Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 37


    "ఇదేం పరీక్ష? నాన్న నా మాటలు నమ్మాలంటే నువ్వూ ఆయనకు కనిపించాలి. లేకుంటే నేనాయన్నెలా ఒప్పించగలను?"
    "అదంతా నాకు తెలియదు...."
    "నువ్వు మమ్మల్నెక్కడికి తీసుకొని వెడతావు?"
    "అమ్మా-అది చాలా పెద్ద బంగళా.....ఎంత విశాలంగా వుంటుందో.....అందులో నువ్వూ, నేనూ, నాన్నా తప్ప యింకెవ్వరూ వుండం....."
    "ఆ బంగళా ఎక్కడుంది?"
    "అప్పుడే చెప్పను. నువ్వు ముందు నాన్నను ఒప్పించు...."
    సరళ యేదో అనబోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    "అమ్మా-నాకు సెలవిప్పించు...."
    సరళ ఆశ్చర్యంగా చుట్టూ చూసింది.
    ఇంతసేపూ తనకేదో మైకం కమ్మినట్లయింది. తానెవరితో మాట్లాడింది?
    మళ్ళీ ఆమెకు వళ్ళు జలదరించింది. భయం మనసును కమ్ముకోబోయింది. కానీ తనతో మాట్లాడినది.....తన రక్తం పంచుకు పుట్టిన బాబు.....
    వాడికి తను భయపడడమా?
    కాలింగ్ బెల్ మళ్ళీ మ్రోగింది.
    సరళ లేచి వెళ్ళి తలుపుతీసింది.
    పక్కింటి పాపాయమ్మ!
    "ఏంటమ్మా-నిద్రపోతున్నావా? తలుపుతీయడానికింతసేపా?" అందామె నిష్ఠూరంగా.
    ఆమె ప్రశ్నకు బదులుగా చిన్నగా నవ్వింది సరళ "రండి - లోపలకు-" అంది మర్యాదగా. ఇద్దరూ లోపలకు వెళ్ళి కూర్చున్నాక-"ఏమీ అనుకోకమ్మా నాకు కూర్చునే టైము లేదు. అర్జంటుగా రెండుసోలల బోంబేరవ్వ కావాలి ...." అంది.
    పాపాయమ్మ యెప్పుడూ అప్పుకోసమే వస్తుందని సరళకు తెలుసు. అందుకని ఆమె మాట్లాడకుండా లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్టీలుడబ్బా మూత తెరిచిచూసింది బోంబేరవ్వ డబ్బాలో సగానికిపైగా వుంది. ఓ కాగితం సంచీ తీసుకొని అందులోకి రెండు సోలలు కొలిచి పోసింది. తిరిగి స్టీలు డబ్బా మూతపెడుతూ ఉలిక్కిపడింది.
    అప్పుడే ఆమెకు వినిపించింది-హృదయవిదారకమైన కేక!
    వున్నపళంగా లేచి అటుగా వెళ్ళిందామె.
    పాపాయమ్మ నిలబడి వుంది. ఆమె గజగజ వణికిపోతోంది.
    "ఏమయిందండీ?" అంది సరళ.
    పాపాయమ్మ తమాయించుకోవడానికి కాసేపుపట్టింది. సరళను చూసి ఆమె-"అబ్బే-ఏమీలేదు...." ఏమీలేదు" అంది.
    "మీరేకదా-గట్టిగా అరిచారు.....?" అంది సరళ.
    "ఊఁ"
    "ఎందుకు?"
    "ఏమిటో చెప్పలేను....ఎందుకో జడుసుకున్నాను..."
    "ఏమైనా చూశారా?"
    పాపాయమ్మ క్షణం తటపటాయించి - "లేదు!" అంది.
    సరళకు అనుమానం వచ్చింది. కొంతకాలం క్రితం రంగమ్మకూడా యిలాగే కేకపెట్టింది. అందుక్కారణం తనకు రాజు చెప్పాడు.
    ఇప్పుడు పాపాయమ్మ రాజును చూసిందా?
    వాడంత భయంకరంగా వున్నాడా?
    "కూర్చోండి-రవ్వ తెస్తాను...." అంది సరళ.
    "పద - నేనూ వంటింట్లోకి వస్తాను...." అంది పాపాయమ్మ.
    ఆమె ఒంటరిగా అక్కడ కూర్చునేందుకు భయపడుతోందని సరళ కర్ధమయింది. ఆమె రవ్వ యిచ్చి పాపాయమ్మను పంపేసేక-"రాజూ!" అని గట్టిగా పిలిచింది.
    "పిలిచావా అమ్మా?"
    సరళ ఆశ్చర్యంగా-"పిలిస్తే పలుకుతావా నువ్వు?" అంది.
    "నువ్వెప్పుడు పిల్చినా పలుకుతాను. నా పలుకులు నీకు మాత్రమే వినిపిస్తాయి. ఇంకెవ్వరికీ వినిపించవు...."
    "పాపాయమ్మకు కనిపించి బెదిరించావా?"
    "బెదిరించలేదు. కనిపించాను...."
    "ఎందుకు"
    "నేను వాళ్ళింటికెళ్ళినప్పుడల్లా యే తలుపుచాటునొ దాక్కుని నన్ను భయపెట్టేది. నేను భయపడితే పిరికివెధవని గేలిచేసేది. ఆవిడ ధైర్యం ఏపాటిదో నాకిప్పుడు తెలిసిపోయింది-" ఆ గొంతులో నవ్వు ధ్వనించింది.
    "పెద్దవాళ్ళను బెదిరించడం తప్పుకదూ!" అంది సరళ.
    "తప్పే!"
    "మరెందుకిలా చేశావు?"
    "ఎందుకు చేశానంటే....?"
    "ఊఁ సందేహించకు.... చెప్పు!"
    "నువ్వు మళ్ళీ భ్రమ అనుకోకుండా! నాతో మాట్లాడినదంతా భ్రమ అని నువ్వనుకుంటే - ఎప్పటికీ నా దగ్గరకు రావాలనుకోవు.....! నువ్వు భ్రమపడలేదనడానికి పాపాయమ్మగారే యిప్పుడు సాక్ష్యం!"
    సరళ నిట్టూర్చి - "ఒక్కసారి ..... ఒక్కసారంటే ఒక్కసారి నాకు కనిపించరా - నాకు చూడాలనుంది!" అంది.
    "నువ్వు చూడాలనుకునే రూపం నాకిప్పుడు లేదు. ఇప్పుడు నాకున్న రూపాన్ని నీకు చూపలేను...."
    "మరి మనం కలిసి ఉండాలంటే ఎలా?"
    "చెప్పానుగా - నాన్నను తీసుకొని నా దగ్గర కొచ్చేయమని!"
    "అప్పుడు మాత్రం నేను నిన్ను చూస్తే భయపడనా?"
    "భయపడవు అదంతా తర్వాత చెబుతానుగానీ నాకిక సెలవిప్పించు....బంగళాకు వెళ్ళాలి...."
    "రాజూ!" అంది సరళ.
    ఆమెకు బదులు రాలేదు.

                                     4

    సాయంత్రం భర్త ఆఫీసునుంచి రాగానే జరిగింది చెప్పింది సరళ. వరప్రసాద్ చటుక్కున ఆమె నుదుటి మీద చేయివేసి చూసి - "హమ్మయ్య! నీకు జ్వరం రాలేదు-" అంటూ తేలికగా నిట్టూర్చాడు.
    "నేనిక భయపడనండీ-భయపడితే రాజు చిన్నబుచ్చుకుంటాడు...."
    "ఇంకెక్కడి రాజు సరళా?" అన్నాడు వరప్రసాద్ బాధగా.
    "మనం రాజుతో కలిసుండే అవకాశముందండీ- నా మాట వినండి మనం వాడి దగ్గరకు వెళ్ళిపోదాం. వాడు మనకోసం పెద్ద బంగళా చూసి వుంచాడు..."
    "నీకు పిచ్చిపట్టలేదుగదా-చచ్చిపోయిన రాజు మన కోసం బంగళా చూసివుంచడమేమిటి?"
    "ఏమో-నేను చెబుతున్నది నిజం...."
    "నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. వాణ్ణి నాతో కూడా ఒకసారి మాట్లాడమను-" వేళాకోళంగా అన్నాడు వరప్రసాద్.
    "వాడు చెప్పనే చెప్పాడు-మీతో మాట్లాడనని!"
    "నువ్వు భ్రమపడుతున్నావనడంలో సందేహంలేదు. కానీ నీ భ్రమలో తెలివి వుంది-" అన్నాడు వరప్రసాద్.
    "ఒక్కసారి ఒప్పుకోండి. మనం వాడి దగ్గరకు వెళ్ళి వుండొచ్చు....."
    "మనం వాడిదగ్గర కెందుకూ వెళ్ళడం? వాడే మనతో కలిసుండొచ్చుగా...."
    సరళ ఆలోచనలో పడింది.
    "సరళా! ఈసారి నీతో వాడు మాట్లాడితే చెప్పు. నాకు చెప్పలేకపోయినా వాణ్ణి మన దగ్గరకు వచ్చేయమను..." అని - "ఈ వేళ ఆఫీసుకు ఫోనొచ్చింది. ముకుందరావుగారు మాట్లాడేరు...." అన్నాడు వరప్రసాద్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS