యక్రమం మార్చుకోవచ్చు."
    కరుణ పకపకా నవ్వింది, తనుకూడా చదివి.
    "ఆఁయ్! ఎందుకు నవ్వటం?" నీలకంఠం చిరుకోపంగా చూశాడు.
    "నాకు కూడా ఒకటి తయారుచేసి పెట్టండి."
    "నా తలకాయ! ఎందుకు?"
    "దానికెందుకు?"
    "ఆమె అంటే ఎడిటర్!"
    "దానికి నేను సబ్ జూనియర్ నైనా కానా?"
    సునీత చిరుహాసంతో, "మంత్రిగారికైనా ఉండదు. ఏమిటో ఈ టైమ్ టేబిలు! నేను మీ కాలేజీ స్టూడెంటును అయితే బావుండేది" అంది.
    "స్టూడెంట్సును ఆచరించినా లేకపోయినా ఎవరూ అడగరు. మంత్రులా? పెర్సనల్ సెక్రటరీలు, సెక్రటరీలు...... అడుగడుగునా ఎవరో ఒకరు ఉంటారు. ఫలానిది చెయ్యమంటే చేస్తారు. మనకేం ఉంది? అయినా ఒక బాధ్యత మనమీద ఉంది. అట్లాగని మనల్ని మనం అశ్రద్ధ ఎందుకు చేసుకోవాలి?"
    "తెలివిగలవారే!"
    కరుణ అందుకుంది. "ఎమ్.ఎ, పిహెచ్.డి. కదే?"
    "అవును నర్సమ్మా."
    వాళ్ళ పరాచికాలమధ్య తను అక్కడ ఉండటం భావ్యం కాదనుకుని, తమ వాటాలోకి వచ్చింది. దాన్ని ఆర్తికి చూపించింది.
    "ఏదో కాస్త చెప్పండి అంటే, దీనికింత ఫైల్ తయారుచేశారు, డాక్టర్! ఖచ్చితంగా ఓ గడియారం వెంటేసుకుని చూస్తూ, ఇలా చెయ్యలేనుకానీ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాను."
    'సారధి ప్రియ' మూడవ సంచికతోబాటు 'మానవుని జిజ్ఞాస' అన్న వివిధ వ్యాససంపుటి కూడా వెలువడింది. వ్యాససంపుటిమీద 'ఆర్తి పబ్లికేషన్స్' అని ఉంది.
    పెద్ద ఎత్తున లాభమేమీ రాలేదు. ఆరువేలదాకా ప్రతులు అమ్ముడుపోయాయి. లాభాలు బాగానే ఉండేవికాని చౌకలోనే ప్రజల కందివ్వదలుచుకున్నాడు వేణు. అందుకే రెండువందలపాతిక పేజీలు ఉన్న పుస్తకం రూపాయి పావలామాత్రమే ఉంది. రెండుమూడు వందలు మిగిలితే అవి ప్రెస్ పనివాళ్ళకే పంచబడ్డాయి.

                              *    *    *

    కల్పనలు ఒక్కొక్క సమయంలో ప్రాణాంతకా లవుతాయి. ఏవో అర్ధంలేని అనుమానాలు తమలో పెనుభూతాలై పీడిస్తూండగా, ఇతరులతో వివిధ రకాలుగా కల్పించి చెబుతారు. ఆ అనుమానం ఇతరులకుకూడా కలగజెయ్యాలన్నది వాళ్ళ ఉద్దేశ్యం కాకపోయినా-అలా అనుకోరుగానీ-చెప్పుకుని తేలికపడదామని, అవతలివాళ్ళు కూడా ఆ ఊబిలో పడకుండా రక్షించాలని వాళ్ళ ఆరాటాలకి ఒకళ్ళను ఫలానా ఊబి ఉందని, జాగ్రత్త అని చెప్పి, వాళ్ళ నెంత పెద్ద ఊబిలో దించుతారో, అది విన్నవాళ్ళు ఎంత సంచలనాన్ని పొందుతారో ఆ చెప్పే వాళ్ళకు అనవసరం. అది వాళ్ళకు తెలియదుకూడా!
    చాలాసార్లు ఆర్తి అడిగింది. వేణు అడిగాడు. నీల కంఠం, సునీతకూడా అడిగారు విశ్వాన్ని, నిర్మల రావటం లేదేమని.    
    ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కల్పించి చెప్పేవాడు. ఎన్నిసార్లు ఈ నాటకం? పుట్టింటినుంచి వచ్చాక, ఒకసారి తప్ప మళ్ళీ రాలేదు.
    "నిన్ను రోజూ రావాలని అనను. కానీ వాళ్ళంతా, ముఖ్యంగా డాక్టర్ అక్కయ్య అడిగింది. ఒకసారి ఆశ్రమానికి వచ్చిపోకూడదూ?"
    నిర్మల అయిష్టత కనబరిచింది, "నేను రాకపోతే అక్కడ మునిగిపోయేది ఏమైనా ఉందా?"
    "నువ్వు రావాలంటే ఏం మునగాలి? అక్కడికి సునీత వస్తుందనేగా నువ్వు మానుకున్నావు!"
    "అవును! నేను ఏదైతే మరిచిపోవాలనుకుంటున్నానో, దానిని దూరంగా ఉంచటమో, ఉండటమో జరగాలి. మీరు మాటిమాటికీ ఆ సునీతపేరు ఎత్తవద్దు."
    ఆ రోజుకూడా రాలేదు.
    విశ్వం వదనం మ్లానంగా ఉండటం చూసి వేణు అడిగాడు.
    వేపచెట్టుకింద కూర్చుంటూ అటు ఇటు చూశాడు విశ్వం. ఇంకా ఎవరూ చేరలేదు, ఇంకా పూర్తిగా సంధ్య కాని కారణాన. విశ్వం యథార్ధం ఏదీ దాచలేదు.
    "ఇష్టపడనప్పుడు ఏమన్నా కష్టమే! నువ్వు ఒత్తిడి చెయ్యకు."
    "చెయ్యను! కానీ, అక్కయ్య ఎన్నోసార్లడిగింది, నిర్మల బాజీ రావటం లేదేమని, నిన్నకూడా చెప్పింది తీసుకురమ్మని. ఆమెకేమని సమాధానమివ్వాలి, వేణూ?"
    "ఏదో ఒకటి చెప్పవచ్చు!"
    "ఎన్నోసార్లయింది. అక్కయ్యముందు అబద్దమాడా లంటే మనకు ఓ పట్టాన ఒప్పదురా!"
    ఆశ్రమంముందు గంట మోగింది.    
    వేణు అన్నాడు: "ఇవ్వాళ వీల్లేకపోయింది, రేపు వస్తానన్నదని చెప్పు. రేపు నేనూ, రాధా వస్తాం. నువ్వేమీ ఎరగనట్లే ఉండు."
    విశ్వం కాస్త కుదుటపడ్డాడు.
    మరోరోజు వేణు, రాధ రావటంతో నిర్మలకు తప్పనిసరి అయింది. విశ్వం తన నాటకాన్ని ఏమాత్రం ఒడుదుడుకులు లేనట్లుగా నడిపాడు.
    విశ్వంతో హాల్లో బాతాఖానీ వేసుకున్నాడు వేణు, గదిలో నిర్మల తయారవుతున్నది. బాజీ ముందే తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు.
    రాధ, నిర్మల మాటల్లో సునీత ప్రసక్తి వచ్చింది.
    "అక్క చాలా మంచిదండీ! పాపం .... ఆమె అమ్మా, నాన్నా చచ్చిపోయారట!"
    రాధ మాటలు విని ముఖం చిట్లించింది నిర్మల. రాధ చిత్రంగా చూసింది. నిర్మల ముఖవైఖరి రాధలో అలా ఎందుకు మారిందో తెలుసుకోవాలన్న కుతూహ లన్ని కలిగించింది.
    "ఆమె మీకూ తెలుసు గదూ?"
    "ఆఁ! ఎవరికి తెలియదు? ఆమె తెలియనివారు ఉన్నారా?"
    "అలా అంటారేం? పిన్నీ, మామయ్యా ఆమె ఎంతో మంచిదనీ, బాగా చదువుకోపోయినా తెలివిగలదనీ చెబుతారు. నిజంగా కూడాను."
    "ఊఁ ..... అందరూ అలాగే అంటారు మరి!"
    రాధ కొంచెం చికాకు పడింది.
    "మీకు తెలియదు. పైకి అలాగే ఉంటుంది. కత్తిలాంటి మనిషి!" నిర్మల అంది.
    "కత్తి?"
    "అవును. నిజం చెబుతున్నందుకు క్షమించండి. మీ మామయ్యగారు, ఇప్పుడు కాదుగాని, ఆమధ్య తరుచు మా ఇంటికి వస్తూండేవారు. ఆయన, మీ మామయ్య గదిలో తలుపులు వేసుకుని ఏదో మాట్లాడుకునేవారు. నాకు మధ్యమధ్య కొన్ని మాటలు వినబడుతూఉండేవి. వాటిలో ప్రేమ, సునీతలాంటి పదాలు ఎక్కువగా ..."
    రాధలో ఒక అపశ్రుతి మోగింది. అనుమాన మనబడే విత్తు నాటబడింది.
    "ఈ విషయంమీదే మాటమీద మాట పెరిగి వారు నన్ను పుట్టింటికి పంపించారు."
    నాటిన విత్తుకు నీరు తగిలింది. విత్తు మేలుకుని జీవం పోసుకున్నది. అపశ్రుతికితోడు మరొక అపశ్రుతి.
    "అది మా ఇంటికి రావటంలేదు. మీ మామయ్య గారూ అంతే, ఆయనగూడా ఇల్లు, ఆఫీసు, సాయంత్రం ఆఫీసునుండి ఓ గంట ఆశ్రమం తప్ప ఎక్కడికీ వెళ్ళటం లేదు. అన్నట్లు మీ మామయ్య పత్రిక పెట్టి ఆవిడకు ఎడిటర్ పని..."
    రాధ వినలేకపోయింది. 'ఎడిటర్.....ఎడిటర్...... సునీత ..... అక్క.....'
    సునీత అనే సుడిగుండంలో మరెవరూ చిక్కుకో గూడదని నిర్మల ఆరాటం. నిజం ఆమెకేం తెలుసు?
    "నా అనుమానం నిరాధారం కావచ్చు. మీరు దీన్ని మనసులో ఉంచుకోకండి! కాని సునీతమాత్రం..."మిగతాది గాలికి వదిలేసింది.
    విషబీజం వేళ్ళు పోసుకున్నది. ఇక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది కాబోలు! హృదయవీణా తంత్రులన్నీ ఒక్కుమ్మడిగా అపస్వరాలు పలికాయి.
    విశ్వం కేకవేశాడు. "ఎంతసేపు, నిర్మలా?"
    తలనొప్పిగా ఉందని రాధ ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆర్తి రెండుమాత్రలు మింగించింది. ఆరోజు రజనీప్రియన ఎత్తుకున్నది ఆర్తి ప్రార్ధనలో! ఆ పాపాయికి ఇదంతా చిత్రంగా తోచింది. ఆర్తి నిర్మలను, బాజీని మాట్లాడించింది.
    రోజులు చకచకా గడుస్తున్నాయి.
    ఒకనాడు -
    వేణు ఆదరాబాదరాగా పైకి వచ్చాడు. సునీత వ్రాయటం ఆపి నిల్చుంది. "క్విక్! అక్కయ్య ఫోన్ చేసింది. నాన్న పెద్ద టెలిగ్రాం ఇచ్చాడుట. త్వరగా నడువు."
    "ఎందుకు? ఏమని?"
    "గంగోత్రి దగ్గిర బావ కలిశాడట. ఊఁ ... అబ్బబ్బ! త్వరగా తెములు."
    "సర్దేదేముంది? పదండి." కాగితాలు బాస్కెట్ లో వేసింది. వేణు బయటికి ఉరికాడు.
    కారులో "ఇవ్వాళ అక్కయ్య అసలు స్వరూపంలో దర్శనమిస్తుంది, నీతా! ఎలా ఉంటుంది?.... ఎలా ఉంటుందో తెలుసా?" అన్నాడు.
    "కైలాసనాథుని చూసిన గిరిరాజతనయలా."
    "ఎక్సలెంట్! కాని చూసిన అవే బదులు చూడబోయే అని ఉండాలి."
    "అదేంకాదు. నేనన్నదే కరెక్ట్."
    "ఎలా?"
    "డాక్టరుగారిలో అప్పుడే వారు ప్రత్యక్షమై ఉంటారు. వారు కళ్ళు మూసుకుంటేసరి ..."
    "ఒప్పుకున్నాం. ఇవ్వాళ అక్కయ్య నడిగి మెళ్ళో నిజమైన మంగళసూత్రం కట్టేస్తాను."
    "రాధ ఊరుకుంటుందీ?"
    "కృష్ణుడికి ఎనిమిదిమంది సతీమణులు."
    "ఆ కృష్ణుడు వేరు. ఈ వేణుగోపాలుడు వేరు."
    "అది తరవాత..." హరన్ వాయించాడు. రామదాసు వచ్చి గేటు తలుపు తీశాడు. కారు ఆగగానే వేణు రివ్వున లోనికి దూసుకువెళ్ళాడు. సునీత నడిచే వెళ్ళింది.    
    మధ్యాహ్నం ఒంటిగంట. టైమ్ కాదుకనక రోగులు లేరు. ఫోన్ చేసినప్పుడు హాస్పిటల్ కే రమ్మన్నది ఆర్తి.
    ప్రైవేట్ రూం లో రాధతోపాటు కూర్చున్నది ఆర్తి.
    వేణు అన్నట్లే, ఆర్తిలో ఎన్నడూ లేని కళ కొట్ట వచ్చినట్లు కనబడుతున్నది. కళ్ళు వెయ్యి జ్యోతుల కాంతులను నింపుకున్నాయి. దాచినా దాగని మధురా నందరేఖలు, సంతోషంవల్ల శ్వాసవేగం, ఆనంద భాష్పాలు ఎక్కువయ్యాయి.
    "ఓ! పాపా, వచ్చావా?" ఎదురువెళ్ళి కౌగిలించు కున్నది. రెండుసార్లు ముద్దుపెట్టుకున్నది.
    సునీత తను చిన్నపిల్ల అయి అమ్మ ఒడిలో ఉన్నట్లు అనుభూతి పొందింది. తడిసిన గొంతుకతో "అమ్మ ... అమ్మ ...." అన్నది. ఆర్తి మళ్ళీ ముద్దుపెట్టుకుంది.
    రాధ బొమలు విరిచింది సునీత రావటం ఇష్టం లేనట్లు. 'ఆమె నెందుకు తెచ్చావు' అన్నట్లు వేణును చూసింది. ఆ చూపులో ప్రశ్నను 'ఇదేమిటి? వీళ్ళు పిచ్చివాళ్ళలా అయ్యారు?' అన్నట్లు అర్ధంచేసుకుని, 'నాకేం తెలుసు?' అని చూపులతోనే ప్రత్యుత్తరం ఇచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS