Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 36


    వరప్రసాద్ ఒక్క ఉదుటున ఆ గదిలోకి వచ్చి "ఏమిటన్నావ్?" అనడిగాడు.
    సరళ అతడికి జరిగినదంతా చెప్పింది. అంతా విని వరప్రసాద్ నవ్వి-"చనిపోయినవాడు మళ్ళీ కనిపించడమేమిటి? నువ్వు భ్రమపడుతున్నావు...." అన్నాడు.
    "భ్రమకాదు-నిజం-" అంది సరళ.
    "అయితే ఏడీ వాడు?"
    సరళ-"రాజా!" అని గట్టిగా పిలిచింది.
    ఎవరూ పలకలేదు.
    ఆత్రుతగా గదంతా కలయతిరిగింది.
    ఎవరూ కనపడలేదు.
    "నువ్వు భ్రమపడ్డావు సరళా!" అన్నాడు ప్రసాద్.
    అప్పటికి సరళ యీ లోకంలోకి వచ్చింది. భ్రమపడలేదని ఆమెకు తెలుసు కానీ అంతసేపూ తను మానవాతీతశక్తితో మాట్లాడేనన్న స్పృహ ఆమెకు కలిగింది.
    తనతో మాట్లాడినది కన్నకొడుకే కావచ్చు. కానీ వాడు మనిషి కాదు.
    సరళ కెవ్వున కేకపెట్టింది.
    "ఏమయింది సరళా?" అంటూ వరప్రసాద్ ఆమెను సమీపించాడు.
    అప్పటికే ఆమెకు స్పృహ తప్పింది. వళ్ళు ముట్టుకుని చూస్తే సలసల కాగిపోతోంది.
    
                                    2

    సరళ మామూలు మనిషి కావడానికి నలుగురోజులు పట్టింది. ఈ నాలుగు రోజుల్లోనూ ఆమె బాగా చిక్కిపోయింది. ఆమెకంటే యెక్కువగా చిక్కిపోయాడు వరప్రసాద్.
    సరళ యే పరిస్థితుల్లో జ్వరపడిందీ తెలుసుకున్నాక ఆమెను చూడవచ్చిన డాక్టరు-"ఎందుకైనా మంచిది? మానసిక వైద్యుడికికూడా చూపించండి-" అన్నాడు.
    ఆ విధంగా వరప్రసాద్ సీతాకరరావును కలుసుకున్నాడు. ఆయన ఆ ఊరిలో పేరుపడ్డ మానసిక నిపుణుడు విషయం విని-"నేను ఫలానా అని మీ భార్యకు చెప్పవద్దు-" అన్నాడాయన. సరేనన్నాడు వరప్రసాద్.
    సీతాకరరావు వరప్రసాద్ కు దూరపు బంధువునని చెప్పి యింట్లో ప్రవేశించి ఆమెతో కబుర్లు ప్రారంభించాడు.
    ఒక రోజంతా ఆయన చెప్పిన సరదా కబుర్లు సరళకు మానసికోల్లాసాన్ని కలిగించాయి. తర్వాత ఆయన నెమ్మదిగా సరళ పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు.
    వివాహమైన రెండేళ్ళకు సరళకు రాజు పుట్టాడు. పురిటి సమయంలో వచ్చిన కాంప్లికేషన్స్ కారణంగా ఆమెకు మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. రాజు ఆ దంపతులకు ప్రాణం. పదేళ్ళు మాత్రం జీవించాడు వాడు. అతి విరేచనాలతో సుమారు సంవత్సరం క్రితం వాడు చచ్చిపోయాడు. వాడికోసం దంపతులిద్దరూ బెంగపెట్టుకొని యెంతగానో ఏడ్చారు. క్రమంగా మనసు చిక్కబట్టుకున్నారు. ఇటీవలే ఓ కుర్రాడిని పెంపకానికి తీసుకోవాలనుకున్నారు. ఆ విషయమై మాట్లాడాలనుకున్న రోజునే ఈ విశేషం జరిగింది.
    సీతాకరరావు సరళతో - "మన మనసు మనకంటే బలమైనది. అంతర్గంతంగా మనసులో వున్న ఆలోచనలు నిజాలుగా కళ్ళక్కట్టినట్లు కనబడుతూంటాయోకోసారి. ఇలా చాలామందికి జరిగింది. నువ్వు నీ బిడ్డకు ప్రాణాధికంగా ప్రేమించావు. ఆ బిడ్డ స్థానంలో వేరొకరిని ప్రవేశపెడుతూంటే బాధనిపించింది. నీ బాబు బాధపడుతున్నట్లు భ్రమకలిగింది. అంతకు ముందురోజు పనిమనిషి భయపడినదానికీ దీనికీ నీ మనసు అన్వయించుకుంది. ఆ విధమైన ఆలోచనే.....నువ్వు నీ బాబుతో మాట్లాడిన సంభాషణ రూపం ధరించింది......నువ్వుభయపడకు....." అన్నాడు.
    "నిజంగా అంతే జరిగిందంటారా?" అంది సరళ ఆశ్చర్యంగా.
    "ఇలాంటివి చాలా తెలుసు నాకు. నిజంగా అంతే జరిగింది."
    "మళ్ళీ నాకు బాబు కనపడడా?"
    "నీ మనసును నువ్వు అదుపు చేసుకుంటే బాబు నీకు కనపడడు..."
    "అందుకు నేనేం చేయాలి?"
    "కొత్తగా యింటికి తెచ్చుకుంటున్న కుర్రాడిని నీ బాబనే అనుకోవాలి. అతడిలో నువ్వు నీ రాజుని చూడాలి-...." అన్నాడు సీతాకరరావు.
    "అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ నా అనుభవం భ్రమగా నాకు తోచడంలేదు. ఒకవేళ మళ్ళీ రాజు నాకు కనబడితే ఏం చేయాలి?"
    "రాజును చూడ్డానికి నీ మనసు సిద్దంగా లేదు. అందుకే నువ్వతడి మాటలు విన్నావు తప్ప చూడలేదు. రాజు నీకు కనబడడు. నువ్వు నీ మనసు నదుపుచేసుకో."
    "కనబడితే ఏం చేయాలి?"
    "ఒక్క విషయం......నిజంగా రాజు మళ్ళీ నీ ఎదుటకు వచ్చినా అతడు నీతో మాట్లాడతాడు తప్ప కనబడడు. అప్పుడు మాత్రం నువ్వతన్ని తలుచుకొని భయపడకు...."
    "భయంవేస్తే?" అంది సరళ. అప్పటికే ఆమె వళ్ళు జలదరించింది.
    "రాజు నీ కన్నకొడుకు. అతడు నీకెన్నడూ అపకారం తలపెట్టడు. దురదృష్టం మీ యిద్దర్నీ విడదీసింది అంతమాత్రాన మీరు శత్రువులైపొరు గదా! నువ్వు తనకు భయపడితే రాజు పసిహృదయం యెంతగానో నొచ్చుకుంటుంది. నువ్వతడిని ఎప్పటి నీ కొడుకులాగే భావించాలి. గుర్తుంచుకో!" అన్నాడు సీతాకరరావు.
    "ప్రయత్నిస్తాను...." అంది సరళ.
    "నీకా అవసరముండకపోవచ్చు రాజు మళ్ళీ నీకు కనపడడని నా నమ్మకం. ఇన్ని రోజులుగా నువ్వు మంచంపట్టావు. ఏదో ఒకరోజున నీతో వచ్చి మాట్లాడి యోగక్షేమాలు విచారించి వెళ్ళేవాడు-రాజు నిజంగా యింకా యీ యింట్లో ఉండివుంటే!" అన్నాడు సీతాకరరావు.
    సరళ నిట్టూర్చింది.
    ఆ రోజే సీతాకరరావు సెలవు తీసుకున్నాడు.

                                    3

    "అమ్మా!"
    ఉలిక్కిపడి లేచికూర్చుంది సరళ.
    అప్పుడింట్లో ఆమె తప్పయెవరూ లేరు.
    పనిమనిషి గిన్నెలుతోమి వెళ్ళిపోయింది. భర్త ఆఫీసులో వుంటాడు. సరళకు బద్ధకంగా వుండి పడుకుంటే చిన్న కునుకుపట్టింది. ఆమెనిపుడు నిద్రలోంచీ యెవరో లేపారు.
    "ఎవరు?" అంది సరళ.
    "నేనమ్మా-రాజుని!"
    "రాజా!" అంది సరళ ఉద్వేగంగా.
    "అమ్మా! నేను భయపడితే పదేళ్ళొచ్చాయి సిగ్గులేదూ అని వేళాకోళం చేసేదానివి. నువ్వు నన్ను చూసి భయపడ్డావా? నేను నిన్నేమీ చేయనమ్మా! నన్ను చూసి ఎందుకు భయపడ్డావ్?"
    ఆ గొంతులోని ఆవేదన సరళను కదిలించింది-"ఇంకెప్పుడూ భయపడను రాజూ!" అందామె.
    "అమ్మా! నీకిప్పుడు కులాసాగా ఉందా?"
    "ఉంది-ఇన్నాళ్ళూ నన్ను పలకరించలేదేం?"
    "నువ్వు నీరసంగా వున్నావు. మళ్ళీ భయపడితే ప్రమాదమని ఊరుకున్నాను. ఈ రోజుకూడా అనుమానంగానే పలకరించాను. అమ్మా! నీకు భయంలేదుకదూ!"
    "లేదు బాబూ! నువ్వు నాతో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నతో మాట్లాడకూడదూ? ఆయన సంతోషిస్తారు...."
    "నేను నీతోనే మాట్లాడతాను. నాన్నతో మాట్లాడను...."
    "ఎందుకని? ఆయనేం తప్పుచేశారు....?"
    "తప్పు కాదు. పరీక్ష!"
    "పరీక్షా?" అంది సరళ ఆశ్చర్యంగా.
    "అవును నేను మిమ్మల్నిద్ధర్నీ నా దగ్గరకు తీసుకొని వెళ్ళడానికేర్పాట్లు చేస్తున్నాను. మీ రిద్దరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే తప్ప మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకోలేను. నేను నిన్ను బ్రతిమాలుకుంటాను-నా దగ్గరకొచ్చేయమని నువ్వు నాన్నను బ్రతిమాలాలి......! నామీద ప్రేముంటే నువ్వు నాన్న నొప్పించగల్గుతావు. నామీద ప్రేముంటే నాన్న ఇందుకొప్పుకుంటాడు ఇదీ పరీక్ష!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS