Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 41


    సరళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి-"బాబూ-రాజూ నీ బాధ నాకర్ధమయింది. నేను నీ దగ్గరకు తప్పక వస్తాను. మీ నాన్నను కూడా ఒప్పిస్తాను. కానీ అందుకు కొంత వ్యవధి కావాలి. ఈలోగా గోపీ జోలికి రాకు. వీడికి నయమయ్యేదాకా ఇంకే విషయమూ ఆలోచించలేము మేము...."
    "అమ్మా! నిజం చెబుతున్నాను గోపీమీద నాకేమీ కోపంలేదు. కానీ వాడంటే నాకు చాలా అసూయగా వుంది. నువ్వు వాణ్ణి పరాయి పిల్లాడిలా చూస్తే నాకే బాధా లేదు. నన్ను చూసినట్లే చూస్తేమాత్రం నేను వాడిని బెదిరిస్తూనే వుంటాను...."
    "మరి వాడిని జాగ్ర్రత్తగా చూడవలసిన బాధ్యత నాది కదా!"
    "ఏమో-అదంతా నాకు తెలియదు. వాడి బాగోగులు చూసుకుందు కింకెవరినైనా నియమించు నువ్వు కానీ, నాన్న కానీ వాడికి దగ్గరవడానికి వీల్లేదు. ఈ విషయంలో నేనింకేమీ వినదల్చుకోలేదు...."
    "రాజూ....నేను చెప్పేది వినరా!"
    సరళకింక బదులు రాలేదు. ఆమె రాజూ, రాజూ అని మళ్ళీ మళ్ళీ పిలిచింది. బదులు రాలేదు. కానీ గదిలోకి వరప్రసాద్ వచ్చాడు.
    సరళ అతడి వంక ఆశ్చర్యంగా చూసింది.
    "అయిందా-నీ సంభాషణ?" అన్నాడతడు తీవ్రంగా.
    "మా సంభాషణ మీరు విన్నారా?"
    "చాలాసేపట్నించి వింటున్నాను. అయిపోయేక గదిలోకి అడుగుపెట్టవచ్చుననుకున్నాను...."
    "అంటే మీరుకూడా రాజు గొంతు విన్నారన్న మాట...ఇప్పుడు నాకెంతో సంతోషంగా వుంది. నేనబద్దం చెప్పలేదని మీరూ గ్రహించారు...." అంది సరళ సంతోషంగా.
    "సరళా-నువ్వు భయపడుతున్నావో, నాటకమాడు తున్నవో నాకు తెలియదు. గదిలో గోపీ యెలా వున్నాడో, నువ్వేంచేస్తున్నావో చూద్దామని-నిద్ర లోంచి మెలకువరాగానే గదిలోకి రాబోయాను. నువ్వు నన్ను చూసి మొదలెట్టావో యేమో తెలియదు. గాలితో సంభాషిస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు. నాకు నీ మాటలే వినిపిస్తున్నాయి..."
    "అంటే రాజు మాటలు నిజంగా మీరు వినలేదా? నాకు వినపడ్డ మాటలు మీకు వినపడలేదా?"
    "లేదు..."    
    "మీరు నన్ను దోషిని చేయాలని చూస్తున్నారు. అందుకే అబద్ధం చెబుతున్నారు. నేనేం తప్పుచేశాను? మీరు నన్నెందుకిలా అనుమానిస్తున్నారు?" అంది సరళ యేడుపు గొంతుతో.
    వరప్రసాద్ సానునయంగా-"నేను నిన్ను నమ్ముతాను. రాజు నీతో యేం మాట్లాడేడో చెప్పు...." అన్నాడు.
    సరళ జరిగినదంతా చెప్పింది.
    "నువ్వు చెప్పింది నమ్మతగ్గదిగా వుంది. గోపీకి స్పృహ తప్పినపుడు వాడెందుకు బెదరాడో అర్ధంకాలేదు నాకు. నువ్వు వాదినేమీ చేయలేదని నాకు తెలుసు. అప్పుడు గోపీయేమో చూశాడు. వాడు చూసింది నేను చూడలేదు. ఇప్పుడు నువ్వెవ్వరితోనో మాట్లాడావు. నువ్వు విన్న మాటలు నాకు వినపడలేదు. రాజు ఉనికి నిజమే ననిపిస్తోంది. ఇప్పుడు గోపీ పరిస్థితి ప్రమాదకరంగా వుంది. నువ్వొ నేనో వాడికి దగ్గరగా వుంటే రాజు వాడిని బ్రతకనివ్వడు. ఎవరో ఒకరు వాడికి దగ్గరుండడం యెంతైనా అవసరం. మనం ఎవర్నయినా సాయానికి పిలుద్దాం-" అన్నాడు వరప్రసాద్.
    భర్త తన్ను పూర్తిగా నమ్మినందుకు చాలా సంతోషం కలిగింది సరళకు. ఆమె వెంటనే - "మనం-ముకుందారావుగారింటికి వెడదాం. తిరిగి వచ్చేవరకూ యెవరినైనా సాయంగా వుండమందాం-" అంది.
    "ఇంత రాత్రివేళ ఎవరు లేచివస్తారు? పాపాయమ్మ గారైతే అస్తమానూ యేదో ఒకటి అప్పుతీసుకొని వెడుతూంటుంది కాబట్టి వస్తుందేమో!" అన్నాడు వరప్రసాద్.
    "ఆవిడ రాదు. మనింటికిప్పుడావిడ ఒంటరిగా రావడంలేదు. ఒకసారి జడుసుకుంది గదా-" అంది సరళ.
    "అయితే ఏం చేద్దాం?"
    "ఈ రాత్రికెలాగో గడిపేద్దాం. మనం గోపీని కన్నకొడుకులాకాక పరాయి మనిషిలా చూస్తే వాడికే ప్రమాదమూ వుండదు. తెల్లారేక యేదో ఉపాయం చూడొచ్చు...." అంది సరళ.
    "అయితే నేనీ గదిలో పడుకుంటాను. నువ్వు పక్క గదిలోకి వెళ్ళు."
    "టైముకి మందివ్వడం గుర్తుంటుందో ఉండదో మీకు" అంది సరళ ఖంగారుగా అయినా వరప్రసాద్ అంగీకరించకపోవడంతో అతడికి మరొక్కసారి వివరాలన్నీ చెప్పి మరీ గదిలోంచి బయటకు వెళ్ళిందామె.

                                      8

    సీతాకరరావు వాలు కుర్చీలో కూర్చుని యేదో మాగాజైన్ చూస్తున్నాడు. అడుగుల చప్పుడుకు తలెత్తి చూసి-"నువ్వా?" అన్నాడు.
    వరప్రసాద్ ఆయనకు నమస్కరించి - "చాలా అర్జంటు పనిమీద వచ్చాను-" అన్నాడు.
    "ఏ మయింది? మీ ఆవిడా మళ్ళీ దెయ్యాన్ని చూసిందా?"
    "జరిగినదంతా వివరంగా చెబుతాడు-" అంటూ వరప్రసాద్ ఆయనకు మొత్తం కథ చెప్పుకున్నాడు.
    అది వింటూనే సీతాకరరావు ముఖం గంభీరంగా అయిపోయిది-"విషయం చాలా దూరం వెళ్ళింది-అన్నాడాయన.
    "అసలేం జరుగుతోందంటారు?" అన్నాడు వరప్రసాద్.
    "రాజు నీ భార్య మనసులో బలంగా నాటుకొని పోయాడు. నా మాటలతో, నీ ప్రవర్తనతో ఆమె భ్రమ తొలగిపోతుందనుకున్నాను. ఆ భ్రమ నానాటికీ బలపడింది తప్పితే తగ్గలేదు. పైగా తనను నమ్మడం లేదని ఆమె చాలా బాధపడుతోంది. ఇది సీరియస్ విషయం...."
    "ఇప్పుడు మనమేం చేయాలంటారు?"
    "నువ్వు ఉదయం గోపీని వాళ్ళింటి దగ్గర దిగవిడిచి రావడం చాలా తెలివైన పని. అంతా వాడు తల్లిదండ్రుల గురించి బెంగపెట్టుకున్నా డనుకుంటారు. కొన్నాళ్ళపాటు గోపీ తల్లిదండ్రుల వద్ద వుండడమే మంచిది."
    "సరళలో మార్పు తీసుకొని రావడమెలా?"
    సీతాకరరావు కాసేపు ఆలోచించి-"మాటిమాటికీ నీ భార్య బంగళా గురించి మాట్లాడుతోంది. ఏమిటా బంగళా?" అన్నాడు.
    "ఏమో-రాజు బంగళా గురించి చెబుతున్నాడంటుంది. అదెక్కడున్నదీ తనకు తెలియదంటుంది. రాజు చెప్పడం లేదుట.....మేమిద్దరం మనస్ఫూర్తిగా రాజు దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకుంటే అప్పుడు బంగళాయెక్కడున్నదీ రాజు చెబుతానన్నాడుట...."
    "అయితే ఒక పనిచేయి......రాజు దగ్గరకు వెళ్ళడానికి మీ యిద్దరూ ఒప్పేసుకోండి. అప్పుడు బంగళా గురించి తెలుస్తుంది-" అన్నాడు సీతాకరరావు.
    "మీ అయిడియా బాగుంది...." అన్నాడు వరప్రసాద్ - "కానీ బంగళా గురించి తెలుసుకోవలసిన అవసరమేమిటి?"
    "ఏమిటంటే-అది రాజుకు కీలక స్థానం. మొత్తం కథంతా ఆ బంగళా చుట్టూ తిరుగుతోంది. మీ రాజు బ్రతికుండగా ఏవైనా బంగళా గురించి కలగనేవారామీరు?"
    వరప్రసాద్ ఆలోచిస్తూ-"ఏమో-గుర్తులేదు ....." అన్నాడు.
    "బాగా ఆలోచించి చెప్పు, నీ భార్య భ్రమపడుతోందా-లేక మానవాతీత శక్తి ఏదైనా నిజంగా ఆమెను భ్రమపెడుతోందా అన్న విషయం ఈ బంగళా గురించిన వివరాలపై ఆధారపడి వుంది-" అన్నాడు సీతాకరరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS