Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 33


    "మన ప్రభుత్వం ఆస్థానకవులను...."
    "ఆఁ! అందరూ ఆస్థానకవులు - అష్ట, శత, సహస్రావధానులు కాలేరు గదా?"
    "బావుంది. పాశ్చాత్య రచయితలకు, మనకు పోలికలు, తేడాలు కొన్ని చెప్పండి."
    "పాశ్చాత్య రచయితలు ఎక్కువగా సమకాలీన కాలాని కనుగుణంగా రాస్తూ ఉంటారు. మనవాళ్ళూ రాస్తారుగానీ, వాళ్ళ సాహిత్యం జీర్ణించుకోగలిగాకే అలా రాస్తున్నారని చెప్పాలి. మన ప్రబంధాల్లో, కావ్యాలు మొదలైన వాటిలో అప్పటి సమకాలీన జీవితం కొంత ప్రతిబింబించిందనుకోండి! ఇప్పటికీ ఆ పద్ధతిలో రాసేవాళ్ళూ ఉన్నారు. అది సమంజసం కాదనను ఎవరి ఇష్టానిష్టాలను బట్టి, అభిరుచులనుబట్టి వారు రాస్తారు.
    "అయితే వాస్తవికతను, వర్తమానాన్ని రంగు టద్ధాల్లోనుండి చూడాలనుకునేవాళ్ళీ శతాబ్దంలో ఎక్కువ అయ్యారు. పాశ్చాత్యులు తత్సంబంధంగా ఎక్కువ సంఖ్యలో రాస్తూ ఉంటారు కనక, కొందరైనా లోకవ్యాప్తంగా పేరు తెచ్చుకోగలుగుతున్నారు.
    "అలా అనుకుని మనల్ని మనం కించపరుచుకోకూడదు. అందమైన వర్ణనలు, చమత్క్రుతులు, కల్లాపాలు వీటిలో మనవారు వారి కెందులోనూ తీసిపోరు కావ్యాల్లో చిత్రించిన బొమ్మలా ప్రకృతిని కళ్ళముందు ఉంచటం, సెలయేటి గలగలలకు తోడు పక్షుల కలకల నాదాలు, నాయికల మంజులస్వనాలు, నాయకుని గంభీర కంఠధ్వని, కన్యాకుమారిలో ఉదయసంధ్యల నుండి హిమాలయ పర్వతపాదాలలోని ప్రశాంతతవరకు ప్రయాణాలు చేయించే పద్యాలు మనకు ఉన్నాయి. యతి ప్రాసలతో, ఛందోబద్ధములై, స్వర్గాన్ని కళ్ళకు కట్టించే కవనాలు ఉన్నాయి. భావ ప్రపంచాల్లోకి లాక్కు పోయే మన కవుల గొప్పదనంముందు వారెంత?"
    "మనవాళ్ళదే గొప్పదనం అంటారు."
    "కాదా, మరి! ఏ సమకాలీన జీవితాన్నీ చిత్రించక, ఏ విప్లవాన్నీ వెలికి తీయక, ఏ శాస్త్ర విజ్ఞానాన్నీ పరిశోధించక, ఏ చారిత్రిక నిరూపణా చెయ్యక, తన ప్రత్యేకపంథాలో సాగి, ఇతరులు కనలేని మహోత్కృష్టమైన, అమృతతుల్యమైన మహావిజ్ఞానాన్ని భావుకు లైన ప్రతివారికీ ప్రసాదించిన 'గీతాంజలి' పాశ్చాత్యులు రాసిందేనా? వాళ్ళలో ఎవరన్నా ఇంతవరకూ అలాంటిది రాశారా? గీతాంజలి హిందూ దేశీయులంటే రాళ్ళనూ, రాప్పలనూ పూజించి, వాటి గొప్పదనమే రాస్తారన్న అపోహను తొలగించి, వారిని ఉర్రూత లూగించలేదా? ఆయన విశ్వకవి కాలేదా? బెంగాలీయు డైన ఆయనదాకా ఎందుకు? తిరుపతి వెంకటకవులు, కృష్ణశాస్త్రిగారు, బాపిరాజుగారు మొదలయినవారు వాళ్ళకన్నా తక్కువంటారా? తిరుపతి వెంకటకవులు ఆంగ్లపదాలను కలిపి అర్దమిచ్చేటట్లుగా సీనపద్యం రాశారే! వారిని తెలుగుపదాలతో ఒక్క లిరిక్ రాయమనండి."
    "నిజమే. వారి సానెట్మనవాళ్ళు రాస్తారుగానీ, మన సీసపద్యం వారు ఇంత సొంపుగా రాయలేరు, సాధారణంగా!"
    "మరొకటి మీకు తెలుసో, లేదో- వేమన తేలిక భాషలో అసలు లోక స్వరూపాన్ని చక్కగా చిత్రించలేదూ?"
    సునీత వాళ్ళిద్దరి వాదాలను వింటూనే ఉంది. ఆమె వ్రాసుకోవటం చాలా సేపటికిందే ముగించింది. "మీరు చెబుతూంటే ఆకలిదప్పులుకూడా తెలియవు. నేనేమో అనుకున్నాను. ఇంత మేధావులని మాట మాత్రంగానైనా అనుకోలేదు. మా కరుణ లక్కీ గరల్!"
    "ఆఁ! నేనీ లక్కీని ఆవిడికి దక్కనిస్తానేమిటీ?"
    "అంతే అంటారు ముందు. తరవాత కీ ఇచ్చిన గడియారం."
    ముగ్గురూ నవ్వుకున్నారు. యాదగిరి రాజు చెప్పింది విని, అంతకు ముందే వచ్చి కూర్చున్నాడు, "లెక్చరర్, మున్ముందు ప్రొఫెసర్ కాదగిన లక్షణాలు మీలో ఉన్నాయి."
    "మరే, పరధ్యానం ప్రొఫెసర్!"
    మళ్ళీ హాస్యాలు.
    "చాలుగానీ, పాపం, విశ్వం ఇందాకటినించీ ఆ కుర్చీలో అవస్థపడుతున్నాడు. వదిలెయ్యండి." సునీత అన్నది.
    "ఆఁయ్, నేను వారిని పట్టుకు కూర్చున్నానా?"
    "మాటలతో కట్టేశారు. మీకంటే ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగేవారు లేరు."
    "వారికి ఉన్నారా, మరి?"
    "లేరా?" గుంభనంగా నవ్వింది.
    "ఓ.......ఓ......తెలిసింది, తెలిసింది!" పెద్దగా నవ్వాడు నీలకంఠం. "సారీ, నాకు మాటలుంటే మరొకటి మరుపు వచ్చేస్తుంది. ఆ సెంటర్ దాకా వస్తాపదండి."
    ఆ మాటల ప్రవాహం ఆగడంతో వాన వెలిసినట్లుంది విశ్వానికి. "తెలుసుకోవలిసినది చాలా ఉంది. అప్పుడప్పుడూ వస్తుంటాను మీతో చర్చలకు."
    "ఓ కే. పదండి." లేచాడు నీలకంఠం.
    "మళ్ళీ ఆ వీథిలో ఉపన్యాసం మొదలెట్టి, ఓ గంట నిలేసేరు" అన్న సునీత మాటలకు, "అబ్బెబ్బే! అసలు మాట్లాడను" అంటూనే మాట్లాడాడు.
    అతను విశ్వానికి చెప్పిన మాటలు తన బుర్రలో కూడా పోగుచేసుకున్నది సునీత. 'మనస్సును దహించే ఈ యోచనలు కాగితంమీదికి ఎక్కించాలి. ఆఫీసులో అంత పనికూడా ఉండదు. ఏ కొద్ది సమయాన్ని అయినా దీనికే వినియోగించాలి. నీలకంఠం, పుస్తకాలు చదివి సేకరించిన వ్యాసాలు అడిగి తీసుకోవాలి. ఏది అడిగినా శాస్త్రజ్ఞుడిలా చెప్పే నీలకంఠం తనకు సహాయం చెయ్యగలడు. వీటివల్లనైనా తను కొంత శాంతిని పొందవచ్చు!'

                               *    *    *

    "వేణూ,
    మీలో మొన్నటి సంఘటన ఇంకా పాతబడి ఉండదు.
    మీచేత ఆ లాకెట్ మెడలో కట్టించుకున్నప్పుడు ప్రపంచంలో దాగిఉన్న ఆనందమంతా నాలో ఉరకలు వేసింది. కళ్ళు మూసుకుంటే మీరు గోపాలకృష్ణులుగా సాక్షాత్కరించి, నా శరీరాన్ని ప్రేమ అనే పంజరంలో బంధిస్తున్నట్లుగా ఆనందించాను. నన్ను నేనే నవ వధువుగా ఊహించుకున్నాను.
    అడిగారు, నా పెళ్ళి ఎప్పుడని, మీకూ తెలుసు, నా పెళ్ళి సంగతి. అయినా చెబుతున్నాను. మీరు బొంబాయినుంచి తిరిగివచ్చాక ఇన్ని రోజులకు నా పెళ్ళి జరిగిపోయింది. ఎవరితో? నేను నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తితో. ఆ వివాహం ఎవరూ చూడలేకపోయారు. ఒక శుభముహూర్తాన సర్వ దేవతలు, పంచభూతాల సాక్షిగా నా మనోవీథిలో ఎంతో వైభవంగా జరిగింది. మంగళవాద్యాలు, వేద ఘోషలు అన్నీ ఉన్నాయి. అవి నేనేతప్ప ఇంకొకరు వినలేని విధంగా జరిగాయి.
    శారీరకంగా మేము దాంపత్యాన్ని గడపటంలేదు. మానసికంగా.... మాలో అన్ని సౌఖ్యాలు ఉన్నాయి.
    మీకు ఇంకా అర్ధం కాలేదా, వేణూ?
    నాకు మాంగల్యంఅన్నా, పుణ్యస్త్రీలు అన్నా ఎనలేని గౌరవం. స్త్రీ సౌభాగ్య సౌఖ్యాల వరప్రసాదిని అయిన మంగళసూత్రం కేవలం తాడు అని నేను అనుకోను. రెండు జీవితాలకు పరస్పరం తోడునీడను కలిగించి, రాగబంధంలో ముడివేసి, తద్ద్వారా మానవజాతి సృష్టికే మూలకారణమవుతున్న ఆ సుమంగళ చిహ్నానికి ఉన్న విలవ, పవిత్రత నేను డాక్టర్ గారి మూలంగా తెలుసుకోగలిగాను. నిరాడంబరంగా ఉండే ఆమె కంఠ సీమలో నగలేమీ లేకున్నా భాస్కరుని జ్యోతిర్మయ కాంతి పుంజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భాసించే మాంగల్యం! సర్వమానవుల కష్టాలను మరపింపచేయగలిగిన, మాతృభావయుక్తమైన ఆమె నుదుట అరుణా రుణ సింధూరతిలకం! వేణూ, ఆమె లోకమాత. పరమేశ్వరిలా ఉంటుంది. ఆమె ఏ ఆజ్ఞ ఇచ్చినా, కొట్టినా, హింసించినా ఆమె చెప్పినది చెయ్యటానికి ఏ సందేహమూ ఉండదు.
    మాంగల్య మహిమను, పాతివ్రత్యాన్ని గురించి పురాణేతిహాసాలలో అనేకమైన కథలు వింటున్నాము. అవన్నీ నిజమో, కల్పనో నేను చెప్పలేను. కానీ, డాక్టరు గారిని చూస్తే, అన్నీ కాకపోయినా కొన్ని జరిగి ఉంటాయేమోనని తోస్తుంది. జరగకపోయినా ఇబ్బంది లేదు.
    అయితే చంచలంగా మనస్సు మార్చుకుంటూ ప్రతిచోటా తప్పటడుగులు వెయ్యటంకన్నా, సాఫీగా సాగిపోవలసిన జీవనరథానికి రెండవ చక్రమైన ఒక వ్యక్తిని వలచి, లేక వివాహమాడిన తరవాత, వియోగం సంభవించినా, తను అధికంగా కోరుకున్నవారి జ్ఞాపకాల్లో శేషజీవితాన్ని కాలానికి అంకితం చెయ్యడంలో వాళ్ళ కేదో తాదాత్మ్యం లభించి ఉంటుంది. లేకపోతే ఇన్ని కథలూ, గాథలూ పుట్టి ఉండవు.
    వేదోక్తమైన వివాహంమీద స్థిరమైన సంకల్పాలు నాలో ఉండేవికావు. డాక్టరుగారిని చూసి, ఆమెను గూర్చి తెలుసుకున్నాక, మంత్రయుక్తమైన పాణిగ్రహణం అంటే గురి కుదిరింది. నాకు .... నాకా అవకాశం లేదు ... అదే నా బాధ.
    అందుకే -
    మొన్న మీచేత లాకెట్ కట్టించుకుంటూ, మూసుకున్న నా కనురెప్పలకింద వివాహ దృశ్యాలన్నీ ఊహించుకున్నాను. మీరుకట్టిన ఆ బంగారు లాకెట్ ను నేను మంగళ సూత్రంగానే భావించాను. మనం భౌతికంగా వేరైనా, మానసికంగా ఒకటే. మన వెనక ఎందరు ఎన్ని అనుకుంటున్నారో, ఎన్ని పుకార్లు ఉన్నాయో చెప్పనవసరం లేదు. మీరు రాధను వివాహమాడినా, నన్ను మరుస్తారన్న భయం లేదు. రాధలో నన్ను చిత్రించుకుంటారు. తద్ద్వారా నన్ను మీలో శాశ్వతంగా సజీవిని చేసుకుంటారు.
    కృతజ్ఞురాలిని! మీరన్నట్లు, మహా రచయిత్రి మాటలలో - ఎన్ని యుగాలతరబడి పొందిన జన్మ జన్మాంతరాల సంస్కారమో మీ ప్రియురాలిని కాగల గడం!
    ఇంకా ముందుతరాల్లో ఇదే భాగ్యాన్ని కోరుకుంటున్నాను.
    నమస్సులతో-
                                                                                              మీ
                                                                                              నీతా."
    వేణు దాన్ని డెస్కులో వేశాడు. తాళం ఒత్తేసి గదిలోనుండి వచ్చాడు. రాధ హాల్లో సి. నా. రె. వ్రాసిన 'అజంతా సుందరి' చదువుతున్నది. మెల్లగా ఆమె పక్కన కూర్చున్నాడు. రాధ చదవటం ఆపి, "ఏమిటి, మామయ్యా?" అంది అతనివైపు చూస్తూ.
    సునీత కనిపిస్తుందేమోనని రాధ కళ్ళలోకి చూశాడు. తన ప్రతిరూపమే ఆమె కనుదోయిలో కనబడింది. ఆ రూపం వెనకాల సునీత వ్రాసిన మాటలు తరంగాలుగా వ్యాపిస్తున్నట్లనిపించింది. వేణు రాధ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.
    రాధ రాగార్ధ్రంగా, "మామయ్యా!" అన్నది.
    "నేనే..... నేనే.... నువ్వున్నావు.....నువ్వు సర్వాంత ర్యామివి." ఆమె నయనాలకు సుతారంగా పెదవులంటించాడు. రాధ కదేమిటో తెలియలేదుగాని, మామయ్య గుండెలమీద తల వాల్చింది. వేణు ఆమె వీపు చుట్టూ చేతులు వేసి మరింత దగ్గిరికి లాక్కున్నాడు.
    రోజూ డైరీలో సునీతను పది పదిహేను వాక్యాల్లో నిర్వచించుకునే వేణు ఆవేళ ఆ పేజీనిండా అదె వ్రాసుకున్నాడు. తనలో ప్రేమబీజాలు నాటిన తోట మాలినిగా, ప్రియురాలుగా గౌరవించి ప్రేమించడం తప్ప, వేణుకు మరొకవిధంగా నడుచుకోవటం చేత గాదు.
    ఆవేళ రాధతో మునుపటికన్నా చనువుగా ప్రవర్తించాడు. రెండవ ఆట సినిమాకు వెళ్లారు. మరునాడు బట్టలు కొనుక్కుందామన్నాడు. రాధ తియ్యని కలల్లో తేలిపోయింది, మామయ్య తనతో అంత స్వేచ్చగా మసులుతున్నందుకు.
    గోవిందరావు జాబు వ్రాశాడు ఢిల్లీనుండి. విశేషాలేమీ లేవు.
    సునీత మామూలుగా ఆఫీసుకు వెళ్ళి వస్తూంది. వేణు యథాప్రకారంగా ఉంటున్నాడు. ఆర్తిలో మార్పు లేదు.
    తీరికవేళల్లో నీలకంఠం వట్టి పుస్తకాలపురుగు. ఇంటి దగ్గిర ఊరికే కూర్చోడు. ఏదో చదువుతూనో వ్రాస్తూనో ఉంటాడు. పుస్తకాలు చూసి వ్రాసుకున్న కాగితాలను బీరువాలోనో, పెట్టెలోనో పడేస్తాడు. అంతే! వాటిని మరిచిపోతాడు. తగని అశ్రద్ధ. ఎప్పుడన్నా సునీతకు చదివి వినిపించేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS