Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 32

 

    నీలకంఠం వస్తూనే ఇందాకా సగంలో ఆపుచేసిన ఉపన్యాసాన్ని కొనసాగించాడు. విశ్వానికికూడా ఆసక్తి కలగటంచేత, వింటూ మరో కుర్చీలో కూర్చున్నాడు.
    "అసలు కొందరు కాలేజీలకు ఎందుకు వస్తారో తెలియదు. క్లాసు ఓ ఫాషన్ సెంటర్ అనుకుంటారు. మగపిల్లలు-వాళ్ళ వెకిలి వేషాలు మనకు తెలియనివి కావు. ఆడవాళ్ళు న్నారే, మహాస్టైలు మెయిన్ టైన్ చేస్తారు. ఒకతె వేసిన స్టైలు మరొకళ్ళకు పనికిరాదాయె. అందులోనే ఈర్ష్యలు, ద్వేషాలు, వాళ్ళను చూసి విద్యార్ధులు కొక్కిరాయి వేషాలు, ఇకిలింపులు, సకిలింపులు."
    యాదగిరి హాల్లో కూర్చుని, రాజు ఆ నెల ఇంటి ఖర్చంతా ఏకరువు పెడుతూ ఉంటే ఆలకిస్తున్నాడు. సునీత వాళ్ళకు కొద్దిదూరంలోనే కూర్చుని ఏమిటో వ్రాసుకుంటున్నది, ఆ మాటలు వింటూ.
    "ఇందాకా మీరు మీ కాలేజీ స్టూడెంట్ లైఫ్ ను గురించి చెప్పారు. అందులో పెద్దమ్మ కారెక్టర్ నాకు బాగా నచ్చింది. అటువంటివాళ్ళు అరుదు. తను ఏకాకే అయినా, ధైర్యంగా జీవనరథం నడుపుకోగల గటం నిజంగా గొప్పదనం. ఆమె ఉద్యోగం చేస్తున్నదని చెప్పినపుడే అనుకున్నాను, చాలా సాహసికురాలని."
    "మీకు ఆమె జీవనవిధానం బాగా నచ్చిందనుకుంటాను!"
    "సందేహమా? ఒంటరివాళ్ళయిన స్త్రీలు, ఇంకా వికసించని మానసిక ప్రవృత్తి గల మనుష్యుల మధ్య మనగలగటం అసాధ్యం. మన దేశంలో అనివార్య పరిస్థితులైతే తప్ప, మన పెద్దవాళ్ళే అసలు అంగీకరించరు."
    "ఇందాకా ఉద్యోగంకన్నా చదువు కష్టమన్నారు! కొంచెం వివరంగా చెప్పగలరా? నాదీ నా అభిప్రాయమే కానీ, మీరేమంటారో, మీ భావం ఏమిటో వినాలనుకుంటున్నాను."
    "చదువంటే మనిషిని మానసికంగా ఎక్కువ శక్తిని వ్యర్ధం చేయించే పని. ఉద్యోగం, ఈ ఆఫీసుల్లో పనిచెయ్యటం - వీటికి చదువులా ఏకాగ్రత, వితర్కం అంత అవసరం లేదు. తమ ఆఫీసుకు సంబంధించిన ఫైళ్ళు వ్రాయటం, కాకపోతే, మేటర్ లో కాగితానికీ కాగితానికీ తేడా ఉంటుంది. అదేమంత కష్టమని! కానీ చదువు? చదవాలి.....చదువుతూనే అర్ధం చేసుకోవాలి. అంటే మస్తిష్కం మనకు తెలియనంత సూక్ష్మ కాలంలో వితర్కించుకోవాలన్నమాట. ఇవన్నీ వెంట వెంట జరగాలి. ఇంకా కేవలం పాఠ్యపుస్తకాలేకాక, ఇతర గ్రంథాలలో సేకరించవలసిన అంశాలు - సైన్సు వాళ్ళయితే లేబరేటరీలు, ఇందులో మూడు వంతులు. ఏదో ఒకటి ఉండవలసిందే గదా? ఆఫీసులో పనిచెయ్యటానికి వీటి అవసరం అంతగా ఉండదు. అందుచేత మేధ అంత శ్రమకు గురికాదు. ఆమాత్రమైనా పని చెయ్యకపోతే సోమరితనం అలవాటు కాదా?"
    "చదువంటే మీరేమనుకుంటారు?"
    "నా దృష్టిలో, ఒక్క టెక్నికల్ కోర్సులు తప్ప, మిగతావన్నీ సారం లేనివని, ఇంకా గట్టిగా అనాలంటే గుమాస్తాలకోసం, వాళ్ళను తయారుచెయ్యడాని కన్నట్లు ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళూ అంటూనే ఉన్నారు విద్యావిధానం సంస్కరించాలని. ఏదీ? తీర్మానాలుతప్ప ఆచరణశూన్యం. కాకపోతే పాఠశాలల, కళాశాలల సంఖ్య పెరుగుతున్నది."
    "ఉద్యోగం, చదువు - రెండూ ఒకే సమయంలో చెయ్యవచ్చా?"
    "చెయ్యవచ్చుగానీ నామటుకు నాకు విసుగు అని పిస్తుంది. అందుకే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళకోసం స్థాపించబడ్డ ఈ నైట్ కాలేజీలు, ఇటువంటి సిటీ ల్లోనే తప్ప మరోచోట నడవవు. అటు పగలంతా పనిచేసి, రాత్రి ఈ చదువు కొంత కష్టంగా ఉంటుంది. అందులో ఈ ఇరవయ్యో శతాబ్దంలో బతికే మనిషికి అలుపనేది ఊరికేనే వస్తుంది. మొదటిరోజుల్లో ఉత్సాహం రానురాను సన్నగిల్లవచ్చు. చదువుకోవాలని అభిలాష గట్టిగా ఉంటే, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారనుకోండి. ఏమంటే, కొన్ని గంటల శ్రమ తరవాత ప్రతివాడూ కొంత విశ్రాంతి కోరుకుంటాడు. అధిక శ్రమకు ఎవరూ ఇష్టపడరు."
    "చదువు మానసికంగా శక్తిని బాగా ఖర్చు చేయిస్తుందన్నారు. మీరు ఎప్పుడూ పుస్తకాలు రిఫర్ చేస్తుంటారు గదా? మీకు మానసికశ్రమ అధికంగా కలగదా?"
    "కాదు. ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలు కాలేజీలో పోతే, ఎనిమిది గంటలు నిద్రకు, అయిదు గంటలు దైనందిన కార్యక్రమాలకు, మరో మూడు నాలుగు గంటలు మీబోటి స్నేహితులు కలిస్తే గడపడానికి. పోతే మిగతా సమయం ఎంత ఉంటుంది? ఆమాత్రం మెదడుకు రాపిడి లేకపోతే, నేను మొద్దుకిందే జమ అయ్యేవాడిని."
    సునీత వ్రాయటం ఆపింది. "వినేవాళ్ళు, ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటే అన్నంగూడా అక్కర్లేదు. వెళ్ళి హోటల్లో కాస్త టిఫిన్ చేసిరండి!"    
    "ఆఁ ..... ఆఁ .... కొద్దిసేపైతే కారియర్ వస్తుందిగా? ఏకంగా అన్నం తినెయ్యచ్చు."
    ఆవేళ నీలకంఠానికి బస్సులో విశ్వం కలిశాడు. మాటవరసకు పలకరించి, వట్టిగా ఎందుకు ఉండాలని కాలేజీని గురించిన ఓ ప్రశ్న వేశాడు, విశ్వం. దానిమీద, బస్సులోనుండే చర్చ మొదలెట్టాడు నీలకంఠం.
    "ఆఁ! ఏమిటో చెబుతున్నానూ ... చదవటం గురించి కదూ?"
    "అవును! మీరు చదివేవారు, రాసేవాళ్ళను గురించి చెప్పండి."
    "రాసేవాళ్ళంటే? రచయితలనా?"
    "అలాగే అనుకోండి. వాళ్ళూ రాసేవాళ్ళే గదా?"
    "ఇప్పుడు నయం. రాజరాజుల కాలం సరేసరి. కానీ ఈ మధ్య సంధికాలంలో కవులు, రచయితలు దురదృష్ట వంతులు. పూర్వం ఏమాత్రం కళాభిరుచి ఉన్నా రెండు పద్యాలు చెప్పి, నాలుగు పాదాలు రాయగలిగినవారికి ప్రోత్సాహం ఉండేది. అప్పుడు వ్యక్తిగతంగా కాస్త ఆస్తి ఉన్నవాళ్లుకూడా ఉత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని వందలమంది ఆదరిస్తే తప్ప ఆ రచయిత రచయితే కాదు. కనీసం ఓ వెయ్యిమందైనా గుర్తించండి లాభంలేదు."
    "కవిత్వం అంటే మీకు ఇష్టమేనా?"
    "ఆహా! నేను బాగా ఇష్టపడతాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. అతననేదేమంటే, కవిత్వం మనసును తేలికపరిచే స్వభావం గలదిట. లోలోపల ఉప్పొంగుతున్న భావపరంపర కలంద్వారా కాగితం మీదికి ప్రవహించాక, ఆ వ్యక్తి ఓ రకమైన ప్రసన్న తను సాక్షాత్కరించుకోగలడు దుఃఖమూ, సంతోషమూ - ఏదైనాసరే - ఉక్కిరి బిక్కిరి చేస్తున్నపుడు. దానిని ఒకరికి చెప్పుకోవటంద్వారా, లేదా వ్రాసుకోవటం ద్వారా కొంత ఉపశాంతిని పొందవచ్చు.
    "మెదడు ఈ కార్యాన్ని అతి ఉద్వేగంగా చేయి స్తుంది. మనచేత భావపరంపర వేగం తగ్గి, తనను కున్న ప్రతి మాటా వ్రాసేక, కవి చాలా హాయిగా నిద్ర పోగలడు సాధారణంగా జరిగేదిది."
    "రచయితల నేవిధంగా ప్రోత్సహించాలి?"
    "సింపుల్! ఎవరేది వ్రాసినా చదవాలి. లోపాలుంటే నిష్పాక్షికంగా ఫలానా, ఫలానా అంటూ విమర్శించాలి. 'నువ్వీ తప్పు ఇకమీద చెయ్యద్దు. ప్రయత్నిస్తే బాగా రచించగలవు' అని చెప్పాలి. అంతేగాని 'నీ కసలేం రాదు, ఫలానావాడు రాసినట్లు నువ్వేం రాయగలవు? నువ్వు రాయటం మానెయ్' అనకూడదు. కానీ ఒకటండోయ్! అలా అంటేనే, నేనెందుకు రాయలేనో చూస్తాను అని. బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేసి, పైకివచ్చేవాళ్ళూ ఉంటారు. కాకపోతే - నూటికో అయిదారుగురు - చాలా స్వల్పం. అంతే!"
    "ఇదొక్కటే మార్గమా?"
    "ఆలోచిస్తే ఇంకా దొరుకుతాయి. నన్నడిగితే రచయితలకు రచన తప్ప మరే వ్యాపకమూ పనికిరాదు. అలసటలోనో, సరిపడని పరిస్థితుల్లోనో ఉత్తమ భావాలకు తావు ఉండదు."
    "కొందరు రచయితలు, కవులు కష్టాల్లోనే ఉత్తమ రచనలు చేసి, సత్యాల్ని బయటపెట్టారు. మరి వాళ్ళ సంగతి ఏమంటారు?"
    "అదికూడా నిజమే. కాని అందరూ అలా చెయ్యలేరు కదా! మహా మహా కవులు క్లిష్టమైన వాతావరణంనుంచే ఉత్తమ రచన లందించారు. ప్రజలను ఉత్తేజ పరిచి, ఒక విప్లవంలాంటిది లేవదీశారు. కాని నేననేది ఎక్కువ శాతం ఆ విధంగా సాధించలేరని."
    "ఎందు కనుకోవాలి? సరే. అది అలా ఉంచండి. రచయితలను ప్రోత్సహించే మరొక మార్గం చెబుతానన్నారు. చెప్పండి."
    "బాగా రాసేవాడైనా లేమిలాంటి ఆటంకాలవల్ల తన కళను సరిగా వ్యక్తం చెయ్యలేకపోవచ్చు. అందుకని మన కేంద్రంగాని, రాష్ట్ర ప్రభుత్వాలుగాని గుర్తించబడిన ప్రతి భాషకు ఒక ఏడెనిమిది మందిని జీతాలిచ్చి పోషించవచ్చు. వారెక్కడికి వెళతామన్నా పంపాలి. ప్రతి ప్రాంతాన్ని చూడటంవల్ల, ఆయా ఆచార వ్యవహారాలు, వేషభాషలు - ఇవన్నీ వాళ్ళ భావాలకు మెరుగులు దిద్దుతాయి. అందువల్ల ప్రపంచ సాహిత్యంలో మనకూ కీర్తి ఎలా అంటే, ఒక మంచి రచయిత ఉన్నాడు. అతను మీరన్నట్లు పేదకుటుంబంలో వాడు. ఆ కుటుంబభారం అతనిదే! చక్కగా ఆ రకమైన వాతవరణాన్ని కళ్ళకు కట్టించేలా రాస్తాడు. అది ఎవరు వేసుకుంటారు? అమ్మితే తగిన ప్రతిఫలం వస్తుందో, లేదో? తను వేయించటానికి డబ్బు లేదు. పబ్లిషర్సు నందో యాభయ్యో ఇస్తామంటారు. వాళ్ళకూ అది అమ్ముడవుతుందో లేదో నమ్మకం లేదు. అందువల్ల పైసా చెయ్యని ఈ రాతల్ని వదులుకునా వదలవచ్చు. అలాంటి వ్యక్తి 'జీత మిస్తాం. మంచి రచనలు చెయ్యి. అన్ని హక్కులూ నీవే' అంటే నోబెల్ బహుమతి కూడా తీసుకునేంత ఉత్తమంగా రాయవచ్చు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS