22
ఎప్పటికైనా నిర్మలే తన తప్పు తెలుసుకోవాలని విశ్వం అభిమతం. అందుకే పదిహేను రోజులుపైగా గడిచినా వెళ్ళి తీసుకు రాలేదు. ఉత్తరమైనా వ్రాయలేదు.
సునీత కిది ఈషణ్మాత్రమూ తెలియదు.
పుట్టింటిలో నిర్మల చాలారోజులు ఉండలేక పోయింది. భర్తను గురించిన ఆదుర్దా ఎక్కువయింది. జాబులుకూడా లేవు. సునీతను గురించిన అనుమానం కన్నా "ఏం చేస్తున్నారో? వేళకు అన్నం తింటున్నారో లేదో? తను లేకపోతే ఆయనకేదీ పట్టదు' అన్న చింత ఎక్కువైంది.
మరోవైపు 'ఆ దయ్యం ఉందిగా? బాగా షికార్లు కొడుతూ, రోజులు క్షణాల్లో దొర్లించేస్తూంటారు. తనుకూడా లేదుగా? కార్డు ముక్కయినా లేదు. ఆ పిశాచం వెయ్యనిస్తుందా? బాజీనిగూడా మరిచిపోతున్నారు' అనుకుంటూ చలిజ్వరం వచ్చినట్లు వణికిపోతూంది.
ఉత్తరంకూడా వ్రాయకుండా ఒక్కత్తే ప్రయాణ మయింది. పుట్టింట్లో తమ కలహం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఒక్కదానివే ఎందుకు వచ్చావంటే ఏదో సాకు చెప్పింది. వెళ్ళేనాడు తండ్రి వచ్చి దిగబెడతానన్నా వద్దన్నది. ఆదివారం, వర్జ్యం బాగా లేదన్నా వినలేదు.
'వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారు. అది కబుర్లు చెబుతూ ఉంటుంది. ఆయన గలగలా నవ్వేస్తూంటారు. తను హఠాత్తుగా వాళ్ళముందు నిల్చుంటుంది. వాళ్ళ ముఖాలు కత్తి వేటుకు నెత్తురుచుక్క రాలనంతగా పాలిపోతాయి. తాను వాళ్ళను బాగా దులపరించి వేస్తుంది..."
దారి పొడుగునా ఆమె ఆలోచన లివే!
బస్సు దిగేసరికి పదకొండు అయింది. రిక్షా చేయించుకున్నది.
తలుపులు తెరిచే ఉన్నాయి. సంచీతో దిగి రిక్షా డబ్బులు ఇచ్చేసింది. బాజీని ఎత్తుకుని మెట్లెక్కుతూ గుమ్మంవరకూ వచ్చి అప్రయత్నంగా ఆగింది, మాటలేమైనా వినబడవచ్చని, ఆమె తలపోసిన కిలకిల నవ్వులు, సరసోక్తులు, సంభాషణలు ఏమీలేవు. హాల్లో విశ్వం మడతకుర్చీలో కూర్చుని వార్తలకోసం పేపరు తిరగేస్తున్నాడు.
చప్పుడు విని తలెత్తి చూస్తే నిర్మల.
చిరునవ్వుతో "గుడ్!" అన్నాడు. నిర్మల బాజీని వదిలింది. వచ్చీరాని పరుగులతో వెళ్ళి, తండ్రి పడ్డాడు. కితకితలు పెడితే నవ్వాడు. ముద్దు పెట్టుకుందుకు బుగ్గలు అందించాడు. తండ్రితో కలిపేశాడు.
"ఇంకా ఆగ్రహమే! లోపలికి వచ్చి గృహాన్ని పావనం చెయ్యండి!"
నిర్మల ఎంత కోపం వచ్చి వెళ్ళినా, అలా అనేసరికి 'నా అనుమానం నిరాధారమైనదేమో? లేకపోతే ఆయన అంత స్వచ్చంగా మాట్లాడగలుగుతారా?' అనుకుంది.
నిర్మల ఇల్లంతా చూసింది. ఆమె ఎలా ఉంచి వెళ్ళిందో అలాగే ఉంది. బోర్లించిన పాత్రలమీద అరంగుళం మందాన దుమ్ము పేరుకుంది. బియ్యం, పప్పు మొదలైన వంటసామగ్రి అంతా అలాగే ఉంది. ఆఖరికి తను ఆరోజు వెళుతూ కాఫీకోసం సగం కాల్చి ఆర్పిన కట్టెలూ అవీ అలాగే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ రోజూ కమ్మగా వంట చేసుకుని తినటం లేదన్నమాట. హోటల్లో తింటున్నట్లున్నారు.
'గదిలో బీరువాలో వెండిసామాను, తన నగలు, బట్టలు అన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని ఈపాటికి సునీతపరమై ఉండాలి.' బీరువా తాళం తీసినట్లేలేదు. తన బంగారపు హెయిర్ పిన్ను దగ్గరనుండి ప్రతి వస్తువు సురక్షితంగా ఉంది.
పెరట్లోకి వెళ్ళినా అంతే. పువ్వులైనా కోసినట్లు లేదు. అవన్నీ అలాగే ఎండి, రాలిపోయిన గుర్తుగా కింద ఎండిన ఆకులూ, పువ్వులూ ఉన్నాయి. మల్లె, సంపెంగ నీళ్ళులేక ఎండిపోతున్నాయి. 'రోజూ ఈ పూలన్నీ కోసి, సునీత తలనిండా పెట్టుకుంటుంది. ఆయన వద్దంటున్నా కోసి దాని నెత్తిన తురుము తాడు.' అదీ తప్పుడు అంచనాగా తేలిపోయింది.
హాల్లో విశ్వం బాజీతో చేరి అల్లరిచేస్తున్నాడు. మామూలుగా కబుర్లు చెప్పాడు ఆరోజు. ఈ పది హేను రోజుల్లో తన బాధలు నవ్వువచ్చేలా చెప్పాడు. పరాచికంగా హాస్యోక్తులు, ప్రహసనాలు చెబుతూ నిర్మలను ఎంత మూతి బిగబట్టి కూర్చుందామన్నా పడనివ్వకుండా నవ్వించాడు. బాజీకి తెలియకపోయినా అమ్మకు కోపం వచ్చిందని, అయినా కొత్త పెళ్ళి కూతురులా సిగ్గుపడుతున్నదని మళ్ళీ నవ్వించాడు.
'మరొక స్త్రీ మోహానికి గురైన వ్యక్తి అలా ఉండగలడా?'
ఉదయం తన పాదాలకు స్పర్శ తగలటంతో మేలుకున్నాడు విశ్వం. నిర్మల!
"రె! రె! ఏమిటిది? ఎవరు చెప్పారిలా చెయ్యమని?" అన్నాడు ఆమెను లేవనెత్తుతూ.
నేరస్థురాలులా తల వంచింది.
"చూడు, నిర్మల్, ఒకసారి నాపేరు, సునీత పేరు కాగితంమీద రాసి ఆమె కెవరో పంపితే దాన్ని సహించలేక, నిష్కర్షగా నాదగ్గిరనుండి క్షమాపణ తీసుకునేదాకా ఆమె రౌద్రమూర్తే అయింది! ఆనాడే ఆమె నా చెల్లె లయింది. అదీకాక కొద్దో గొప్పో డాక్టరుగారి శిక్షణ ఉన్న నేను, మన వివాహబంధం ఎంత మధురమూ నిర్మలమూ అయిందో తెలిసిన నేను నీకు ద్రోహం చేస్తానా? ఒకవేళ మన ఈ బంధం సడలిపోతుందేమో నమతే మరింత గట్టిగా బిగిస్తున్న బాజీ ఉన్నాడు. ఇవన్నీ ఛేదించుకొని నేను కంటకయుతమైన మరొక మార్గం అనుసరిస్తానా?"
"మీరు ఆమెతో అంత చనువుగా ఎందుకు తిరుగు తారు?"
"మీ అన్నగారి దగ్గిర నువ్వు చనువు చూపవూ? నిర్మలా, సునీత కణకణలాగే నిప్పులాంటిది. మూర్ఖించి చేయివేస్తే కాల్చివెయ్యగలదు."
"ఏమో? నేను ఆమెఅంత చదువుకున్నదాన్ని కాదు. మీరు కొంచెం ...."
"అది అసాధ్యం, నిర్మలా!"
ఆమాట మళ్ళీ ఆమె అహాన్ని రెచ్చగొట్టింది. అయినా సంబాళించుకొని, "నేను తప్పుచేస్తే మన్నించండి" అంది.
"మనకు మన్నింపులేమిటి?" అంతలో బాజీ లేచాడు. వాడిని ఎత్తుకొంటూ, "రేపు ఒకసారి ఆశ్రమానికి వెళ్ళివద్దాం" అన్నాడు.
నిర్మల ఏదీ తెలియకుండా తల ఆడించింది.
* * *
బస్సు దొరకలేదు! తను అంతదూరాన ఉండగనే వెళ్ళిపోయింది. అది పోతే ఏం? టాక్సీలు ఉన్నాయి.రిక్షాలు ఉన్నాయి. రిక్షాను పిలిచి అడిగితే ఆ తొందర గమనించాడేమో, పదణాలకు తక్కువ రానన్నాడు రిక్షా వాలా. మరొక మాట అడగకుండానే అందులో కూర్చుని తొందరగా పోనిమ్మన్నాడు.

వెళ్ళవలిసిన చోటికి వెళ్ళగానే రిక్షా ఆగింది. డబ్బులివ్వకుండానే పరుగుతియ్యబోయాడు లోపలికి. రిక్షావాలా "సాబ్, పైసే భూల్ గయే!" అనగానే జేబులో రూపాయి తీసి చేతిలో పెట్టాడు. అతడు మిగతా డబ్బులు ఇద్దామని జేబులోనుంచి తీసి తల ఎత్తితే ఎవరూ లేరు. ఇందాకా రిక్షా ఎక్కిన 'సాబ్' మెట్లెక్కి లోపలికి వెళ్ళిపోతూ అగుపించాడు రిక్షావాలాకు.
ఫ్యూను చెయ్యి అడ్డు పెట్టబోయి, ఆ విగ్రహాన్ని చూసి అది విరమించుకున్నాడు. తను వ్రాసిన 'స్కెచ్' ని సునీత కిద్ధామని తలుపు తెరుచుకుని వస్తున్న వేణును గూడా చూశాడో లేదో? రెండో అంతస్తులో మూడు నాలుగు మెట్ల కొక అంగవేసేస్తూ, వెళ్ళిపోతూనే ఉన్నాడు.
"తిక్కమనిషి!" వేణుకూడా మెట్లవేపు వెళ్ళాడు.
సునీత సంపాదకీయం వ్రాస్తున్నది. ఒగరుస్తున్న నీలకంఠం ఆమెముందుకు సుడిగాలిలా వచ్చేసరికి తుళ్ళిపడింది. ఆ వెనకే వేణు రావటంతో నిల్చున్నది.
"ఎందుకలా ఉరుకులతో వచ్చారు? కాసేపలా కూర్చోండి. మీరూనూ" అంది వేణును చూస్తూ.
వేణు సునీత కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. తనూ ఒక కుర్చీ జరుపుకున్నది సునీత.
"వారు సేద తీర్చుకునేవరకూ మీరెందుకు వచ్చారో చెప్పండి" అంది పక్కనే స్టూలుమీద ఉన్న కూజాలో నీరు గ్లాసులోనికి వంపి, నీలకంఠం ముందు ఉంచుతూ.
వేణు చేతిలో కాగితాలను అక్కడ ఉంచుతూ, "స్కెచ్ రాయమన్నావుగా! రాశాను. కాస్త మెరుగులు దిద్ది పేరు నువ్వే పెట్టు" అన్నాడు.
సునీత ఫైల్ తెరిచి సీరియల్ ఆర్డరులో పెట్టింది.
"దానికీ సీరియల్ ఆర్డరు తప్పలేదన్నమాట!" టేబిల్ ను వేళ్ళతో టకటక వాయించాడు వేణు.
"ఎక్కడున్నా మనసుకు దగ్గరుంటే చాలు. ఆర్భాటాలు ప్రదర్శించేదానికన్నా క్రియాత్మకంగా చూపించండి మంచిది."
నీలకంఠం స్థిమితపడ్డాడు. మంచినీరు గడగడా తాగేసి, జేబులోనుంచి కవరొకటి తీశాడు. "వాళ్ళు మీరు నాపేరున రాసిన వ్యాసాలు చూశారట. ఇంకా కొన్ని ఇంగ్లీషులో రాసి పంపిస్తే, పుస్తకం వేస్తారట!"
"ఎవరు?" అంటూ దాన్ని తీసి చదివింది. న్యూఢిల్లీ నుండి ఒక ప్రముఖ పుస్తక ప్రకాశకుల కంపెనీ వ్రాసింది. నీలకంఠం ఆంగ్లంలో వ్రాసిన వ్యాసాలను చూశామని, ఇంతవరకు ప్రచురించబడినవి, మరింకే మైనా పంపిస్తే వాటిని కలిసి సంపుటంగా ప్రచురిస్తామని, అంగీకారమై తమకు తెలిపితే ఉత్తర ప్రత్యత్తరాలు జరిపి, స్థిరీకరించవచ్చునని దాని భావం.
"నాకేం తోచలేదు. వాళ్ళందరికీ క్లాసు లేదని చెప్పి వచ్చేశాను."
వేణుకూడా దాన్ని చదివాడు. "మనకేం నష్టం? రాళ్ళు కొంత డబ్బుకూడా ఇస్తారు."
"అమ్మివెయ్యటమా? ఛ! వాళ్ళు బోలెడు లాభం పొందుతారు."
"పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాన్ని ఆశించకుండా ఉంటారా?"
సునీత అలా అనగానే వేణు అన్నాడు: "నాదో చిన్న మొర. ఆలకించగలరా?"
"చెప్పండి."
"పెట్టుబడి అణాపైసలతో పూడాక మిగిలే ప్రతి పైసా నీలకంఠంగారే తీసుకోవచ్చు. పుస్తకం మీద హక్కులన్నీ వారివే అయి ఉంటాయి."
"అంత నిస్స్వార్ధప్రకాశకు లెవరు?"
"మనమే!"
"ఆఁయ్, మనం! మనమా?"
సునీత హర్షించలేదు. పేపర్ వెయిట్ ను వేలితో అటు ఇటు కదిలిస్తూ ఆలోచిస్తున్నట్లుంది.
"ఏం పెద్దమ్మా, మీకిది బాగులేదా?"
"అని కాదు. పుస్తకం పబ్లిష్ చెయ్యడం అనుకున్నంత తేలికకాదు."
