Previous Page Next Page 

                      

                          31
    రెండు మాసాలు గడిచిపోయాయి. ఆరోజు నెల్సన్ వచ్చేరోజు. బొంబాయి నించి వచ్చే రైలు బండిని ఎడుర్కొటానికి అన్నదమ్ములు శ్రీనివాసరావు, ఐరావతమ్మ నలుగురు వెళ్ళారు. ఐరావతమ్మ కు మనసు మనసులో లేదు.
    రైలు ఫ్లాటు ఫారం మీద ఆగింది. నెల్సన్ బండి దిగగానే నిరంజన్, నరేంద్రలను చూచి గుర్తు పట్టి వెన్ను తట్టి ఆప్యాయంగా పలుకరించాడు. అంతలోకి శ్రీనివాసరావు- ఐరావతమ్మలు సమీపించారు. ఒకరినొకరు చూచుకుంటున్నారు మాటలు కరువయ్యాయి. ఐరావతమ్మ ను చూచి నమ్రతతో తల వంచాడు. తర్వాత స్నేహితులిద్దరూ ఒకరినొకరు పట్టుకుని పరస్పరం చూచుకుంటుంటే చూపరుల కత్యంతాశ్చర్యాన్ని కల్గించింది. ఆమె కన్నీరు తుడుచుకుంటూ నుంచుంది. వారి స్నేహ స్రవంతికి అడ్డు కట్ట వేయలేక కొడుకు లిద్దరూ చూస్తూ నుంచున్నారు. వారిద్దరి పలుకరింపుగా ఒక్కమాట మాట్లాడలేదు గానీ వారి కళ్ళు వారి హృదయాలు ఎంతో మాట్లాడుకుంటున్నాయి. "వెళ్దాం రండి " అని నిరంజన్ నెల్సన్ భుజం చుట్టూ చేయి వేసి ఎడమ చేత్తో సూట్ కేస్ ఎత్తుకున్నాడు.
    నరేంద్ర మరో చిన్న సూట్ కేసు, బ్యాగ్ తీసుకున్నాడు. అందరూ వెళ్లి టాక్సీ ఎక్కారు.
    అప్పటికి మౌన భంగం అయింది.
    "పిల్లలు, మిసెస్ విల్సన్ క్షేమమా? ఆఖరి పాప ఎలా వుంది? దాని పేరేమిటో మర్చిపోయాను" శ్రీనివాసరావన్నాడు.
    అయన గంబీర స్వరం వింతగా ధ్వనించింది. " ఎలా మర్చిపోతారు? అసలు నేను రాయలేదు. ఆమె పేరు సరళ."
    "ఇక సరళ పొంగిపోతుంది" అన్నాడు నరేంద్ర.
    టాక్సీ ఆగింది. నిరంజన్ ముందు దిగాడు. నెల్సన్ దిగే సమయానికి లలిత, ప్రేమ వచ్చారు.
    ఆ చెట్ల క్రింద కోడళ్ళు ఇద్దరూ పరిచయం చేయబడ్డారు. అందరూ లోపలి కెళ్ళారు. లోపల గదిలో బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటున్న శంభూ క్రచ్చ్ఘీస్ టకటక లాడించుకుంటూ వచ్చాడు. అక్కడ చేరిన వారితో మరో నూతన వ్యక్తీ వున్నాడని గమనించి బిగుసుకుపోయి మెల్లగా వెనక్కు తిరిగాడు. శంభూ ను ఆపాద మస్తకం ఆశ్చర్యంతో చూచాడతను. ఆ పిల్లవాని ముఖంలో ఆయా పోలికలు చూచి డుంబా లక్షణాలు చూచి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆప్యాయంగా చేతులు చాచేడు.
    శంభూ కదల్లేదు. నిర్ఘాంత పోయి చూస్తున్నాడు.
    శంభూ కు నెల్సన్ ను గూర్చి చెప్పారు. అనేక విధాలుగా పరిచయం చేశారు. అందర్లో కి అతను క్రొత్తగా కనిపించాడు శంభూ కు. గబగబ వచ్చి ఐరావతమ్మ చాటున దాగాడు.
    నెల్సన్ కు వారం రోజులలో పిల్లవాడు చేరువ అయ్యాడు.
    ఊరంతా తెలిసిన వాళ్ళ మధ్య గుసగుస లూ వ్యాఖ్యానాలు వినడానికి కష్టంగా వుంది. ఆ శ్రీనివాసరావు పెంచు కున్నాడే -- ఆ కుంటాడి తండ్రి వచ్చాడు. ఎక్కడ చూచినా వాళ్ళిద్దరే. ఎవరికో పుట్టాడనుకుంటాను. రంగు మాత్రం వచ్చింది? ఫరవాలేదు. ఆ పిల్లవాడిని ఎంతో ఆప్యాయంగా చూచుకుంటాడట! ఆ చెయ్యి, ఆ కాలూ నిమురుతాడుట- కన్నీళ్ళ పర్యంతం అవుతాడట. వాళ్ళింట్లో పని చేసేది చెబుతుంది. "అంకుల్, అంకుల్.' అనిపిస్తారుట. నిజంగా తండ్రే అయి వుంటాడు, ఇన్నాళ్ళ కొచ్చాడు తీసు కెళ్ళటానికి? ఏమిటీ -- ఆ పిల్లాడు వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? అన్న ప్రశ్నకు అంత వింత జవాబు లోచ్చాయి. తల్లి దగ్గరకు తీసుకు వెళ్తాడు కాబోలు. మంచిదే వాణ్ణి పంపి వేసి, వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు ఆ తరువాత యింటికి మనం కూడా వెళ్లి కాసేపు కూచుని రావచ్చు.
    శంభూ వెళ్తే ఆ యింటి లోని వ్యక్తులతో స్నేహం తిరిగి సంపాదించాలని వారి కోర్కె. కరేపాకు, పువ్వులు- అరిటాకులు- కూరగాయలు అప్పుడప్పుడు ఉచితంగా లభిస్తాయని చుట్టూ వున్న మధ్యతరగతి కుటుంబాల ఆశ. అంతేగాని ఈ వివరాలపై ప్రత్యెక శ్రద్ధ లేదు. శంభూ కొద్దిగా అలవాటయ్యాడు.
    "వేడిని అక్కడ శామ్ అని పిలవాలి. సంభా- శంభూ- , శామ్.... చాలా బాగున్నాయి. వీడి పాస్ పోర్ట్-- వీసాలలో ఈ మూడు పెర్లేక్కిస్తే బావుంటుంది ." అంటుంటే అంతా నవ్వేశారు.
    నిరంజన్ క్షణం వాడి వైపు చూచి- వాడి జబ్బ చరిచి ప్రేమతో అన్నాడు -- "శంభూ ఎలాంటి వాదోతాదో అన్న భయం మన కనవసరం.
    పుట్టింది , ధైర్యాన్ని పోతబోసిన వ్యక్తులకు. పెరిగేది మన ఇండ్ల లో - వీడు పిరికి వాళ్ళ మధ్య ఉండడు." ఔను , నిరంజన్ -- నీవన్నది అక్షరాలా నిజం" అన్నాడు నెల్సన్. పక్షం రోజులైంది. శంభూ ను తయారు చేశారు. సరళ అత్తవారింటి కి కెళ్తున్నప్పుడు కూడా అంత దుఃఖం రాలేదు ఐరావతమ్మకు. కన్నీరు కారుస్తూ ఆన్ని సామాన్లు, గుడ్డలు సర్దింది. నెల్సన్ భార్యకు బిడ్డలకు మన దేశ వస్తువులు -- పట్టు చీర బహుమతి గా యిచ్చింది.
    "అత్తయ్యా-- శంభూ లేడు- మీరిక ఈ ఔట్ హౌస్ కాపురం మానేసి అక్కడికి రండి. ఇక ఏ సమస్యలు లేవు" అన్నది ప్రేమ అత్తయ్య దగ్గర కూచుని, "అందరం కలిసే వుందాం మీరు రండి" అన్నది లలిత కూడా.
    ఐరావతమ్మ ముఖంలో లీలా మాత్రంగా క్రోధం పొడసూపింది ఆమెకు కోపం రావటం -- చూడటం అదే మొదటి సారి.
    "పిచ్చి తల్లుల్లారా శంభూ వచ్చి మనల్ని వేరు చేశాడనీ వాడు వెళ్లి పోయి మనల్ని ఒకటిగా చేశాడని అనుకుంటున్నారా? లేదమ్మా వాడలాంటి తల్లిదండ్రులకు పుట్టలేదు? వాడేప్పుడైన తిరిగి వచ్చి "అమ్మా" అని పిలిచే వేళకు ఈ వాకిలి తెరిచి ఉంటుంది" అన్నది ఆమె దుఖర్ధ్రంతో.

                                    32

    పోస్ట్ మేన్ చూపిన స్థలంలో సంతకం చేసి పంపించి ప్రేమ. చేతిలో ఐదు పది రూపాయల నోట్లు, మనియార్డరు కూపన్ లో ఇంగ్లీషు లో వ్రాసుంది. అభినందనములతో తిరిగి పంపుతున్నాను గీత. గీత ఎందుకు పంపింది? తన దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. తేదీ చూసింది. నాల్గు రోజుల క్రితం తారీఖు వేసుంది.
    ప్రేమకు ఆలోచించినా ఏదీ స్పురించలేదు. ఒక వేళా లలిత కేమో నని భారంగా అడుగులేస్తూ వెళ్ళింది లలిత దగ్గరకు.
    "గీత ఏభై రూపాయలు పంపింది -- నీ కోసమేమో! నాకెందుకు పంపుతుంది ? ఎప్పుడూ నేనేమీ ఇవ్వలేదే?"
    లలిత కూడా ఆలోచించింది. ఏదీ తట్టలేదు. "నాకెందుకు -- నీ పేరిటనే పంపింది...ఆ ...ఒకవేళ మీ పెళ్ళికి ఏమీ చదివించలేదని ఇప్పుడు పంపిందేమో"
    "సరే-- అలాగయితే తిరిగి పంపుతున్నాను " అని ఎందుకు రాయాలి?
    "ఏమో నువ్వెప్పుడైనా అప్పిచ్చి మర్చి పోయావేమో?" లలిత జ్ఞాపకం తెయబోయింది.
    "ఉహు- ఎప్పుడూ లేదు. గీత నయాపైనా తీసికోలేదు."
    అలసినట్లుంది ప్రేమకు. సాయంత్రం ఆరు గంటలు దాటినా నిరంజన్ రాలేదు. ప్రేమ పడుకుని కళ్ళు మూసుకుంది. తలగడ క్రింద డబ్బు- కూపన్ ఉన్నాయి. గీత ఎందుకు పంపింది?
    నిరంజన్ చప్పుడు చేయకుండా వచ్చి ఆమె కనురెప్పల్ని ముద్దు పెట్టుకున్నాడు.
    ఉలిక్కిపడి అంది ప్రేమ . "అబ్బ -- ఎంత భయం వేసిందో."
    'అంతగా ఏమాలోచిస్తున్నావు? చిన్ని ప్రేమాను గూర్చే == అప్పుడే" అంటూ మృదువుగా ఆమె గర్బం పై చేయి వేశాడు. ప్రేమ వదనం చంద్ర బింబమే అయింది.
    నెమ్మదిగా లేవబోయింది. "కాఫీ తెస్తాను."
    "వద్దు-- నేను వస్తుంటే అమ్మ చూచి నీకు అంత బాగాలేదని కాఫీ ఇచ్చి పంపింది. నీకు తేనా?...."
    "మీరెళ్ళి తెస్తారా?"
    "ఏం? తప్పా?' బుగ్గను గిల్లాడు.
    "తప్పు లేదు-- అత్తయ్య ఏమను కుంటారో?"
    "హి' నవ్వుతూ కూర్చున్నాడు నిరంజన్.
    "మీరు చేస్తే-- అది వేరే సంగతి ...."ఇద్దరూ నవ్వుకున్నారు.
    కాసేపు గడిచాక నిరంజన్ ప్రేమకు కాఫీ కప్పు అందించి దగ్గరగా కూచున్నాడు. "ఎలా వుంది ప్రేమా .....' కళ్ళలో కళ్ళు కలిపి ఆప్యాయంగా అడిగాడు.
    "బాగానే వుంది. కొంచెం ఆయాసంగా వుంటే పడుకున్నాను."
    "ఏదో ఆలోచిస్తున్నలా కనబడ్డావు" ప్రేమ మారు మాట్లాడకుండా తలదిండు కింద డబ్బు, కూపన్ అతని చేతిలో పెట్టింది. అతని ముఖంలో ప్రస్పుటమైన భావ కల్లోలాన్ని గ్రహించిన ప్రేమ విస్తుబోయి చూచింది. "ఉహూ !" నిరంజన్ ముఖం కోపంతో కందగడ్డ అయింది.
    "ఏం సంగతి ?"
    "అందరికీ తెలియటం మా కిష్టం లేదు" నవ్వాడు నిరంజన్. "చెప్పను" అనే నిర్ణయం అందులో లేదు. ప్రేమ ఒత్తిగిలి అటు తిరిగి పడుకుంది. తలగడ సర్దుకుని-- "ఆ చెప్పుదురూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS