"ఏం రఘూ పిల్లను అంత దూరం పంపిస్తున్నావు ఉద్యోగానికి అని పరామర్శించింది ఆవిడ రాత్రి. "ఇక్కడ దొరకలేదు , పెళ్లి లేక, ఉద్యోగం లేక ఇంట్లో కూచుని ఏం చేస్తుంది?"
గీత తల్లి వైపు చూసింది. "అసలే వియ్యపురాలు లలిత విషయం వస్తే ఏమేమీ ప్రశ్నిస్తుందోనని ఆమె భయ పడ్తోంది. పైగా కూతుర్ని నాగపూర్ పంపటానికి తనకేం అభ్యంతరం లేదన్నట్లు అయన మాటకేమర్ధం తీస్తుందో.
"లలిత ఎలా ఉంది?"
ఎవరూ మాట్లాడలేదు.
"ఎవరినో -- దిక్కుమాలిన సంతానాన్ని పెంచుకున్నారటగా వాళ్ళు ....వాళ్లతో రాకపోకలు -- మర్యాదలు దేనికి ?"
"మాకు తెలీదా వదినా? నువ్వంతగా అడగాలా అది ఏనాడైనా గుమ్మం దాటి వెళ్ళిపోయిందో ఆనాడే అది చనిపోయిందనుకున్నాము" అంది తల్లి.
"అత్తయ్యా - మనవాళ్ళు పదిమందీ వెళ్లకపోయినా వాళ్లకు లోటుండదు. వాళ్ళను గూర్చి గొప్పగా చెప్పుకుని వాళ్ళని అభిమానించే స్నేహితులే చాలు. వాళ్లకి."
"నాకెవరు చెప్తారు?"
ఐతే ,మిగతా విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఆ చెప్పిన వారెవరో , ఆ బిడ్డ నికృష్ట సంతానం కాదని, మనలాగే ఒక అబ్బకి అమ్మకి పుట్టాడని చెప్పలేదా?"
"అత్తయ్యతో అలా మాట్లాడోచ్చటే." తల్లి క్రోధంతో అన్నది.
గీత పకపక నవ్వింది. "అత్తయ్య పరాయిది కాదనే ఉన్న సంగతి చెబుతున్నా."
30
గీత ఇవతలి కొచ్చి నూతి గట్టు మీద కూచుంది. ఆమె మనస్సంతా వికలమై పోయింది. రాత్రి బావ రాగానే హృదయం ఆనంద తరంగాల పై ఒలలాడింది. ఏదో ప్రశాంతత ఆవరించింది. అతని సన్నిధిలో తన జీవితం పరిపూర్ణత చెందగలదని ఆశించింది. అది కేవలం ప్రేమ కాదు. స్త్రీత్వం చిలికి వెన్న దీసినట్లు జీవితాన్ని మదించి మాతృత్వాన్ని సిద్ధింప చేసుకునే వయస్సది. సమాంతరంగా స్త్రే పురుషులు పయనించనవసరం లేని వయస్సు. ఆ జీవితాలు సమీపించి సిద్దించవలసిన గడియ.
బావ రాకకు ఆమె హృదయం పొంగింది. ఆ రాత్రి -- ఆ నిశీధి లో కళ్ళు తెరుచుకొని చూస్తుంది. కిటికీలో చుక్క రాలటం కనబడింది. ఎంత అందంగా వుంది, ఆమె కళ్ళు మూసుకుంది. ప్రతి స్వల్ప విషయం ఈ క్షణం లో తను ఉత్తేజ పరుస్తోంది. గీత తనలో తాను నవ్వుకుంది. పుష్ప వచ్చి ప్రక్కనే కూచుంది. "అత్తయ్య నిన్ను వెంకటేష్ కు అడగటానికే వచ్చింది......."
"మరి కట్నం ....ఎంత ?....నాన్న అంగీకరించారా? ఏవిధంగా నైనా నాకు పెళ్లి చేయాలని అమ్మా నాన్న చూస్తున్నారు.......వాళ్ళు దేనికైనా అంగీకరిస్తారు.......తర్వాత కష్టపడేది మీరు."
పుష్ప చెల్లి తల మీద చెయ్యి వేసింది. "ష్ గట్టిగా మాట్లాడకు.... అత్తయ్య నిన్ను మాత్రమె కోరింది? నీతో డబ్బు అక్కర్లేదట, అంతే కాదు. వీలైనంతలో ఈ వివాహం జరిపించాలన్నది.
"అత్తయ్య అంత ఆత్రంగా వుందా?"
పుష్ప నవ్వింది "అత్తయ్యకు కాదే పిచ్చీ ,, వెంకటేష్ కు ...అమ్మాయిని కట్నం లేకుండానే .....గీత చటుక్కున లేచి కూర్చుంది!
"ఇంకా....."
పుష్ప అన్ని సంగతులు విశదీకరించింది. కట్నం వద్దు ఇష్ట పూర్వకంగా ఏం ఇస్తే అవే తీసికొంటారుట. వెంటనే కాపురం పెట్టాలి--అదంతా విని గీత నవ్వకుండా వుండలేక పోయింది.
"నాన్న ఏమన్నారు ' అక్క చెవిలో రహస్యంగా అడిగింది.
"ఏమంటారు -- ఓ తప్పకుండా అన్నారు."
"నన్నడక్కుండానే మాటిచ్చేశారే'
"ఏం నీకిష్టం లేదూ?"
గీత మౌనం దాల్చింది "నేను ఆలోచించుకోవద్డా" అని తనలో అనుకోన్నట్లుగా అంది.
"గీతా?"
"ఔనక్కయ్యా . నేనాలోచించు కోవాలి"
పుష్ప మౌనంగా లేచి వెళ్ళిపోయింది. అత్తయ్య తన కోసం ఎందుకొచ్చిందో-- ఆలోచించే కొలది ఆమెకు క్రోధం అధికమౌతోంది. హృదయం భగ్గున మండుతోంది. ఎంత విశాల హృదయం -- తమ్ముడి పట్ల ఆమె ఎంత అద్వితీయమైన ప్రేమను కనుపరుస్తోంది. ఒకనాడు డబ్బుకున్న విలువ ఈనాడామే కు లేదంటే ఆ భావన ఎంత అమోఘమైనది! బందుత్వాన్ని ముడివిడని బంధంగా చేయాలని ఎంత తాపత్రయపడ్తోంది? వెంకటేష్ కు నిజంగానే తను కావలసి వచ్చిందా? లాంటి వాటికి కూడా స్వయంగా ఆలోచించే శక్తి ఉందా? ఆనాడు తల్లి మాటను జవదాట లేని వాడికి ఇంత ధైర్యం వచ్చిందా? స్వతంత్యంగా ఏ పనీ చేయలేని పిరికి వాదికింత సామర్ధ్యం వచ్చిందా? ఏమిటిది? దీనిలోని నిగూడంగా వున్న కారణం ఏమిటి? అవతల ఏం కధ జరిగింది. దినాలు కాదు-- మాసాలు కాదు- సంవత్సరాలు గతించి పోయాయి. "నేను బావను చేసుకోను" అని గట్టిగా అరవాలనిపించింది ఆమెకు. నిద్రపోదామని ప్రయత్నించినా నిద్ర రాలేదు. చివరికి ఎలాగో మగత లాంటి నిద్ర పట్టింది.
పుష్ప నెమ్మదిగా వచ్చి నుంచుంది. ప్రొద్దు పొడవలేదు. మంచు తెరలు చల్లచల్లగా దాటి పోతున్నాయి. తలార స్నాన చేసి తెల్లని చలువ వస్త్రం కట్టుకుని ఎదుట నుంచున్న సోదరిని చూచి గీత ముఖం త్రిప్పుకుంది. ఆ కళ్ళలో మెదిలిన అశ్రువులు అరుణ కాంతి లో కేమ్పుల్లా మెరిశాయి.
"గీతా" అంది దూరం నించి.
గీత ముఖం తిప్పలేదు - "నన్నట్టే విసిగించకు....." కోపం ఆ కంఠం లో ధ్వనించింది.
"వెంకటేష్ నీతో మాట్లాడాలను కుంటున్నాడు--"
"ఎందుకు?"
జవాబురాలేదు. ఆమె ప్రక్కకు తిరిగేసరికి దాటిపోతున్న పుష్ప కనబడింది. ఆమె స్థానంలో వెంకటేష్ నుంచున్నాడు.
గీత లేచే ప్రయత్నం చేయలేదు. వెంకటేష్ కూచూనే ప్రయత్నం చేయలేదు.
బాదం చెట్టు నానుకుని నుంచున్నాడు. గీత అతని ముఖంలోకి ఓ క్షణం చూచి తల వంచేసుకుంది. దూరంగా వాకిలి కనబడ్తోంది. మనుష్యులు కనబడ్తారు గానీ మాటలు వినబడవని నిర్ధారణ చేసుకుంది.
"గీతా -- నీతో మాట్లాడాలని వచ్చాను.
"మాట్లాడండి -- నేవద్దనలేదే?"
"ఔను-- నువ్వద్దన లేదు గాని-- మాట్లాడడానికి సుముఖత చూపటం లేదని గ్రహించాను.
"మీరు చాలా మారిపోయారు.
వెంకటేష్ నవ్వేశాడు. నువ్వు నన్ను మన్నిస్తుంటే క్రొత్తగా వుంది. పోయినసారి మాట్లాడినప్పుడు ఏకవచనం ప్రయోగించావు."
అ దినాలు వేరు. ఆ సందర్భం ఎలాంటిది అదేదో జరుగుతుందన్న దృడ విశ్వాసంతో మాట్లాడాను. కానీ ఈరోజు తేలిపోయిందిగా? మీరు పరాయి వారు. నేను పరాయి దాన్ని."
"నాకు టైం వెస్ట్ చేయడం ఇష్టం లేదు."
"నాకంత కన్నా-------"
వెంకటేష్ మాట్లాడలేదు. కుడిచేత్తో చెట్టు కొమ్మను మెల్లగా వంచి పచ్చి జామకయను వాసనా చూశాడు. దృష్టి మరల్చ కుండానే అడిగాడు "ఈ పెళ్లి నీకిష్టం లేదన్నావటగా."
"దానిక్కారణం నీకు తెలుసు " గీత సీరియస్ గా మాట్లాడుతుందని తెలిసింది వెంకటేష్ కు.
"నాకు తెలుసా?"
"ఔనన్నట్లు తల ఆడించింది గీత.
"గీతా-- నిజంగా నాకు తెలియదు."
గీత పేలవంగా నవ్వింది , "మీ అమ్మకు కూడా తెలియదా?"
"అమ్మ చెప్పదు"
కాసేపు నిశ్శబ్దం.
"ఓ మాటడుగుతాను. - నువ్వు నిజం చెప్పాలి" అన్నది గీత.
వెంకటేష్ గీత కళ్ళల్లో కి సూటిగా చూశాడు. "అబద్దం చెబుతానని ఎలా అనుకున్నావు?........."
గీత కళ్ళు వాలేసింది......ఐతే అత్తయ్య బలవంతం మీద వచ్చావా లేక నీవు -- నీయిష్టం మీద వచ్చావా?"
అతను చెట్టు బోదె కానుకుని చేతులు కట్టుకున్నాడు. క్షణం ఎటో చూచి చటుక్కున గీత వైపు తిరిగాడు " నా ఇష్టం మీద అమ్మ వచ్చింది"
"తప్పనిసరిగా ?" గీత అతని కళ్ళల్లో కళ్ళు కలిపి అడిగింది.
"ఆ తప్పనిసరిగానే"
"ఇదంతా నాకర్ధం కాలేదు బావా"
అతను తల ఆడించాడు ..."ఇటు కూచోనా? అని ఆమె ప్రక్కకు వచ్చాడు. గీత బాగా దూరంగా జరిగింది.
"గీతా....ఆనాడు రావటం వెళ్ళటం అయిపొయింది. కొత్తగా పనిలో చేరటం -- నాది నా డబ్బు అనుకోగలిగినంత స్తోమత వచ్చింది ఉద్యోగంలో కొంత గర్వం స్త్రీని అన్నింటి లో తనకన్నా తక్కువగా చూచే మనస్తత్వం నాలో కూరుకుపోయింది. పుట్టి పెరిగిన వాతావరణం . స్నేహితుల ప్రభావం వల్ల ఆ దృక్పధం ఏర్పడి వుండొచ్చు'. అంత వరకు ఏ పని కొదొఆ స్వతంత్రంగా చేసి ఎరుగను. కారణం ఒక్కగానొక్క కొడుకుగా పుట్టినందు వల్ల అనుకుంటాను. ప్రధమం నుంఛీ అమ్మకు నచ్చిన పిల్లనే చేసుకోవాలన్న తీర్మానమే బలమైనందువల్ల ఆనాడు నేను పరోక్షంగా అన్నీ తెలిసినా, ఏమీ చేయలేక పోయాను. దాన్ని పిరికితనం అను- చేతకాని తనం అను- ఏదైనా అను. ఈనాడు నాలాటి వారు లక్షల కున్నారు. నిన్ను చూచి వెళ్ళిపోయాము. ఆ తర్వాత నాకెవ్వరూ నచ్చలేదు. నీపై ప్రేమ వల్ల ఈ విధంగా జరుగుతుందా? లేక నిజంగానే నాకు పిల్ల నచ్చలేదా అని చాలాకాలం వరకూ ఆలోచించాను......' చెప్తూ మధ్యలో ఆగాడు వెంకటేష్.
"ఏమని తేలింది?" ఉత్సుకతను అణిచి వేస్తూ మామూలుగా అడిగింది గీత.
"ముందు నా ప్రశ్నకు జవాబిస్తావా?"
"ఇదేమీ న్యాయం ' అంటూ నవ్వింది. గాని అతని ముఖంలోని గంబీర్యాన్ని చూచి మౌనం దాల్చింది.
"చెప్పు గీతా -- నేనంటే ఎటువంటి అభిప్రాయం వుంది?"
"ణా దృష్టి లోనా? నా హృదయం లోనా?' నవ్వింది . ఆ నవ్వులో జీవం లేదు.
రెండింటిలో" అతను ఆశగా చూశాడు.
"దృష్టిలో - పెద్దవారు -- హృదయంలో -- పసివారు."
అతను నవ్వేశాడు. పూపోదల మీదుగా తేలిపోతూ వచ్చిన పిల్ల గాలిలా వుందా నవ్వు.
"చాలా బాగా చెప్పావు. నేను పసివాడినే గీతా...ఇంకా నన్నొకరు నడిపించాలి. న్యాయాన్యాయాలు బోధ పర్చాలి. చివరికి నా భాగస్వామిని కూడా ఒకరు నిర్ణయించాలి -- ఎంత అసమర్దుడ్ని ! కదూ?"
గీతకు జాలేసింది , కాని ఏమీ అనలేక చెంపకు చేయి ఆన్చి వింటోంది.
ఉద్యోగంలో ప్రవేశించాను ....క్రొత్త స్నేహితు లేర్పడ్డారు. దేశ దిమ్మరిలా సంవత్సరం తిరిగాను. ఆ పని నచ్చలేదు. గమ్యం లేకుండా త్రాడు లేని బొంగరం లా ఏమిటీ బ్రతుకనిపించింది. ఫైజర్ కంపెనీ లో ఖాళీ అయితే అప్లై చేశాను సెలెక్ట్ అయ్య్యాను. ఎనిమిది నెలల ట్రైనింగ్ ఇచ్చారు . వివిధ రకాల వ్యక్తులతో స్నేహం ఏర్పడింది. ఆ వాతావరణమే వేరు. ఆ దర్జా -- ఆ పార్టీలు వేరు. అందులో కలిసిపోయే మనస్తత్వం పెంపొందించు కున్నాను.
