4
అది పురాతనకాలపు పెద్దిల్లు.
ఇంట్లో పేదరికపు ఛాయలు కనబడుతున్నాయి.
కిల్లర్, సింగ్ వ్యాన్ దిగేసరికి గుమ్మంలోనే వారికి మహావీర్ సింగ్ ఎదురయ్యాడు. వాళ్ళు తనకోసమే వచ్చారని తెలుసుకుని ఆయన తనే మహావీర్ సింగ్ నని చెప్పుకున్నాడు.
ఇద్దరూ ఆయనకు ప్రణామాలు చేశారు.
మహావీర్ సింగ్ ఆశ్చర్యంగా, "మీ రెవరు? నాతో మీకేం పని?" అనడిగాడు.
"మీ గురించి విని మిమ్మల్ని చూడాలని వచ్చాం-" అన్నాడు కిల్లర్.
వాళ్ళిద్దరూ ఆంధ్రాలో స్థిరపడిన సిక్కులని తెలిసి-"ఇంత దూరం వచ్చి చూసేటంత విశేషం నాలో వుందనుకోను. మీరింకేదో పనిమీద వచ్చారు-" అన్నాడు మహావీర్ సింగ్.
"మీరు చెప్పింది కొంతవరకూ నిజం. ఇక్కడకు మేము వేరే పనిమీద వచ్చాం. పంజాబులో సిక్కులు హిందువులను హత్య చేయడంవల్ల యితర రాష్ట్రాలలోని సిక్కులందరికీ ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. సిక్కులు భారతదేశమంతా నిండి ఉండి హిందూ సంస్కృతిలో ఒక భాగంగా కలిసిపోయారు. ఇతర ప్రాంతాలవారితో సోదర సమానులుగా జీవిస్తున్న సిక్కుల సుఖజీవితంలో నిప్పులు పోస్తున్న పంజాబు టెర్రరిస్టుల్ని కలుసుకుని మాట్లాడాలని వచ్చాం. వాళ్ళనెలా కలుసుకోవాలో తెలియదుగానీ మీ గురించి విన్నాం. ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకొనడం మంచిదనిపించింది-...."
మహావీర్ సింగ్ ముఖం గంభీరంగా అయిపోయింది.
"ఈ విషయంలో మీరు చేయవలసింది ఒక్కటే! పంజాబులో లేని సిక్కులందరూ ఒక్కటై టెర్రరిజాన్ని నిరసించండి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపండి. అప్పుడు సాటి ప్రజలకు టెర్రరిజాన్ని మీరూ నిరసిస్తున్నారన్న భావం ఏర్పడుతుంది. ఇంతవరకూ ఇతర రాష్ట్రాలలో సిక్కులలాంటి ప్రయత్నాలు చేసి నట్లు లేదు-...."
"మీరు చెప్పింది నిజమే!" అన్నాడు సింగ్- "అయితే పంజాబులోని హిందువుల రక్షణకు మేమేం చేయగలం?"
మహావీర్ కళ్ళెర్రబడ్డాయి-"నేను పంజాబీని, నా రక్షణకు ఒకరిపై ఆధారపడను...."
కిల్లర్ మాట మార్చుతూ "మీ జీవన విధానం గురించి తెలుసుకోవాలనుంది-" అన్నాడు.
మహావీర్ సింగ్ తన కుటుంబం గురించి గర్వంగానే చెప్పుకున్నాడు. తన భార్య, అల్లుళ్ళ గురించి చెప్పు కున్నాక-"నా కొడుకుల పద్ధతే నాకు నచ్చలేదు-" అన్నాడు.
"ఎందుకని?"
"ముగ్గురబ్బాయిలు నాకు వాళ్ళు పల్లెవిడిచి వెళ్లరు. ఇక్కడే వుండి నాకు సాయపడతానంటారు. నా కెవరి సాయమూ వద్దన్నా వినరు. వాళ్ళ స్నేహితులు నలుగురైదుగురు టెర్రరిస్టులతో కలిసిపోయారు. అప్ప్డుడప్పుడు వాళ్ళూ వీళ్ళూ కలుసుకుంటూంటారు. నేనూ మా వాళ్ళకు చెప్పాను-ఆ టెర్రరిస్టుల మనసులేనా మార్చండి. లేదా వాళ్ళ ఆచూకీ పోలీసులకు చెప్పండి- అని! కానీ వాళ్ళు వినరు. సంపాదన గురించి హెచ్చరిస్తే డబ్బు సంపాదించడానికి లక్ష మార్గాలంటారు. ఒక్కడూ పెళ్ళి చేసుకోనంటాడు....పంజాబులో శాంతి నెలకొనేదాకా వాళ్ళు బ్రహ్మచారులుగా ఉండిపోతారుట...అదిప్పట్లో జరిగే పనేనా?" అంటూ నిట్టూర్చాడు మహావీర్ సింగ్.
"ఎందరో మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మీ మాట చాలామందికి శిలాశాసనం. అలాంటప్పుడు మీ వాళ్ళు మాత్రం మీరు శాసిస్తే ఎందుకు వినరు?"
"ఎందుకు వినరు-వింటారు. కాని నా పిల్లలు మానవత్వంలో నన్ను మించినవారు. నాకు డబ్బుమీద మోజు లేదు...." అని-"సుమారు రెండునెలల క్రితం అనుకుంటాను. ఓ తమాషా జరిగింది...." అన్నాడాయన.
కిల్లర్, సింగ్ వింటున్నారు.
"మా ఊరిచివర రోడ్డుదగ్గర ఓ కారాగి ఉంది. అందులో యిద్దరు తెలుగువాళ్ళున్నారు. ఒకాయన పేరు శ్రీమన్నారాయణ. రెండో ఆయనపేరు నరసింగరావు. ఆ శ్రీమన్నారాయణ కారు దిగి కంగారుగా అటూ యిటూ తిరుగుతూంటే మా వాళ్ళు చూశారు. కారులో నరసింగరావు స్పృహతప్పి పడివున్నాడు. మా వాళ్ళు వాళ్ళిద్దర్నీ మా యింటికి తెచ్చారు. మా ఊళ్ళో డాక్టరు లేడు. పొరుగూరి డాక్టరు బాగా డబ్బుమనిషి పిలవడానికి వెడితే రానన్నాడు. మా వాళ్ళు బలవంతంగా ఎత్తుకుని తీసుకుని వచ్చారు. డాక్టరు రావడం కాస్త లేటై వుంటే ఆ నరసింగరావు చచ్చిపోయేవాడు. డాక్టరుకు శ్రీమన్నారాయణ బాగా డబ్బిచ్చి పంపాడు. రెండ్రోజులపాటు వాళ్ళకు మేము శక్తికి మించిన ఆతిధ్యం యిచ్చాం. అదంతా మా వాళ్ళే చూసుకున్నారు. నరసింగ రావు వెళ్ళిపోతూ-వాళ్ళని-మీరు మనుషులు కాదు, దేవుళ్ళు-అన్నాడు...."
"అసలా నరసింగరావు కేమయింది?"
"డాక్టరు చెప్పిన కారణం టెన్షన్!"
"టెన్షన్ ఎందుకు?"
"కావాలని అమృతసర్ వెడుతున్నారు, మనిషి మరీ అంత ధైర్యవంతుడు కాకపోవచ్చు, ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయం ఎక్కువగా ఉందనుకుంటాను, నే నతన్ని వెనక్కు వెళ్ళిపొమ్మని సలహా యిచ్చాను. శ్రీమన్నారాయణ మాత్రం తానుండగా నరసింగరావు కే ప్రమాదం రాదనీ-ముందుకే వెడతామనీ చెప్పాడు. అందుకు నరసింగరావూ అంగీకరించాడు. మా వాళ్ళు డాక్టర్ని మోసుకొచ్చిన పద్ధతికి వాళ్ళు తల్చుకుని నవ్వు కుంటూండేవారు-"అన్నాడు మహావీర్ సింగ్.
"ఒక్కసారి మీ వాళ్ళను చూసి వెడతాము-" అన్నాడు కిల్లర్.
"వాళ్ళిప్పుడింట్లోనే ఉన్నారు-" అంటూ మహావీర్ సింగ్ లోపలకు వెళ్ళాడు.
కిల్లర్, సింగ్ తో -"అనుకోకుండా మనకు శ్రీమన్నారాయణ కథను తనే చెప్పాడీయన. ఈ కథ నన్ను మరింత అయోమయంలోనికి తోసేసింది-..." అన్నాడు.
"నాకు మొదట్నించీ అంతా అయోమయంగానే ఉంది-" అన్నాడు సింగ్.
మహావీర్ సింగ్ తన ముగ్గురు కొడుకుల్నీ తీసుకుని వచ్చాడు.
కిల్లర్ కు వాళ్ళు దేశభక్తుల్లా కాక గూండాల్లా కనిపించారు. అల్లరి చిల్లరి మనుషుల్లా వున్నారు వాళ్ళు. అతడు వాళ్ళని శ్రీమన్నారాయణ గురించి మరికొన్ని ప్రశ్నలు వేశాడు. చెప్పుకోదగ్గ సమాచారం లభించలేదు.
టెర్రరిస్టుల గురించి కిల్లర్ వారిని మరికొన్ని పశ్నలు వేశాడు.
"వాళ్ళను టెర్రరిస్టులనవద్దు. వాళ్ళు మా స్నేహితులు...." అన్నాడు మహావీర్ సింగ్ పెద్దకొడుకు.
"మీ స్నేహితులు హిందువులను కాల్చి చంపుతున్నారు...."
"వాళ్ళు కాల్చి చంపుతున్నది హిందువులను కాదు, సిక్కుమత వ్యతిరేక ప్రచారకుల్ని వాళ్ళకు హిందువుల మీదనే ద్వేషముంటే మమ్మల్నెప్పుడో చంపేసే వారు....."
"అయితే మీరు మీ స్నేహితులకు సహకరిస్తున్నారా?"
ముగ్గురూ మాట్లాడలేదు.
"మీ స్నేహితులు కోరితే మీ ముగ్గురూ ఓ అమాయకుణ్ణి కాల్చి చంపగలరా?" అన్నాడు కిల్లర్.
"ఓ మనిషి మీద పెట్రోలు పోసి అంటించమని టెర్రరిస్టులు చెబితే మీరు చేయరూ?"
ముగ్గురూ మాట్లాడలేదు.
