Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 40


    "ఏం చేయాలో నువ్వే చెప్పు.."
    "గోపీని వేరే యింట్లో ఉంచుదాం...."
    వరప్రసాద్ నిట్టూర్చి-"గోపీ మరీ పసివాడు కాదు. వాడి అభిప్రాయంకూడా తెలుసుకుందాం -" అంటూండగా కాలింగ్ బెల్ మ్రోగింది.
    గోపీ పాపాయమ్మగారింటినుంచి తిరిగివచ్చాడు.
    వాడి ముఖంలో ఇప్పుడెక్కడా భయం ఛాయలు లేవు. వరప్రసాద్ వాడివంకే ఆశ్చర్యంగా చూస్తూ "ఈ సమయంలో ఆటలేమిట్రా?" అన్నాడు.
    "అమ్మే పంపింది.." అన్నాడు గోపీ.
    "ఎందుకు?"
    ఈ ప్రశ్నకు బదులిచ్చేలోగా గోపీ ముఖంలో ప్రవేశించిన భయాన్ని స్పష్టంగా చూశాడు వరప్రసాద్. వాడు తను దెయ్యాన్ని చూసిన విషయం చెప్పాడు.
    "అనవసరంగా భయపడ్డావు. అమ్మే నీ ధైర్యం పరీక్షించడానికి దెయ్యం వేషం వేసుకుంది" అన్నాడు వరప్రసాద్.
    గోపీ వెంటనే-అమ్మెప్పుడూ నన్నలా భయపెట్టదు. అదీకాక అప్పుడమ్మ వంటింట్లో పనిచేసుకొంటోంది. నేను నిజంగా దెయ్యాన్ని చూశాను. దెయ్యం కాకపోతే నాలికనంత పొడవుగా చాపడమింకెవరికీ సాధ్యం కాదు" అన్నాడు నమ్మకంగా.
    "ఒకవేళ భ్రమపడ్డావేమో-" అన్నాడు వరప్రసాద్.
    "అయితే అయుండఅవచ్చు. కానీ అమ్మ మాత్రం నన్ను భయపెట్టలేదు. నాకు బాగా తెలుసు" అన్నాడు గోపీ.
    సరళ చటుక్కున-"గోపీ-నువ్వు భ్రమపడలేదు. ఈ యింట్లో నిజంగా దెయ్యముంది-" అంది.
    వరప్రసాద్ ఉలిక్కిపడి సరళా-"నువ్వేం చెబుతున్నావో తెలుసా?" అన్నాడు.
    "తెలుసు నిజం తెలుసుకోవడం వాడికీ మంచిది-" అని-"గోపీ-నీకు తెలుసుగదా! రాజు నీ యీడువాడే. దురదృష్టంకొద్దీ అర్ధాంతరంగా పోయాడు. అయితే వాడి ఆత్మ దెయ్యమై ఈ యింట్లోనే తిరుగుతోంది. వాడు నిన్ను చూసి అసూయపడుతున్నాడు. నిన్నీ యింట్లోంచి తరిమేయాలని నిన్ను బెదిరిస్తున్నాడు. ఇలాంటిచోట నువ్వుండగలవా?" అంది సరళ.
    గోపీ మ్రాన్పడిపోయి సరళ వంక చూశాడు. ఆమె ఏం చెప్పిందీ వాడికి సరిగ్గా అర్ధంకాలేదు. సరళ వాడిని దగ్గరగా తీసుకొని చిన్నపిల్లల కర్ధమయ్యే విధంగా దెయ్యం ఆలోచన గురించి చెప్పింది.
    గోపీ అంతా బుద్దిగా విని-"అంటే ఈ యింట్లో దెయ్యం తిరుగుతోందన్నమాట...." అన్నాడు.
    "అవును...."
    "ఆ దెయ్యం నామీద పగబట్టిందన్నమాట!"
    "అవును...."
    "అమ్మా! ఆ దెయ్యం నీ కొడుకే అయితే అది నన్నేమీ చేయదు. ఈసారది నన్ను బెదిరిస్తే నన్నేం చేయవద్దని బ్రతిమాలుకుంటాను. కానీ యిక్కడే వుంటాను. ఇంకెక్కడికీ నన్ను పంపించొద్దు-" అన్నాడు గోపీ.
    వరప్రసాద్ వాడిని దగ్గరగా తీసుకొని - "నువ్విక్కడే వుందువుగాని లే బాబూ!" అన్నాడు.
    సరళ వెంటనే-"నిర్ణయం తీసుకుంటే సరిపోదు. వీడికే అపకారం జరిగినా ఆ తర్వాత మీరు నన్ను తప్పు పట్టకూడదు...." అంది.
    "అమ్మా! నాన్న నిన్ను తప్పుపట్టినా నేనొప్పుకోను" అన్నాడు గోపీ.
    అప్రయత్నంగా సరలకూడా వాడిని దగ్గరగా లాక్కుంది. గోపీ పరవశంతో కళ్ళు మూసుకొని తెరిచి ఏం చూశాడో యేమో-కెవ్వుమన్నాడు.
    ఆ తర్వాత వాడికి వళ్ళు సలసల కాగిపోయింది. వరప్రసాద్ వైద్యుడికోసం వెంటనే పరుగెత్తాడు.
    
                                     7

    వైద్యుడు వచ్చి మందిచ్చి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు.
    ఆయన గోపీకేమీ ప్రమాదం లేదని చెప్పినప్పటికీ ఆ రోజంతా వాడికి స్పృహ లేదు. మందు ప్రభావంవల్ల వాడికి మగతఃగా ఉండి వుంటుందని వరప్రసాద్ అన్నాడు. కానీ సరళకు మనసు మనసులోలేదు.
    ఆమె ఆ రాత్రంతా మెలకువగా వుండి గోపీ పక్కలోనే కూర్చుంది. వరప్రసాద్ తనూ మెలకువగానే వుండాలనుకున్నాడు కానీ నిద్రనాపుకోలేకపోయాడు.
    ఒక రాత్రివేళ "అమ్మా!" అన్న పిలుపు వినబడి సరళ ఉలిక్కిపడింది.
    "బాబూ-గోపీ-మెలకువొచ్చిందా?" అందామె.
    కానీ గోపీ యింకా మగతలోనే వున్నాడు.
    మళ్ళీ సరళకు-"అమ్మా!" అన్న పిలుపు వినిపించింది.
    "ఎవరది-రాజూ?" అంది సరళ.
    "అవునమ్మా-నేనే!"
    "ఎందుకు నన్ను పిలిచావు?"
    "నువ్వు గోపీ దగ్గర కూర్చోవద్దు...."
    "అది సరే-నువ్వెందుకు నన్ను పిలిచావు?"
    "నిన్ను గోపీ వద్ద కూర్చోవద్దని చెప్పడానికి...."
    "నేను వీడి దగ్గర కూర్చుంటే నీకేం నష్టం?"
    "నా బాధ నీకెందుకర్ధంకాదు? నువ్వు నా అమ్మవి. నేనెంత పిలిచినా నువ్వు నా దగ్గరకు రావడంలేదు. గోపీ మూలంగా నువ్వు నన్ను మర్చిపోతున్నావుకూడా!"
    "గోపీ మనింట్లో వున్నప్పుడు ప్రేమగా చూసుకోవాలి గదా"
    "ఏమో - అదంతా నాకు తెలియదు.....ఇందాకా నువ్వు వాణ్ణి అభిమానమ్గా దగ్గరగా తీసుకున్నావు. నేనది చూడలేకపోయాను. వెంటనే వాడికి కనబడిబెదిరించాను. హడిలిపోయాడంతే....."
    "అంటే నువ్వు మళ్ళీ గోపీని బెదిరించావన్నమాట......అందుకే వాడికి జ్వరం వచ్చింది. ఇలాగైతే రాజూ......నేను నిన్నసహ్యించుకుంటానేమో...." అంది సరళ.
    "అమ్మా-నువ్వలాగంటే నాకేడుపొస్తుంది. మా అమ్మ నన్ను కాదని ఇంకెవరినో ప్రేమగా చూస్తూంటే నాక్కోపం రాధా?"
    "కానీ నేనేం చేయను? నువ్వు చచ్చిపోయావు...."
    "చచ్చిపోయానని నన్ను మర్చిపోతావా? నాకెంత బాధ కలిగినా నీకేమీ అనిపించదా?"
    "నీ గురించి నేనేం చేయగలను చెప్పు!"
    "నా దగ్గరకు వచ్చేయమ్మా.....ఎంత మంచి బంగళాయో అది! అందులో అన్నీ ఖరీదైన కుర్చీలు, బీరువాలు, మంచాలు, పరుపులు...."
    "ఎక్కడుందిరా ఆ బంగళా!"
    "నువ్వు నాతో వచ్చేస్తానంటే చెబుతాను...."
    "నేను నీతో వచ్చేస్తాను...." అంది సరళ.
    "నువ్వొచ్చేస్తానంటే చాలదు. నాన్నను కూడా తీసుకురావాలి...."
    "ముందు నన్ను బంగళా చూడనీ, నాకు నచ్చితే నాన్నను కూడా రమ్మని చెబుతాను..." అంది సరళ.
    "అలా కుదరదు. ఇద్దరూ కలిసే రావాలి...."
    "ఎందుకని?"
    "బంగళా యిక్కడికి చాలా దూరం..."
    "ఎంత దూరమేమిటి?" కుతూహలంగా అంది సరళ.
    "చాలా చాలా దూరం. ఒకసారి నిన్నక్కడికి తీసుకొని వెడితే నేను తిరిగి నిన్ను వదిలిపెట్టలేను. నాకు తెలుసు-నువ్వు నాన్న లేకుండా వుండలేవని! బంగళాకు చేరుకున్న మరుక్షణంనుంచీ నువ్వు నాన్నో నాన్నో అని కలవరిస్తావు. అందుకని కూడా తీసుకొని వెళ్ళిపోతేనే మంచిది కదా!"
    "నువ్వే యిక్కడుండకూడదా? నా కంటిక్కనిపించకూడదా?" అంది సరళ.
    "ఎన్నిసార్లు చెప్పనమ్మా - అది సాధ్యంకాదని! నన్ను కనిపెంచిన తల్లివి-నీ ఋణం తీర్చుకోకుండానే దూరమయ్యాను. ఇప్పుడు నిన్ను నాకు దగ్గర చేసుకొని అన్ని సేవలూ చేయాలని వుంది. అమ్మా-నా దగ్గరకు వచ్చేయవూ? నేను నీకు కాళ్ళు పడతాను. వంటచేస్తాను. ఏ పనీ చేయకుండా అస్తమానూ కూర్చుని పుస్తకాలూ చదువుకోవచ్చు. అన్నట్లు బంగళాలో బోలెడు పుస్తకాలున్నాయి. అన్నీ నీకిష్టమైనవే..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS