Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 39


    "నీ దగ్గరే కూర్చుంటాను...."
    "వద్దు పాపాయమ్మగారింట్లో ఆంజనేయుడున్నాడు. అక్కడికి వెళ్ళివస్తే నిన్నె దెయ్యాలూ బాధించవు......నా మాట విని కాసేపు ఆదుకుని రా...."
    ఏమనుకున్నాడో గోపి పక్కింటికి వెళ్ళిపోయాడు. సరళ తలుపులువేసి గోపి గదిలోకి వెళ్ళి - "రాజూ!" అని గంభీరంగా పిలిచింది.
    "నువ్వు పిలుస్తావని నాకు తెలుసు...." అని వినిపించిందో గొంతు.
    "ఇన్నాళ్ళూ ఏమైపోయావు?"
    "మనకోసం బంగళాలో మంచి ఏర్పాట్లుచేశాను. నిన్న రాత్రే తిరిగి వచ్చాను."
    "ఇప్పుడు నువ్వు చేసిన పని యేమీ బాగోలేదు...." అంది సరళ.
    "నేనేం చేశానమ్మా?"
    "గోపీ నెందుకు భయపెట్టావు?"
    "వాడు నా మంచంమీద పడుకున్నాడు. నా గదిలో వుంటున్నాడు. నా బీరువా వాడుకుంటున్నాడు. నా బట్టలు వేసుకుంటున్నాడు-"
    "అవన్నీ నీకిప్పుడవసరంలేదు కదా!"
    "లేకపోయినా సరే-అవి నావి...."
    "చాలా తప్పు రాజూ! మనకు పనికిరాని వస్తువులు ఇతరుల ప్రయోజనాలకుపయోగపడితే చూసి సంతోషించాలి నువ్వు..."
    "అయితే ఇంతకాలం నువ్వా బీరువాని వేరే పనికెందుకు వాడలేదు? నా మంచాన్ని వేరే ఎవ్వరికీ యెందుకివ్వలేదు? నా బట్టలు పేద బాలురకెందుకు పంచిపెట్టలేదు?"
    సరళ తడబడుతూ-"అవన్నీ నీ జ్ఞాపకంగా వుంచుకోవాలనుకొన్నాను-" అంది.
    "మరిప్పుడెందుకుంచుకోవడంలేదు?"
    సరళ మాట్లాడలేదు.
    "చెప్పమ్మా?"
    "గోపీ అవన్నీ వాడుకొంటే నీకు కష్టమేముంది?"
    "నష్టమేమీ లేదు....కానీ..."
    "ఊఁ.....చెప్పు...."
    "వాడు నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడు...."
    "అయితే?"
    "నువ్వు రాత్రి కాసేపు వాడి పక్కలో పడుకొన్నావు....
    "అయితే?"
    "ఇందాకా భయపడితే వాణ్ణి దగ్గరగా తీసుకొన్నావు..."
    "అందులో తప్పేముంది?"
    "నువ్వలా ఎందుకు చేయాలి?"
    "పాపం - వాడు వాళ్ళమ్మ దగ్గరే వుండేవాడు. అప్పుడు వాళ్ళమ్మయివన్నీ చేసేది. వాళ్ళకు డబ్బులేదు కదా - అందుకని వాడికి తిండి పెట్టలేక మనింటికి పంపారు. ఇప్పుడు వాన్నెవరలా చూస్తారు..? నేనే చూడాలి కదా!" అంది సరళ.
    "నువ్వు వాడినలా చూస్తే నాకు నచ్చదు..."
    "ఎందుకని?"
    "నువ్వు నాకు మాత్రమే అమ్మవు. గోపీకి కాదు.."
    "తప్పు..అలా అనకూడదు.."
    "ముందే చెబుతున్నాను. మామూలుగా యే చుట్టాలబ్బాయిలాగో వుంటే ఫరవాలేదు. నువ్వు నన్ను చూసినట్లే గోపీని చూశావంటే నేను సహించను. వాణ్ణి భయపెట్టి తరిమేస్తాను.."
    "రాజా.."
    "ఇంక నీతో మాట్లాడను..నువ్వు ముందు నాన్నను నా దగ్గరకు రావడానికొప్పించు..." అందా గొంతు.
    "నువ్వు గోపీ జోలికి వెడితే నేను నీ దగ్గరకు రాను."
    "నేను గోపీ జోలికి వెళ్ళకపోతే నువ్వు నన్ను మర్చిపోతావు నువ్వు మర్చిపోతే నేను భరించలేను..."
    "రాజూ-ఏమిట్రా యిది?"
    "ఇంక నేను మాట్లాడను. అవతల మనం కలిసుండడానికి నేనెన్నో యేర్పాట్లు చేస్తున్నాను. నువ్వేమో ఇంకెవన్నో తెచ్చి యింట్లో పెట్టుకొని నన్ను మర్చిపోవాలనుకొంటున్నావు. కానీ నేను నిన్ను మర్చిపోనివ్వను. గోపీనింట్లోంచి తరిమేస్తాను..."
    సరళ మ్రాన్పడిపోయింది.
    
                                      6

    కూరలు తీసుకొని వచ్చేక వరప్రసాద్ భార్య నోట జరిగినదంతా విని-"సరళా-నీ భ్రమ చాలాదూరం వెళ్ళింది-...." అన్నాడు.
    "నా భ్రమేమిటి? భయపడింది నేనుకాదు.....గోపీ!" అంది సరళ.
    "అసలు విషయం నేను చెబుతున్నాను. విని ఖంగారు పడకూడదు...." అన్నాడు వరప్రసాద్ సాలోచనగా.
    "ఏమిటండీ-ఆ అసలు విషయం?" అంది సరళ.
    "జాగ్రత్తగా విను. సావధానంగా ఆలోచించు. అంతే తప్ప - కాదని బుకాయించకు..." అన్నాడు వరప్రసాద్.
    "ఏమిటో చెప్పండీ...." అంది సరళ ఖంగారుగా.
    "గోపీ మనింట్లో వుండడం నీకిష్టంలేదు. అందుకని నువ్వే వాడిని దెయ్యం పేరు చెప్పి హడలగొట్టావు...." అన్నాడు వరప్రసాద్.
    ఈ ఆరోపణకు సరళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి-"రామరామ! పసివాన్ని నేనెందుకు బెదిరిస్తాను? నాకు గోపీ ఒకటి రాజు ఒకటీనా?" అంది.
    "అది నిజమే కానీ అంతరాంతరాల్లో నీకు తెలియకుండా దాగివున్న భావమది. ఒకోసారి నువ్వు చేసేవన్నీ నీకు తెలియవు. రాజునింకా మనసులోంచి తుడిచిపెట్టలేకపోతున్నావు. గోపీని పెంచుకోవాలనీ వుంది. కానీ రాజు పొందవలసిన సుఖసంతోషాలు గోపీ పొందుతూంటే నీలోని తల్లి మనసు సహించలేకపోతోంది. నువ్వు రాజును చూసి మాట్లాడ్డం నీ భ్రమ. గోపీని నీకు తెలియకుండా నువ్వే భయపెట్టావు. నువ్వు వాణ్ణి పొమ్మనలేవు. వాడే యిక్కడుండనని గోలపెట్టి వెళ్ళిపోవాలి. అదీ నీ ఎత్తు...."
    "అయితే రంగమ్మనీ పాపాయమ్మనీకూడా నేనే బెదిరించానా?"
    "అవును-అందర్నీ నువ్వే బెదిరించావు. ఈ ఇంట్లో లేని దెయ్యాన్ని వున్నట్లు భ్రమ కలిగించడానికి తాపత్రయపడుతున్నావు..."
    "అనండి....ఎన్నైనా అవండి.....నేను నేరస్థురాలిని."
    "సరళా!" అనునయంగా అన్నాడు వరప్రసాద్ - "నేను నిన్ను తప్పుపట్టడంలేదు. నేరస్థురాలిని చేయడం లేదు. ఈ విషయం బాగా ఆలోచించు. నీ మెదడును నువ్వే అదుపు చేసుకో ఒకసారి నీ మెదడు నీకు లొంగిందా -అప్పుడు నువ్వు గోపీలో రాజును చూడగల్గుతావు. జీవితం సుఖంగా వుంటుంది!"
    "మిమ్మల్నెలా నమ్మించాలో నాకు తెలియడంలేదు" అంది సరళ అసహాయంగా.
    "నన్ను నమ్మించడానికొక్కటే మార్గముంది. ఒక్కసారి రాజును నాకు కనపడమను-" అన్నాడు వరప్రసాద్.
    "వాడు మీకు కనపడడు-" అంది సరళ.
    "ఎందుకని?"
    "ఎందుకో నాకు తెలియదు. కానీ ఒక విషయం చెబుతాను. నన్ను నమ్మండి. రాజు నిజంగా నాతో మాట్లాడుతున్నాడు వాడు గోపీకి అపకారం తలపెడతాడు. గోపీకేదైనా జరిగితే మీరది నాకే అంటగట్టే లాగున్నారు. నిజం చెబుతున్నాను. గోపీని నేను కన్నతల్లిలాగే ప్రేమిస్తున్నాను. వాడిని నేను కావాలన్నా ద్వేషించలేను...." అంది సరళ.
    వరప్రసాద్ ఇంకేదో అనబోయాడు కానీ సరళ వున్నపళంగా కూర్చుని ఏడుపు ప్రారంభించింది.
    "ఏడవకు సరళా! నాకు నీ మంచితనం తెలుసు......నా మాటలు నువ్వపాధం చేసుకొన్నావు...." అంటూ వరప్రసాద్ ఆమెకు దగ్గరయ్యాడు.
    "మీరు నన్నపార్ధం చేసుకున్నారని నాకు బాధ లేదు. కానీ గోపీ యిప్పుడు ప్రమాదంలో వున్నాడు. నా మాట విని వాణ్ణి రక్షించే ఉపాయం చూడండి" అంది సరళ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS