Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 31


    కిల్లర్ వాళ్ళ ముఖభావాలనే గమనిస్తున్నాడు.
    "ఈ ప్రశ్నలు మీరు మమ్మల్నెందుకు అడుగుతున్నట్లు?" అన్నాడు మహావీర్ సింగ్.
    కిల్లర్ అతడికి శ్రీమన్నారాయణ టెర్రరిస్టుల చేత కాల్చబడ్డ విశేషం చెప్పాడు.
    "అసాధ్యం! ఆ రోజు మా స్నేహితు లీ ప్రాంతాల లేరు-" అన్నాడు మహావీర్ సింగ్ పెద్దకొడుకు.
    "వాళ్ళు కాకపోతే వాళ్ళ పేరుతో మరొకరు...." అన్నాడు కిల్లర్.
    "ఇందులో ఏదో తిరకాసుంది-" అన్నాడు మహావీర్ సింగ్ రెండో కొడుకు.
    మహావీర్ సింగ్ మూడో కొడుకు సాలోచనగా-"మీరు చెప్పిన ప్రాంతాల తోతారామ్ అనే కుర్రాడు తిరుగుతూంటాడు. అక్కడేం జరిగినా వాడి దృష్టి నుంచి తప్పించుకోదు-" అన్నాడు.
    "తోతారాం ఎవరు?"
    "వాడొక పశువుల కాపరి. కానీ విచిత్రమైనవాడు. వాడు చెబితే పశువులు బుద్ధిగా వుంటాయి. ఇతరుల పొలాల్లోకి వెళ్ళవు ఎక్కడికీ తప్పిపోవు. వాటి మానాన వాటిని వదిలి తనెక్కడెక్కడో తిరుగుతూంటాడు వాడు.....
    "అయితే మనం వాణ్ణి కలుసుకుదాం-"అన్నాడు కిల్లర్.
    "మీ రిక్కడే ఉండండి నేను వాడిని కలుసుకుని అసలు విషయం తెలుసుకుని వస్తాను...." అంటూ మహావీర్ సింగ్ మూడో కొడుకు లేచాడు.
    "నేనో వస్తాను. వాణ్ణి నేను స్వయంగా కలుసుకుని మాట్లాడాలి-" అన్నాడు కిల్లర్.
    "లాభం లేదు తోతారాంను పట్టుకోవడం, మాట్లాడించడం ఇతరులవల్ల కాదు...." అంటూ జవాబుకోసం యెదురుచూడకుండా తాను వెళ్ళిపోయాడు మహావీర్ సింగ్ మూడో కొడుకు.
    "నరసింగరావు టెర్రరిస్టు లెలా వుంటారో మీకు వర్ణించి చెప్పలేదా?" అన్నాడు మహావీర్ సింగ్.
    "చెప్పాడు-" అన్నాడు కిల్లర్.
    "వాళ్ళెలా వుంటారో చెప్పండి. మా స్నేహితుల పోలికలతో కలుస్తాయేమో చూద్దాం-" అన్నాడు మహావీర్ సింగ్ రెండో కొడుకు.
    కిల్లర్ అతడి కళ్ళలోకి చూశాడు. కుతూహలం, భయం, అనుమానం వగైరా రకరకాల భావాలున్నాయి ఆ కళ్ళలో!
    "వాళ్ళు ముగ్గురు దృఢంగా ఉంటారు. గెడ్డాలూ, మీసాలూ వుండవు. చూడగానే హిందువు లనిపిస్తుంది...." కిల్లర్ వాళ్ళ ముఖభావాలను గమనిస్తూ అన్నాడు.
    మహావీర్ సింగ్ నిట్టూర్చి-"మతం గుర్తు తెలియాలంటే-మనిషికో, ఆలయానికో రూపం మార్చాలి. మత గ్రంథానికి వేరే పేరు పెట్టాలి. లేకుంటే అంతా ఒక్కటే కదా!" అన్నాడు.
    సింగ్ తానెక్కువగా సంభాషణలో జోక్యం చేసుకోవడంలేదు "అతడా ముగ్గురు యువకుల్నీ నరసింగరావు హంతకులుగా చిత్రించి ఇచ్చాడన్న నిజాన్ని బయట పెడతాడా?" అని అతడాలోచిస్తున్నాడు.
    కిల్లర్ కీ, సింగ్ కీ - యింట్లోంచి పరోటాలూ, ఆలూ మటన్ వచ్చాయి. వేడిగా వున్న ఆ పదార్ధాలు వారి కెంతో రుచికరంగా అనిపించాయి.
    కాసేపు వారక్కడ విశ్రాంతి తీసుకున్నారు.
    సుమారు గంట తర్వాత మహావీర్ సింగ్ మూడో కొడుకు తిరిగివచ్చాడు. అతడి ముఖం నీరసంగా వుంది.
    "ఏమయింది?" అనడిగాడు మహావీర్ సింగ్ ఆశ్చర్యంగా.
    కొడుకు మాట్లాడలేదు.
    "తోతారాం దొరకలేదా?"
    "దొరికాడు...."
    "తనావేళ ఏమైనా చూశాట్ట?"
    "చూశాడు-"
    "ఏం చూశాడు?"
    "చెబితే ఎవరూ నమ్మరు....."
    "నేను నమ్ముతాను-చెప్పు!"
    "నరసింగరావు శ్రీమన్నాయణను చంపేశాట్ట...."
    అందరి కంటే యెక్కువగా రామచరణ్ సింగ్ ఉలిక్కిపడ్డాడు.
    "అదెలా సాధ్యం?" అన్నాడు మహావీర్ సింగ్.
    "ఇద్దరు మనుషులలా వస్తూంటే అంతవరకూ చెట్టు కింద కూర్చున్న తోతారాం చెట్టుచాటుకు వెళ్ళాట్ట. ఏం జరుగుతుందో గమనిస్తున్నాట్ట. వాళ్ళిద్దరూ వాడి కర్ధం కాని భాషలో మాట్లాడుకుంటున్నారుట. ఉన్నట్లుండి నరసింగరావు తన చేతిలోని డబ్బాలోని పెట్రోలు చటుక్కున శ్రీమన్నారాయణ మీద పోసి-ఏమేమో మాట్లాడేట్ట. శ్రీమన్నారాయణ భయపడ్డాట్ట. తర్వాత అతడు లైటరుతో శ్రీమన్నారాయణను అంటించే శాట్ట.....శ్రీమన్నారాయణ భయంకరంగా కేకలు పెడుతూంటే అతడిమీద మరింత పెట్రోలు విదిలించి పక పకా నవ్వేట్ట.....శ్రీమన్నారాయణ పూర్తిగా కాలిపోయే దాకా అక్కడే ఉన్నాట్ట. తర్వాత వెళ్ళి పోయాట్ట-...."
    కిల్లర్ అతడివంక చూసి-"తోతారాం అబద్ధాలు చెప్పడని నమ్మకమేనా?" అన్నాడు.
    "ఊఁ."
    "ఇలా అడుగుతున్నానని యేమీ అనుకోవద్దు తోతారాం అనేవాడు నిజంగా ఉన్నాడా?" అన్నాడు కిల్లర్ మళ్ళీ.
    "ఎందుకిలా అడుగుతున్నారు?" అన్నాడు మహావీర్ సింగ్.
    "ఎందుకంటే?" ఒక్కక్షణం ఆగాడు కిల్లర్-"తోతారాం నిజంగా ఉంటే తప్ప మీరు చెప్పిన నిజం తెలిసేది కాదు. ఆ నిజమేమిటంటే-.....ఒక స్నేహిహుణ్ణి నరసింగరావు కొత్త ప్రాంతంలో చంపేశాడు. అదీ యెప్పుడు? అతడు తన ప్రాణాలు రక్షించేక.....ఇలా జరగొచ్చని మీరు నమ్ముతారా?"
    "నేను నమ్మలేక పోయాను. నాకు మానవత్వం మీదనే నమ్మకం నశించింది. అందుకే నీరసంగా తిరిగి వచ్చాను-" అన్నాడు మహావీర్ సింగ్ మూడో కొడుకు.
    "నాకు మానవత్వం మీద నమ్మకముంది. అందుకే తోతారాం ఉనికిని నమ్మలేకపోతున్నాను-" అన్నాడు కిల్లర్.
    మహావీర్ సింగ్ ఆశ్చర్యంగా-"లేని తోతారాం ను ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం మావాడి కేముంది?" అన్నాడు.
    "ఏమో-అతడికే తెలియాలి-...." అన్నాడు కిల్లర్.
    మహావీర్ సింగ్ తన ముగ్గురు కొడుకులవంకా అనుమానంగా చూశాడు. కళ్ళతోనే వాళ్ళాయనకు సమాధానమిచ్చారు.
    తండ్రి ప్రశ్న, కొడుకుల జవాబు కూడా కిల్లర్ చదివాడు.
    "తోతారాం నిజంగా వున్నాడు-" అన్నాడు మహావీర్ సింగ్.
    కిల్లర్ నవ్వి "నేనిక సెలవు తీసుకుంటాను-" అన్నాడు.
    అతడలా అడిగినందుకు రామ్ చరణ్ సింగ్ ఆశ్చర్యపడ్డాడు.
    
                                       5

    "మనం ఢిల్లీ పోయేపక్షంలో ఏం తెలుసుకున్నట్లు?" అన్నాడు సింగ్.
    "మహావీర్ సింగ్ మంచివాడు. ఆయన కొడుకులు దుడుకుమనుషులు. అల్లరిచిల్లరగా డబ్బు సంపాదించే రకాలు. ఆయన వాళ్ళ గురించి పరోక్షంగా నిజాలు చెప్పి ప్రత్యక్షంగా అబద్దాలు చెప్పాడు. వాళ్ళకు పెళ్ళి కావడం లేదంటే సంబంధాలు రావడంలేదన్న మాట. వాళ్ళూరువదిలి వెళ్ళడం లేదంటే వాళ్ళకు చదువు రాలేదన్నమాట. వాళ్ళకు టెర్రరిస్టులతో స్నేహమున్నదంటే తుంటరి స్నేహితులున్నారని అర్ధం, వాళ్ళు బలవంతంగా డాక్టర్ని తెచ్చారంటే అలాంటి పనులు వాళ్ళకి మామూలన్నమాట. శ్రీమన్నారాయణిచ్చే డబ్బు కాశపడి వాళ్ళాయన్నూ, నరసింగరావునూ తమ ఇంటికి తీసుకుని వెళ్ళివుంటారు-"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS