Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 31


    "నందిని హత్య చేయాలనుకోలేదు. ఆమెను నువ్వే ప్రోత్సహించావు..."
    "నేనూ హత్య చేయాలనుకోలేదు. అందుకు మీ అబ్బాయే నన్ను ప్రోత్సహించాడు..." అన్నాడు చక్రధారి.
    "మీ అబ్బాయికూడా చావాలనుకోలేదు. అందుకే గదా నేను మోసపు మందు సృష్టించాను, అలాంటి మందు నింతవరకూ యెవరూ కనిపెట్టలేదు. గూఢచారులకూ, నేరస్థులకూ యెంతో ప్రయోజనకారికాగల ఈ మందుకు నేను-'జీ 87' అని పేరు పెడదామనుకుంటున్నాను. జీ స్టాండ్స్ ఫర్ గంగాధరం..." అన్నాడు డాక్టర్ గంగాధరం.
    "విషం మీరిస్తే కదా-నందినికి దొరికింది...." అన్నాడు సోమేశ్వరరావు.
    "కావచ్చు. కానీ ఆమెకు మా పథకం గురించి ముందుగానే తెలిసిపోయింది. ఈ అవకాశాన్ని తీసుకుని గోవర్ధన్ ని హత్య చేయాలనుకుంది. ఎక్కణ్ణించొ నిజం విషాన్ని సంపాదించి అతడికిచ్చింది."
    "మీరిచ్చింది నిజం విషం కాదని ఆమెకు ముందుగానే తెలుసంటారా?" గంభీరంగా అడిగాడు సోమేశ్వరరావు.
    "నేనే ఆమెకు ముందుజాగ్రత్త కోసం చెప్పాను. ఈ విషయం నూటికి తొంభై తొమ్మిదిపాళ్ళు పనిచేస్తుంది. ఆపైన అదృష్ట ముండాలని....అందుకని ఆమె రిస్కు తీసుకోకుండా నూటికి నూరుపాళ్ళు పనిచేసే విషమైనా సంపాదించి వుండాలి. లేదా ముందుగానే మా పథకమంతా తెలుసుకుని ఉండాలి-" అన్నాడు చక్రధారి.
    సోమేశ్వరరావు వారందరివంకా తీక్షణంగా చూసి-"నేను చాలా పవర్ ఫుల్ మనిషిని. నాకు మీ మీద అనుమానం కలిగితే మీ అంతు చూస్తాను. నా కన్నకొడుకు మీద నాకు సదభిప్రాయం లేదు. నా కోడలంటే జాలి, సదభిప్రాయం కూడా ఉన్నాయి. తనకుతానై ఆమె విషం మార్చి చంపిందంటే నేను నమ్మలేను. నన్ను మీరు నమ్మించగలిగితే నా కోడలి సంగతి నేను చూసుకుంటాను. నమ్మించలేకుంటే మిమ్మల్ని ఉరికంబ మెక్కిస్తాను. అంతవరకూ మా అబ్బాయి శవాన్ని కూడా మీరు కాపాడాలి-" అన్నాడు.
    "అంతవరకూ అంటే?" అన్నాడు చక్రధారి.
    "నా కోడలిచ్చిన విషం ఆమెకు మీరిచ్చింది కాదనడానికి ఋజువు కావాలి-నా అనుమానం మీ జీ-87 మీద ఇంకా పరిశోధన జరగాల్సుందని-...." అన్నాడు సోమేశ్వరరావు.
    "నా జీ-87 ని ముందు ఎలుకలమీదా, తర్వాత కుందేళ్ళమీదా అటుపైన ఇద్దరు బిచ్చగాళ్ళమీదా అ తర్వాత చక్రధారిమీదా కూడా ప్రయోగించాను-" అన్నాడు డాక్టర్ గంగాధరం.
    "అయినా అది నా కొడుక్కు వికటించి వుండొచ్చు" అన్నాడు సోమేశ్వరరావు.
    "గోవర్ధన్ని నేను పరీక్షించాను. అతడిపై ఎలాంటి విషం ప్రయోగించబడిందో నా కర్ధంకాలేదు. విషప్రయోగాల విషయంలో నేను స్పెషలిస్టుని. ఈ విషం గురించి నేను పరీక్ష చేయాల్సి వుంది-...." అన్నాడు గంగాధరం.
    "మీ జీ-87 శాంపిల్ నాకివ్వండి. నేను నాకు తెలిసిన నిపుణుల ద్వారా దాన్ని పరీక్షింపజేస్తాను-" అన్నాడు సోమేశ్వరరావు.
    చక్రధారి సోమేశ్వరరావు వంకే ఆశ్చర్యంగా చూస్తోన్నాడు.
    ఈ పెద్దమనిషి కడుపులో యెలాంటి ఊహ లున్నాయి?
    కన్నకొడుకు చనిపోతే చలించకుండా యింత నిర్లిప్తంగా యెలా ఉండగలుగుతున్నా డీ వ్యక్తి?
    ఇతడివల్ల తమ కెలాంటి ప్రమాదం సంభవించవచ్చు?
    చక్రధారి ఆలోచన లెలాగున్నప్పటికీ-సోమేశ్వరరావు డాక్టర్ గంగాధరంవద్ద జీ-87 శాంపిల్ తీసుకున్నాడు. శవాన్ని ఒకరోజుపాటు జాగ్రత్తగా భద్రం చేయమన్నాడు.

                                     6

    సీతమ్మ, రాజమ్మ ఏకకంఠంతో-"నోట్సు రాయడం అయిపోయింది-" అన్నారు.
    "నువ్వు చదువు సీతమ్మా!" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
    సీతమ్మ గొంతు సవరించుకుని-"నందినిని భర్త గోవర్ధన్ క్రూరంగా హింసించి బాధిస్తున్నాడు. ఆమెకు చక్రధారి సాయపడతాడని చెప్పి ఒక విషం ఇచ్చాడు. చక్రధారి గోవర్ధన్ ఏజెంటు. తాత్కాలికంగా విషప్రయోగ లక్షణాలు చూపించే జీ-87 అనే మందును డాక్టర్ గంగాధరం కనిపెట్టాడు. ఆ మందునే చక్రధారి నందిని కిచ్చాడు. నందిని ఆ మందునే భర్తపై ప్రయోగించింది. గోవర్ధన్ తాత్కాలికంగాకాక శాశ్వతంగా మరణించాడు. ఈలోగా చక్రధారి ద్వారా గోవర్ధన్ పథకం గురించి తెలుసుకున్న చక్రధారి ప్రియురాలు చంద్రిక నందినికి అసలు కథ చెప్పేసింది. నందిని విషయం తన మామగారికి చెప్పింది. ఆయన మనవద్దకు వచ్చాడు" అంది.
    "ఇందులో కొన్ని పాయింట్లు మిస్సయ్యాయి-" అంది రాజమ్మ.
    "ముఖ్యమయిన విశేషాలే చదివాను. అన్నీ చదవమంటే చదవగలను-" అంది సీతమ్మ.
    "గుడ్....బాగా చదివావు..." అని మెచ్చుకుని......"సోమేశ్వరర్రావుగారూ- నే నేం చేయాలో మీరు చెప్పండి...." అన్నాడు వెంకన్న.
    "నా కోడలు నా కొడుక్కిచ్చిన విషం శాంపిలూ, డాక్టర్ గంగాధరమిచ్చిన జీ-87 శాంపిలూ ఒకటేనా అన్నది మీరు తేల్చాలి. ఆపైన యిందులో నా కోడలి పాత్ర ఏమిటీ అన్నది కూడా మీరు తేల్చాలి. ఇందుకెంతో వ్యవధి లేదు. ఒక్కరోజులో మీరన్నీ తెలుసుకోవాలి-" అన్నాడు సోమేశ్వరరావు.
    "ఎందుకొచ్చిన గొడవ? మీ అబ్బాయిని చంపిన హంతకులని ఆ చక్రధారి బృందాన్ని పోలీసుల కప్పగిస్తే సరిపోతుందిగా-" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
    "వెంకన్నగారూ! నే నాడవాళ్ళను రెండు తరగతులుగా విభజిస్తాను. ఒకరు విలాస జీవితాన్ని కోరేవారు వేరొకరు పవిత్రులుగా ఆరాధించబడాలనుకునేవారు మొదటి తరగతివారిని నేను నా సుఖాలకు వినియోగించుకొంటాను. రెండోతరగతివారిని ఆరాధిస్తాను. నా భార్య నా కూతురు రెండోతరగతికి చెందినవారు. నా కోడలు కూడా ఆ తరగతి మనిషేనని నా అనుమానం. ఆమె సహచర్యంలో నా అబ్బాయి బాగుపడతాడనుకున్నాను. కానీ వాడామెను క్రూరంగా హింసించాడు. పరోక్షంగా ఆ హింసకు బాధ్యుడ్ని నేను ఆ తప్పు నేను సవరించుకోవాలి.
    ఆమె కావాలని గోవర్ధన్ ని చంపితే అదామె తప్పుకాదు. అయితే ఆమె క్రూరహింసలు భరించలేక భర్తను చంపాలనుకుందా? లేక విలాస జీవితాన్ని కోరి చక్రధారితో చేతులు కలిపిం'దా? ఈ ప్రశ్నకు సమాధానం యెంతైనా అవసరం. విలాస జీవితాన్ని కోరే పక్షంలో నందిని బాధ్యత నాకేమీ లేదు. ఆమె పవిత్రురాలే అయితే-ఆమె భవిష్యత్తును సంరక్షించడం నా బాధ్యతగా భావిస్తాను...."
    "విషపరీక్షకూ-దీనికీ సంబంధ మేమిటి?"
    "ఉంది వెంకన్నగారూ-ఉంది! తానిచ్చిన జీ-87 తాత్కాలికమని చక్రధారి అంటున్నాడు. అలాంటప్పుడు గోవర్ధన్ ప్రాణాలెలా పోయాయి? నందినికి వేరే ఇంకా పరిచయాలున్నాయా? విషం సరైనదికాదని ఆమెకు ముందే తెలియజెప్పి-శాశ్వతంగా ప్రాణాలుతీసే విషాన్నామె కందించిన వారెవ్వరై ఉంటారు?" అన్నాడు సోమేశ్వరరావు.
    "ఈ ప్రశ్నలకు మీ కోడలే జవాబు చెప్పగలదు. అడిగిచూడలేదా మీరు?"
    "అడిగాను ఆమె చెప్పిన జవాబు విచిత్రంగా ఉంది-...." అన్నాడు సోమేశ్వరరావు.
    "విచిత్రమంటే?"
    "చక్రధారిచ్చిన విషాన్నామె పూజా మందిరంలో ఉంచిందట. తనకు న్యాయం జరిపించమని భగవంతుణ్ణి ప్రార్దించుకుందిట. తను చేసేది తప్పు కాకుంటే ఆ విషం భర్త ప్రాణాలు తీయాలని ఆమె భగవంతుణ్ణి కోరుకుంది. భర్త చనిపోతే అది దేవుడి మహిమే అయుండాలని ఆమె అంటుంది. భర్త నిజంగా చనిపోయాడని నా ద్వారా విన్నప్పుడామె కళ్ళలో నీళ్ళుకూడా తిరగలేదు. గోవర్ధన్ వంటి భర్త జీవించి ఉండడం కంటే పంతొమ్మిదవ శతాబ్ధపునాటి వైధవ్య సంప్రదాయమే తనకు మెరుగని ఆమె అంది..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS