వారతడిచ్చిన గ్లాసుల నందుకుని నీళ్ళు గట గటా తాగేశారు.
కాసేపటికి ముగ్గురూ వెనక్కి వాలిపోయారు.
వారి శరీరం రంగు నీలంగా మారింది. శరీరంలో చలనమాగింది.
నాడి అందడంలేదు. గుండె కొట్టుకోవడంలేదు.
వెంకన్న గుండె వేగంగా కొట్టుకుంది.
తన చేతులతో తనే వారిని హత్య చేశాడా?
వాళ్ళు ముగ్గురు కూడా యెంతో ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో తానిచ్చిన మందు పుచ్చుకున్నారు.
వారికిది అలవాటై ఉండాలి.
కొన్ని ప్రయోగాల అనంతరం వారిది యెందరికో ప్రదర్శించే వుండాలి. లేకుంటే అంతటి ఆత్మవిశ్వాముండదు.
వారు నిజంగా చనిపోలేదా? వైద్యశాస్త్రం ఈ పరిణామానికేం పేరు పెడుతుంది? మృత జాగ్రుదవస్థలో మనిషి భావాలెలాగుంటాయి?
వెంకన్న ఆలోచిస్తూ అసహనంగా పచార్లుచేస్తున్నాడు,
మందు పుచ్చుకున్న రెండు గంటలకు చక్రధారి బృందం శరీరాలు యథాప్రకారం అయ్యాయి. రంగు మార్పుతోపాటు శరీరంలో చలనం వచ్చింది.
కొద్ది క్షణాల్లోనే వాళ్ళు లేచి కూర్చున్నారు.
"హేట్సాఫ్ టూ యూ-" అన్నాడు వెంకన్న గంగాధరం బృందాన్నభినందిస్తూ.
"థాంక్స్-" అన్నాడు గంగాధరం.
"ఏ ఉదేశ్యంతో మీరీ మందును కనిపెట్టారు?" అన్నాడు వెంకన్న.
"నేను దీన్ని సదుద్దేశ్యంతోనే కనిపెట్టాను. కానీ గోవర్ధన్ మరణంతో నేను కాస్త డీమోరలైజ్ అయ్యాను...." అన్నాడు గంగాధరం.
"ఏమిటి మీ సదుద్దేశ్యం?"
"ఈ విధంగా ఒక్కసారి చచ్చిబ్రతికితే-మనిషి శరీరంలో ఏళ్ల తరబడి నిద్రలేమి వున్నా-ఆ ప్రభావం పోతుంది. రక్తపుపోటు పోతుంది. పాత జబ్బులన్నీ తొలగిపోయి మనిషికి కొత్త జీవితం ప్రారంభించే అవకాశముంది....."
"వెరీగుడ్....మరి మీ మందు గోవర్ధన్ నెలా చంపిందంటారు?" అన్నాడు వెంకన్న.
"అదే తెలియడంలేదు. నందిని యేం చేసిందో మరి!...."
"అది తెలుసుకోవాలని మీకుంటే మీరూ నాతో రావాలి...."
"ఎక్కడికి?"
"నందిని ఇంటికి!"
"ఎందుకు?"
"మీ మందు నామె యేం చేసిందో తెలుసుకోవాలిగా-...."
8
"దేవుడున్నాడు...." అంది నందిని.
"ఉంటే మన దేశంలో ఎందరో అన్నార్తులెందుకుంటారు?" అన్నాడు వెంకన్న సూటిగా.
"వాళ్ళు పాపాత్ములు-...." అంది నందిని తడుముకోకుండా.
"వాళ్ళు పాపాత్ములు కాదు-అమాయకులు-...." అన్నాడు వెంకన్న.
"అమాయకుల్ని దేవుడెప్పుడూ కాపాడతాడు." అంది నందిని.
"మన దేశంలో దేవుళ్ళ కెన్నో పేర్లు-నీ దేవుడి పేరేమిటి?" అన్నాడు వెంకన్న.
"ఏ దేవుడి పేరు చెప్పను?" అంది నందిని చటుక్కున.
"చక్రధారి నీ కిచ్చిన తాత్కాలిక విషాన్ని శాశ్వత విషంగా మార్చిన దేవుడి పేరు చెప్పు...." అన్నాడు వెంకన్న.
చక్రధారి, చంచల్రావు, గంగాధరం కుతూహలంగా ఆమెవంక చూస్తున్నారు.
"ఆ దేవుడి పేరు నాకెలా తెలుస్తుంది?" అంది నందిని.
"పేరు తెలియకపోతే అడ్రసు చెప్పు...." అన్నాడు వెంకన్న.
"రండి-చూపిస్తాను-" అంది నందిని.
వెంకన్న, చక్రధారి బృందం ఆమె ననుసరించారు.
ఆమె వారిని పూజామందిరంలోకి తీసుకెళ్ళింది.
"ఈ మందిరంలో చాలా విగ్రహాలున్నాయి. ఏ దేవుడి విగ్రహం నా కోరిక తీర్చిందో నాకు తెలియదు-" అంది నందిని.
"అంటే?"
"నా చేతికొచ్చిన విషాన్నో చిన్న సీసాలో పోసి ఈ పూజామందిరంలో ఉంచాను. దేవుణ్ణి ప్రార్ధించు కున్నాను. దేవుడు నా కోరిక తీర్చాడు...."
"అయితే ఈ విషయంలో మనుషులెవ్వరూ నీకు సాయపడలేదంటావు?"
"లేదు-...."
"అసాధ్యం-...." అన్నాడు డాక్టర్ గంగాధరం.
"డాక్టర్ గంగాధరం జస్టేమినిట్...." అన్నాడు వెంకన్న-"నువ్వు దేవుణ్ణి నమ్మావు. దేవుడు నీకు సాయపడ్డాడు. నువ్వు చక్రధారిని కూడా నమ్మావు. అతడు నిన్ను మోసగించాలనుకున్నాడు. నీ భర్త మీదున్నట్లే అతడిపై కూడా నీకు ద్వేషముందిదా"
"అంటే?"
"తన పథకం పారితే చక్రధారి నిర్దాక్షిణ్యంగా నిన్ను నైట్ స్టార్ హోటలుకమ్మేసి వుండేవాడు. వీలుంటే అతడూ చావాలని నీ కుందా?"
"నా కర్ధంకాలేదు...."
"నేను నీకు గతంలో చక్రధారిచ్చిన మందును మరికాస్త యిస్తాను. ఆ మందును గతంలోలాగే నీవు పూజామందిరంలో ఉంచు. రెండ్రోజుల అనంతరం అతడిచేత ఆ మందును తాగించు. అతఃడు జీవించాడా-నీ వతడి సొత్తువు. అతడు నిన్ను నైట్ స్టార్ హోటల్ కమ్మేస్తాడు. అతఃడు మరణించాడా-నీవు పవిత్రురాలివి. నీ మామగారికే కాదు-నాకూ ఆరాధ్య దేవతవు-" అన్నాడు వెంకన్న.
అతడు మాట్లాడుతున్నదేమిటో అర్ధంకావడానికి కందరికీ కాసేప్పట్టింది.
"నోనో-నేనిందుకు సిద్దంగాలేదు-" అన్నాడు చక్రధారి.
"ఎందుకని?" అన్నాడు వెంకన్న.
"ఆమె మందును విషంగా మార్చగలదు...."
"మందునామె కాదు-దేవుడు విషంగా మార్చాడు."
"అదంతా వట్టి కథ..."
"అదే మనమిప్పుడు తేల్చేస్తాం.......పూజామందిరానికి వంతులవారిగా నేను మీరు కాపలా కాద్దాం......గతంలో లాగే దేవుడికి రెండే రెండ్రోజులు టయిమిద్దాం...."
"నేనిందుకు ఒప్పుకోను...." అన్నాడు చక్రధారి.
"మిష్టర్ చక్రధారీ! మీరిందుకొప్పుకోకపోతే-నందినికి జీ-87 కి బదులు శాశ్వత విషాన్ని మీరే యిచ్చారని-ఒప్పుకోవలసి ఉంటుంది...."
డాక్టర్ గంగాధరం చక్రధారికి నచ్చజెప్పాడు.
"ఇది నీ పవిత్రతకు పరీక్ష. భవిష్యత్తుకుసోపానం. కాదనకూడదు-" అంటూ వెంకన్న నందినిని సవాలు చేయడంలో ఆమెకూడా ఒప్పుకుంది.
అప్పుడు నందిని ఓ చిన్న సీసా తెచ్చిచ్చింది.
మూడంగుళాల పొడవున్న సిలిండర్ ఆకారంలోని తెల్లని గాజు సీసా అది. దానికి స్క్రూ సిస్టంతో ఓ ప్లాస్టిక్ మూత వుంది.
వెంకన్న ఆ సీసాను తనే స్వయంగా కడిగాడు. శుభ్రంగా కడిగాడు. తనవద్దనున్న జీ-87 లో కొంత ఆ సీసాలోకి మార్చి సీసా మూతపెట్టాడు. నందిని చెప్పినచోట అతడే ఆ సీసా ఉంచాడు.
పూజామందిరంలో జీ-87 ఉన్న సీసా..
