ఆర్తికి వచ్చిన టెలిగ్రామ్. వేణు చదివాడు.
"సారథి కలిశాడు. ఒక ఆశ్రమంలో ఉన్నాడు. నీ సంగతి చెప్పాను. ఏమనలేదు. ఇక్కడ ఒక వృద్దుడైన సాధువుతో చెప్పించాను. తిరిగిరావటానికి ఒప్పుకున్నాడు. మరొక పన్నెండు రోజులైతే పౌర్ణమి వస్తుందిట. ఆనాడు ఈ గంగోత్రిని పండువెన్నెల్లో దర్శించాక వెళదామన్నాడు. ఒక మూడు వారాల్లో రాగలం. ఇక్కడ విశేషాలు పెద్ద ఉత్తరంగా వ్రాస్తున్నాను. అయిదారు రోజుల్లో అందుతుంది. వచ్చే తేదీ వగైరా మరొక టెలిగ్రామ్ లో.
-గోవిందరావు."
"చాలా పెద్దదే టెలిగ్రామ్. చిన్నసైజు ఉత్తరం" అన్నాడు వేణు.
ఆరోజు ఆర్తి సినిమాకు వచ్చింది. విశ్వానికీ నీలకంఠానికీ తెలిసింది.
"అబ్బ! ఇలా మీరే సంతోషిస్తే లాభంలేదు. మరి మాకు పార్టీ ఇచ్చి ఆనందంతోపాటు మిఠాయిల్లో ముంచెయ్యాలి." నీలకంఠం అన్నాడు.
ఆర్తి తల ఊపింది.
"వినండొహో! ఆదివారం హోటల్ తాజ్ లో రూప్ గార్డెన్స్ లో స్పెషల్ డిన్నర్ బై శ్రీమతి ఆర్తీదేవి!" వేణు చాటింపువేశాడు.
"విశ్వం, నిర్మలను బాజీని తీసుకురావాలి. కరుణా, నువ్వుకూడా రావాలి."
"అలాగే! ప్రొఫెసరుగారు మరిచిపోతారేమో?"
"ఆఁ య్! నిన్ను పెళ్ళి చేసుకున్న దెందుకు? మరుపును వదిలించమనేగా?"
"అక్కా, రాధను, రాధకు కాబోయే మొగుణ్ణి ఆహ్వానించు మరి." వేణు అన్నాడు.
రాధ, వేణును మోచేత్తో పొడిచింది. "ఆజ్ఞ, దేవి! నోరు మూసుకొనెద!"
రజని సునీత మెడలోనుంచి తీసిఇచ్చిన లాకెట్ తో ఆడుకుంటున్నది ఆమె ఒడిలోనే, గొంతులో వేసుకుంటుందని చేతితో పట్టుకున్నది సునీత.
"మరి పాపాయి డిన్నర్ కు రాలేదు కదూ?" కరుణ పాపను తీసుకుంది.
"రాకపోతే? బొమ్మలు, కొత్త ఉయ్యాల .... మనకన్నా పెద్ద బిల్లు చేయిస్తుంది." నీలకంఠం ఆర్తి వైపు తిరిగాడు.
సునీత రాధ వైఖరి-ఏమీ పట్టనట్లు కూచోవటం- గ్రహించింది. ఆమె మౌనం సునీతలో సంచలనాన్ని కలిగించింది. ఎప్పుడూ కిలకిలలాడే రాధ అలా ఎందు కున్నది? ఇవ్వాళే కాదు, ఆ రోజు నిర్మల ఆశ్రమానికి వచ్చి పోయిననాటినుండి అంతే! తనను మందలించటమైనా చెయ్యటం లేదు.
ఆర్తి ఎవరినీ పరిశీలనగా చూడటం లేదు.
రెండురోజుల తరవాత -
"రాధ వైఖరి నాకేమీ బోధపడటంలేదు, డాక్టర్!" సునీత అంది.
"ఏమంటున్నది?"
"నన్ను తప్పుకుని తిరుగుతూంది."
"నువ్వేమైనా అన్నావా, పాపా?"
"లేదు, డాక్టర్. విశ్వం భార్య నిర్మలా అలాగే ఉంటూంది."
"సరే నేనడుగుతాలే."
"ఎవర్ని? వద్దు, డాక్టర్. దయచేసి ..."
"వేణు నడుగుతాలే. నీకేం భయంలేదు, పాపా!"
"ఏమో? ఏదో కేఉ శంకిస్తున్నది. అప్పుడెప్పుడో మీరు వ్రాసినట్లు తుఫాను ఏదో రావచ్చు."
"అందరమూ ఏకమవుతాం."
* * *
"సునీతా,
వేణు చెప్పాడు-అక్కయ్య రాధ, నిర్మలల వైఖరిని గురించి అడిగిందని. వేణు ఆమెతో ఏదీ చెప్పలేదు. ఆమె నమ్మేవిధంగా మరొక కట్టుకథ చెప్పాడుట. అయినా ఆమె దృష్టి సత్యాసత్యాలను త్వరలోనే వేర్వేరుగా చూడగలదు.
అసలు దీనికి మూలం -
నిర్మల మన ఇద్దరి స్నేహాన్ని అపార్ధం చేసుకున్నది. ఆ అనుమానం మా ఇద్దరి మధ్య చిన్న కలత రేపింది. సర్దుకున్నా నిర్మలతో అపోహ తొలగిపోలేదు. అదే రాధకు చెప్పి ఉంటుంది.
-విశ్వం."
"ఉఫ్!" కణతలు ఒత్తుకున్నది సునీత.
దాన్ని ఎవరికీ చూపించలేదు. చెప్పలేదు.
ఎన్నడూ లేనిది మూడురోజులు తను ఆఫీసుకు రాలేనని వ్రాసి, రాజుచేత పంపించింది. వేణు దాన్ని చూసి అప్పటికప్పుడే రాజును కార్లో కూచోబెట్టుకుని వచ్చాడు.
గదిలోనుంచి కరుణతో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి! గుమ్మంలో ప్రత్యక్షమైన వేణును చూసి సునీత కొంచెం కంగారుపడి కళ్ళు తుడుచుకున్నది. వేణు అది చూశాడు. కరుణ తమ వాటాలోకి జారుకున్నది.
మూడు నిమిషాలు ఆమె నలాగే చూసి దగ్గిరికి వచ్చి పక్కన కూర్చున్నాడు.
సునీత అడిగింది: "ఎందుకు వచ్చారు, వేణూ?"
"నువ్వెందుకు రాలేదో కనుక్కుని పోదామని."
"అవ్వ జ్ఞాపకం వచ్చింది. రా బుద్ధి కాలేదు."
"కాదు. నువ్వు ఏదో దాస్తున్నావు."
"దాచేందు కేముంది?"
"చెప్పవన్న మాట!"
"ఏం చెప్పమంటారు? నేను సంసారాల్లో చిచ్చు పెడుతున్నాననా?"
"విశ్వం చెప్పాడన్న మాట."
"అవును. మీరుకూడా నాకు దూరంగా ఉండటం మంచిది, వేణూ!"
"మనస్ఫూర్తిగా అంటున్నావా?"
"ఊఁ ..... ఊఁ .... ఆ .... వు.....ను." తడబడింది.
"అయితే నన్నారోజు తాగటం మానమని ప్రమాణం ఎందుకు చేయించుకున్నావు? ఈ రంపపు కోతకొరకేనా?"
"..........................."
"చెప్పవేం?"
".............................."
"నోరు పడిపోయిందా?"
"..........................."
"సరే! నేను దూరంగానే ఉంటాను. నువ్వు ఏ పరిస్థితిలోనూ నన్ను తలవకూడదు. నీ హృదయంలో ఉన్న ఒక రూపాన్ని వికృతంచేసి నిర్జీవంచేసి, దానికి అంత్యక్రియలు నెరవేర్చు."
వేణు లేచాడు. అతని కాళ్ళ సునీత హస్తాలు బంధాలు వేశాయి.
"సాగనంపటానికిది - చివరి..."
"కాదు.....కాదు.....నన్ను చంపెయ్యండి.......నేను పిశాచాన్ని......వేణూ...."
"నువ్వెప్పుడూ అలాగే అంటావు. నాకెన్నడూ అలా కనబడవేం?"
"..............................."
"పోనీ! ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని నువ్వే నాకొక ఉపాయం ఆదేశించావు. మరి నువ్వు ఆచరింపవేం. సునీతా?"
"ఇది పరాయివాళ్ళన్న సమస్య కాదు....."
"మనం అన్నదేం? అదీ అలాగే ఎందుకు కాకూడదు?"
"మీకు చెప్పలేను...."
"అందుకే నేను చెప్పినట్టు విను! బయలుదేరు. వెళదాం."
"ఇవ్వాళ రాలేను.....కాదు....మధ్యాహ్నం వస్తాను."
"సరే.....ఒక్కసారి నవ్వు. చూసి వెళతాను."
నవ్వలేదు.
"చిరునవ్వు రాల్లేవోయ్!"
పెదిమ కదలలేదు.
"బాలా, బేలతనమేలా? ప్రియురాలా? నప్పె వదేలా?"
ముసిముసిగా నవ్వింది. వేణు వెళ్ళాడు.
కరుణ నవ్వుతో చప్పట్లుకొడుతూ "భేష్ అంటూ వచ్చింది.
"ఊఁ! నేనేమో అనుకున్నా. నీ హృదయం దాచిన ఇనప్పెట్టె. గట్టిదేకాదు, గడుసుదికూడాను!"
* * *
23
సునీత తల అంటుకుందామని లాకెట్ తీసి టేబిల్ మీద పెట్టింది హాల్లో. యాదగిరి దాన్ని చూశాడు. అంతలో రాజు కాఫీగ్లాసు తెచ్చి, అదే టేబిల్ మీద పెడుతూ, దాన్ని కొంచెం పక్కకు జరిపాడు. అది కింద పడింది, కొసదాకా జరపటంవల్ల. అప్పుడే ఆ లాకెట్ విచ్చుకుంది.
కుర్చీలోనుంచి దాన్నందుకుని చూశాడు యాదగిరి. ఒకవైపు వేణు. మరొకవైపు సునీత. అంటదు నిమిషాలలాగే దానిమీద దృష్టి నిలిపాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్లు టేబిల్ మీద పెట్టి కాఫీ గ్లాసు అందుకున్నాడు. కాఫీ తాగేసి వాలుకుర్చీలో వెనక్కి వాలాడు.
ఆ కుర్చీ ఆయన స్మృతులకు పెట్టె లాంటిది. దానిలో కూర్చుని కళ్ళు మూసుకుంటే, ఆయన దేవకిని చూస్తాడు. అతని కళ్ళలో ఆమె దీనంగా ఏడు స్తుంది. తన పాపదగ్గిరికి వెళ్ళమని ఘోషిస్తుంది. ఆ ఘోషలతాలూకు కన్నీరు యాదగిరి కళ్ళలో నుండి జారుతూ ఉంటుంది.
సునీత వచ్చింది.
మూసుకున్న ఆయన కనురెప్పల్లో నుండి కన్నీరు వెలికి వస్తున్నది.
విస్మయంగా "బాబాయ్!" అంది.
ఆ పిలుపు ఆయనను లేపలేదు. తనతో తనే చెప్పు కుంటున్నాడు: "ప్రేమమయివైన నీకు తీరని అపచారం చేశాను.....నా అశ్రువుల ధారలతో నీ పాద ప్రక్షాళనం చేసే క్షమాభిక్ష అడుగుదామనుకున్నాను. నే నెంత దురదృష్టవంతుణ్ణి! తిరిగి రాకుండా ఏ అజ్ఞాతంలో అదృశ్యమయ్యావు? ఎక్కడికి వెళ్ళావు? లోకందృష్టిలో నన్నింకా పెద్దమనిషిగానే ఉంచావు. నువ్వు దేవతవు....మనసులో కోరికలు తీరక మానవులు సృష్టించుకున్న దేవతవు గావు.....మానవరూపంలో జన్మించిన అమృత మూర్తివి...."
ఆ మాటలన్నీ సునీతకు వినిపిస్తూనే ఉన్నాయి. "....ఏమైనా మీ స్త్రీల హృదయాలు అగాథాలు. మీరేమనుకుంటారో, ఏం చేస్తారో తెలియదు. సృష్టి చిత్రాల్లో కల్లా చిత్రమైన మనస్తత్వం నీది....మాటలు చెప్పవు.... చేసి చూపిస్తావు. అందుకే....అందుకే..... ప్రాణత్యాగానికి ఒడిగట్టావు...."
'ఎవర్ని గురించి ఆయన అంటున్నాడు? ఎవరు ప్రాణత్యాగం చేసుకున్నారు?'
"....సునీత అంతే చేస్తున్నది. నీ రూపమే.... నీ మాటే .... ఆమె.... ఆమె.... నీ బిడ్డ అనే అనుకుంటున్నాను.....నిజమేనా? నిజమేనా?"
సునీత స్తబ్ధ అయింది. 'ఎవరి రూపం తనకున్నది? ఎవరి మాటలాటిది తన మాట? తనెవరిలాగో ఉందిట.....ఎవరు? ఎవరు?'
కాస్త దగ్గిరగా వచ్చి రెండుసార్లు పిలిచింది. యాదగిరి కళ్ళు తెరిచాడు.
"ఎందుకేడుస్తున్నావు, బాబాయ్?"
"చెబుతాను, చెబుతాను....కూర్చో, నువ్వు వేణును ప్రేమించావు. మాటకైనా నాతోగాని, మరెవరితో గాని చెప్పలేదు. నీ ఈ తత్త్వం ..... రూపురేఖలు అన్నీ...నాకు మరువరాని క్షణాలను ఇచ్చిన ఒక వ్యక్తిని పోలిఉన్నాయి...."
"ఎవరు, బాబాయ్?"
"ఎవరని చెప్పను .... ఎలా చెప్పుకోను .... ఆమె.....ఆమె...... దేవకి, తల్లీ!"
"ఆఁ!" సునీత ఊపిరిపీల్చటం మరిచిపోయిందొక క్షణం. నాడులలో రక్తప్రసారం స్తంభించిపోయిన ట్లయింది.
"దేవకి..... దేవకి..... అమ్మపేరు.... అమ్మపేరు..... అవ్వ చెప్పింది...."
"దేవకి మీ అమ్మపేరా? నిజమా? నిజమా, సునీతా?"
సునీత తల వంచుతూ, "అవును, బాబాయ్! కానీ నువ్వుకూడా నన్ను అ పేరు తెలుసుకుని హింసిస్తున్నావు.... నేనేం పాపం చేశాను?" అంది.
"కా.....కా.....దు ..... నీ తండ్రి.... నీ తండ్రి నాకు తెలుసమ్మా.... నీకు తెలుసా? తెలుసా?"
"తెలియదు! ఎవరు .... ఎవరు, బాబాయ్?"
"నేను..... నేనేనమ్మా..... నువ్వు నా బిడ్డవు..."
సునీత కేకపెట్టింది పెద్దగా! కరుణ, రాజు అందరూ హాల్లోకి ఉరుకుతూ వచ్చారు. నీలకంఠం అంతకుముందే కాలేజీకి వెళ్ళాడు.
యాదగిరి లేచాడు. సునీతను రెక్క పట్టుకున్నాడు. సునీత రోదిస్తున్నది. ఆయన చెయ్యి పట్టుకోగానే విదిలించుకుంది. "వదులు.....నన్ను ముట్టుకోవద్దు.....వెళ్ళు...... నే నివ్వాళే వెళ్ళిపోతాను..... వదులు."
"నీ ఇష్టం, తల్లీ! నేను చెప్పేది విను. నువ్వు నాకు ఉరిశిక్ష వేయించినా నేను సిద్ధమే. కానీ .... కానీ.....నేను చెప్పేది వినమ్మా."
"చెప్పు.... చెప్పు...." ఉద్వేగంగా అన్నది.
"ఇక్కడ కాదు. గదిలోకి వెళదాం, పద."
* * *
"నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, దేవకి నీ తల్లి కాదుగదా అని. అయితే ఆరాలు తీస్తున్నట్లు నిన్నడిగితే నువ్వేమనుకుంటావోనని, వెళ్ళిపోతావేమోనని ఊరుకునే వాడిని. ఒక మనిషికి మరొక మనిషికి పోలికలు లేకుండా జరిగే ఈ సృష్టిలో, విధాత ఎన్ని రూపాలని గుర్తుంచు కుంటాడు? ఒకవేళ పొరపాటున దేవకిలా నిన్ను సృష్టించి ఉంటాడని సరిపుచ్చుకునేవాడిని.

అందుకే ఆమెను తలుచుకోవడం; బరువైన స్మృతిని కరిగించి కన్నీరుగా మార్చుకోవటం.
