Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 35


                                 కొడుకు పిలుపు

    "అమ్మా!"
    ఈ పిలుపుకులిక్కిపడి లేచింది సరళ. కళ్ళు నులుముకుని చుట్టూ చూసింది గదిలో యింకెవ్వరూ లేరు.
    విశాలమైన ఆ డబుల్ కాట్ మీద సరళ, ఆమె భర్త వరప్రసాద్ వున్నారు. వరప్రసాద్ ముసుగుతన్ని నిద్రపోతున్నాడు.
    ఎవరు పిలిచారు?
    తను కలకన్నదా లేక భ్రమపడిందా?
    ఆలోచిస్తూండగానే సరళకు అమ్మా అన్న పిలుపు మళ్ళీ వినిపించింది.
    "ఎవరూ?" అందామె.
    "ఇష్ - గట్టిగా మాట్లాడితే నాన్నగారు లేచి పోతారు. ఒక్కసారి పక్క గదిలోకి రామ్మా-"
    ఆ గొంతు ఎక్కడో విన్నట్లే అనిపించింది సరళకు. ఎక్కడో వినడమేమిటి-అది రాజు గొంతు.
    కానీ రాజు....
    "రామ్మా!" మళ్ళీ వినపడిందాగొంతు.
    సరళ మంత్రముగ్ధురాలిలా లేచి పక్క గదిలోకి వెళ్ళింది.
    "అమ్మా!"
    "ఎవరు?" అంది సరళ.
    "నన్ను గుర్తుపట్టలేదామ్మా?" దీనంగా అందాగొంతు.
    "నా కెవ్వరూ కనిపించడంలేదు....."
    "కానీ నా గొంతు వినిపిస్తోందిగా....."
    "బాబూ-నిజంగా నువ్వేనా?" అంది సరళ.
    "అవునమ్మా...."
    "ఒక్కసారి నా కళ్ళకు కనిపించరా!" అంది సరళ.
    "ఎలా కనిపించనమ్మా? ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే భయపడతావు!"
    "తల్లి బిడ్డను చూసి భయపడదు...."
    "లేదమ్మా-బ్రతికున్నంత కాలమే తల్లి ప్రేమ అయినా!"
    సరళ ఉలిక్కిపడి-"అవును-నువ్వు చచ్చిపోయావు కదూ!" అంది.
    "అవునమ్మా - చచ్చిపోయినా నాకీ యింటిమీద మోజు తీరలేదు. నువ్వంటే ప్రేమ చావలేదు. నీ దగ్గరే ఉండాలనీ నీ ఒడిలో పడుకోవాలనీ కోరికగా వుంది. కానీ అదిప్పుడు సాధ్యంకాదు...."
    "అయితే నువ్వింకా ఈ ఇంట్లోనే మసలుతున్నావా? అమ్మనెప్పుడూ పలకరించలేదేం?" అంది సరళ.
    "ఆ రోజు నాకింకా గుర్తుందమ్మా! ఉన్నట్లుండి నాకు విరేచనాలు పట్టుకున్నాయి. ముందు నువ్వు పట్టించుకోలేదు. విరేచనాలెక్కువైపోయాయి. వాముకాటు నీళ్ళిచ్చావు. అయినా తగ్గలేదు. నాన్న డాక్టరు దగ్గరకు పరుగెత్తాడు. డాక్టరు వచ్చేసరికి నేను నీరసంగా పడుకుని వున్నాను. ఆయన నన్ను పరీక్షించి ముఖంమీద గుడ్డ కప్పాడు. మీరంతా పెద్దగా యేడ్చేశారు. ఏమయిందో నాకు తెలియలేదు. కానీ నాకు నేనే దూరంగా వుండి నన్ను చూసుకోగలుగుతున్నాను. నన్ను మీరెవ్వరూ చూడ్డంలేదు. నాన్న నా శరీరాన్ని మోసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
    అయితే నేను చచ్చిపోయానని నాకు చాలాకాలం దాకా తెలియలేదు. నేను మామూలుగానే యింట్లో తిరుగుతున్నాను. అందరికీ కనపడుతున్నాను. అయినా యెవ్వరూ నన్ను చూడనట్లే మసలుతున్నారు. పలకరించడంలేదు. నేనే పలకరించాలంటే నాకు గొంతు పెగిలేదికాదు. మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాను.
    మొదట్లో గాలిని పోగుచేసి కొన్ని శబ్దాలు చేయగలిగాను. ఆ చప్పుళ్ళు విని నువ్వు భయపడ్డావుకూడా! నిన్ను భయపెట్టకూడదని నువ్వింట్లో లేనప్పుడు గాలిలో శబ్దాలు చేసేవాణ్ణి. క్రమంగా నాకు మాట్లాడ్డం వచ్చింది. కానీ అప్పటికింట్లో మాటలనుబట్టి నేను చచ్చిపోయానని అర్ధమయింది. నాకు తెలుసు-చచ్చిపోయిన వాళ్ళంటే నీకు భయమని! అందుకే పలకరించలేదు...."
    సరళ కళ్ళు చెమ్మగిల్లాయి- "మరిప్పుడు పలకరించావుగా-ఇలాగే రోజూ పలకరించరా-నాకెంతో తృప్తిగా వుంటుంది-" అందామె.
    "అలాగేనమ్మా-కానీ ఇప్పుడెందుకు పలకరించానో తెలుసా?"
    "నువ్వే చెప్పు-" అంది సరళ.
    "అమ్మా - నువ్వు నాకు మాత్రమే అమ్మవు. ఇంకెవరికీ అమ్మవు కాకూడదు...."
    "అంటే?"
    "ఈ యింట్లో నీకింకో కొడుకుండకూడదు-"
    "ఎందుకని?"
    "నేనది భరించలేను-"
    సరళ నిట్టూర్చి-"సరేలే-కానీ-ఒక్కసారి నువ్వు నాకు కనిపించకూడదూ?" అంది.
    "ఇప్పుడు నేను తలచుకుంటే యేమైనా చేయగలను. నీకు కనిపించనూగలను-"
    "అయితే కనిపించు" అంది సరళ ఆత్రంగా.
    "అమ్మా-ఒకప్పటి నా రూపం నీకు తెలుసు. ఆ రూపాన్ని మళ్ళీ చూస్తే నీలో దుఃఖం పెరుగుతుంది. అది నాకిష్టంలేదు. అయినా ఇప్పటి నా రూపం వేరు. అది నీకు చూపించలేను-"
    "ఎందుకని?"
    "నిన్న మన పనిమనిషి రంగమ్మ గట్టిగా కేక పెట్టింది గుర్తుందా?"
    సరళకు గుర్తు వచ్చింది. నిన్న ఉదయం ఇల్లూడుస్తూ ఓ గదిలోంచి హృదయవిదారకంగా అరిచింది రంగమ్మ ఖంగారుపడి సరళ, వరప్రసాద్ ఆ గదిలోకి వెళ్ళి ఏం జరిగిందని అడిగారు. అప్పటికదింకా వణుకుతోంది. వీళ్ళను చూడగానే కాస్త సిగ్గుపడింది - "ఏమీ లేదమ్మా-ఎందుకో భయంవేసింది....-" అంది.
    ఎందుకు భయంవేసిందో ఎంతడిగినా చెప్పలేదు.
    "గుర్తుంది-" అంది సరళ.
    "అప్పుడది నన్ను చూసింది-" అందా గొంతు.
    సరళకు వళ్ళు జలదరించింది.
    "అమ్మా - నువ్వు నా వంక ప్రేమగా చూసి లాలించాలి. నన్ను చూసి భయపడి కేకలు పెట్టకూడదు. అందుకే నా రూపం నీకు చూపించను" అందా గొంతు.
    "మరి-రంగమ్మ కెందుకు కనిపించావు?"
    "నన్ను చూస్తే మనుషులకేమనిపిస్తుందో చూడాలనుకున్నాను. రంగమ్మ భయపడకపోతే నా రూపం నీకూ చూపాలనుకున్నాను...."
    "ఒక్కసారి-ఎప్పటి నా రాజులా కనిపించరా?" అంది సరళ.
    "కనిపించను. కానీ గుర్తుంచుకో ..... ఈ ఇంట్లో ఇంకెవరైనా నా స్థానంలో ప్రవేశించారో వాళ్ళకు రోజూ నా అసలు రూపం చూపిస్తాను...."
    "రాజూ-నీ మాటలు వింటుంటే నాకు మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తోంది. నీతోనే వుండాలనిపిస్తోంది-" అంది సరళ ఆత్రుతగా.
    "నువ్వు నిజంగా యిష్టపడితే అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నువ్వూ నాన్నాకూడా వచ్చి నా దగ్గరుండొచ్చు-"
    సరళ యేదో అనబోయింది. ఇంతలో వెనుకనుంచీ సరళా! ఎవరితో మాట్లాడుతున్నావు?" అన్న వరప్రసాద్ కంఠమామెకు వినిపించింది.
    "ఏమండీ యిలా రండీ - మనబాబు మాట్లాడుతున్నాడు...." అంటూ ఉత్సాహంగా అరిచింది సరళ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS