Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 38


    ముకుందరావనగానే అర్ధమయింది సరళకు.
    ఆయనకు ఎనమండుగురు పిల్లలు. అయిదుగురు మగపిల్లలు ముగ్గురాడపిల్లలు. పదేళ్ళ వాళ్ళబ్బాయి గోపిని వరప్రసాద్ కు పెంపకంగా యివ్వాలనుకుంటున్నాడు. అందుకు కొంత డబ్బిస్తాడాయనకు వరప్రసాద్ ఆ డబ్బుతో కూతురి పెళ్ళి చేయాలని ఆయన తాపత్రయం.
    గోపి అచ్చం రాజులా వుంటాడని ఆయనంటాడు కానీ సరళకలా అనిపించలేదు. అయితే గోపికి-సరళింటికి వెళ్ళిపోవాలనుంది. అంతమంది పిల్లల మధ్య తనకు భవిష్యత్తు లేదని వాడి పసిహృదయానికర్ధమైపోయింది. ఒకరిద్దరు మాత్రమే పిల్లలున్న యింట్లో వాళ్ళెలా పెరుగుతారో వాడు కళ్ళారా చూసి వున్నాడు.
    పెంపకం మాటలు తేల్చేయాలనుకుంటూండగా సరళ జడుసుకొని మంచంపట్టింది. ఆ విధంగా కొంత వాయిదా పడ్డాక యిప్పుడు ముకుందరావు మళ్ళీ ఫోన్ చేశాడు.
    "ఏమంటారు?"
    "త్వరగా యేదో ఒకటి తేల్చి చెప్పమన్నాడు. లేకుంటే వాళ్ళబ్బాయి నింకెవరికైనా పెంపకానికిచ్చే స్తాట్ట...."
    "ఇచ్చేయమనండి-" అంది సరళ.
    "అనేయడం సులభమే! కానీ మనకు గోపీలాంటి కుర్రాడు దొరకడు. వాడిలో పోయిన మన రాజును చూసుకోవచ్చు. మన రాజులాగే వాడెంతో బుద్దిమంతుడు కూడా!"
    "అవును కానీ రాజే మనకు దొరుకుతూంటే-వేరే ఎవరో ఎందుకు?"
    "అంతా నీ భ్రమ! రాజు మనకు దొరికితే-గోపీ లోనే దొరకాలి!"
    సరళ ఆలోచనలో పడింది.
    "సరళా! గోపి పరిస్థితిచూస్తే నాకు ముకుందరావు గారంటే అసహ్యం కలిగింది. ఈ రోజుల్లో చాలీచాలని ఆదాయంతో ఆయన అంతమంది బిడ్డల్నెందుకు కనాలి? ఇప్పుడా తల్లిదండ్రులు ప్రతిరోజూ బిడ్డల్ని విసుక్కుంటూనే వుంటారు.....బయటివాళ్ళు చూస్తూండగా తిడితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారనికూడా లేదు...."
    "అంతే లెండి! అలాంటి వాళ్ళకే దేవుడూ పిల్లల్నిస్తాడు. మనకెందుకు పిల్లలు లేకుండా పోయారో నాకిప్పటికీ అర్ధంకాదు. తప్పు మనుషులది కాదు- దేవుడిదే!"
    "నేను గోపీతో మాటల్డాను. వాడికి మనింటికి వచ్చి వుండాలని వుంది....."
    "ఎందుకుట?"
    "ముందు మొహమాటపడ్డాడు కానీ తర్వాత ఒకొక్కటే చెప్పాడు. వాడికి మంచి బట్టలు వేసుకోవాలనుంది. కాళ్ళకు కొత్త జోళ్ళు వేసుకోవాలనుంది. వాళ్ళ నాన్నయితే అసలు కాళ్ళకు జోళ్ళే వద్దంటాడుట...... మా వాడికి రోజూ కడుపునిండా భోంచేయాలనుంది."
    "ఊఁ"
    "అన్నట్లు-వాడు జిలేబీ తిని రెండేళ్ళయిందట...."
    "అయితే?"
    "జిలేబీ అంటే వాడికెంతో యిష్టం...."
    "పాపం...."
    "పాపమని ఊరుకుంటా వేమిటి సరళా - మర్చి పోయావా? మన రాజుకి జిలేబీ అంటే ఎంత ఇష్టం?"
    సరళ ఉలిక్కిపడి - "ఏమన్నారూ? గోపీకి జిలేబీ యిష్టమా-రెండేళ్ళ నుంచి వాడది తినలేదా?" అంది.
    "అవును - సరళా!"
    "అయితే పదండి - మనమిప్పుడే ముకుందరావు గారింటికి బయల్దేరి వెడదాం - గోపీని త్వరగా మనింటికి తెచ్చుకుందాం...." అంది సరళ. ఆమె కనులలో గోపీకి జిలేబీచేసి పెట్టాలన్న ఆత్రుత చూసి - "తల్లి మనసు ఎంత గొప్పది?" అనుకున్నాడు వరప్రసాద్.

                                      5

    చాలా సింపుల్ గా పెంపకం అయిపోయింది.
    గోపి వరప్రసాద్ ఇంటికి వచ్చేశాడు.
    వాడికిప్పుడు కొత్త బట్టలు, బూట్లు, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు....
    ఇంట్లో వాడికి ప్రత్యేకంగా ఒక గది.....మంచం......బీరువా....
    అవన్నీ రాజువి....
    ఇప్పుడు గోపివి.....
    గోపి తన కొత్త హోదాను చూసుకొని మురిసిపోతున్నాడు.
    వాడికి తల్లిదండ్రుల్ని వదిలి వచ్చానన్న బెంగలేదు ఆ యింట్లో వాడు సదుపాయాలెరుగడు. అభిమానం ఎరుగడు. అడిగినదేమీ దొరికేదికాదు. అ స్తమానూ పనివుండేది. ఆడుకుందుక్కూడా తీరుబడి దొరికేదికాదు.
    గోపి తల్లిదండ్రులు వాడిని ప్రేమించకపోలేదు. బాధ్యతల బరువులో తమ ప్రేమను ప్రకటించే అవకాశం కూడా లేదు వారికి.
    సరళ గోపీలో రాజును చూసింది. ఆమెలోని మాతృప్రేమ ఉప్పొంగి, అందులో తలమునకలై ఉక్కిరిబిక్కిరయ్యాడు వాడు. అయినా వాడికి సంతోషంగానే వుంది.
    అన్నీ యిచ్చే నాన్న.....అభిమానించే అమ్మ.....ఆడుకుందుకు బోలెడు టైము.....బడిలో సాటి విద్యార్ధుల మధ్య గర్వంగా తలెత్తుకు నిలబడగల హోదా.....
    ఏ పిల్లలైనా యింతకుమించి కోరుకునేదేమిటి?
    అలా వారం రోజులు గడిచాయి.
    ఆ రోజు ఆదివారం.
    వరప్రసాద్ కూరలు తెస్తానని బజారుకు వెళ్ళాడు.
    గోపి హోంవర్కు చేసుకుంటున్నాడు తన గదిలో.
    సరళ వంటింట్లో వంట ప్రయత్నాలు చేస్తోంది.
    అప్పుడామెకు వినపడింది-ఉన్నట్లుండి-హృదయ విదారకమైన కేక....
    ఉన్నపళంగా సరళ ఆ కేకవచ్చిన వైపు పరుగెత్తింది.
    గదిలో గోపి లేచి నిలబడి వున్నాడు. వాడు గజగజ వణికిపోతున్నాడు.
    "ఏమయింది గోపీ?" అంది సరళ.
    కాసేపు గోపికి నోట మాట రాలేదు.
    "ఏమయిందిరా?" అంటూ ఆమె వాడిని సమీపించి దగ్గరగా తీసుకుంది.
    ఆమె ఒడిలో త్వరగానే తేరుకున్నాడు గోపి.
    "దెయ్యం!" అన్నాడు వాడు.
    "దెయ్యమా-ఎక్కడ?" అందామె.
    "ఇంగ్లీషు హోం వర్కయిపోయింది. ఆ పుస్తకాలు బీరువాలో పెట్టి లెక్కల పుస్తకం తెచ్చుకుందామనుకున్నాను. తలెత్తిచూస్తే బీరువా తలపులకు అడ్డంగా నిలబడి వుంది దెయ్యం!"
    "ఛీ-దెయ్యాల నేవి మన భ్రమ.....అ వెక్కడా వుండవు...."
    "కానీ నేను చూశానమ్మా!" అన్నాడు గోపీ.
    "చూస్తే-ఎలా వుంది దెయ్యం?"
    "పొట్టిగా ఉంది. నా అంత ఎత్తే వుంది!"
    సరళ ఉలిక్కిపడింది.
    రాజు నిజంగా దెయ్యమయ్యాడా?    
    "దెయ్యాన్ని చూసి యెందుకు భయపడ్డావు? నువ్వు పిరికివాడివా?"
    "నేను భయపడలేదు. అదే నన్ను భయపెట్టింది......."
    "భయపెట్టిందా.....ఎలా?"
    "ఎర్రటి గుడ్లు....గాలిలో తేలిపోతున్నట్లుంది......అస్పష్టంగా వుంది ఆకారం......నేను తనవైపు చూడగానే నాలిక పొడుగ్గా చాపింది.....అంతే....నాకు భయంవేసింది...."
    సరళ ముఖం గంభీరంగా అయిపోయింది-"గోపీ! నువ్వనవసరంగా భయపడ్డావు. కాసేపు పక్కింటి పాపాయమ్మగారింటికి వెళ్ళి ఆడుకునిరా.....భయం తగ్గుతుంది. దెయ్యాన్ని చూశానని పాపాయమ్మగారికి చెప్పకు...."
    "నేనిప్పుడు ఆడుకోనమ్మా...."
    "మరేం చేస్తావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS