Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 32


    వెంకన్న నిట్టూర్చి-"ఒక్కక్షణం మీరు కూర్చుని నా అసిస్టెంట్సుతో మాట్లాడండి-నా వద్ద అత్యంతాధునిక పరికరాలున్నాయి. వాటితో ఏ విషాన్నయినా ఇట్టే అయిడెంటిఫై చేయొచ్చు-...."
    సోమేశ్వరరావు తలాడించాడు.
    వెంకన్న లోపలకు వెళ్ళగానే సోమేశ్వరరావు సీతమ్మ, రాజమ్మలచేత తను చెప్పిన వివరాలు నోట్సు చదివించుకుని విన్నాడు. ఒక చిన్న విశేషం కూడా పోకుండా మొత్తం వివరాల వొకేవిధంగా రికార్డు చేసిన వారిద్దర్నీ ఆయన అభినందించాడు.
    సరిగ్గా నలభై నిముషాలపాటు డిటెక్టివ్ వెంకన్న లోపల ప్రయోగశాలలో తన పరిశోధనలు ముగించుకుని వచ్చాడు.
    సోమేశ్వరరావు వెంకన్న వంక ఆత్రుతగా చూశాడు.
    "రెండు విషాలూ వేరు. రెండూ కొత్తవి......" అన్నాడు వెంకన్న.
    "అంటే?"
    "ఇంతవరకూ నాకు తెలిసిన ఏ విషంతోటీ, మత్తు పదార్ధంతోటీ ఇవి సరిపోలడంలేదు. అంటే రెండూ కూడా కొత్త పదార్ధాలే! కానీ రెండూ ఒకటి కాదు-...."
    "చాలా చిత్రంగా ఉందే! యెవరికీ తెలియని కొత్త విషాన్ని డాక్టర్ గంగాధరం కనిపెట్టి నా కోడలి కిచ్చాడు. కానీ యెవరికీ తెలియని మరో కొత్త విషాన్ని నా కోడలెలా సంపాదించిందంటారు?" అన్నాడు సోమేశ్వరరావు.
    "ఇలాంటి విషం మామూలుగా మార్కెట్లో దొరికే ప్రసక్తే లేనేలేదు. చక్రధారి బృందం మినహాయించి మరొకరి ద్వారా నందిని కీ విషమందిందనుకునే ఆస్కారం లేదు. మరొకరెవరైనా నందినికి సాయపడాలనుకుంటే-ఏదో మామూలు విషం తెచ్చిస్తారు తప్ప-ఇలాంటి అరుదైన విషం తేలేరు-...." అన్నాడు వెంకన్న.
    "అయితే ఏమంటారు?"
    "చక్రధారి అబద్దం చెబుతున్నాడని నా అనుమానం. అతడు గోవర్ధన్ని అంతం చేయాలనే నిశ్చయించుకున్నాడు. జీ-87 ఉన్నమాట నిజమో కాదో తెలియదు. కానీ వాళ్ళు నందిని కిచ్చింది నిజం విషం-"
    "వెంకన్నగారూ-డాక్టర్ గంగాధరం చక్రధారిని మోసం చేసే అవకాశముందని మీ కనిపిస్తోందా?" అన్నాడు సోమేశ్వరరావున్నట్లుండి.
    "మధ్య గంగాధరం ప్రసక్తి యెందుకు?" అన్నాడు వెంకన్న.
    "గంగాధరం జీ-87 యేదో ప్రయోజనంతో కనిపెట్టి ఉండొచ్చు. దాని ప్రభావాన్ని పరీక్షించడానికి చక్రధారిని సాయమడిగితే అతడు మా అబ్బాయిని సూచించి వుండవచ్చు. జీ-87 ప్రయోగం వికటించి ఉండవచ్చు...."
    "సోమేశ్వర్రావుగారూ-మీ బుర్ర సుపర్బ్....మీ వంటి వారికింద కొంత కాలం అసిస్టెంటుగా పనిచేస్తే-నా వృత్తిలో నేను మరింత రాణించగలనేమో....."
    "వెంకన్నగారూ-మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు...."
    "వేళాకోళం కాదు.....ఉన్నమాటే అన్నాను......బహుశా మీరు చెప్పినట్లే జరిగుండొచ్చునేమో!"
    కాసేపెవ్వరూ మాట్లాడలేదు. తర్వాత వెంకన్న లేచి నిలబడి-"నేనొకసారి అర్జంటుగా చక్రధారి బృందాన్ని కలుసుకుని వస్తాను-" అన్నాడు.
    
                                     7

    గదిలో చక్రధారి, గంగాధరం, చంచల్రావు వున్నారు. వారి కెదురుగా డిటెక్టివ్ వెంకన్న ఉన్నాడు.
    "వెంకన్న గారూ! నిజం చెబుతున్నాను. జరిగింది యాక్సిడెంటే తప్ప-హత్య కాదు హత్యంటూ జరిగితే ఆ బాధ్యత నందినిది-మాది కాదు-...." అన్నాడు చక్రధారి ధీనంగా.
    "నేను మీ మాటలు నమ్మాలంటే ఒకటే పద్ధతి ఉంది...." అన్నాడు వెంకన్న గంభీరంగా.
    "చెప్పండి-" అన్నాడు చక్రధారి.
    "నేను జీ-87 ప్రభావాన్ని పరీక్షించాలి...."
    "తప్పకుండా పరీక్షించవచ్చు-" అన్నాడు డాక్టర్ గంగాధరం.
    "అది మీమీదే ప్రయోగిస్తాను...."
    "అందుకు నేను సిద్దం..." అన్నాడు డాక్టర్ గంగాధరం.
    "మీరొక్కరే కాదు..."
    "ఇంకెవరు?" అన్నాడు గంగాధరం.
    "చక్రధారి...చంచల్రావు...."
    "మేమూ సిద్దమే-" అన్నారు వాళ్ళిద్దరూ.
    "ముగ్గురూ ఒకేసారి.." అన్నాడు వెంకన్న.
    చక్రధారి ఆశ్చర్యంగా-"ఒకరి తర్వాత ఒకరు పరీక్షిస్తే పనికిరాదా?" అన్నాడు.
    "పనికిరాదు. జీ-87 ప్రభావం పరీక్షించబడుతున్నప్పుడు మీ ముగ్గురిలో యే ఒక్కరూ మెలకువగా ఉండకూడదు...."
    చక్రధారి అందుకోపట్టాన అంగీకరించలేదు. డాక్టర్ గంగాధరం కలగజేసుకుని అందర్నీ అందు కొప్పించాడు.
    "ఈ వెంకన్న నెలా నమ్ముతాం? అతడు మనలనేదయినా చేస్తే?" అన్నాడు చక్రధారి-ఒప్పుకున్నాక కూడా.
    "డిటెక్టివ్ వెంకన్నగారి గురించి నాకు బాగా తెలుసు. వారు నీతికీ, నిజాయితీకి పేరుబడ్డవారు. నేరస్థుడిని శిక్షించాలన్నది వారి అభిమతం కాదు. నేరాన్ని రూపుచూపడానికే వారు కంకణం కట్టుకున్నారు. వారిని మనం నమ్మవచ్చు-...." అన్నాడు గంగాధరం.
    "నేరస్థులకు సహకరించే జి-87 వంటి విషాన్ని కనిపెట్టినందుకు మీకు. ఆ విషంవల్ల ప్రయోజనం పొందాలనుకున్నందుకు చక్రధారికి, మీ పథకంలో ఒక భాగమైన చంచల్రావుకు-జీ-87 ప్రభావాన్ని నా ముందు ప్రదర్శించడం బాధ్యత...." అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
    అప్పుడు డాక్టర్ గంగాధరం తన కోటు జేబులోంచీ ఒక సీసా తీసి డిటెక్టివ్ వెంకన్న కందించి-"ఇందులో పది గ్రాముల జీ-87 ఉంది నేను చెప్పిన ప్రభావం కనపడాలంటే-మనిషికొక గ్రాము చాలు, మంచినీళ్ళలో మీరే స్వయంగా కలిసి అందించండి-" అన్నాడు.
    వెంకన్న సీసా అందుకున్నాడు.
    ముదురు నీలంరంగులో ఉందా సీసా!
    వెంకన్న సీసాతో పక్కగదిలోనికి వెళ్ళాడు.
    గదిలో పొడవాటి పెట్టె ....
    ఆ పెట్టెలో శవం వుందని వెంకన్నకు ముందే తెలుసు.
    ఇవతలపక్కగా వాష్ బేసిన్ వుంది.
    పక్కనే బోర్లాపెట్టిన గాజు గ్లాసులు నాలుగున్నాయి.
    వెంకన్న ఓ గ్లాసు తీసి-వాష్ బేసిన్ లో కుళాయి విప్పి తొలిచి నిండా నీళ్ళుపట్టి తాగాడు.
    నీళ్ళు రుచిగా వున్నాయి.
    తర్వాత వెంకన్న మిగతా గ్లాసులూ తీసి కుళాయి కింద కొలిచి-కొద్ది కొద్దిగా నీరు పట్టాడు. తనవద్ద నున్న సీసాలోని మందును ఉజ్జాయింపుగా ఒకో గ్రాము నా గ్లాసుల్లో వేసి బాగా కలిపాడు. మందు నీళ్ళలో కరిగేక ప్రతి గ్లాసుకూ-మూడు వంతులు నీటిలో నింపి-చక్రధారి బృందమున్న చోటికి వెళ్ళాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS