Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 41


    ఆఫీసులో పనిచెయ్య బుద్ది కాలేదు. ఒకరోజుకు సెలవు వ్రాసి ఇచ్చేసి వేణు దగ్గిరికి వచ్చాడు.
    "ఏం అగ్రజా! అధికారికి ఎగనామం పెట్టావా? ఏం కథ?"
    "అన్నట్లే! సునీత పైన ఉందా?"
    "ఉంది. సందేశం పంపేదా?" కనుబొమ్మలెగరేసి నవ్వాడు.
    "వద్దులే."
    "అదే తిక్కరోగం. ముందేదో పని ఉన్నట్లు అడగటం.....తరవాత వద్దు అనటం! మీ మాట లెవరూ వినగూడదా?"
    "కాదు, కానీ..." అన్నాడు.
    "కానీలు, అర్ధణాలు పోయాయి. నయాపైసాలు కనక అసలు సంగతి విశదపరచవలిసిందే."
    వేలితో టేబిల్ మీద గీస్తూ అలాగే ఉన్నాడు. మెల్లగా అన్నాడు: "సునీత శీలాన్ని శంకించేవాళ్ళు గూడా ఉన్నారు, వేణూ."
    వేణు ఎగిరిపడలేదు. ఎవరు ఎవరూ అంటూ విస్తు పోయి విశ్వం భుజాలు పట్టుకుని ఊపుతూ అడగలేదు. పైగా అదేం కొత్తవిషయం కాదన్నట్లు చిరునవ్వు నవ్వాడు.
    "బ్రదర్, ఇది కలియుగం. ఒకళ్ళకు మంచిగా కనిపించేది మరొకరికి చెడుగా అనిపించవచ్చు. సునీతను అందరూ ఉన్నతురాలిగా చూడాలని ఎక్కడున్నది?'
    "ఉందని నేననటం లేదు..."
    "నీకో తమాషా చూపిస్తా, చూడు." బజ్జర్ నొక్కాడు. ఫ్యూను రాగానే "చందూని పిలు" అన్నాడు. రెండవ చప్రాసీ చందూ నచ్చాడు. వినయంగా చేతులు కట్టుకుని నిలుచున్నాడు.
    విశ్వంవైపు సంజ్ఞాపూర్వకంగా చూసి, "చందూ, మొన్న మీరు, అంటే నువ్వూ, హెడ్ క్లర్కూ అనుకున్న మాట్లు గుర్తున్నాయి కదూ?" అని అడిగాడు.
    చందూ నోరు వెళ్ళబెట్టాడు.
    అప్పటికీ అనుమానమే, తమ మాటలు అప్పుడే లోపలికి వస్తూ వేణు విని ఉంటాడని. కాని హెడ్ క్లర్కు అన్నాడు- "వింటే పిలిచి చివాట్లు వెయ్యటమో, ఉద్యోగం పీకేసి, వచ్చినదోవ పట్టించడమో చేసేవాడు" అని.
    "బాబ్బాబు, గడ్డి తిన్న. లెంపలేసుకుంట."
    "నేను నిన్నేమీ చెయ్యను. ఆ మాటలన్నీ చెప్పు!"
    చందూ భయంగా చూశాడు.
    "నవ్వు చెప్పకపోతే తెలుసుగా?" బెదిరించుతూ అన్నాడు.
    చందూ చెప్పిన మాటల సారాంశం క్లుప్తంగా ఇది:
    ముందే వచ్చిన హెడ్ క్లర్కుతో మాట్లాడుతూండగా, ఆ క్లర్కు వేణుకు, సునీతకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తూందన్నాడు.
    చందూకూడా అవునని సమర్ధించాడు.
    కాస్త తలనెరిసిన అక్కౌంటెంట్ నిజానిజాలు దేవునికే ఎరుక అనీ, ఏ క్షణంలోనైనా వేణు రావచ్చనీ, ఆ కారు చప్పుడుగూడా వినిపించనంత మంచిదనీ, అది కనక అతను వింటే, తమ నోట్లో దుమ్ము తప్పదనీ సర్దజూశాడు.
     అప్పుడే వేణు వచ్చి గుమ్మానికి అవతల నిలబడి వాళ్ళ మాటలు వింటున్నాడు.
    చందూ ఊరుకోలేదు. సునీత చాలా తెలివిగలది కనక, వేణును వలపన్ని తనవైపు తిప్పుకుని, తనూ ఓ ఆఫీసరు కాగలిగిందని, ఇంతమంది ఇవతల ఉన్నా  ఆఫీసు రూమ్ లో ఒకళ్ళ నొకళ్ళు చూసుకోవటాలు, చిరునవ్వులు, చేతులు పట్టుకోవటాలు - ఇవన్నీ చెయ్యటాన్ని విమర్శించాడు.
    "ఏం చేస్తాడాయన? ఉద్యోగం పీకేస్తాడు. అంతేగా?" అని క్లర్క్ అన్నాడు.
    "నాకెందుకులే" అని అక్కౌంటెంట్ తప్పు కున్నాడు.
    విశ్వం చందూ చెప్పినదంతా విన్నాడు.
    "నువ్వెళ్ళు! నేను ఇది నిన్నడిగినట్లు ఎవరితోను చెప్పకు."
    "బాబయ్యా!" చందూ వేణు కాళ్ళమీద పడ్డాడు.
    కాళ్ళు పక్కకు జరిపాడు. "నేను నిన్నేమీ చెయ్యను. నువ్వెళ్ళు."
    చందూ దణ్ణంపెడుతూ భయంగానే వెళ్ళాడు.
    "చూశావా, బ్రదర్? ఇదొక్కటే కాదు. ఇంకా విన్నాను. వీటన్నిటినీ నేను అసలు లక్ష్యపెట్టను. లేకపోతే ప్రశాంతంగా జీవించలేం. లోకులు కాకులు. అరవటమే వాటి పని. నువ్వు ఊరికే మధనపడకు."
    "ప్చ్ ప్! అందుకు కాదు ..."
    "ఎందుకైనా మంచిదే. మొదటిరోజుల్లో నేను నీలాగే బాధపడేవాడిని. సునీతే నాకీ ఉపాయం నేర్పింది. నువ్వూ ఆచరించు. వెరీ ఈజీ."
    "ఎవరో అంటే బాధలేదు! నిర్మలే ఈ సూటి పోటీలు..."
    "అంటుందంటావు! ఆమె నీ అర్ధాంగి కనక అంటే అనవచ్చు! నీ హృదయంలో తనకుతప్ప మరొకరికి చోటు ఉందేమోనని ఆమె ఆరాటం. పోనీ, కొన్నాళ్ళు పుట్టింటికి పంపిచూడు. కొంత సర్దుబాటు కావచ్చు."
    "ఆ మాట నేనే అంటే దానికో లంకె; సాధింపూ!"
    "కాలికి తప్పితే మెడకూ, మెడకు తప్పితే కాలికీ....బావుంది. సునీతనే అడిగి ఏదో చిట్కా ప్రయోగించు."
    "సునీతనా? వద్దు. ఇది తెలిస్తే నా సంసారం విచ్చిన్నం చేయటానికి తనే కారణమని అసలు అవుపించనైనా అవుపించదు."
    మధ్యాహ్నం నిర్మల ప్రశ్నించింది, "ఆఫీసుకు వెళ్ళలేదా?" అని.
    విశ్వం ప్రత్యుత్తరం ఇవ్వలేదు.
    నిర్మల ఏడుపు తెచ్చుకుంటూ, "అవును లెండి! నేనేం అన్నా మీకు వినిపించదు" అంటూ వంటింట్లోకి వెళ్ళింది. విశ్వం కాళ్ళు కడుక్కుని వచ్చాడు. నిర్మల పెద్దగా గిన్నెలు చప్పుడు చేస్తూ అన్నం వడ్డించింది. రోజులా అది కావాలా, ఇది కావాలా అని అడిగి వెయ్యకుండా,, అన్నీ గిన్నెల్లో పెట్టేసి మూత పెట్టింది. విశ్వం పీటమీద కూర్చున్నాడు వచ్చి. తను గడప అవతల బాజీ నెత్తుకుని చూస్తూంది. అసలు మాట్లాడకూడదని, బతిమిలాడి తక్కువదనం చూపించగూడదని ఆమె సంకల్పం.
    రాత్రి భోజనంకూడా అలాగే గడిచింది.
    ఆ నాలుగు దినాలూ అంతే! ఆఫీసు - అక్కడి నుండి ఆశ్రమం, ఇల్లు - నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చోవటం. బాజీ విశ్వం దగ్గిరికి రావటానికి జంకు తున్నాడు. నిర్మల సాధిస్తూనే ఉన్నది.
    విశ్వం ధోరణి ఆమె అనుమానాన్ని మరింతగా బలపరుస్తున్నట్లుంది. అయిదారు రోజులయ్యాక గట్టిగా అడిగేసింది అతను ఏమనుకుంటున్నాడో చెప్పమని.
    "నేను చెప్పేదేముంది? అది నువ్వు తెలుసుకోవాలి."
    సన్నగా రాగం ప్రారంభించింది. తల్లికి తనూ శ్రుతి కలిపాడు బాజీ.
    "మంచివారని నాన్నా, అమ్మా అందరూ మోస పోయారు. నా బతుకులో నిప్పులు పోశారు."
    "నిప్పులు పోశానో, నీళ్ళు చల్లానో నాకెరుకలేదు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు."
    బాజీ మూలకు కూచుని ఎక్కెక్కిపడుతున్నాడు. ఇద్దరిలో ఎవరూ తీసుకోలేదు. నిర్మల రోషంగా అన్నది: "ఏం చేస్తారు? గొంతుకు ఉరేసి ఉన్న కాస్త అడ్డూ తీర్చేసుకుంటారు. అంతేగా?"
    "నిర్మలా!"
    "మీకు దానికి ఏ సంబంధమూ లేకపోతే, మీరిలా ఎందుకు ఉంటారు? మీరు ముఖం మాడ్చుకోటానికి అర్ధం ఏమిటి?"
    విశ్వం పిడికిళ్ళు బిగించాడు. కాలిని నేలకు బలంగా తొక్కి పట్టాడు. తన నిగ్రహాన్ని నిర్మల కప్పివేస్తూ రెచ్చగొడుతున్నది.
    "నా వైఖరికి ఎన్నో విపరీతార్ధాలు తియ్యవచ్చు. ఒకవేళ నీకిక్కడ ఉండటం శూలాలు గుచ్చుతున్నట్లుంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు."
    నిర్మల అననే అంది: "పుట్టింటికి పంపేస్తే దాన్ని ఏకంగా ఇంటికే తీసుకువచ్చి ..."
    మాట పూర్తి కాకముందే నిర్మల చెంపమీద గట్టి దెబ్బ పడింది. బాజీ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు. నిర్మల కళ్ళు తిరిగాయి. నిల్చోలేక చాపమీద కుప్పలా కూర్చుంది. విశ్వం వాళ్ళిద్దరినీ అలాగే వదిలి దర్వాజా దాకా వెళ్ళాడు.
    నిర్మల ఇంకా తేరుకోలేదు.... బాజీ రోదన మానలేదు.
    జాలివేసింది విశ్వానికి. మళ్ళీ వచ్చి బాజీని ఎత్తుకుని సముదాయిస్తూ నిర్మలముందు నిలుచున్నాడు.
    "బాజీ సాక్షిగా నేను, సునీత అన్నాచెల్లెళ్ళ అనుబంధంతప్ప మరొక చేడు సంబంధం ఎరగం. తెల్ల వారుజామున బస్సుకు మీవాళ్ళింటికి వెళ్ళు. నేను నీకే ద్రోహమూ చెయ్యలేదు. చెయ్యనుకూడా. లే, నిర్మలా" అన్నాడు చెయ్యి అందిస్తూ.
    తెల్లవారకముందే వెళ్ళి రిక్షా తెచ్చాడు. అదికూడా ఆమె అపోహకు మరో సమిధ అయింది. బట్టలుకూడా సర్దుకోలేదు. వెనకనే తనూ మరో రిక్షాలో బస్ స్టాండ్ కు వచ్చాడు.
    నిర్మల వెళుతున్నాననికూడా చెప్పలేదు. బత్తాయిలు, అరటిపళ్ళు దస్తీలో కట్టి తెచ్చి ఇస్తే మారు మాట లేకుండా తీసుకుంది. బాజీని ముద్దు పెట్టుకుని ఆమె ఒడిలో వదిలాడు.
    "త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయి. మూర్ఖంగా, పట్టుదల కొద్దీ ఒక ఉత్తమురాలికి నీచత్వాన్ని అంటగట్టావు. ఎవరి తప్పుమాత్రం ఉందని? నీకోసం... శుభప్రదమైన నీ సాన్నిహిత్యాన్ని కోరుకునే నా హృదయ ద్వారాలు ఎప్పుడూ తెరవబడి స్వాగతమిస్తూనే ఉంటాయి....."
    బస్సు వెళ్ళిపోయింది.
    వేణుకు మాత్రం చెప్పాడు.
    'సారథి ప్రియ' సర్వాంగ సుందరంగా తయారై ప్రజల చేతుల్లోకి వచ్చింది. పాండవమధ్యమునికి వాసుదేవుడు గీత ఉపదేశిస్తున్న ముఖచిత్రం ప్రతి వారినీ ఆకర్షించింది. దానికన్నా ఆకర్షించింది ఎడిటర్ పేరు. 'ఎవరీ సునీతాదేవి?' అనుకున్నారు అది చూసినవాళ్ళు.
    మొదటి పేజీ ప్రారంభమే గీతాశ్లోకంతో! అంత మవటం కూడా మరొక గీతాశ్లోకంతోనే అయింది. ఈమధ్య రకరకాల విజ్ఞానాసక్తిని కలిగించే శీర్షికలు. మొత్తంమీద ఆశించినదానికన్నా ఎక్కువ ప్రతులు వచ్చేనెల వేయవలిసి వచ్చింది.
    ఈ ప్రయత్నంలో సునీత కొద్దిగా శ్రమపడింది. ప్రెస్ నుండి రెండు కాపీలు తీసుకుని ఆర్తి దగ్గిరికి వెళ్ళింది. అవి చూసి ఒకవిధమైన డగ్గుత్తికతో, "బాగా ఉంది, పాపా! అభినందిస్తున్నాను" అన్నది.
    "థాంక్స్, డాక్టర్!"
    "కాని ఇకనుండి నువ్వు ఇంత శ్రమ తీసుకోవద్దు. నీ కళ్ళు ఎంత అలసటగా ఉన్నాయో చూడు."
    "అలసట ఏం ఉంది? మొదటిసారి కదా? ఆ మాత్రం..."
    "అందుకే ఊరుకున్నాను. ఈసారి రెగ్యులర్ టైమ్ టేబిల్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే రేపే ప్రేస్సుకు, ఆఫీసుకు సీల్ వేయిస్తాను."
    "అలాగే, డాక్టర్! పాపాయేది?"
    "రజనా? ఇంటి దగ్గిర ఉంది. ఇక్కడి కెందుకు వస్తుంది? రాధను అల్లరిపట్టిస్తూ ఉంటుంది. వెళ్ళు."
    సునీత పాపాయిని చూసి వెళ్ళింది.
    గోవిందరావు దగ్గిరనుండి ఆశాజనకమైన ఉత్తరం వచ్చింది. దానిలో-
    "హృషీకేశ్ చేరుకున్నానమ్మా! ఒక బాబాజీ నాకు పరిచయమైనారు. ఆయనతో ఒకరోజు గడిపాను. సందర్భవశాన నేను సారథిని అన్వేషిస్తున్నట్లు చెప్పాను. ఆయన అన్నారు-! పేరైతే నాకు తెలియదు గాని, మీరు చెప్పిన రూపురేఖలు గల యువకుడు గంగోత్రి ప్రాంతంలో ఒక ఆశ్రమం దగ్గిర చూసినట్లు గుర్తు అని.
    నేను ఆత్రంగా ఆయనను వివరాలడిగి తెలుసుకున్నాను.
    మేనుండి నవంబరు మొదటివారం వరకు అక్కడికి ప్రయాణం సుకరంగా ఉంటుందట. అదృష్టవశాత్తు మేనెలా గడిచిపోవచ్చింది. ఇక్కడినుంచి టెహ్రీ అనే ప్రాంతంమీదుగా థార్పావరకూ వెళ్ళాలిట. థార్సానుంచి కంచరగాడిదలమీద వెళ్ళవచ్చుట.
    బాబాజీ ఆశీర్వాదంపొంది రేపే బయలుదేరుతున్నాను. భగవంతునికి మనమీద కరుణ కలిగింది. సారథి అక్కడ కనిపించవచ్చు. బాబాజీకూడా అన్నారు. ఈ నాలుగైదు నెలలూ సాధువులు మహాపవిత్రమైన ఆ గంగోత్రి ప్రాంతంలోనే దైవచింతనలో గడుపుతారట. ఎక్కడికీ వెళ్ళరట.
    మన దృష్టి అక్కడిదాకా వెళ్ళదని సారథి అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఏమైనా శుభప్రదమైన అంతమే జరుగుతుంది. బాబాజీ అలాగే ఆశీర్వదించారు."
    ఆర్తి ఎన్నిసార్లు చదివిందో లెక్కలేదు. హాస్పిటల్ ప్రైవేట్ రూమ్ లో ఏ అలంకారాలు లేని ఆ గదిలో ఆమె ఆనందమూర్తి అయి కూర్చున్నది. అక్కడ రెండే రెండు చిత్రాలు. ఒకటి, తథాగతుని దివ్యమూర్తి. మరొకటి, సారథి ఛాయాచిత్రం.
    ఆనందబాష్పాలు నిండిన కనుదోయితో ఆమె అనుకుంటున్నది: 'ప్రభూ! నామీద కరుణ కలిగిందా? మీరు... మీరు....వస్తున్నారు. వస్తారు, ప్రభూ. ఎన్ని యుగాల అనుబంధం! ఎన్ని ఏండ్ల నిరీక్షణ గడిచింది! మీరు కరుణాసముద్రులు. నేను మీ నదీ కన్యను. మీలో .... మీలో ...... లయమైపోయె ఆ క్షణం ఎన్నడు .... ఎప్పుడు, ప్రభూ?'
    ఎవరో అన్నారు: "వెలుగునీడలు, సుఖదుఃఖాలు వెన్నంటి తిరుగుతూనే ఉంటాయి. ఏవీ ఎల్లకాలమూ అంటిపెట్టుకుని ఉండవు." అవి తథాగతుడన్నట్లే తోచాయి ఆమెకు.

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS