అతడు మంచంమీద పడ్డానికి ముందే అతఃదిచేతిలోని కొరడా నేలమీద పడింది.
ఆమె మరో అడుగు వెనక్కు వేసింది.
జరుగుతున్నది కలో, నిజమోనని ఆమె కనుమనంగా ఉంది.
అతడు పడ్డవాడు పడ్డట్లే వున్నాడు. గిలగిల తన్నుకోవడంలేదు కేకలు పెట్టడంలేదు.
దగ్గరకు వెడితే కొత్తరకంగా వేధిస్తాడేమోనని ఆమె భయం.
కాసేపాగిందామె.
ధైర్యం చిక్కబట్టుకునేందుకామెకు కొన్ని క్షణాలు పట్టింది.
అతడు కదలకుండా మెదలకుండా అలాగే పడిఉన్నాడు.
ఆమె నెమ్మదిగా కొత్తపెళ్ళికూతురిలా అడుగులో అడుగువేసుకుంటూ అతణ్ణి సమీపించింది.
మెత్తటి ఆమె పాదాల సవ్వడి అతఃడిలో చలనం తీసుకురాలేదు.
ఆమె మంచంవద్ద ఒక్కక్షణం తటపటాయించి నెమ్మదిగా అతఃది వంక పరీక్షగా చూసి ఉలిక్కిపడింది.
అప్పుడే అతడి శరీరం నీలంగా మారింది.
"విషం అంత బలమైనదా?" అనుకుందామె.
అతడు చనిపోయాడంటే ఆమెకింకా నమ్మకం కలిగినట్లులేదు. మరోక్షణం తటపటాయించి ఆమె అతణ్ణి తాకింది.
అతడు కదలలేదు కానీ శరీరం స్పర్శకు కొత్తరకంగా ఉంది. మనిషికి శవానికీ తేడా అదేనేమో!
ఆమె మరింత ధైర్యంతో అతడి చేయి పట్టుకుని చూసింది.
నాడి అందడం లేదు.
ఆమెకు ధైర్యం పెరిగింది.
పరీక్షించి అతఃడికి శ్వాస ఆడడంలేదనీ, గుండె కొట్టుకోవడంలేదనీ ధృవపర్చుకుందామె.
అంటే అతడు చనిపోయాడన్నమాట!
తనకో దుర్మార్గుడి పీడ శాశ్వతంగా వదిలిపోయింది!
"ఇప్పుడేం జరుగుతుంది?" అందామె మనసు.
"అన్నింటికీ ఆపద్భాంధవుడిలా ఆ చక్రధారే ఉన్నాడు-" అనుకుందామె.
సరిగ్గా అప్పుడే ఎవరో వీధితలుపు తట్టారు.
ఆమెకు వచ్చిందెవరో తెలుసు.
"అంతా అనుకున్నట్లే జరుగుతోంది!" అనుకుంటూ ఆమె అక్కణ్ణించి వీధి గుమ్మంవైపు పరుగెత్తింది.
2
అతడు డబుల్ కాట్ పై వెల్లకిలా పడుకుని వున్నాడు.
ఆమె అతడిపక్కనే బోర్లా పడుకుని వుంది.
అతడింటి కప్పును చూస్తూంటే ఆమె అతడి ముఖాన్ని చూస్తోంది.
"నీ జీవితంలో నా హోదా ఏమిటి చక్రీ?" అందామె.
అతడు చూపుల్నింటి కప్పునించి మరల్చకుండానే-ప్రస్తుతానికి ప్రియురాలీని. మున్ముందు భార్యవు-" అన్నాడు.
"ప్రస్తుతం గురించి బాగానే చెప్పావు. భవిష్యత్తు విషయం నేను నమ్మను-" అందామె.
"ఎలా నమ్ముతావు? నాకు తెలిసినట్లు నీకు భవిష్యత్తు తెలియదుగా-...." అన్నాడతడు.
"నాకు భవిష్యత్తు తెలుసు. అందులో నీ భార్యపేరు నందిని-" అందామె.
అతడులిక్కిపడి-"నందిని గురించి నీకెలా తెలుసు?" అన్నాడు.
"నా దగ్గరే రహస్యాలూ లేవంటూనే నందిని గురించి దాచావు. నా భవిష్యత్తు గురించి నేను తెలుసుకున్నది నిజం-"అందామె.
"చంద్రికా-ఈ చక్రాధారి గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. ముందు నాకు నందిని గురించి నీకెవరు చెప్పారో చెప్పు. అప్పుడసలు విషయం చెబుతాను-" అన్నాడతడు.
"నాకెవరూ చెప్పలేదు. స్వయంగా మీ యిద్దర్నీ చూశాను. మీ సంభాషణకూడా విన్నాను...." అంది చంద్రిక.
"ఎప్పుడు?"
"మనసుంటే మార్గముంటుంది. అనుమానంచిన మనసుకైతే ఎన్నెన్నో మార్గాలు....."
"ఈ ఇంట్లో నీ రాకపోకలకెలాంటి అంతరాయాలూ లేవు. అది నేను నీకిచ్చిన చనువు. దాన్ని సద్వినియోగం చేసుకున్నావన్నమాట.....ఇంతకీ మా సంభాషణలో ఏం విన్నావు?"
"మీ రిద్దరూ ఒకరినొకరు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. అందుకామె భర్త అడ్డు. నువ్వామెకు విషమిచ్చావు-భర్తమీద ప్రయోగించడానికి. నీకోసం భర్తకు విషమివ్వడానికి సిద్దపడ్డ ఆడది నిన్నెంతగా ప్రేమించిందో నేనూహించగలను....." అంది చంద్రిక.
"ఓహ్-అయితే మూడురోజుల క్రితం మా సంభాషణ విన్నావన్నమాట...." అని చక్రధారి నిట్టూర్చి-"అయితే నువ్వు అసలు నిజంకూడా తెలుసుకోవాల్సి ఉంది-" అన్నాడు.
"ఏమిటా అసలు నిజం?"
"నందిని నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటోంది కానీ అందుక్కారణం ప్రేమకాదు. అవసరం-...."
"ఏమిటా అవసరం-కండకావరమా?" అంది చంద్రిక వెటకారంగా.
"కాదు ఆమె బుద్ధిగా కాపురం చేసుకోవాలనే అనుకుంటోంది కానీ ఆమె భర్త శాడిస్టు ఆమెను శారీరకంగా హింసించి తృప్తిచెందేవాడు. శారీరక బాధ నామె తట్టుకోలేకపోతోంది-...."
"నేను నమ్మను...."
"ఒక్కసారి నందిని శరీరం చూశావంటే నీకర్ధమవుతుంది-ఆమె ఎన్ని గాయాలకు గురయిందో?"
"నువ్వు చూశావా?"
"చూశాను....."
"హుఁ" అంది చంద్రిక కోపంగా.
"చంద్రికా-అసూయ జాలి జతపర్చి నందిని నర్దం చేసుకో-అప్పుడు నీలో అసూయ మాయమై నందినిపట్లజాలిమాత్రమే మిగులుతుంది-"అన్నాడు చక్రధారి.
"నీ విషయంలో అదే విశేషమింకా ముందుకు జరిగి ఆ జాలి ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తోంది. కధేమైతే నాకెందుకు? భవిష్యత్తులో మనమిద్దరం భార్యభర్తలం కావడంలేదు. అంతే కదా!" అంది చంద్రిక.
"కాదు, చంద్రికా! నేను నందినిని మోసగిస్తున్నాను" అన్నాడు చక్రధారి గంభీరంగా.
"ఎలా?"
"నందిని భర్త గోవర్ధన్ లక్షాధికారి సోమేశ్వరరావు ముగ్గురి కొడుకుల్లో ఆఖరువాడు. అతడికి చిన్నతనంలోనే తల్లిపోవడంవల్ల గారంగా పెరిగాడు. ఆ గారాబం దురలవాట్లకు దారితీసింది. గోవర్ధన్ కి తిన్నగా చదువు రాలేదు చెడు సావాసాలు పట్టాడు. తండ్రి దీనికెంతో కలవరపడి కొడుకును మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక్కటీ ఫలించలేదు. చివరికాయన విసిగిపోయి కొడుకునింట్లోంచి పొమ్మన్నాడు. పౌరుషంకొద్దీ ఇల్లొదిలి పెట్టినా త్వరలోనే తానెందుకూ కొరగానివాడినని గ్రహించి తప్పు క్షమించమంటూ యింటికి తిరిగొచ్చాడు గోవర్ధన్.
తండ్రి అతణ్ణి వెంటనే నమ్మలేదు. తను చెప్పినట్టు పెళ్ళిచేసుకుని ఆమెతో బుద్దిగా కాపురం చేస్తూంటే-భార్యద్వారా అతడిక్కావలసిన డబ్బిస్తానని చెప్పాడాయన. గోవర్ధన్ ఈ షరతు కంగీకరించాడు. తండ్రి అతడికి పేదింటి పిల్లయినా నందినితో వివాహం జరిపించి అతణ్ణి బాగుచేసే బాధ్యత ఆమెకప్పగించాడు.
"నందినికి సవతితల్లి. ఇంట్లో బాధలు పడలేకపోతోంది. ఐశ్వర్యవంతుడి కోడలు కావడం తన అదృష్టంగా ఆమె భావించింది. మామగారి అభీష్టం మేరకామె భర్తకు మంచి బుద్ధులు నేర్పాలనుకుంది. కానీ గోవర్ధన్ ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించి ఇట్టే నందిని నాడి పట్టేశాడు. ఆమెద్వారా తండ్రివద్ద నుంచి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. ఆమె అసహాయతను కనిపెట్టి క్రూరంగా హింసించసాగాడు. ఆ విధంగా తండ్రిమీద కోపాన్నతడు భార్యమీద తీర్చుకుంటున్నాడు.
