Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 29


    "లేదు-"
    "దొరికే అవకాశముందా?"
    "తీవ్రవాదుల గురించి యెన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ దుండగుల్ని పట్టుకునే అవకాశంలేదు. వారి ఐడెంటిటీ తెలియదు...."
    "నరసింగరావు మీకు చెప్పలేదా?"
    "ఏవో గుర్తులు చెప్పాడు. కానీ అవి చాలవు. ఆయన బాగా షాక్ తిన్నట్లు కనిపించాడు......నేను పోలీసు రక్షణతో ఢిల్లీకి పంపాను..."
    "ఆయన చెప్పిన వెంటనే మీరు చుట్టుపక్కలకు సెర్చి పార్టీలు పంపలేదా?"
    "పంపి ప్రయోజనముండదు. అయినా అప్పుడు నా వద్ద స్టాఫు మరీ యెక్కువగా లేదు..." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కిల్లర్ కాసేపు తటపటాయించి చివరకు తనవద్ధనున్న ఆర్టు పేపరు ఇన్ స్పెక్టరు కి చూపించాడు.
    "ఎవరు వీళ్ళు?" అన్నాడు బహదూర్ సింగ్ ఆశ్చర్యంగా.
    "నేను నరసింగరావు చెప్పింది విని-ఈ బొమ్మగీశాను. ఆయనీ బొమ్మచూసి భయపడుతూ-వీళ్ళే.....వీళ్ళే..నా స్నేహితుణ్ణి కాల్చేశారు...కానీ వీళ్ళ గుర్తులు నేను చెప్పినట్లెవారికీ చెప్పవద్దు. నాకు భయంగావుంది..అన్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన విషయం మరిచిపోయి- వీళ్ళలో యెవరినైనా గుర్తించగలరేమో చెప్పండి...." అన్నాడు కిల్లర్.
    బహదూర్ సింగ్ ఆ బొమ్మల వంకే ఆశ్చర్యంగా చూస్తూ-"ఆ రోజు నరసింగరావు నాకు చెప్పిన వివరాలకీ ఈ బొమ్మలకీ బొత్తిగా పోలికలేదు-" అన్నాడు.
    "అప్పుడాయన బాగా షాక్ తిని ఉన్నాడు. ఇప్పుడు తాపీగా జరిగినవన్నీ గుర్తుచేసుకొని చెప్పిన వివరాలివి.." అన్నాడు కిల్లర్.
    "మీరు చెప్పింది నిజం ఆ రోజాయన వణికిపోతున్న తీరు చూస్తుంటే నాకు మన జాతిమీద అసహ్యం కలిగింది. మనిషి బాగా పిరికివాడిలాగున్నాడు. అలాంటి వాణ్ణంతలా బెదరగొట్టడం మహాఘోరం.."
    "ఎంతటి ధైర్యవంతుడైనా గుండెలు జలదరిచే పని చేశారు దుండగులు...ఆయన వణికిపోవడంలో ఆశ్చర్యమేముంది? ఈ ఫోటోలో వ్యక్తులు మీకు తెలుసా?" అన్నాడు కిల్లర్.
    "తెలుసు కానీ వీళ్ళు దుండగులు గావడానికి వీల్లేదు..."
    "ఎందుకని?"
    "వీళ్ళు హిందువులు!"
    "మీకు బాగా తెలుసా?" తెల్లబోతూ అడిగాడు కిల్లర్.
    "తెలుసు.." అన్నాడు బహదూర్ సింగ్ నమ్మకంగా.
    "వాళ్ళు హిందువులే అయితే ఇలాంటి పనెందుకు చేస్తారు?"
    ఇన్ స్పెక్టర్ ఆలోచనలోపడ్డాడు. కాసేపాగి ఆయన "వీళ్ళు ముగ్గురూ అన్నదమ్ములు వీళ్ళ గ్రామం ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో వుంది. వీళ్ళ తండ్రి మహావీర్ సింగ్ -నీతికీ, నిజాయితీకీ, త్యాగానికీ, ధైర్యానికీ పెట్టింది పేరు. ఆ ఊళ్ళో హిందువులు తక్కువ సిక్కులెక్కువ. అయినప్పటికీ మహావీర్ సింగ్ కారణంగా అక్కడి సిక్కులందరూ ఒక్కటై హిందువుల నభిమానిస్తున్నారు. మత సామరస్యం అక్కడున్నంతగా యింకెక్కడాలేదు. మహావీర్ సింగ్ కు జాతీయస్థానంలో ఏదైనా బహుమతిప్పించాలని రాష్ట్రప్రభుత్వం అనుకుంటోంది...." అన్నాడు.
    కిల్లర్ తనూ ఆలోచిస్తూ-"మహావీర్ సింగ్ ఆర్ధిక పరిస్థితి ఎలాంటిది?" అనడిగాడు.
    "ఒకప్పుడు బాగా వుండేదిట. ఇప్పుడు చితికిపోయాడు. అప్పుల్లో ఉన్నాడంటారు. ఏడాదిక్రితం కూతురి పెళ్ళిచేసి యిల్లమ్ముకున్నాడు. ఆ ఇల్లు కొనుక్కున్న సిక్కు జాలి తలచి ఆ యింట్లోనే అతడినుండనిస్తున్నాడు...."
    "మహావీర్ సింగ్ గురించి మీ కిన్ని వివరాలెలా తెలుసు?" అడిగాడు కిల్లర్.
    "ఈ చుట్టుపక్కల పేరెన్నికగన్న సంఘసేవకుడాయన...."
    కిల్లర్ ఇన్ స్పెక్టర్ కు ధన్యవాదాలు చెప్పి  లేచాడు.
    "చాలా థాంక్స్" అన్నాడతడు.
    "మీరింతవరకూ వచ్చినందుకు అభినందించాలి. ప్రజలు పంజాబులో అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు. అడపాహడాపా అక్కడా యిక్కడా అల్లర్లు జరుగుతున్నమాట వాస్తవం. అంతమాత్రాన పంజాబు వెళ్ళడమంటే అడవికి పోవడంకాదు-" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కిల్లర్ నవ్వి-"ఆ నిజం వచ్చేదాకా తెలియదు కదా! రావడానికి ధైర్యముండాలి కదా.." అన్నాడు.
    అంతవరకూ మౌనంగా వారి సంబాషణ వింటున్న సింగ్ చటుక్కున నోరు తెరిచి-"ఆ ధైర్యం నా స్నేహితుడు శ్రీమన్నారాయణకుంది. ధైర్యమతడికిచ్చిన ప్రతిఫలం చూశారుగా-" అన్నాడు.
    కిల్లర్ సింగ్ భుజం తట్టి-"ఏమనిశికి చావెలా రాసి పెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. పడవ మునగవచ్చు. పాము కాటేయవచ్చు ఇల్లు కాలిపోవచ్చు. స్టవ్ పేలవచ్చు. దురదృష్టం మనిషి నకాలమృత్యువుకు గురిచేస్తుంది-" అన్నాడు.
    "దురదృష్టం ధైర్యవంతుణ్ణి పొట్టనబెట్టుకుంటే బాధగా వుంటుంది కదా!" అన్నాడు సింగ్.
    "పద-పోదాం-" అన్నాడు కిల్లర్ అతడి భుజం తట్టి.
    ఇద్దరూ ఇన్ స్పెక్టర్ దగ్గర సెలవు తీసుకొనివ్యానెక్కారు.
    "ఇంతవరకూ మనం సాధించిన దేమిటి?"
    "చాలా వుంది..." అన్నాడు కిల్లర్ వ్యాన్ స్టార్టు చేస్తూ.
    "చాలా ఉందా? మనం వెనక్కు వెళ్ళిపోతున్నాం కూడా..." అన్నాడు సింగ్ అర్ధంకానట్లు.
    "అవును..కానీ మహావీర్ సింగ్ ను కలుసుకున్నాక...."
    "అతడి నెందుకూ కలుసుకొనడం?"
    వ్యాన్ స్టార్టయింది. కిల్లర్ మందహాసంచేసి-"అతడిలో పెద్దరహస్యమే ఉన్నదని నా అభిప్రాయం" అన్నాడు.
    సింగ్ మాట్లాడలేదు.
    "నరసింగరావు ముగ్గురు యువకుల బొమ్మలు గీశాడు. వారు మహావీర్ సింగ్ బిడ్డలు..."
    "కానీ వారు హిందువులు..."
    "కావచ్చు కానీ సంఘసేవ పేరు చెప్పి ఆస్తంతా పాడుచేసుకున్న మహావీర్ సింగ్ బిడ్డలు వారు..."
    "అంటే?"
    "నాకు తెలుసు. అలాంటివారి బిడ్డలెలా తయారవుతారో! పేరు ప్రతిష్టలు మనిషికి కూడుపెట్టవు....." కిల్లర్ కాసేపాగి-"మహావీర్ సింగ్ మహానుభావుడు కావచ్చు. కానీ ఉగ్రవాదుల కలాంటి వాగవు. వారు పేరున్న ప్రతి హిందువునూ తుడిచిపెట్టేయాలనుకుంటారు. మహావీర్ సింగ్ కుటుంబానికి ప్రమాదం రాకుండా అతడి బిడ్డలు కొందరు సిక్కు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని నా నమ్మకం....."
    "హిందువుల నాశనానికి హిందువులు సహకరిస్తారా....?"
    "హిందువులు, సిక్కులు అన్నది మనసు నాయకులు కల్పించే భ్రమ, నాయకులకు సంబంధించి అదంతా స్వార్ధం మన దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాలకు పనిచేసే గూఢచారులు-భారతీయులే వున్నారు. కాదంటావా?"
    సింగు కళ్ళు పెద్దవయ్యాయి-"నువ్వు చెప్పింది నిజమే! డబ్బు కోసం, స్వార్ధం కోసం-రష్యన్సు రష్యాకు అమెరికన్స్ అమెరికాకు, బ్రిటన్స్ ఇంగ్లండ్ కు వ్యతిరేకంగా పనిచేసిన వార్తలు చాలా విన్నాను. మహావీర్ సింగ్ పిల్లలు కూడా అలాంటివారేననుకోవాలి....."
    "ఇందులోని నిజానిజాలు ఆరాతీయడానికే మనం మహావీర్ సింగ్ యింటికి వెడుతున్నాం-" అన్నాడు కిల్లర్.
    వ్యాను స్పీడందుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS