వేలకు వేలు కట్నం యిస్తారని ఆశ చూపి అమ్మ పెళ్లి చూపులకు రమ్మనేది. అమ్మ మాట మన్నించి వెళ్ళే వాడిని. ఏ అమ్మాయి లోనూ నేను కావాలనుకున్నభార్యను చూడలేక పోయాను. ఏదో అమాయకత్వం . అపరిపక్వత -- తెలియని తనం కొట్టవచ్చినట్టు కనబడేది. ఆ సమయంలో నువ్వు జ్ఞాపకాని కొచ్చేదానివి. నీకు చదువుంది. నీలో సంపూర్ణత్వం గోచరించేది. అది చదువుతో విద్యతో వస్తుందంటే ఒప్పుకోలేను. నేను చూచిన ఐదుగురిలో ఇద్దరు బి.ఏ పాసయ్యారు. అంటే వాళ్ళు కేవలం డిగ్రీల కోసమే చదివారన్న మాట. వీళ్ళతో ఎంత మాట్లాడి నాకు సంతృప్తి కరంగా లేదు. మిగిలిన ముగ్గురు పల్లెటూరు వాళ్ళు. ఎంత ఆలోచించినా నువ్వే జ్ఞాపకానికి వచ్చేదానివి. కాని నువ్వు అందని పండు వనిపించేది" అతను జాలిగా చూశాడు.
"ఎందుకు?" అంది ప్రశ్నించినట్లు మనుసులో ఆనందం కలుగుతున్నా.
"ఎందుకంటె అమ్మకు కోడలు కావాలంటే అమ్మాయి ఒడి నిండుగా వుండాలి" జామచెట్టు ఆకొకటి నోట్లో వేసుకుని నమిలాడు. అది వగరుగా వుంటే "వూ" అని ఊదేశాడు.
"డబ్బు లేని కోడలంటే మీ అమ్మకు వగరుగా ఉంటుందన్న మాట, మరి ఇదెలా సాధ్యమైంది?
"నేను పట్టుపట్టాను. అన్నాడు వెంకటేష్ మెత్తగా నవ్వుతూ.
ఆ నవ్వు గీతలో ఏవో భావాలు కలియ బెట్టింది. ఆమె ఆకర్షితమై అతని ముఖంలోకి చూచింది. అతను తన వైపు చూడడం లేదు. అప్రయత్నంగా తలొంచుకొని మౌనం దాల్చింది గీత.
ఇంకొంచెం ముందుగా ఎందుకు రాలేదు? ఇంత ఆలస్యం చేయటానికి కారణం?అని అడగాలని వుంది. మనిషి మీద అసహ్యం ఉంటె ఆ ప్రశ్నలు అడగవచ్చు. కాని ఇప్పుడు అడగడం కష్టంగా వుంది.
"మీ చెల్లి-- లలిత -- పరాయి సంబంధాన్ని చేసుకుందని- అటువంటి కుటుంబాన్ని దూరంగా వుంచాలని చెప్పింది అమ్మ."
గీతకు ఆశ్చర్యంగా వుంది. తను బావను గూర్చి ఊహించినదంతా తప్పేనా -- బావ యింత స్వేచ్చగా అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పగల్గుతున్నడంటే అతని హృదయ విశాలత కే తార్కాణము! తను ఓడిపోతుందా?
"అంతేనా?"
"అంతే గీతా....అతను తటపటాయిస్తూ "ఉహు" అన్నాడు వినబడి వినబడనట్లు. "మరి ఎలా ఒప్పించగల్గావు....బావా....ఇటు చూడు -- నేను పాస్ కావటానికి ఈ రాకకు సంబంధం లేడూ ....నిజం చెప్పు బావా?" ప్రాదేయపడ్తున్నలా అడిగింది. తను ఓడిపోలేదు- తను ఊహించింది తొంబై పాళ్ళు నిజమే.
"ఉంది గీతా "-- అన్నాడు వెంకటేష్, మొహం ఖాళీగా పెట్టి.
"నా విలువ హెచ్చింది. ఇప్పుడు నాకు మూడు వందల ఏభై యిస్తారు. రెండు సంవత్సరాలకు దాదాపు తొమ్మిది వేలు ఖరీదు చేస్తాను. బోడి కట్నం ఐదు వేలు పది వేలూ ఎందుకు? వెండి సామాన్లు వజ్రపు టుంగరాలు దేనికి-- లక్ష రూపాయలు విలువ చేసే కోడలుంటే చాలదూ? ఇదేనా అత్త అభిప్రాయం? కష్టపడి చదివింది నేను, కడుపు కట్టుకుని చదివించింది అమ్మా, నాన్న. అయితే గ్రద్ద తన్నుకు పోయింట్లోచ్చి తన్నుకు పోవటానికి మీరు సిద్దమయ్యారు. మా వాళ్ళు- ఎలాగో పెళ్లి చేసి పంపాలని చూచారు గానీ ఇదంతా ఆలోచించలేదు....వాళ్ళు చాలా కష్టాల్లో వున్నారు. వారికి సహాయం చేయగలదాన్ని నేనోక్కత్తినే ....అందుకే బావా నా కిష్టం లేదని రాత్రే చెప్పాను. ఇక వెళ్ళిపొండి...." గీత కాళ్ళు పైకెత్తుకుని మోకాళ్ళ లో తల దూర్చి కాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుంది.
వెంకటేష్ కు ఏమి చెయ్యాలో తోచలేదు. గాభరాగా అటు ఇటు చూచాడు. అచేతనుడై మౌనంగా చూస్తున్నాడు. హృదయంలో కల్లోలం అధికమైంది. కొంతసేపటికి తమాయించుకుని గీతకు దగ్గరగా జరిగాడు.
"గీతా -- ఒక్క మాట విను. మేం ఈ రోజే వెళ్లిపోతాము. ఈ ఒక్క మాట విను. నువ్విప్పుడు చెప్పినదంతా నేను ఊహించలేదు . గీతను పాస్ కానీ అంటుంటే చదువు మధ్యలో పెళ్లి చేయటం దేనికని అమ్మ ఆటంక పరుస్తోందనే అనుకున్నాను. డిగ్రీ పొందాక మా కోడలు ఇంత చదివిందని ఘరానా చెప్పుకోవచ్చు ననుకుంది అనుకున్నాను. ఇదంతా నాకు క్రొత్తగా వుంది. నిజమే , కష్టపడి చదివించింది వాళ్ళు. దాని ఫలితం అనుభవించేది మేము కాని ఆ దృష్టి తోనే రాలేదు....నేను నీకోసం వచ్చాను....నేనంటే నీ కసహ్యమైనప్పుడు వృధాగా ఇంతసేపు ఎందుకు మాట్లాడవు గీతా? ముందుగానే ముఖం మీద అనేసినట్లయితే వెంటనే వెల్దును గా....పోనీయే.....వెళ్ళిపోతాను గాని ఈ అన్యాయంలో నేను భాగస్తుడనని మాత్రం అనుకోకు . అంత కుళ్ళు పెట్టుకుని రాలేదు. వెళ్తున్నాను గీతా/...'అని లేచి నిలబడ్డాడు.
ఈ క్షణం విలువైనది. జారిపోతే మరి రాదేమో. గీత హృదయం గాలిలో కొట్టుకుపోయే ఎండుటాకులా తల్లడిల్లి పోయింది. తలెత్తి చూచింది వెళ్తూ వెళ్తూ వున్న వెంకటేష్ గబుక్కున వెనుదిరిగి చూచాడు. ఆ దృష్టి ఆమె హృదయాన్ని చేధించింది.
"బావా-- అగు" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది.
వెంకటేష్ నిర్ఘాంత పోయి నుంచున్నాడు. "బావా...వేళ్ళకు?" అశ్రుపూరిత నయనాలతో క్షణం అతని కళ్ళల్లో కి చూసింది.
ఆమె కళ్ళలో అనంతాకాశ నీలాలను చూస్తూ "వెళ్ళిపొమ్మన్నావుగా" గోముగా అడిగాడు.
"ఉండమంటే వుంటావా? అని గొణిగింది . అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి.
అమ్మ బాబోయ్ ...అత్తగారింట్లోనే ...ఉండను గీతా. నువ్వు వస్తే తీసుకుని వెళ్ళిపోతాను."
ఆ మాటలకు వెన్నెల చిలికినట్లుగా నవ్వింది గీత.
"ఇంత సమీపాని కొచ్చి -- పెళ్లి కాని అమ్మాయి ఈ విధంగా నవ్వితే ....గీతా ....మనస్సు మాట వినదు....తప్పు చేస్తే శిక్షించకు"
గీత చిరుకోపం ప్రదర్శిస్తూ దూరంగా నడిచింది.
"ఇంకొకక్క మాట. ఇలా వచ్చి కూచోండి. మీతో కొంత వ్యవహారం మాట్లాడాలి."
వెంకటేష్ వింతగా చూచాడు. గడ్డాన్ని బొటనవ్రేలు , చూపుడు వ్రేలుతో పట్టుకుని గీత వైపు నిశితంగా చూచాడు.
"గీతా -- నువ్వేమంటున్నావో తెలుసు కదూ?"
"ఊ."
"నేను ఉద్యోగం చేయటం, డబ్బు మా వాళ్లకు పంపటం విషయం మాట్లాడాలి. గీత నిస్సత్తువలో ముకుళించుకు పోయింది.
"గీతా. మనది సిటీ లైఫ్. డబ్బు ఖర్చు ఎక్కువగా వుంటుంది. కానరాని ఖర్చు లుంటాయి.
"నేను పనిచెయ క పోయినా -- మీ జీతం మనకు సరిపోతుందిగా?"
"ఆ సరిపోతుంది-- ఇద్దరు ముగ్గురైతే, ముగ్గురు నలుగురైతే - నలుగురు -- "ఆపండి " అంటూ గీత చిరునవ్వుతో మందలించింది. వెంకటేష్ నవ్వేశాడు."
"మీరు ఒక్క దమ్మిడి ఎవ్వరికీ పంపనవసరం లేదు కదా. నేను పనిచేయుటమంటూ సంభవిస్తే కొంత మా వాళ్ళకు పంపాలి" వెంకటేష్ ముఖం ప్రసన్నం చేసుకొని "దాని కభ్యంతరం వుండదు" అన్నాడు గీత హృదయం తేలిక పడింది.
"నిజంగా అంత కృతజ్ఞత వుంటే ఒక్క మాటకు జవాబివ్వు."
"అడగండి."
"ఒకవేళ -- వీల్లేదనుకుంటే !" ఆ ప్రశ్నలు హాస్యమే ఉంది కాని సందేహం లేదు.
"మీరలా అనరని తెలుసు.
"అన్నానే అనుకో-- అప్పుడు నన్ను వచ్చిన దారినే పొమ్మనే దానివా?"
"అంతేగా మరి"
"గట్టిదానివే! అని పకపకా నవ్వాడు వెంకటేష్.
"ఇది నవ్వులాటకు సమయం కాదు.
"ఓ....ఐ యాం సారీ....ఇది ప్రాత కాల సమయం - పనులు చేసుకొని వీలైతే -- ఎవరైనా ఇస్తే కాఫీ తాగే శుభసమయం"
గీత సిగ్గుపడింది
"కాఫీ త్రాగలేదూ?"
"ఇంటి నుండి పోమ్మన్నవారు కాఫీ ఇచ్చి సాగనంపుతారా?"
గీత పరుగున లోపలికి వెళ్ళింది. అప్పటికే శుభవార్త ఇంట్లో తెలిసిపోయింది.. "అక్కయ్య ...త్వరగా కాఫీ......"
పుష్ప ముఖం పుష్పించింది." ఇప్పుడే ఇంత హడావిడి..."
"ఏడున్నరైంది కదా, ఒక్కరికైనా కాఫీ ఇవ్వాలని ఆలోచన రాలేదేం?" అన్నది గీత.
టాక్సీ ఆగిన వెంటనే ప్రేమా, లలితా ఎదురెళ్ళారు. శంభూ అతోగ్యంగానే వున్నాడు. కాళ్ళకు ఏదో బెల్టు కట్టి వున్నారు. చెయ్యి వ్రేలాడుతోంది. నరెంద్త కార్ దిగి నుంచుంటే ప్రేమ, లలిత లు వాడిని ఆప్యాయంగా తలకాయ నిమిరారు.
అత్త మామగార్ల కు నమస్కరించారు. ఆమె ప్రేమ చెంప నిమిరి, "ఆరోగ్యం బాగుంది కదమ్మా....నేను లేనని-- సమయానికింత చేసి పెట్టలేక పోయానని ఎంతో ఇదై పోయాను -- ఏం తల్లి లలితా - గీత విషయం రాశావు మాకెంతో ఆనందం అయింది."
అందరూ లోపలి కెళ్ళారు. "నిరంజన్ లేడా?"
"రీసెర్చి చురుగ్గా సాగుతోంది. త్వరగానే వస్తానన్నారు."
ఆ రాత్రి భోజనానంతరం అందరూ కూచున్నారు. శంభూ క్రచ్చీస్ పట్టుకుని టకటక లాడిస్తూ వచ్చాడు.
శ్రీనివాసరావు ప్రారంభించాడు. "చాలా ఆలస్య మౌతుందట. కోలుకోతం అలా వుంచండి. అసలు కాలు, నడిచేందుకు పనికి రావటానికి కొన్ని సంవత్సరాలు పడ్తుందట. అక్కడ ఎన్ని మసాలున్నాము. అప్పుడప్పుడు వెళ్లి రావచ్చని వచ్చేశాము....అది సరే గీతను ఎవరో చేసుకుంటానన్నారుటగా-- ఎవరా అబ్బాయి."
"స్వంత బావే. వెనక ఓసారి వచ్చి కట్నం కుదరలేదని వెళ్ళిపోయారే , వారే అన్నది లలిత. అ స్వరంలో అక్క అదృష్టానికి ఆనందం కంటే బావపై అసహ్యం ధ్వనించింది.
"ఇప్పుడెలా సాధ్యమైంది?' అయన ఆశ్చర్యం తో ప్రశ్నించారు.
"ఆనర్స్ - టెస్ట్ పాసయిన కోడలు వస్తుంటే ఐదు వేల కట్నం ఎవడిక్కావాలి? ఆ డిగ్రీ చాలా విలువ చేస్తుందిగా?"
"ఔరా" అంటూ ముక్కు మీద వేలేసుకుంది ఐరావతమ్మ.
శ్రీనివాసరావు కాసేపు ఆగి జేబు లోంచి కవరు తీసిచ్చాడు.

నిరంజన్ పరాకుగా తీసి చదివి - బిత్తర పోయాడు ఆ కాగితాన్ని నెమ్మదిగా నరేంద్ర కు అందించాడు. అలాగే ఆఖరుగా ప్రేమ చేతిలో ఆ కాగితం గాలికి రెపరెప లాడుతోంది.
"ఐతే నెల్సన్ గారోస్తారన్న మాట. శంభూ ను చూచేందుకుకెనా?"
"ఉహూ ! శంభూ ను తీసుకెళ్లాలని" ఐరావతమ్మ శంభూ ను చూస్తూ అంది.
"నాన్నా-- నువ్వు రాశావా?...." నిరంజన్ ఉద్రేకంతో అన్నాడు.
"రాశాను-- శంభూకు ఇలా అయిందని సుదీర్ఘ లేఖ వ్రాశాను. హాస్పిటల్ బిల్ కని రెండు వేల రూపాయలు పంపాడు."
"మరి తీసు కెళ్ళటానికేనా రావటం?" నరేంద్ర బాధగా అన్నాడు.
"ఔను . ఉత్తరం రాశాడు. చాలా ఎక్కువగా వుండి నడవలేక పొతే తీసుకెళ్తా నన్నాడు. అక్కడ ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడట....
"నాన్నా-- నువ్వు-- అంగీకరించావా?"
మొదట ఒప్పుకోలేదు. తరువాత -- ఆలోచించిన మీదట శంభూ ను పంపటమే ఉచితమనుకున్నాను....వీలైతే అమెరికా కు కూడా తీసుకెళ్తాడుట. అతనికి డబ్బుంది. మంచి ట్రీట్ మెంట్ ఇప్పించగలడు. శంభూ తిరిగి మామూలుగా నడవగలిగితే -- ఆ చెయ్యి తన పని చేయగల్గితే -- అంత కన్నా మనం కోరేది ఏమీ లేదు. నేను "పంపను" అని భీష్మించు కుంటే వీడికి బాగయ్యే యోగ్యత ను తృణీకరించిన వాడినౌతాను."
కాసేపు ఆగి ఆయనే అన్నాడు. "శంభూ కు ట్రీట్ మెంట్ ఇప్పించడం పూర్తయిన వెంటనే ఇక్కడికి పంపాలని నెల్సన్ కు స్పష్టంగా వ్రాశాను. ఒప్పుకోన్నట్లే. ఎప్పుడొస్తాడో కేబిల్ పంపుతాడట."
ఐరవాతమ్మలలిత నుద్దేశించి అంది "మీ ఇంట్లో ముందు గదిని తయారుగా వుంచండి. వారోస్తే అక్కడే వుంటారు. భోజనాది సదుపాయాలూ నేను చూసుకుంటాను."
* * *
