Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 34

                  
    ఏ పుస్తకం కనిపించినా వదలడు. వంటింటి వైద్యం వ్రాసిన శాస్త్రులవారి పుస్తకమైనా, ఐన్ స్టీన్ అణు సిద్దాంతాలయినా చదవవలిసిందే! చరిత్ర జీవశాస్త్రం, లెక్కలు-ఏదైనాసరే చదవటం, నచ్చినవాటిలో ముఖ్యమయినవని తోచినవాటిని కాగితాల మీద నోట్ చేసుకోవటం.
    ఒకసారి సునీత అడిగింది, ఏదన్నా వ్యాసం ఉంటే ఇమ్మని ఏదో కనిపించినది బీరువాలోనుంచి తీసి ఇచ్చాడు. అదంతా చారిత్రక నిరూపణ. బీరువాలో ఇంకా కాగితాలు చాలా అవుపిస్తున్నాయి. అవేమిటని అడిగింది.
    "అవన్నీ.... చాలా రకాలున్నాయి. ఏమని చెప్పను?"
    "నాకిచ్చేస్తారా?"
    "మీకా? ఎందుకు? ఏం చేసుకుంటారు?"
    "చదివి ఇచ్చేస్తాను. ఏపత్రికకైనా పంపుకుంటే..."
    "చూడవచ్చు! అయినా నా రాత, గుర్తులు వాళ్ళకు తెలియవు. మళ్ళీ సాపుచేసే ఓపిక లేదు."
    "మీరు సేకరించిన ఈ విజ్ఞానమంతా బీరువా అడుగున మరుగుపడేస్తే లాభమేముంది?"
    "వ్యాపారం కాదు గదా?" బద్ధకంగా ఆవలించాడు.
    ఏది చెప్పినా అంతే. తగని బద్ధకం.
    ఆ కాగితాలన్నీ తీసుకున్నది సునీత. అన్నీ ఓ మూడు దస్తాలు ఉంటాయి. ఒక ఆదివారంనాడు కూర్చుని, క్రమం అంటూ లేకుండా ఉన్నవాటిని చదువుతూ, వేటి కవి వేరుచేసింది ఓపికగా. మొత్తం ఒక నలభై దాకా వ్యాసాలు లెక్క తేలాయి. కొన్ని కాగితాలు అసలు బోధపడకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని పారవేసింది.
    సామాజిక జీవితంలో కలిగిన అభివృద్ధిని, అనాదిగా మానవుని కార్యకలాపాలను వివరిస్తూ, పాశ్చాత్య దేశాలకు, మన దేశానికి ఉన్న తేడాలతో వాటిలో మంచి చెడులను నిరూపిస్తూ వ్రాసిన వ్యాసం అన్నిటికన్నా పెద్దది. సునీతకు అదే బాగా నచ్చింది. మిగతావన్నీ రకరకాలు-
    భాష మాత్రం ఎక్కువగా ఆంగ్లం. అదైనా కఠిన పదాలతో, డిక్షనరీల దగ్గిరికి పరిగెత్తించేలా ఉంది.
    సునీతకు ఒక విషయంలో ఆశాభంగం కలిగింది. ఆమె వ్రాయలనుకున్నవి కథలు, కల్పనలు. ఇవన్నీ వ్యాసపరంపరలు.
    యాదగిరి అవి చదివాడు, ఒకటి రెండు. ఆయనొక సలహా ఇచ్చాడు. "ప్రపంచంలో విజ్ఞానం రోదసిలోకి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నది. అందరూ కథా రచయితలే అయితే సామాన్యులకు ఒకపట్టాన సుబోధకం కాని ఈ నిరూపణలు, పరిశోధనలు తెలిపేవారు ఉండరు. కొందరు వైజ్ఞానిక రచయితలు కూడా ఉండాలి."
    ఏ వ్యాపకం లేకుండా వట్టిగా కూర్చునేదానికన్నా ఇదన్నా కొంత మేలనుకుంది. అందుకే తనకు నచ్చిన ఆ వ్యాసాన్ని సందర్భోచితమైన ఉదాహరణలతో, సరళమైన ఇంగ్లీషు శైలిలో వ్రాసి, దాన్ని మళ్ళీ తెలుగులోకి అనువదించింది. మరొక రెండు వ్యాసాలను ఉర్దూ, హిందీ, తెలుగుల్లోకి అనువాదం చేసింది. ఆంగ్ల ప్రతులను ఆంగ్ల దినపత్రికలకు మిగతావాటిని ఆయా భాషల వారపత్రికలకు పోస్టు చేసింది. అను వాదాల్లో తప్ప, ఇంగ్లీషులో నీలకంఠం పేరే ఉంచింది. ప్రతి కాపీలో మూల రచయిత పేరు తప్పకుండా ఉంచింది. చిరునామామాత్రం అన్నిటికీ నీలకంఠం కాలేజీకే ఇచ్చింది.
    క్లుప్తంగా వ్రాసుకోవటంతప్ప, నీలకంఠం భాషను గురించి పట్టించుకోడు. ఇంగ్లీషైనా, తెలుగైనా ఎక్కడలేని పదాలు దొర్లుతాయి. నీలకంఠం దగ్గిర డిక్షనరీ తీసుకోకపోతే అవేమిటో అసలు ఆమెకు తెలిసేవేకావు. అతను నాలుగు పేజీలు  వ్రాసుకుంటే పదిహేను పేజీలయ్యేది సవివరంగా వ్రాసేసరికి.
    తను వాటిని పత్రికలకు పంపినట్లు అతనికి చెప్పలేదు. రెండు రోజులకు ఒకసారి ఆర్తిని కలుసుకోవటం తప్ప, ఎక్కడికీ కదలదు. ఆఫీసు, ఇల్లు. ఆఫీసులో టైప్ రైటింగ్, ఇంట్లో హేండ్ రైటింగ్. ఇంగ్లీషులో ముందు వ్రాసి, తనకు తెలిసిన మూడు భాషల లోకి మార్చి, కాస్త పేరుఉన్న పత్రికలకు పంపటం.
    రెండు మూడు రోజుల కోసారి ఏవో కాగితాలు తెస్తూనే ఉంటాడు నీలకంఠం. సునీత వాటిని అడిగి తీసుకుంటుంది. అవి ఏమయ్యాయో, సునీత వాటినేం చేసిందో నీలకంఠం ఎన్నడూ అడగడు.

                                   19

    ఎందుకో యాదగిరికి మనస్సంతా వికలమైంది.
    నీలకంఠం అప్పుడే వచ్చి పుస్తకాల్లో తలదూర్చాడు.     
    ఒక్కొక్క రోజు ఎందుకనో వద్దంటున్నా, గతం కళ్ళముందుకు వస్తుంది. ఆవేళ యాదగిరి ఇద్దరు కొడుకులకు ఉత్తరాలు వ్రాశాడు. ఎప్పుడోతప్ప, ఆయన సాధారణంగా అలా వ్రాయడు. ఈ గతాన్నుండి తప్పించుకుని రామకోటి అయినా వ్రాద్దామంటే ఏకాగ్రత కుదరటంలేదు.
    కళ్ళు మూసుకుంటే సరి, దేవకి సాక్షాత్కరిస్తూంది. అప్పుడు ఆయనా, ఎన్నో ఏళ్లబట్టి ఆయనకు అలవాటైన వాలు కుర్చీ, అందులో తనూ, తన స్మృతులూ - ఇవే ఉంటాయి.
    ఆమె .... దేవకి ఎంత సుందరంగా ఉండేదని! తను వెళితే ఎంతో మర్యాదగా కాఫీ ఇచ్చి కూర్చోబెట్టేది. వాళ్ళ అన్నయ్య లేకుండివా, చనువుగా ఉండేది. స్వీట్సు తెచ్చిపెట్టేది. పాలల్లో పంచదార కన్నా గ్లూకోజు మంచిదని తన ఎదురుగా వాటిలో కలిపి ఇచ్చేది. తనమీదికి ప్రహసనాలు వదిలేది. నవ్వించేది. వాళ్ళ అన్నయ్యకూడా అపార్ధం చేసుకునేవాడుకాదు. అతనేకాదు. అందరూ ఎంతో ఆదరాభిమానాలు ప్రదర్శించేవారు. పైగా వాళ్ళుకూడా తమ మాటల్లో పాల్గొంటూండేవారు. తను పెండ్లి అయినవాడు. ఇద్దరు బిడ్డల తండ్రి. అందుకే అనుమానాలకు తావు ఉండేదికాదు. తను? తనకుమాత్రం? అసలు ఏ పాడు ఉద్దేశ్యమూ ఉండేదికాదు.
    తనామెకు ద్రోహం చేశాడు. ఆ త్యాగమూర్తి తన పేరు వెలువరించకుండానే తన ప్రాణాలను బలిపెట్టు కుంది. ఆ వేశానికి బాధ్యత పూర్తిగా తనదే అయినా, ఆమే వహించింది. తనే శిక్ష అనుభవించింది. తన పాపం పండే రోజు వస్తుంది. రావాలి. తమ కుక్కచావు చస్తాడు ...
    ఇలా సాగుతూంటుం దాయన గతావలోకనం.
    సునీత దేవకి బిడ్డే కాదుగదా? అన్న తలంపు. దానికి తగ్గట్లే ఆమె రూపం, స్వరం. చివరికి నడకకూడా ఆమెనే స్ఫురింపజేస్తూంది. తనను "బాబాయ్" అనే బదులు నాన్న అంటే బాగు! నీవెవరు? మీ అమ్మా, నాన్నల పేరేమిటి? అని అడగాలన్న వెర్రి ఊహ. అడగాలనుకుని సునీతను పిలవబోయిన పిలుపు నాలుక చివరిదాకా వచ్చి ఆగిపోతుంది. సునీత ఏమనుకుంటుందో? ఆ ప్రశ్నలు వేసి అవమానించావని వెళ్ళిపోతుందేమో?
    సునీత యథావిధిగా ఉంటూంది. యాదగిరి ఆమె కిప్పుడు అద్దె ఇంటి యజమాని కాదు. ఆప్యాయంగా "సునీతా" అంటే ఆమె కరిగిపోతుంది. కేవలం అద్దె కుంటున్న పరాయిదానిలా కాక, ఆయన స్వంత బిడ్డకన్నా ఎక్కువైంది. అందుకే ఆఫీసుకు దూరమైనా ఇల్లు మార్చలేదు. ముందు తాత్కాలికంగా అనుకునే ప్రవేశించినా, రానురాను ఆ ఉద్దేశ్యం అడుగునపడింది. అంతకన్నా మంచి ఇల్లు చౌకలో దొరికినా వద్దు. అసలు యాదగిరి ముందు ఒప్పుకోడు.
    ఆమధ్య ఆర్తిని చూశాక మరీ కుమిలిపోతున్నాడు. వెళ్ళాలంటే చేసిన తప్పు ముందుకువచ్చి, ఏ ముఖం పెట్టుకుని వెళుతున్నావని నిలదీస్తున్నట్లుంటుంది. ఇక వెళ్ళ బుద్ధికాలేదు.
    చాలాసేపు గడిచింది. నీలకంఠం కాసేపు చదువు కున్నాడు. మరికాసేపు వ్రాసుకున్నాడు. ఫ్లాస్కులో కాఫీ ఉందేమో చూస్తే అడుగున ఓ అరకప్పు ఉన్న ట్లుంది. దాన్ని మూతలో పోసుకున్నాడు. ఆ ఫ్లాస్కు లోకి రోజూ కాఫీ ఎలా వచ్చి నిండుతుందో అతనికి అవసరంలేదు. దాన్నెక్కడ పడేసి వెళ్ళినా తిరిగి వచ్చేసరికి కాఫీతో నిండి, చిలకకొయ్యకు తగిలించి ఉంటుంది. చిందరవందరగా, అడ్డగోలుగా, ఎక్కడి వక్కడ వదిలి పోయిన పుస్తకాలు తిరిగి ఒక వరసలో బీరువాపైన పేర్చి ఉంటాయి. ఈ గారడీ ఎవరు చేస్తున్నారో డిటెక్ట్ చేసి వెలికి తియ్యాలని పుస్తకం తీస్తూ అనుకుంటాడు. నాలుగు పంక్తులు చదవగానే, అది దాని దోవ కది తప్పుకుంటుంది. అయినా వీటిని పట్టించుకునే తీరికెక్కడిది? కాలేజీకి వెళ్ళాలి! పాఠాలు చెప్పాలి! బుక్స్ స్టడీ చేసి స్టూడెంట్సుకు ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, నిర్ణీతకాలంలో సిలబస్ పూర్తి చెయ్యాలి! మనస్సులో ఏకాగ్రత లేకపోతే అలా షికారు వెళ్ళాలి. స్నేహితులు కలిస్తే కాసేపు అయినా మాట్లాడాలి. ఇవన్నీ అయ్యేసరికి అలిసిపోతాడు. నిద్ర. అబ్బో! ఈ అర్ధంలేనివాటికోసం టైమ్ పాడుచెయ్యటం .... అసలు ఉంటే గదా చెయ్యడానికి?
    ఆవేళకు చదవడం చాలనుకున్నాడు. పుస్తకాలన్నీ మూసేసి చాపమీద ఆ నాలుగు పుస్తకాలు పేర్చాడు. వాటినే దిండుగా చేసుకుని, పైకప్పు చూస్తూ, ఎదురు రొమ్ముమీద చేతులానించుకుని, కాళ్ళాడిస్తూ చాలాసేపు పడుకున్నాడు. అదీ నచ్చక మళ్ళీ బయటికి వచ్చాడు. వరండాలో గిరి ఉన్నాడు.
    "తాతయ్యగారూ!"
    ఆయన వాస్తవికతలోకి వచ్చాడు.
    "పెద్దమ్మ రాలేదూ?"
    "ఇంకా లేదు. వస్తూ ఉంటుంది."
    ఆరు గంటలకు సునీత, కరుణ కలిసి వచ్చారు. వాళ్ళను చూసి, "గుడ్ ఈవెనింగ్, కరుణాదేవీ! మీ జాబ్ ఎలా ఉంది? ఏం పెద్దమ్మా, ఇవ్వాళ ఆలస్యంగా వచ్చారేం?" అన్నాడు.
    "ఇదో....కరుణాదేవి....ఇవ్వాళ తన పెళ్ళి సందర్భంగా అడ్వాన్సు పార్టీ ఇస్తానని..."
    "హోటల్ కెళ్ళారా ఏం?"
    "వెళ్ళగూడదా?"
    "నో! నో! అదికాదు..... హోటల్ డిన్నరా, ఇంటి లోని విందు..."
    "మీరు లేరని తెగ విచారపడింది. ఏమే?" మోచేతితో పొడిచింది సునీత. కరుణ తల దించుకుంటూ, "ఏమిటే ఆ మోటూ?" అంది.
    "నేనే మోటుదాన్ని! నీలకంఠం సున్నితమైనవారు ఏమే?"
    గలగల నవ్వాడు నీలకంఠం కరుణ మరింత తల దించుకుంది.
    కరుణ మాటల సందర్భంలో చెప్పింది : "మా అమ్మ వద్దంటున్నది. ఆమె కీ పెళ్ళి ఇష్టంలేదు. వాళ్ళతో మనం సరితూగలేం, మానెయ్యటం మంచిదంటూంది."
    "మానేస్తావా, ఏం?"
    "ఉహూఁ! తమ్ముడుకూడా చేసుకోమంటున్నాడు. వాడికికూడా నేను మోడులా గడపటం ఇష్టంలేదు. ఈ ఏప్రిల్లో పరీక్ష రాసేస్తే, ఎక్కడన్నా ఉద్యోగం సంపాదించుకుని, అమ్మ భారం తను తీసుకుంటాడుట."
    "ఇంకేం?"
    "ఏం లేదు. కానీ అమ్మ తీవ్రంగా ప్రతిఘటిస్తూంది. తన మాట వినకపోతే బావిలో పడుతుందిట!"        "నువ్వు సుఖపడటం ఆమె కిష్టంలేదా?"
    "ఉంది! ఎవరో నాకు తగినవాడిని ఎన్నుకోమంటూంది!"
    "నేను మీకు తగనా?" నీలకంఠం ప్రశ్న.
    "నే ననను. మీరు ధనవంతులుట, వివరాలన్నీ చెప్పానులెండి. అందుకే నేను అత్తారింటికి వెళితే చాకిరీ గొడ్డుగా చూస్తారుట!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS