Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 29

   
    "నందిని భర్తను విడిచిపెడితే సవతితల్లి పాలబడాలి. నందిని భర్తను మార్చలేకుంటే గోవర్ధన్ తండ్రి కూడా ఆమె నాదరించడు. ఇలాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ తనే స్వయంగా నందినికీ, నాకూ పరిచయమయ్యే పరిస్థితులు కల్పించి తనేమీ ఎరుగనట్లు నటించసాగాడు-"
    చక్రధారి ఊపిరి పీల్చుకుందుకన్నట్లు కాసేపాగాడు.
    "చాలా విచిత్రంగా వుంది కథ! ఇందులో గోవర్ధన్ ఆశించే ప్రయోజనమేమిటి?" అంది చంద్రిక.
    "నీ ఊహ కందని పథకమిది. గోవర్ధన్ బాధలు భరించలేని నందినికి నేను ఎడారిలో ఒయాసిస్ లా కనబడ్డాను. ఆమెను పెళ్ళికాశపెట్టాను నేను. అతణ్ణి చంపడానికామె సిద్దపడింది. హత్యానేరం ఆమెపైకి రాకుండా కాపాడతానని మాటిచ్చాను నేను. ఆమె నమ్మింది..." అన్నాడు చక్రధారి.
    "ఇప్పుడేమవుతుంది?"
    "విషమని చెప్పి నేనోమందిచ్చానామెకు. దాన్నామె భర్తపై ప్రయోగిస్తుంది. అది తిన్న వెంటనే ఆమె భర్తలో చలనం వుండదు. శరీరం నీలం రంగులోకి మారుతుంది. అయితే అతడు నిజంగా చనిపోడు. ఆ పరిస్థితి రెండుగంటలసేపుంటుంది. తర్వాత అతడు మామూలు మనిషవుతాడు. ఆమె తను హత్యచేశాననుకుంటుంది. నేనామెను రక్షించానన్న భ్రమతో వుంచుతాను...."
    "ఇందువల్ల లాభమేమిటి?"
    "భర్త బ్రతికే వున్నాడని ఆమెకు తెలియదు, బ్లాక్ మెయిలరొకడామె నీ విషయమై వేధిస్తూంటాడు, రహస్యం దాచడానికి మామగారినామె డబ్బడుగుతుంది. మామగారామెకు కొంతకాలం మాత్రం డబ్బిస్తాడు. తర్వాత అనుమానించడం మొదలుపెడతాడు. డబ్బిచ్చి నంతకాలం-నేను, గోవర్ధన్ వాతాలేసుకుని అనుభవిస్తాం. తర్వాత ఆమెనింట్లోంచి గెంటేస్తాడు, భర్త పోయాడనుకుని నాతో గడపడానికి సిద్దపడ్డ నందిని ఒక రోజున రెడ్ హాండెడ్ గా ఆయనకు పట్టుబడే ఏర్పాటు గోవర్ధన్ చేస్తాడు. అప్పుడామెకిక యే ఆధారమూ ఉండదు. నేనామెను మంచిమాటలతో వంచించి-సైట్ స్టార్ హోటల్ కమ్మేస్తాను. రెండు లక్షలువస్తాయి...."
    "నీ ప్లాను భయంకరంగా ఉంది-" అంది చంద్రిక భయంగా.
    "నేను భయంకరమైన వ్యక్తిని. కానీ నీకెందుకు భయం? ప్రస్తుతానికి నీవు నా ప్రియురాలివి. భవిష్యత్తులో నా భార్యవు...." అన్నాడు చక్రధారి.
    "ఇలాంటి మాటలే నువ్వు నందినిక్కూడా చెబుతూండవచ్చు-" అంది చంద్రిక.
    "నువ్వు నన్ననుమానిస్తున్నావా?"
    "ఊఁ."
    చక్రధారి ఏదో అనబోయాడు. అంతలోనే మంచం పక్క ఫోన్ మ్రోగింది. అతడు చేయిచాచి ఫోనందుకుని "హలో!" అన్నాడు.
    "నేను సార్......చంచల్రావుని.... ...." అందవతలి గొంతు.
    "వ్వాట్ చంచల్.....ఏమిటి విశేషం?"
    "కొంప మునిగింది సార్...."
    "ఏమయింది?"
    "గోవర్ధన్ చచ్చిపోయాడు...."
    చక్రధారి నవ్వి-"అంటే నందిని అతడికి విషం పెట్టిందన్న మాట...." అన్నాడు.
    "అవును సార్ ...."
    "రెండు గంటలయిందా అతడు పోయి..."
    "నేను సరైన సమయానికే ఆమె ఇంటికి వెళ్ళి శవాన్ని ముందుగా సిద్ధంచేసి వున్న పెట్టెలోకి మార్చి మా యింటికి తీసుకొచ్చాను సార్ ..... అతఃడు విషయం తిని ఇప్పటికి మూడుగంటలు కావచ్చు...."
    "గోవర్ధన్ మామూలు మనిషయ్యాడా లేదా?"
    "అతడు నిజంగా చనిపోయాడు సార్ ...."
    "షటప్...."
    "అతడు నిజంగా చనిపోయాడు సార్ ...."
    చక్రధారి ఏదో అనబోయి-"మన డాక్టరున్నాడా అక్కడ...." అన్నాడు.
    "గంగాధరం గారేనా? అతడి చావు గురించి ఆయనే ధృవపరిచాడు సార్"
    "చావుక్కారణమేమిటి?" అన్నాడు చక్రధారి.
    "విషప్రయోగంట ...."
    "అంటే ఆయనిచ్చింది నిజం విషమా?"
    "కాదంటున్నారు సార్..."
    "మరి విష మెక్కడిది?"
    "మాకు తెలియకే కదా సార్.... నేను మీకు ఫోన్ చేశాను."
    "సరే- నేను వస్తున్నాను...." అంటూ చక్రధారి ఫోన్ పెట్టేశాడు.
    ఆ సంభాషణంతా తనూ విన్న చంద్రిక-"నందిని నువ్వనుకున్న కంటే చాలా తెలివైనది. ఇప్పుడామె వలలో నువ్వు చిక్కుకున్నావు...." అంది.
    చక్రధారి కోపంగా-"హుఁ" అన్నాడు.
    
                                      3

    చక్రధారి చంచల్రావింటికి వెళ్ళగానే చంద్రిక నందిని యింటికి వెళ్ళింది.
    "నువ్వెవరో నాకు తెలియదు-...." అంది నందిని ఆశ్చర్యంగా.
    భవిష్యత్తులో చక్రధారి భార్యను. నా పేరు చంద్రిక. నే నెవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు" అంది చంద్రిక.
    "నే నెవరో నీకెలా తెలుసు?" అంది నందిని.
    చంద్రిక నందిని గురించి చక్రధారి ద్వారా తను విన్న కథంతా చెప్పిందామెకు.
    "చాలా చిత్రంగా వుంది. చక్రధారి మావారికి స్నేహితుడా?" అంది నందిని.
    "అవును సాటి ఆడదానిగా నీకు సాయపడాలని వచ్చాను. నీకు అడుగడుగునా కష్టాలే! సవతితల్లి బారి నుంచి తప్పించుకుంటే బాధించే మొగుడు. అక్కణ్ణించి తప్పించుకుంటే మోసగించే ప్రియుడు. ఈ సమయంలో నిన్ను హెచ్చరించడం మంచిదనిపించింది...."
    "అయితే నా భర్త నిజంగా చావలేదంటావా?"
    "లేదు. అతడిప్పుడు చంచల్రావింట్లో పార్టీ చేసుకుంటూంటాడు."
    చంద్రిక కావాలనే నందినికబద్దం చెప్పింది.
    ఆమెకు నందినికి సాయపడాలన్న ఉద్దేశ్యంలేదు. గోవర్ధన్ నిజంగా చనిపోయుంటే ఆ హత్యా నేరం నందినిపైకే వెళ్ళాలి. చక్రధారి తప్పించుకోవాలి.
    "నీ సహాయానికి చాలా చాలా థాంక్స్...." అంది నందిని.
    "కాసేపట్లో చక్రధారి ఇటు రావచ్చు. నేను సెలవు తీసుకుంటాను. అతడికి నేను చెప్పినట్లివేమీ చెప్పకు-" అంది చంద్రిక.
    ఆమె వెళ్ళిపోయాక నందిని ఆలోచనలో పడింది.
    తాననుకున్నదొకటి-జరిగినదొకటి?
    చక్రధారి మంచివాడనీ తన్ను నిజంగా ప్రేమిస్తున్నాడనీ అనుకుంది.
    అతడు తన్ను మోసగించి నైట్ స్టార్ హోటల్లో చేర్చాలనుకున్నాడు. అతఃది ఆశయం నెరవేరకూడదు.
    ముందుగా గోవర్ధన్ చేస్తున్న కుట్ర గురించి మామగారికి చెప్పుకోవాలి. భర్తలో మార్పుతీసుకునిరావడం కోసం ఆమె అతడు పెట్టే క్రూర హింసల గురించి మామగారికి చెప్పలేదు.
    ఇప్పుడిక జాప్యం చేయకూడదు.
    ఆమె క్షణాలమీద చీర మార్చుకుని మామగారింటికి బయల్దేరింది.

                                    4

    విశాలమైన గది.
    గదిలో నేలపై ఖరీదైన కాశ్మీర్ కంబళి పరచి వుంది.
    గది మధ్యగా నేలమీద పట్టుపరుపు. పట్టుపరుపు మీద కూర్చున్నాడు సోమేశ్వరరావు అతడి చేతిలో అందమైన గ్లాసుంది. అతఃది వంటిమీద అండర్ వేర్ మినహాయించి మరే దుస్తులూ లేవు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS