Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 27


    "ఇంతకీ ఎవరు నువ్వు?"
    "నా పేరు కిల్లర్ అయామే కిల్లర్ ఆఫ్ ఎనీథింగ్ క్రూయల్....."
    సింగ్ కిల్లర్ వంక ఆశ్చర్యంగా చూశాడు.
    వ్యాన్ డ్రైవింగ్ సీట్లో యెవరూ లేకుండానే ముందుకు దూసుకుని పోతోంది.

                                      2

    నరసింగరావింట్లో డ్రాయింగ్ రూం......
    గది మరీ అంత విశాలమైనదికాదు కానీ గది ఇంటి వారి అభిరుచిని తెలియజేస్తోంది.
    గడకు ఇండియా మ్యాప్.....పక్కగా గాంధీ, నెహ్రూ, శాస్త్రి, ఇందిరా, రాజీవ్ గాంధీల ఫోటోలు వ్రేలాడుతున్నాయి.
    అందమైన కాశ్మీర్ కార్పెట్ మొత్తం నేలనంతా కవర్ చేసింది.
    గది మధ్యలో సోఫాల్లో కూర్చుని వున్నారు నరసింగరావు, కిల్లర్, సింగ్.....
    కిల్లర్ నరసింగారావునే చూస్తున్నాడు.
    అతడు ఖద్దరు పంచ ధరించి వున్నాడు దానిమీద ఖద్దరు చొక్కా, కండువా! చూడ్డానికి రాజకీయ నాయకుడిలా ఉన్నాడతడు.
    పచ్చటి దబ్బపండులాంటి ఛాయ.....
    "నా పేరు కిల్లర్-" అన్నాడు కిల్లర్.
    "ఢిల్లీలో కిల్లర్స్ కి లోటులేదు-" అన్నాడు నరసింగరావు.
    "అయామే కిల్ల రాఫ్ కిల్లర్స్....."    
    నరసింగరావతడి వంక కుతూహలంగా చూసి-"మీరు చెప్పదల్చుకున్న దేమిటి?" అన్నాడు.
    కిల్లర్ క్లుప్తంగా అతడికి విషయం వివరించాడు.
    నరసింగరావు లేచి కిల్లర్ని సమీపించి చేయిచాచి ష్యేక్ హ్యాండిచ్చాడు.
    "అయాం వెరీవెరీ హాపీ......నా ప్రాణమిత్రుడు శ్రీమన్నారాయణను క్రూరంగా చంపిన ఆ దుర్మార్గులను సర్వనాశనం చేయడానికి మీకెలాంటి సహకారం కావాలన్నా నేనందజేయగలను...." అన్నాడతడు.
    "అందుకే మీ ద్గాగారకు వచ్చాను. మీరు దేశభక్తులని మీ డ్రాయింగ్ రూం, దుస్తులు చూసి చెప్పవచ్చు మీ వంటివారిచేత ఖలిస్థాన్ జిందాబాద్ అనిపించినవారిపై మీకు అపరిమితమైన ద్వేషముండాలి...." అన్నాడు కిల్లర్.
    "లేదు...." అన్నాడు నరసింగరావు.
    సింగ్ అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు.
    "ఎందుకు లేదు?" అన్నాడు కిల్లర్.
    "నా బలహీనతకు నేను వారినెందుకు ద్వేషించాలి? శ్రీమన్నారాయణకులా నేనూ నా ప్రాణాలకు తెగించి వారి నెదిరించవచ్చు. కానీ నా దేశభక్తి వేషధారణకూ, డ్రాయింగ్ రూంకు మాత్రమే పరిమితమయింది. నాలో ధైర్యం తక్కువ, నా ప్రాణాలు రక్షించుకునేందుకు నేనేమైనా చేయగలనని రుజువయింది. ఇప్పుడు నన్ను నేనే ద్వేషించుకోవాలి...శ్రీమన్నారాయణను రక్షించుకోలేనందుకు.....అతడిలా ధైర్యాన్ని ప్రదర్శించలే నందుకు...."
    "నిజం చెప్పాలంటే మీ పరిస్థితుల్లో నేనైనా అంతే చేసేవాణ్ణి. శ్రీమన్నారాయణ అసాధారణ పురుషుడు, అలాంటి ధైర్యం మహాత్ములకు కానీ సాధ్యపడదు-" అన్నాడు కిల్లర్.
    "అందుకే అతడు పోయాడు. పాపీ చిరాయువు.....అంటారు కదా-నేను మిగిలాను...." అంటూ నరసింగరావు కళ్ళు మూసుకుని-"ఆ మంటల్లో మాడిపోతూ కూడా శ్రీమన్నారాయణ భరతమాతకు వందనాలు పలికాడు-" అన్నాడు.
    అతడి గొంతు రుద్ధమయిందని గమనించాడు కిల్లర్ .
    "మీరేరూట్లో వెళ్ళారో-ఎలా వెళ్ళారో-నాకు వివరాలు కావాలి...." అన్నాడు కిల్లర్.
    "చెబుతాను అసలా దుండగులెలావున్నారో కూడా మీకు నేను చెప్పగలను-...." అన్నాడు నరసింగరావు.
    "చెప్పండి-" అన్నాడు కిల్లర్.
    నరసింగరావు లేచి లోపలకు వెళ్ళాడు. కొద్దిక్షణాలలోనే ఆయన వెనక్కు వచ్చాడు. ఆయన చేతిలో గుండ్రంగా చుట్టబడిన ఒక ఆర్టు పేపరుంది.
    కిల్లర్ ఆ పేపరందుకున్నాడు.
    అందులో ముగ్గురు వ్యక్తులున్నారు.
    ఒకడు సన్నగా పొడుగ్గా వున్నాడు. ఒకడు లావుగా పొట్టిగా వున్నాడు.
    "నేను వాళ్ళ బొమ్మలు గీశాను...." అన్నాడు నరసింగరావు.
    "ఎవ్వరికీ గెడ్డాలు లేవు.." అన్నాడు కిల్లర్.
    సింగ్ ఆ బొమ్మలవంకే చూస్తూ-"వీళ్ళు నిజంగా సిక్కులే అయితే-ఖలిస్థాన్ విషయమెలాగున్నా ముందు మతద్రోహం చేశారు-గెడ్డాలు తీసేసి..." అన్నాడు.
    నరసింగరావు నిట్టూర్చి-"ఎవరు వీళ్ళ నిందుకు ప్రోత్సహిస్తున్నారో ముందు వాళ్ళ అంతు తేల్చాలి-" అన్నాడు.
    కిల్లర్ ఆ బొమ్మలవంకే ఆశ్చర్యంగా చూస్తూ-"మీరు చెప్పింది నిజం. తప్పు వీళ్ళది కాదు. వీళ్ళను నడిపించే వాళ్ళది-" అన్నాడు.
    "నడిపించేవాళ్ళు చెప్పినట్లు నడవడానికి మనిషికి మాత్రం బుద్దుండొద్దూ?" అన్నాడు సింగ్ కోపంగా.
    "ఒక గాంధీ ప్రబోధిస్తే-స్మానాయుడు లాఠీ దెబ్బ లకు రొమ్మిచ్చి నిలబడ్డాడు. ఒక హిట్లర్ ప్రబోధిస్తే-మాజీ సైన్యం మనుషుల్ని కీటకాల్లా మాడ్చేసింది. నాయకత్వపు శక్తి ఉన్నవాడు తన అనుచరులచేత మానవకల్యాణం సాధించగలడు. మారణహోమం చేయగలడు. తప్పొప్పులు అనుచరులవి కాదు. నాయకులవి...." అన్నాడు కిల్లర్.
    "ఉన్నట్లుండి మీ దృష్టి నాయకులపైకి మళ్ళిందేం?" అన్నాడు నరసింగరావు.
    "ఎందుకంటే ఈ ముగ్గురు మనుషుల్లోనూ నాకు రాక్షసత్వం కనబడడంలేదు. వారి కళ్ళలో త్యాగదీక్ష, దేశభక్తి ప్రతిఫలిస్తున్నాయి...."
    "నేను బొమ్మ తప్పు వేసివుంటాను. శ్రీమన్నారాయణను వాళ్ళు పెట్రోలు పోసి తగులబెడుతూంటే వాళ్ళకళ్ళల్లో నేను పైశాచికానందాన్ని నా కళ్ళారా చూశాను. వాళ్ళు మంచివాళ్ళు కాదు. పరమ కిరాతకులు-...." అన్నాడు నరసింగరావు ఆవేశంగా.
    "బ్రిటీష్ వారిపై బాంబులు వేసి ఉరికంబ మెక్కితే వారు మనకు అమరవీరులయ్యారు. వారి కళ్ళలో మనం క్రూరత్వాన్ని చూడగలమా? మనకు చెందనివారు మన దేశంలో అడుగుపెట్టి మానను బానిసలుగా చూస్తూంటే సహించలేక తిరగబడ్డ మహాత్ములు వారు. భరతఖండంలో అన్ని మతాలవారూ సమానంగా సామరస్యంతో జీవిస్తూంటే-కొందరు వేర్పాటువాదులు లేని యెక్కువతక్కువుల్ని సృష్టించి - సిక్కులకు హిందువులు బ్రిటీష్ వారే నన్న దురభిప్రాయం సృష్టించారు. అది నమ్మిన అమాయకులు తాము దేశభక్తులమనీ, త్యాగపరులమనీ నమ్ముతూ సోదరుల నూచకోత కోస్తున్నారు. తప్పు వారిది కాదు. వారిని నడిపిస్తున్న వారిదే!"
    "కానీ....." ఏదో అనబోయాడు నరసింగరావు.
    "మీలోని చిత్రకారుడు గొప్పవాడు. చూసింది చూసినట్లుగా బొమ్మ గీశారు. మీ స్నేహితుడు మీ కళ్ళముందే కాలిపోతూంటే మీకు వారు క్రూరులుగా కనిపించి ఉండవచ్చు. కాని మీలోని చిత్రకారుడు వారిని యధాతధంగా ఫోటో తీసి మనసులో ముద్రించాడు. ఈ ఫోటోలోని వ్యక్తులు తప్పుదారిలో నడుస్తున్న మంచిపౌరులనడంలో సందేహంలేదు-" అన్నాడు కిల్లర్ సాలోచనగా.
    "మీ పరిశీలనాశక్తి అద్భుతం.....ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? వీరి సాయంతో అసలువారిని పట్టగలరా? ప్రభుత్వ గూఢచారులకు సాధ్యపడనిది మీకు సాధ్యపడుతుందా.....?" అన్నాడు నరసింగరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS