"ఇలా ఆలోచించేవాడు సాహసం చేయలేడు. నేను సాహసిస్తున్నాను" అన్నాడు కిల్లర్.
"మీకు అన్ని వివరాలూ చెబుతాను కానీ ఎక్కడ నా పేరు రాకూడదు. ఈ బొమ్మలోని వ్యక్తులను నా ద్వారా గుర్తిస్తున్నట్లు మీరెక్కడా అనకూడదు. నేను నీతిగానే బ్రతుకుతున్నా ధైర్యవంతుణ్ణి కాను, బ్రతుకు మీద ఆశ, తీపి-రెండూ వున్నవాణ్ణి-" అన్నాడు నరసింగరావు.
కిల్లర్ ఆయనకు హామీ యిచ్చాడు.
3
కిల్లర్ తనూ సిక్కు వేషంలోనే వున్నాడు. అతడు తనతో పంజాబీ మాట్లాడుతుంటే సింగ్ ఆశ్చర్యంగా "ఇరవై నాలుగు సంవత్సరాలు తెలుగు దేశంలో వుండికూడా నేను స్వచ్చమైన తెలుగు నేర్చుకోలేకపోయాను. నా మాటలో పంజాబీ యాస తెలిసిపోతుంది. నువ్వు అచ్చం పంజాబీలా మాట్లాడుతున్నావు-...." అన్నాడు.
"అందులో ఆశ్చర్యమేముంది-....?" అన్నాడు కిల్లర్.
"తెలుగు యాస లేదు నీ భాషలో-ఆశ్చర్యం కదూ?"
"నేను తెలుగువాడి ననీ-పంజాబీని కాదనీ నీ కెవరు చెప్పారు?-...." అన్నాడు కిల్లర్ కాస్త చిరాగ్గా.
"అయితే నువ్వు పంజాబీవా?" అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా.
"నన్నిప్పుడు చూస్తూంటే నీ కెలా కనబడుతున్నాను?"
మొబైల్ వ్యాన్ దూసుకుపోతూంటే సింగ్ కిల్లర్ నే పట్టి పట్టి చూశాడు. మాటలో, రూపంలో-అతడిని సిక్కు కాదనడం కష్టం!
"అచ్చం నేటివ్ సిక్కులాగున్నావు!"
కిల్లర్ నవ్వి-"చూశావా-కాస్త అభ్యాసంతో మనిషి ఏ భాషనైనా మాట్లాడవచ్చు. ఏ రూపాన్నైనా దరించవచ్చు. అంటే అర్ధమేమిటి-అంతా ఒక్కటే నని కదా! ఇది తెలిసి కూడా మనిషి-మతం పేరిట, భాష పేరిట-రక్తపాతాన్నెందుకు సృష్టిస్తాడో నా కర్ధంకావడం లేదు. నీకూ అర్ధం కాదనుకుంటాను....." అన్నాడు.
"అవును రాష్ట్రం వదిలిపెట్టిన మూలాన అంతా ఒక్కటే నన్న భావం నాలో బాగా పేరుకుపోయింది. కానీ ఇంతకీ నువ్వెక్కడివాడివి?"
"అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను భారతీయున్ని.....అంతే!"
ఉన్నట్లుండి వ్యాన్ సడన్ బ్రేకుతో ఆగింది.
దారి కడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్ళున్నాయి.
బిలబిలమంటూ పదిమంది ముసుగు మనుషులు వ్యాన్ ని చుట్టుముట్టారు. కిల్లర్ వ్యాన్ దిగి అచ్చమైన పంజాబీలో వారిని పలకరించాడు.
"ఖలిస్థాన్ విమోచనకు చందా యిచ్చి వెళ్ళండి-" అన్నారు వాళ్ళు.
"నా దగ్గర ఒక్క పైసాకూడా లేదు-" అన్నాడు కిల్లర్.
"అది మేము చూసుకుంటాం-" అన్నారు వాళ్ళు.
"మీ యిష్టం....." అన్నాడు కిల్లర్.
ఒకడు వెనుకనుంచీ వ్యాన్ తలుపు తెరిచాడు. అంతే!
బుస్సుమంటూ అదోరకం గ్యాస్ వచ్చింది.
క్షణాలమీద వ్యాన్ చుట్టూ వున్న ముసుగు మనుషులు స్పృహతప్పి పడిపోయారు.
"ఏం జరిగింది?" అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా.
"వీళ్ళకు స్పృహతప్పింది. మరో గంటదాకా నిద్రలేవరు...." అన్నాడు కిల్లర్.
"మరి మనకు తప్పలేదేం?"
"వ్యానెక్కేముందు నేను నీకు చూయింగ్ గమ్మిచ్చాను కదా అది దీనికి యాంటిడోట్...."
"నువ్వు అసాధ్యుడివి-...." అన్నాడు సింగ్.
"కావచ్చు కానీ-నాకూ అసాధ్యాలున్నాయి.."
సింగ్ మాట్లాడలేదు. కిల్లర్ తో కలిసి అతడామనుషులందర్నీ వ్యాన్ లోకి చేరవేశాడు. ఓ పదినిమిషాల్లో వాళ్ళు దగ్గర్లో వున్న పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ కిల్లర్ జరిగింది చెప్పాడు. పోలీసులా మనుషుల్ని స్వాధీనపర్చుకున్నారు.
ఇన్ స్పెక్టర్ వాళ్ళని చూసి-"వీళ్ళు టెర్రరిస్టులు కాదు. పాత ఖైదీలు-" అన్నాడాశ్చర్యంగా.
"టెర్రరిజం ప్రారంభమైతే ఇలా ఉపయోగించుకునేందుకెందరో అవకాశవాదులుంటారు-" అన్నాడు కిల్లర్.
కిల్లర్ అక్కడ తన వివరాలేమీ చెప్పలేదు. దొంగలను పట్టుకున్న ఘనత పోలీసులకే వదిలిపెట్టి అతడు ముందుకు వెళ్ళాడు.
చివరకు శ్రీమన్నారాయణ తగులబడ్డ చోటు చేరుకున్నాడు.
అదొక మైలురాయి. రాతి పక్కగా సన్నని కాలిబాట. కాలిబాటలో వందగజాల దూరం నడిస్తే ఓ చెట్టు.
ఆ చెట్టుకింద సజీవదహనం అయిపోయాడు శ్రీమన్నారాయణ.
జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటికీ అక్కడ కొన్ని గుర్తులున్నాయి-ఓ మనిషి సజీవంగా కాలిపోయినట్లు.
కిల్లర్ ఆ ప్రాంతాన్ని శ్రద్దగా పరిశీలించాడు.
సింగ్ అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.
తన పరిశోధన అయ్యాక-"ఇంక ఏడుపు ఆపు-" అన్నాడు కిల్లర్.
"నువ్వు నన్నిక్కడే పెట్రోలు పోసి తగులబెట్టు-" అన్నాడు సింగ్.
"ఎందుకు?"
"నా జాతి చేసిన అన్యాయానికి శ్రీ మన్నారాయణ ఆహుతి అయిపోయాడు. అందుకు బదులుగా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను....."
"నీ ఆలోచనలు మూర్ఖత్వంతో నిండివున్నాయి. నువ్వు సిక్కువు కాదు. మనిషివి. శ్రీమన్నారాయణ హిందువుకాదు. మనిషి, ఒక మనిషి అతడిని అన్యాయంగా సజీవదహనం చేశాడు. అందుకు నువ్వు బాధ్యుడివి కాదు....."
"అంటే?"
"శ్రీమన్నారాయణను సిక్కు చంపాడు కాబట్టి అది నీ బాధ్యత అయింది. అదే యే ముస్లిమో, హిందువో చంపితే అది నీ బాధ్యత కాదా? నిన్ను నువ్వు యేదో జాతికి పరిమితం చేసుకొనడం సంకుచితం. మనమిప్పుడన్వేషిస్తున్నది సిక్కు తీవ్రవాదులను కాదు. మన స్నేహితున్ని దారుణంగా చంపిన కొందరు దుష్టులను తెలిసిందా?"
సింగ్ కాస్త ఊరటచెంది-"బాభీజీ నాతో మాట్లాడ్డం మానేసింది. స్వంత అక్కలా నన్నాదరించే బాభీజీ అలా ప్రవర్తించేసరికి నామీద నాకే ద్వేషం పుట్టుకొచ్చింది. ఇక్కడ శ్రీమన్నారాయణ ఆహుతైన దృశ్యం తలపులోకి రాగానే నాకు పిచ్చెక్కినట్లయింది. నీ మాటలు నాకు కాస్త ఊరటను కలిగించాయి-" అన్నాడు.
"అనవసరంగా ఆవేశపడకు ఎవరో చేసిన తప్పుకు నిన్ను బాధ్యుణ్ణి చేసుకోక.....పద.....పోదాం-" అన్నాడు కిల్లర్.
మళ్ళీ వాళ్ళ వ్యాన్ బయల్దేరింది.
దగ్గర్లో ఇంకో పోలీస్ స్టేషన్.....
అక్కడ ఇన్ స్పెక్టర్ బహదూర్ సింగ్ వారితో యెంతో అభిమానంగా మాట్లాడాడు.
కిల్లర్ అతడికి శ్రీమన్నారాయణ హత్య గురించి గుర్తుచేశాడు.
"అవునవును. మహాదారుణమది. మన సిక్కులందరూ సిగ్గుపడాల్సిన చర్య అది!" అన్నాడు బహదూర్ సింగ్.
"దుండగులు దొరికారా?"
