Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 40


    "నా క్లాసులో ఉన్నారు ఓ పాతికమంది. ఏ ఒక్క రిద్దరో తప్ప డిక్టేట్ చేయించిన నోట్సు బట్టీ ఫైడ్ చేసి పాస్ అనిపించుకోవడం."
    "ఆడాళ్ళంటే మీకంత అక్కసెందుకు?" కరుణ అంటుంది.
    "అక్కసు? అలా అయితే మీమీదకూడా ఉండాలి. అది కాదు. ఈ కాలేజీ గరల్స్ ఉంటారే... పాసవుతారా..... పెళ్ళయితే చదివిందానికి సున్నా చుడతారు. ఒకరిద్దరు పిల్లలు కలిగితే ....బుక్సూ అవీ ఏమైనా ఉంటే, అగ్నిహోత్రునికి సమర్పయామి!"
    "ఆడవాళ్ళ జీవితంలో ముఖ్య పాత్ర ఇల్లూ, పిల్లలూ."
    "కాదనను. సహనమూర్తి అయిన స్త్రీ కుటుంబాన్ని దిద్దుకోవాలి. కానీ తీరికవేళల్లో పక్కింటి లేచిపోయిన పారిజాతాన్ని, ఎదిరింటి సరసురాల్ని గూర్చి గాలికబుర్లు పోగుచెయ్యకపోతే, ఏ చిన్న వ్యాసమో, కథో రాస్తే? అదీ చాతగాకపోతే, ఇంటికి వచ్చినావిడకు కాస్త లోకాన్ని అర్ధం చేయిస్తే ఎలా ఉంటుంది?"
    "మరి సునీతకు పెళ్ళికాలేదు. అది ...."
    "ఆమె తన స్వశక్తితో జీవిస్తున్నది. సలహా లిచ్చే వారు, ఒత్తిడి చేసేవారు లేరు. పెళ్ళి, సంసారాన్ని గురించి ఆలోచించే తీరిక లేదు. తటస్థపడిన వ్యక్తులకు దివ్యసందేశాలిస్తూ, ఒడుదుడుకులు లేక నీటిమీద నావలా సాగుతున్న ఆమె వివాహంలాంటి మజిలీలు, మలుపులు చూడకుండానే గమ్యం చేరగలదు."
    అక్టోబరు నెలలో కంపెనీ లెక్క లన్నీ పునః పరిశీలించారు. అదనపు వ్యయాలెన్ని ఒరిగినా నిరుటికన్నా లాభాలు పన్నెండువేలు ఎక్కువ వచ్చాయి. ఆర్తి చెప్పింది: "మన ఆశ్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక పత్రిక పెట్టు."
    "పత్రికా? నాకు అంతగా ఆ రంగంలో అనుభవం లేదక్కా!"
    "అనుభవమేమీ అవసరంలేదు."
    "నష్టం వస్తే?"
    "రానివ్వు. ఆఫీసు డబ్బేమీ వద్దు. బాంకులోనా..."
    "ఎవరిదైతే ఏంలే? విశ్వాన్ని నీలకంఠాన్ని అడుగుదాం."
    "సరే! సాయంత్రం వస్తారుగా?"
    విశ్వం స్వంత ప్రెస్సు లేనిది ప్రయోజనం లేదన్నాడు. నీలకంఠం అదే సమర్ధించాడు. అదేగాక ఇంకోటి గూడా అన్నాడు. "కన్నన్ పవర్ ప్రింటర్సు వాళ్ళు ప్రెస్సు అమ్ముతామంటున్నారు. వాళ్ళు మద్రాసు వెళ్ళిపోతారట. మీ ఆఫీసుకు దగ్గిరే ఉంది."
    "ఎంత చెబుతున్నారు?" వేణు అడిగాడు.
    "నేనది కనుక్కోలేదు. కన్నన్ నాకు తెలుసు. వీలున్నప్పుడు చెబితే వెళ్ళి కలుసుకుని మాట్లాడవచ్చు."
    'నువ్వేమంటావు, పాపా?" ఆర్తి సునీత దిక్కు చూసింది.
    "మంచిదే!"
    శుక్రవారం వేణు, నీలకంఠం, సునీత ప్రెస్సుకు వెళ్ళారు. ప్రెస్సు ఉన్న ఇంటితో సహా  పదిహేను వేలు చెప్పారు. బేరం పన్నెండువేలకు కుదిరింది. రిపేర్ ఖర్చులు ఒక వెయ్యి పైగా అవుతాయి. మొత్తంమీద కొంత చౌకలోనే దొరికింది. అసలు ఆ ప్రెస్సువాళ్ళు పోయిన ఏడు విపరీతంగా నష్టం ఎదుర్కొన్నారు. ఈ ఏడూ అలాగే ఉంది. వచ్చినంతే చాలనుకుని తెగనమ్మారు.
    రిజిస్ట్రేషన్ వగైరాలు జరిగాయి. ఇదివరకు ఉన్న కంపోజిటర్లు, బైండర్లు, మెకానిక్ అందులో పని చేస్తా మన్నారు. ఇంటిని, ప్రెస్ మెషీనరీని రిపేర్ చేయించటం గూడా చకాచకా సాగిపోయింది.
    ప్రెస్ ప్రారంభాని కెవరూ పెద్దవాళ్ళను, ప్రముఖులను పిలిపించలేదు. నిరాడంబరంగా జరిగిపోయింది. పత్రిక పెట్టడానికి అవసరమైన సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. ఎడిటర్ గా ఎవరు ఉంటారన్నది సమస్య.
    "సునీతని అడుగు, వేణూ!" ఆర్తి సలహా.
    "ఎక్సలెంట్ ఐడియా!" ఉదయం ఆఫీసులో చెప్పాడు: "అక్కయ్యే నీ పేరు సూచించింది, నీతా!"
    నవ్వుతూ, "మూడు వారాల్లో మళ్ళీ మెషీన్లను వేలం వేయించవలిసివస్తుంది, వేణూ!" అన్నది.
    "తప్పకుండా వేయిద్దాం! ముందు నువ్వైతే దివాలా తీయించు!"
    "దానికి కనీసం ట్విన్ సిటీస్ లో నైనా సర్కులేషన్ ఉండాలి! ఏ ఏజెంటు అయినా దాన్ని తీసుకుంటాడా అని!"
    "అన్ని ఏర్పాట్లూ చేద్దాం!"
    "ఎడిటర్ని గూడా ఎవరినైనా ఏర్పాటు చెయ్యండి!"
    "పోనీ, ఎవర్నో నియమించమంటున్నావు. నువ్వొకర్ని సూచించు,"
    "నేను చెప్పాలా? ఎంతమంది సాహితీవేత్తలు లేరు!"
    "వాళ్ళెవ్వరూ వద్దు. నువ్వు ఎడిటర్ నీతావవుతావని ఆశ పెట్టుకున్నాను కొండంత."
    "మంచుకొండంత!"
    "అలాగే జరిగింది! సరేలే, వెళ్ళు. ఎవర్నో చూద్దాం."
    సునీత 'డాక్టర్ గారికి చెబుతారు!' అనుకుంటూ వెళ్ళింది.
    ఆర్తి అడగనే అడిగింది: "నీకిష్టంలేదా, పాపా?"
    "ఇష్టమని కాదు, డాక్టర్! నాకేం తెలుసు? నేనేం చదువుకున్నానని?"
    "నీకేమీ తెలియదని, చదువుకోలేదని ఎవరైనా అన్నారా?"
    సమాధానం స్ఫురించలేదు. "సరే! కానీ, నేనొక్క దాన్నే ఈ బరువు ..."
    "పిచ్చిపాపా! అంతా నీమీదే వేస్తావనుకున్నావా?"
    ప్రెస్ కు సంబంధించిన క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ వగైరాలు తన స్వంత డబ్బుతోనే కొన్నది ఆర్తి. రిజిస్ట్రేషన్ ఆమె పేరుతోనే జరిగింది. ప్రెస్ కు పేరు మార్చి కళ్యాణి పేరు పెట్టబడింది.
    సునీత నోట ఇది విన్న యాదగిరి ఈసారి తనూ కాస్త కల్పించుకున్నాడు. ఊరికే కూర్చుంటే పూర్వ స్మృతులు కలతపెడుతున్నాయి. తను ప్రెస్ మానేజ్ మెంట్ తీసుకుంటానన్నాడు.
    "ఆయన వ్యాపారంలో అనుభవమున్న వాడు. పత్రికకు సంబంధించిన వ్యాపారవిషయాలన్నీ ఆయననే తీసుకోమను" అంది ఆర్తి.
    ఎడిటర్ సునీత అయింది. మానేజర్, పబ్లిషర్ యాదగిరి. ప్రింటర్ కూడా ఆయనే! రాధా, కరుణా స్త్రీల విభాగం నిర్వహిస్తారు. నీలకంఠం చీఫ్ అడ్వయి జర్. విశ్వంకూడా అడ్వయిజరే! వేణు పార్ట్ నర్. ఇలా స్నేహితులు, బంధువులు అందరూ తలా ఓకే భారం తీసుకునేటట్లు చూసింది ఆర్తి. పత్రిక పేరు 'సారధి ప్రియ'.

                                  
    యాదగిరి తను జీతం తీసుకోనన్నాడు. మిగిలిన వాళ్ళలో కూడా ఎవ్వరూ జీతం కోరలేదు. తనకు ఎప్పుడూ ఇస్తున్న వందరూపాయలు చాలన్నది సునీత.
    పత్రిక ఆఫీసు ప్రెస్ కు దగ్గిరగా ఉంటుందని, కంపెనీ ఆఫీసు పైన రెండవ అంతస్తు ఖాళీగానే ఉంటుంది కనక దానిమీదే ఏర్పాటయింది. వేణు కావాలనే అలా చేశాడు,.
    ప్రెస్ లో పనివాళ్ళు నీరసంగా, పట్టీపట్టనట్లు పనిచెయ్యటం యాదగిరికి ఏమీ నచ్చలేదు. సునీత కూడా అసంతృప్తి ప్రకటించింది. ప్రతి లైనుకూ అయిదారు తప్పులు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. చెప్పీ చెప్పీ ఆమెకే విసుగెత్తింది.
    "ఇంత తప్పులతడకయితే నెత్తిన వేసుకోటానికి గుడ్డముక్కయినా లేకుండా దివాలా ఎత్తుతుంది. శ్రద్ధగా ఒళ్ళువంచి ఎందుకు పనిచెయ్యరు?"
    ఆ కంపోజిటర్ నీరసంగా నవ్వాడు. "ముఫ్ఫయి రూపాయల జీతంలో ఇంతకన్నా మంచిగా చెయ్యగల వారుంటే నియమించుకోండి."
    "ముఫ్ఫై? అలాగని ప్రొప్రయిటర్ గా రన్నారా?"
    "అంతకన్నా ఎక్కువిస్తారా?"
    ఆఫీసుకు వచ్చి వేణును కదిపింది.
    "ప్రెస్సు కంపోజిటర్లు-వాళ్ళకు  జీతా లెంతిస్తామన్నారు?"
    "నేనేమీ అనలేదే?"
    "వాళ్ళ జీతా లెంతేసి ఉన్నాయో తెలుసా?"
    "ఎంత? వందలా? వేలా"
    "ఇంకా నయం! లక్షలన్నారు కాదు. ముచ్చటగా ముఫ్ఫయి రూపాయలట!"
    "ముఫ్ఫయి? వాళ్ళు గడ్డితిని బతుకుతారా?"
    "గడ్డి మోపులుకూడా రావు! వాళ్ళ పూర్వపు యజమాని అలా ఇచ్చి ఉండవచ్చు! ఇలా అయితే మన పత్రిక నడవటం కష్టం!"
    "తీసేద్దామంటావా?"
    "ఎందుకు? సరైన జీతాలిస్తే అవే చక్కబడతాయి. డాక్టర్ గారి నడిగి..."
     "దీనికి అక్కయ్యదాకా ఎందుకు?..." అంటూ లేచి, బీరువాలోనుంచి వెయ్యి రూపాయలు తీసి ఆమె కిచ్చాడు. "ఇదిగో, నీ ఇష్టం వచ్చినంతగా జీతాలు నిర్ణయించి అడ్వాన్సు జీతాలుగా ఇవ్వు. చాలక పోతే ఇంకా ఇస్తాను."
    మొత్తం పనివాళ్ళు పదహారు మంది ఉన్నారు. తెచ్చిన రూపాయలన్నీ వాళ్ళకు సమంగా వచ్చేటట్లు భాగించింది. వాళ్ళు తెల్లముఖాలు వేసి చూస్తున్నారు.
    "మీ పనులనుబట్టి అరవైనుండి డెబ్బయి వరకు మీ జీతాలు ఉంటాయి. మీరు మంచిగా పనిచేస్తూ మన పత్రిక సర్కులేషన్ పెరగటానికి తోడ్పడితే మీ జీతాలు పెరుగుతాయి."
    వాళ్ళ కడుపులు నిండిపోయినట్లయినాయి.
    
                             *    *    *    *

    నిర్మల మాటల విసుర్లు ఎక్కువయ్యాయి.
    అయిదారుసార్లు విన్నాడు విశ్వం. కోపం వచ్చి, "ఉత్తిపుణ్యానికి అపోహలు కల్పించుకోకు ఆమె నీ చెల్లెలయితే అలాగే అంటావా?" అన్నాడు.
    "అప్పుడు మరదలివరసతో బాగా సరసమాడే వారు."
    "పిచ్చిగా వాగకు. సునీత నువ్వనుకున్నంత నీచురాలు కాదు. నాకు చెల్లెలు వంటిది. నోటిని అదుపులో పెట్టుకో!"
    మరి మాట్లాడలేదు నిర్మల.
    అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళే నిర్మల అక్కడికీ వెళ్ళటంలేదు. ఆమె చేడు ఊహలకు దోహదంచేసిన సంఘటనకూడా ఉంది.
    పక్క ఇంటి సర్వేయరు గారి భార్య నిర్మలను సినిమాకు వెళదాం రమ్మని బలవంతం చేసింది ఒక రోజు. తను రాననే అన్నది.
    "వారితో చెప్పలేదు. ఇంటికి తాళంవేసి మనం వెళితే వచ్చి కంగారుపడతారు. రేపు వెళదాం లెండి."
    ఎన్ని సాకులు చెప్పినా తప్పలేదు.
    అదేరోజు విశ్వం, సునీత, నీలకంఠం దంపతులు, రాధ. వేణుకూడా వచ్చారు. అందరికీ మధ్య సునీత, విశ్వం కూర్చున్నారు. పైన బాల్కనీలో ముందు వరసలో కూర్చున్నవాళ్ళు నిర్మల కంట బడ్డారు. విశ్వం పక్కన సునీతను చూసిన నిర్మల అట్టుడికినట్లయింది. పైగా అతనివైపు చూస్తూ ఏదో చెప్పి నవ్వటం .... నిర్మల సహించలేకపోయింది. వాళ్ళు తనను గమనిస్తారేమోనని తల వంచుకుంది. దీపాలు మలిగి సినిమా మొదలయినా నిర్మల సినిమా చూడలేక పోయింది. తల నొస్తున్నది, ఇంటికి వెళతానంది, సర్వేయరు గారి భార్య ఎంత చెప్పినా వినకుండా. ఇంటర్వెల్ కాకముందే ఇల్లు చేరుకుంది.
    సునీత అంటే ఉన్న సదభిప్రాయం కాస్తా దురభి ప్రాయమయింది.
    విశ్వానికీ, సునీతకూ తన పెళ్ళికాని రోజుల్లో ఏదో సంబంధం ఉండి ఉంటుందనీ, విశ్వమేగాక వేణు, నీల కంఠం కూడా ఆమె వలలో పడ్డ పక్షులేననీ, లేకపోతే ఇంత స్నేహంగా మెలగటం జరిగేపని కాదనీ ఆమె ఊహ! అంత పెద్ద కాలేజీలో చదివిన విశ్వానికీ, ఒక్క సునీతే ఎందుకు జ్ఞాపకం ఉండాలి? ఒక్క ఆమె స్నేహమే ఎందుకు కలగాలి? ఇతర ఆడస్నేహితులెందుకు లేరు?
    పరాయి స్త్రీలతో తన భర్త చనువుగా మెలిగితే, స్త్రీ ఎంత అసహనంగా ఉంటుందో ఆ అసహనం ఆమెలో ఆవేశించింది.      
    వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక మాట అనకుండా వదలదు.
    ఉదయం చారులో ఉప్పు తక్కువయింది. "రోజుకు రోజు కసురు పెక్కువవుతూంది. చారులో ఉప్పు వేశారా రాణీగారు?"
    దీర్ఘం తీస్తూ, "ఊఁ, ఇష్టమైన రాణీగారు వెయ్యకున్నా అమృతంలాగే తింటారు" అంది.
    విసురుగా పళ్లాన్ని ముందుకు తోసి వెళ్ళి పంపు దగ్గిర చెయ్యి కడుక్కున్నాడు. బట్టలు వేసుకుని వెళుతూంటే వెనక ఉండి నిర్మల అన్నది-"హోటల్లో అయినా తినండి" అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS