"అంటే వాళ్ళే శ్రీమన్నారాయణ కాల్చి చంపేరంటావా?"
"అదే నిజమని నాకు తోస్తే వెంటనే వాళ్ళ అంతుతేల్చేయన్ని కానీ ఈ విషయంలో వాళ్ళు నిరపరాధులు, తోతారాం అనేవా డున్నాడో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పింది నిజం-...."
"అంటే?"
"నరసింగరావే కావాలని శ్రీమన్నారాయణుని పెట్రోలు పోసి అంటించాడు. ఆ నేరం పంజాబు టెర్రరిస్టులమీదకి తోసేయాలనే ఉద్దేశంతో అతడు శ్రీమన్నారాయణను ప్రోత్సహించి అమృతసర్ ప్రయాణానికి పురిగొల్పాడు. తను తప్పు చేయబోతున్నానని అతడికి తెలుసు. ఇలాంటి నేరాల నతడు గతంలో చేసివుండడు. అందువల్ల అంతులేని టెన్ షన్ కు గురయ్యాడు. తాననుకున్న చోటు సమీపించే సరికతడు టెన్ షన్ భరంచలేక స్పృహ తప్పి పడిపోయాడు-" అన్నాడు కిల్లర్.
"నువ్వు చెప్పింది బాగానే వుంది. కానీ తన ప్రాణాలను రక్షించిన శ్రీమన్నారాయణ నతడెలా చంపగలడు? తన్ను రక్షించినమహావీర్ సింగ్ ముగ్గురు కొడుకుల్నీ హంతకులుగా నిరూపించాలని ఎందుకు చూస్తాడు?" అన్నాడు సింగ్.
"ఏవో కారణాలుంటాయి. అదే తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణపై అతడికి బాగా కక్ష ఉండివుండాలి. ఆ కక్ష తీర్చుకుందుకు టెర్రరిస్టులు నతడు తెలివిగా ఉపయోగించుకున్నాడు. అతడికి మహావీర్ సింగ్ కొడుకు లంటే కృతజ్ఞత వుంది. అందుకే వాళ్ళను హంతకులుగా చిత్రిస్తూనే అతడు తనకు తెలియకుండానే వాళ్ళ కళ్ళలో త్యాగశీలతను ప్రతిబింబించేలా చేశాడు. వాళ్ళను నువ్వూ చూశావుగదా! వాళ్ళు మంచిమనుషుల్లా లేరు-" అన్నాడు కిల్లర్.
"జరిగింది బాభీజీ నమ్ముతుందా? నా నిర్దోషిత్వాన్నా కుటుంబం అంగీకరింస్తుందా?" అన్నాడు రాంచరణ్ సింగ్.
"నిజాన్ని మనం బైటపెట్టక తప్పదు. లేకుంటే మరి కొందరు దుర్మార్గులిది అవకాశంగా తీసుకుని అన్యాయాలకు, అక్రమాలకు తలపెడతారు టెర్రరిస్టులు పేరుతో జరిగిన దుశ్చర్యలను లోతుగా పరిశీలించే అవకాశంకూడా ఏర్పడుతుంది...."
సింగ్ సాలోచనగా-"పంజాబులో ప్రతి యింటా తుపాకీ ఉంటుంది. చలామంది తమ పాత పగలను టెర్రరిస్టుల పేరుతో తీర్చుకుంటున్నారేమోనని నా కిప్పుడనుమానంగా వుంది-...." అన్నాడు.
"కొన్ని అబద్ధాల కారణంగా నిజం అబద్ధం అయిపోదు. పంజాబులో టెర్రరిజం కొనసాగుతున్న మాట నిజం. కొందరది అవకాశంగా తీసుకొనడం దురదృష్టం-....."
"నరసింగరావుకు వ్యతిరేకంగా మనం సంపాదించిన సాక్ష్యాలను ఋజువు కావాలి. మనం తోతారాంను కలుసుకోవలసింది. మహావీర్ సింగ్ యింట్లోని విశేషాలు టేప్ చేయవలసింది-" అన్నాడు సింగ్.
"ఆ సాక్ష్యాలుకోర్టులో నిలబడవు. తోతారాం కోర్టుకు వచ్చి సాక్ష్యమివ్వకపోవచ్చు. ఇచ్చినా అతడి సాక్ష్యానికి విలువుంటుందని గ్యారంటీ లేదు. మహావీర్ సింగ్ కొడుకు లీ హత్య చేయలేదని నిరూపించలేము. ఎందుకంటే శ్రీమన్నారాయణ హత్య గురించి విన్నకనే వారు తోతారాం గురించి కల్పించి వుండవచ్చు. మన పరిశోధన నరసింగరావు కెంత వ్యతిరేకంగా ఉందో మహావీర్ సింగ్ కొడుకులకీ అంతే వ్యతిరేకంగా వుంది. నాకు నరసింగరావుమీదే అనుమానముంది. అతడిచేత నిజం చెప్పించే ఉపాయం చూడాలి తప్ప- మహావీర్ సింగ్ కుటుంబాన్నిబ్బంధిలో పెట్టకూడదు-" అన్నాడు కిల్లర్.
6
వ్యాన్ నరసింగరావింటి ప్రాంగణంలో ప్రవేశించింది. అప్పుడు కిల్లర్ మామూలు వేషంలో వున్నాడు. ఇంట్లో నరసింగరావు లేడు. చేపప్లమ్తే ఎవ్వరూ లేరు. అయన కుమార్తె సునీత మాత్రం ఉంది. ఆమె బియ్యే ఫైనలియర్ పరీక్ష లవ్వాల్సి ఉంది. అందుకే ఒంటరిగా ఉంది.
"ఒంటరిగా ఉండడం నా కలవాటే?" అందామె నవ్వుతూ.
"నాన్నగా రెప్పుడొస్తారు?" అన్నాడు కిల్లర్.
"అంతా ఆగ్రా వెళ్లారు. బహుశా రేపు సాయంత్రానికి రావచ్చు...."
"రెండ్రోజుల క్రితం మేము మీ ఇంటికి వచ్చాం...." అన్నాడు కిల్లర్.
"మీరు నాకు తెలుసు" అందామె.
"ఎలా? ఆ రోజు మిమ్మల్నింట్లో చూడలేదు నేను...." అన్నాడు సింగ్.
ఆమె లోపలకు వెళ్ళి ఓ ఆర్టు పేపరు తెచ్చింది. దాని మీద కిల్లర్ రాంచరణ్ సింగుల బొమ్మలున్నాయి.
"మీరు వచ్చినప్పుడు నే నింట్లో లేను. నేను వచ్చే సరికి మీరు వెళ్ళిపోయారు. నాన్న ఆగ్రా వెడుతూ మీ గుర్తులు నాకు చెప్పారు. నేను బొమ్మ వేశాను. పోలికలు సరిగ్గా వచ్చేయమన్నారు. ఇప్పుడు చూస్తూంటే నాకు చాలా తృప్తిగా వుంది. నాన్న గుర్తులు సరిగ్గా చెప్పగలరు. నేనది బొమ్మగా వేయగలను...."
"మీరు వేయడమెందుకు? మీ నాన్నగారే గొప్ప చిత్రకారులు కదా!" అన్నాడు కిల్లర్.
సునీత నవ్వి-"నాన్న బొమ్మ వేయడమా? ఆయన మనిషిని వేయాలనుకుంటే ఏ వంకరకాళ్ళ గాడిదో తయారవుతుంది-" అంది.
అప్పుడు కిల్లర్ తన దగ్గరున్న బొమ్మ చూపించి-"ఇది మీ నాన్నగారు వేయలేదా?" అన్నాడు.
ఆ బొమ్మను చూసి సునీత తడబడి-"ఈ బొమ్మ మీ దగ్గరకెలా వచ్చింది?" అంది.
కిల్లర్ క్లుప్తంగా తమ కధ చెప్పి-"శ్రీమన్నారాయణ వంటి సచ్చీలున్ని నీతిపరున్ని దేశభక్తుణ్ణి స్నేహపాత్రున్ని అమానుషంగా కాల్చిచంపిన క్రూరాతిక్రూరులు వీళ్ళు మీ నాన్నగారు నాకు వీళ్ళ బొమ్మనిచ్చారు...." అన్నాడు.
"వీళ్ళ బొమ్మను నాన్న వేయలేదు. నేను వేశాను...." అంది సునీత.
సింగ్ ఆశ్చర్యంగా కిల్లర్ వంక చూశాడు. కిల్లర్ ఆ బొమ్మవంక చూశాడు.
తన అంచనా మొత్తం తప్పుతున్నట్లుంది.
ఆ బొమ్మలోని మహావీర్ సింగ్ కొడుకులు ముగ్గురూ దుష్టుల్లా కాక కధానాయకుల్లాగున్నారు. నరసింగరావుకు సంబంధించి అందుకు కారణం వెతికాడు తను.
సునీత కేమి కారణముంది?
"నువ్వీ బొమ్మ వేసేముదు-వీళ్ళు నరహంతకులాని మీ నాన్న నీకు చెప్పలేదా?"
"ఆయనేం చెప్పారో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం వీళ్ళు నరహంతకు లనిపించదు.....!" అంది సునీత.
"శ్రీమన్నారాయణ వంటి సచ్చీలున్ని......సత్పురుషున్ని.
కిల్లర్ యింకా యేదో అనబోతూండగా-ఆపండి కిల్లర్ గారూ!" అంది సునీత అసహనంగా.
"ఏమయింది?" అన్నాడు కిల్లర్.
"తండ్రి స్నేహితుడని నమ్మి సంకోచించకుండా గది లోకి వచ్చిన కూతురీడు ఆడపిల్లను యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం లేకుండా బలాత్కరించేవాడిని సచ్చీలుడు, సత్పురుషుడు అనడం తప్పు కాకపోతే మీరు శ్రీమన్నారాయణను పొగడండి కానీ నా దగ్గర పొగడొద్దు. నేను భరించలేను. ఆయన నయవంచకుడు. నరరూప రాక్షసుడు..."
