ఆ సీసాకెదురుగా ప్రముఖ దేవుళ్ళ విగ్రహాలు.
పూజామందిరం ముందు నందిని కూర్చుంది. ఆమె కనులు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్ధిస్తోంది-తన పవిత్రతను ఋజువు చేయమని.
ఆమెకూ పూజామందిరానికి కాపలాగా ఉన్నారు వెంకన్న, చక్రధారి బృందం.
వెంకన్న చెంచల్రావుద్వారా సోమేశ్వరరావుకూ, తన అసిస్టెంట్సుకూ కబురుపెట్టి అక్కడికి రప్పించాడు.
సోమేశ్వరరావుకు జరిగిందంతా చెప్పి-"మీ కోడలి పవిత్రతను నిరూపించడానికి మీరు మరో రెండ్రోజులాగక తప్పదు...." అన్నాడు.
"మీరన్నది సబబుగానే ఉంది-" అని సోమేశ్వరరావు అంగీకరించాడు.
"నేనెవరినీ నమ్మను. నా వంతు కాపలా లేనప్పుడు మోసం జరక్కుండా మీరుండాలి-" అని వెంకన్న తన అసిస్టెంట్సుకు చెప్పాడు.
9
రెండురోజులట్టే గడిచాయి.
"చక్రధారీ-పరీక్షకు సిద్దపడాలి. మీకు విజయమో వీర స్వర్గమో!" అన్నాడు వెంకన్న.
"దేవుడున్నాడు-నా పవిత్రతను ఋజువు చేస్తాడు" అంది నందిని.
ఆమె ముఖం నిర్మలంగా వుంది. ఆమె కళ్ళు నిశ్చలంగా వున్నాయి.
చూడగానే ఆమె మహాపతివ్రత అనిపిస్తుంది.
చక్రధారి భయపడుతూ-"నేను నందిని విషయంలో తప్పుగా ప్రవర్తించాను. అందుకు నాకు తగిన శిక్షపడాల్సిందే......కానీ...." అడిగాడు.
"ఊఁ చెప్పండి-" అన్నాడు వెంకన్న.
"నా తప్పుకు నాకు శిక్షపడుతుంది. నేను చనిపోతానని భయంగా ఉంది-" అన్నాడు చక్రధారి.
"అయితే?"
"నేను నందిని పవిత్రతనంగీకరిస్తున్నాను. నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఆమె యిచ్చే మందును స్వీకరించను...."
"తప్పించుకోవడం మీకంత సులభంకాదు. నందినికి మనమందరమూ కాపలాగా వున్నాం. పూజామందిరంలో మందునామె మార్చలేదు. ఈ రోజుల్లో మాయమంత్రాల నెవరూ నమ్మరు-...." అన్నాడు వెంకన్న-"కాబట్టి గోవర్ధన్ చావుకి కారణమైన విషం మీరే ఆమెకిచ్చారని అనుకోవచ్చా?"
"మిష్టర్ చక్రధారీ! డోంట్ క్రియేటేసీక్.....నందినిచ్చిన మందు పుచ్చుకో-" అన్నాడు డాక్టర్ గంగాధరం.
"నాకు చెప్పేబదులు నువ్వే పుచ్చుకోవచ్చుగా-" అన్నాడు చక్రధారి.
"నాకభ్యంతరంలేదు. కానీ పురాణ కధల్లా ఇది సైన్సుకుకాదు - పవిత్రతకు పరీక్ష. నందిని చేతిమందు నీపట్లనే తప్ప నాపట్ల విషంగా మారకపోవచ్చు....."
"నందిని విషయంలో ఇద్దరూ ఒకేరకం మోసగాళ్ళు. మందెవరు పుచ్చుకున్నా ఫరవాలేదు-...." అన్నాడు వెంకన్న.
"నాకైతే ముగ్గురికీ యివ్వాలనుంది.." అంది నందిని.
"పుచ్చుకుందుకు నేను రెడీ-....జీ-87ని నేను నమ్మకుంటే ఇంకెవరూ నమ్మలేరు...." అన్నాడు గంగాధరం.
నందిని ముందుగా ఒక గ్లాసుడు నీళ్ళలో కొద్దిగా ఆ మందును కలిపింది.
"ముందెవరు తీసుకుంటారు?" అన్నాడు వెంకన్న.
"నేను-" అన్నాడు డాక్టర్ గంగాధరం.
"అయితే తీస్కోండి...."
గంగాధరం ఆ గ్లాసును తీసుకుని-నీళ్ళు త్రాగబోతూండగా-"ఆగండి!" అన్నాడు వెంకన్న.
"ఏం?" అన్నాడు డాక్టర్ గంగాధరం ఆశ్చర్యంగా.
"ఆ సీసాలో యిప్పుడున్నది జీ - ఎయిటీ సెవెనో, ప్రమాదకరమైన మందో తెలుసుకోవడానికింకా సులభమైన పద్ధతి నాకు తెలుసు. అంతవరకూ యెవరూ రిస్కు తీసుకోవడం మంచిది కాదు-" అన్నాడు వెంకన్న.
"ఏమిటది?"
"గతంలో నందిని తన భర్తకిచ్చిన మందును నేను పరికరాలద్వారా పరీక్షించాను. అది జీ-ఎయిటీ సెవన్ కాదని తేలింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ పరికరాల ద్వారా పరీక్షించి ఇది జీ-87 అవునో కాదో తేల్చగలను-"
"అదే అత్యుత్తమమైన పద్ధతి-పరీక్షకు నేను మీతో వస్తాను-" అన్నాడు డాక్టరు గంగాధరం.
10
ఆ గదిలో చక్రధారి బృందం, నందిని, సోమేశ్వరరావు, వెంకన్న బృందం-ఉన్నారు.
"ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నందిని పూజామందిరంలో వుంచిన తాత్కాలిక విషం-రెండురోజుల్లో ప్రమాదకరమైన విషంగా మారిపోతోంది. ఇది ఒకసారి కాదు. రెండుసార్లు జరిగింది దేవుడనుకోవాలా? నందిని పవిత్రత గొప్పదనుకోవాలా? లేక మన కర్ధంకాని సప్సెన్సిందులో ఉన్నదనుకోవాలా? - అన్నది నేను, డాక్టర్ గంగాధరం యిప్పుడు పరిశోధించి తేల్చబోతున్నాం-" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
జరిగిన విశేషం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
పూజామందిరంలో నే మందు విషంగా మారుతున్నదని నిశ్చయంగా తేలింది కాబట్టి వెంకన్న, గంగాధారం కూడా ఆ మందిరంపైనే పరిశోధన ప్రారంభించారు.
బాగా పరిశోధించాక వారు తేల్చిన విశేషమిది......
మందిరంలో అటూ యిటూ రెండు దీపాలు నిత్యం వెలుగుతూంటాయి. కరెంటున్నంతసేపు అవి వెలుగుతూనే ఉంటాయి.
ఆ మందిరంలోనే ప్రముఖ దేవుళ్ళ విగ్రహాలు ఆరున్నాయి. ఆ విగ్రహాల కళ్ళు ప్రత్యేకమైన వజ్రాలతో పొదగబడ్డాయి. ఈ దీపాల కాంతి ఆ వజ్రాల పైబడి ప్రతిఫలించి-అన్నివైపులనుంచీ కేంద్రీకరించబడి-జీ 87 మందుపై ప్రసరిస్తోంది. అప్పుడందులో రసాయనిక చర్యజరిగి-జీ-87 ప్రమాదకరమైన విషంగా మారుతోంది.
ఇలా జరుగుతుందని జీ-87 కనిపెట్టిన డాక్టరు గంగాధరానికి కానీ - దేవుణ్ణి నమ్మిన నందినికి గానీ తెలియదు.
"ఈ విగ్రహాలు నీ కెక్కడివి?" అన్నాడు వెంకన్న నందినితో.
"అదామెకు నేనే యిచ్చాను. రోజూ వాటికి పూజ చేయడం ద్వారా నా కొడుకులో మంచి మార్పు వచ్చి ఆమె సుఖపడుతుందని చెప్పాను. కానీ అవామెకిలా ఉపయోగపడతాయని నేను కలలో కూడా అనుకోలేదు..." అన్నాడు సోమేశ్వరరావు.
జరిగిన విశేషానికి చక్రధారి, చంచల్రావు వగైరా లందరూ షాక్ తినేశారు.
"దేవుడున్నాడు. అతడు పవిత్రుల్ని రక్షిస్తాడు. మోసగాళ్ళను శిక్షిస్తాడు"
ఇలాంటి భావాలక్కడి వారందరి ఆలోచనల్లోనూ తిరుగుతున్నాయి.
"సోమేశ్వరరావుగారూ! గోవర్ధన్ కి మీరు జన్మనిచ్చారు. అందుకే భగవంతుడు మీచేత అతణ్ణి అంతం చేయించాడు. అతడి మరణం యాదృచ్ఛికంగానే జరిగినా దుర్మార్గులందరికీ హెచ్చరికగా ఉంటుంది..." అన్నాడు వెంకన్న.
సోమేశ్వరరావు లేచి నిలబడి-"వెంకన్న గారూ! కాసేపట్లో మీ ఫీజు మీ ఆఫీసుకు పంపిస్తాను. నా కొడుకు గురించి నేను పూర్తిగా మర్చిపోతాను. వాడి శవానికి అంతిమ సంస్కారం జరిపించుకునే అర్హత కూడాలేదు. దాన్ని మీ యిష్టానికే వదిలిపెడుతున్నాను. నా కోడలికి పునర్వివాహం జరిపించి ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దుతాను.....భగవంతుడున్నాడనీ-తన పవిత్రతను నిరూపిస్తాడనీ నమ్మిన ఆ అద్బుత వ్యక్తి నా కోడలు కావడం తాత్కాలికమైనా నాఅదృష్టం...." అన్నాడు.
చక్రధారి వెంకన్నవైపు తిరిగి-"గోవర్ధన్ కి అంతిమ సంస్కారం జరిపించే బాధ్యత నాది. అర్హత ఉందనుకుంటే నేను నందినికి భర్తను కావాలనుకుంటున్నాను-" అన్నాడు.
వెంకన్న చటుక్కున లేచి నిలబడి తన అసిస్టెంటు వైపు తిరిగి-"మనమిక్కడ చేయవలసిందీ చెప్పవలసిందీ ఏమీలేదు. అన్నింటికీ దేవుడున్నాడు. ఆ విషయమిప్పుడే ఋజువైంది కదా-రండి, పోదాం-" అన్నాడు.
-:అయిపోయింది:-
