Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 26


    "నువొక్కడివీ ఏం చేయగలవు?"
    "ప్రతీకారం తీర్చుకుంటాను నా ప్రాణానికి ప్రాణం శ్రీమన్నారాయణ మృతికి కారకులయిన వారిని అంతం చేస్తే ఆ తర్వాత నేనే మైనా బాధుండదు-"
    కిల్లర్, సింగ్ భుజం తట్టి-"నీ ఆవేశం నా కర్ధమయింది. కానీ నీ ఆశయం నెరవేరాలంటే ఇలా ఉన్న పళంగా బయల్దేరి లాభంలేదు. ముందుగా నరసింగరావును కలుసుకుని కొన్ని వివరాలు సేకరించాలి-...." అన్నాడు.
    "అందుకే బయల్దేరాను నేను...."
    "అలాంటప్పుడిక్కడెలా ఉన్నావు?"
    రామ్ చరణ్ సింగ్ తల వంచుకున్నాడు.
    చెప్పడానికతడు తటపటాయిస్తున్నాడని గ్రహించి "ఎటూ కాని ఈ ప్రాంతానికి నీ వెలా వచ్చావో నా కాశ్చర్యంగా ఉంది-" అన్నాడు.
    "శివరాజు నన్ను చంపాలని యిక్కడకు తీసుకొచ్చాడు."
    "శివరా జెవరు?" అన్నాడు కిల్లర్.    
    "మా ఊరిగుండా! శ్రీమన్నారాయణ కు స్నేహితుడు. తద్వారా నాకూ స్నేహితుడు నన్ను మంచి మాటలతో యిక్కడకు తెచ్చి-ఇక్కడ నన్ను చంప బోయాడు. నే నప్పుడతన్ని వేడుకున్నాను. శివరాజు నవ్వి-"మా శ్రీమన్నారాయణకు పట్టిన గతే నీకూ పట్టాలి. మీ సిక్కులకు లేని కరుణ నాకెందుకుండాలి?" అన్నాడు. నేను వెంటనే-"శ్రీమన్నారాయన నీ వాడే కాదు. నావాడు కూడా! అతడి చావుకు ప్రతీకారం తీర్చుకునేలోగా చావకూడదని నా కోరిక. నాకా అవకాశ మివ్వు. నన్ను వదిలి పెట్టు-" అన్నాను.
    శివరాజు వినలేదు. అప్పుడు నేను తిరగబడ్డాను. అతణ్ణి లొంగదీసుకున్నాను. శివరాజు నేను తనని చంపుతాననుకున్నాడు. నే నతడితో-నిజమైన సిక్కు అకారణంగా హత్య చేయడు. నా పట్ల నీకు గల దురభిప్రాయం తొలగించడమే నా ఆశయం. ఈ క్షణమే నేను పంజాబు వెడతాను. నీవు ఇంటికి వెళ్ళి నీ వదినకు, నా పిల్లలకు రక్షణ కల్పించు. ప్రాణాలతో తిరిగివస్తే మళ్ళీ కలుసుకుందాం-" అన్నాను శివరాజు నన్ను తెచ్చిన జీపులో వెనక్కు వెళ్ళిపోయాడు. తర్వాత నాకు స్ఫురించింది-జీపులో నేను రైల్వేస్టేషన్ కు పోవాల్సిందని! అప్పట్నించీ యేదయినా వాహనం వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాను....."
    కిల్లర్ సాలోచనగా -"శ్రీమన్నారాయణకు గూండాలు స్నేహితులుగా ఉన్నారంటే అసలతడెలాంటి వాడు? అన్నాడు.
    "గూండాలూ మనుషులే! వారిలో గూండాలను చూసేవారు, వారిని గూండాలుగా ఉపయోగిన్చుకునే వారూ కిరాతకులు. వారిలో మనుషులను చూసేవారు స్నేహితులు శివరాజుకు శ్రీమన్నారాయణంటే గొప్ప ఆకర్షణ!" అన్నాడు సింగ్.
    "శ్రీమన్నారాయణ యేం చేస్తుంటాడు?"
    "బిజినెస్....."
    కిల్లర్ కాసేపాలోచించి-"బాగా ఉన్నవాడా?" అన్నాడు.
    "ఊఁ" అన్నాడు సింగ్-"ఆయనకు స్వంతానికే మూడు కార్లున్నాయి. వ్యాపారానికి సంబంధించి పన్నెండు ట్రక్కులు ఎనిమిది వ్యాన్ లు, ఆరు కార్లు ఉన్నాయి-"
    "ఏమిటాయన వ్యాపారం?"
    "రవాణా-...." అని - "ఇవన్నీ ఎందుకడుగుతున్నారు?" అన్నాడు సింగ్ అనుమానంగా.
    "చనిపోయిన మనిషినిబట్టి రియాక్షన్ వుంటుంది. శ్రీమన్నారాయణ బాగా గొప్పవాడైతే ఊళ్ళో చాలా పెద్ద కలకలం రేగి వుండాలి. నువ్వు భయపడి ఊళ్ళోంచి పారిపోయుండాలి-" అన్నాడు కిల్లర్ సాలోచనగా.
    "విషయం అందరికీ తెలియదు-" అన్నాడు సింగ్. ఢిల్లీ పోలీసులీ విషయానికి ప్రచారమివ్వద్దని నరసింగ రావును కోరారు. నరసింగరావు టెలిగ్రాం ద్వారా శ్రీమన్నారాయణ పెద్దకొడుకును ఢిల్లీ రప్పించి అసలు విషయం చెప్పి-శ్రీమన్నారాయణ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ప్రచారం చేయంమన్నాడు. అతడందుకంగీకరించాడు.
    ఇక్కడికొచ్చేక శ్రీమన్నారాయణ భార్యకు విషయం తెలిసింది. నాతో మాట్లాడ్డం మానేసింది. ఏం జరిగిందో నాకు తెలియదు. మాకూ వాళ్ళకీ కుటుంబ సంబంధాలు కూడా తగ్గిపోయాయి. ఒకరోజు నేను శివరాజు దగ్గర విషయం చెప్పుకుని బాధపడ్డాను. సంగతేమిటో తెలుసుకుంటానని అతడు వెళ్ళాడు. అక్కడ అతడికి విషయం తెలిసినట్లుంది. నన్నిక్కడకు తీసుకుని వచ్చాడు. విషయం తెలియగానే నేనూ ఆవేశపడ్డాను....."
    కిల్లర్ నిట్టూర్చి-"ఢిల్లీలో నరసింగరావు చిరునామా తెలుసా నీకు?" అనడిగాడు.
    "కరోల్ బాగ్ లో సౌతిండియా హోటల్ నడుపుతున్నాడతడు. బోర్డింగూ, లాడ్జింగూ కూడా వున్నాయి. హోటల్ పేరు వరాహనృసింహా సౌతిండియన్ కాఫీ హౌస్...."
    "అయితే మనమిద్దరం కలిసి ఇప్పుడే బయల్దేరుదాం."
    "ఎక్కడికి?"
    "ఛలో ఢిల్లీ!"
    "మరి నీ వ్యానెక్కడ పెడతావు?"
    "వ్యాన్ లోనే మన ప్రయాణం-" అన్నాడు కిల్లర్.
    "వ్యాన్ లోనా-అయితే ఢిల్లీ ఎప్పటికి చేరేటట్లు?" అన్నాడు సింగ్ నిస్పృహగా.
    "ట్రయిన్ కంటే ముందు వెడతాం....."
    "కావచ్చు కానీ ఏకబిగిని డ్రైవ్ చేయలేం గదా!"
    "నీకు నా వ్యాన్ సంగతి తెలియదులే-మనమిద్దరం రాత్రిళ్ళు సుఖంగా నిద్రపోవచ్చు. కంప్యూటర్ కంట్రోలుతో వ్యాన్ దానంతటదే నడుస్తుంది...."
    "నిజమా?" అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా.
    "కావాలంటే చూడు...." అంటూ కిల్లర్ డ్రైవింగ్ సీట్లోంచి తప్పుకున్నాడు.
    వ్యాన్ యెప్పటిలాగే పయనిస్తోంది. మలుపులు వస్తే తిరుగుతోంది. వెనుకనుంచి వచ్చే వాహనాలకు దారి నిస్తోంది. ముందున్న వాహనాలను దారివ్వగానే దాటించుకుని వెడుతోంది. స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అవుతోంది. దారికడ్డంగా యేమైనా వుంటే ఆగిపోతోంది.
    "కలలా వుంది. ఇలాంటి వాహనాలుంటాయని నాకు తెలియదు...." అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా.
    "నీకు తెలియనివెన్నో నాకు తెలుసు. అందుకే నీకు సాయం అవసరం-...." అన్నాడు కిల్లర్.
    "డ్రైవింగ్ సీట్లో మనిషి కనబడకపోతే దారిన పోయేవాళ్ళు చూసి అనుమానించి విడ్డూరంగా చూడరూ?" అన్నాడు సింగ్ అనుమానంగా.
    "కంప్యూటర్ డ్రైవింగ్ సమయంలో వ్యాన్ అద్దాలలోంచీ మనకు బైట జరిగేదంతా కనబడుతుంది. బయటివారికి లోపలెవరున్నదీ కనపడదు. ఫిల్ముస్టార్సు కార్లలో వెళ్ళేటప్పుడు తామూ యిలాంటి యేర్పాట్లే చేసుకుంటారు....." అన్నాడు కిల్లర్.
    "నీవు చాలా శక్తిమంతుడిలా కనబడుతున్నావు. ఈపాటికే టెర్రరిస్టు పనిపట్టవలసింది....."
    "నిజమైన శక్తిమంతుడు శక్తికిమించిన పని తల పెట్టడు...." అన్నాడు కిల్లర్ నవ్వుతూ.
    "అంటే?" అన్నాడు సింగ్.
    "సామాన్యులకు సామాన్యుడిని కాకపోవచ్చు కానీ నేను సామాన్యున్ని నాకున్న శక్తిని సామాన్యులకోసం వినియోగించాలనుకున్నంతకాలం నేను శక్తిమంతుడిగా వుంటాను. పంజాబు టెర్రరిస్టులను ఎదుర్కోవాలనుకొనడం-చిట్టెలుక సింహంతో తలపడడం వంటిది. పొట్టేలు కొండను ఢీకొనడంవంటిది. నేనప్పుడు సామాన్యులకు మిగలకుండా పోతాను. టెర్రరిస్టులు నెదుర్కొనేందుకు ప్రభుత్వముంది. ప్రభుత్వ యంత్రాంగముంది-" అన్నాడు కిల్లర్.
    "అయితే ఇప్పుడెందుకు నాతో వస్తున్నావు?"
    "నువ్వొక గ్యారేజీలో మెకానిక్కువి. అలాంటి నువ్వే టెర్రరిస్టుల నెదిరించడానికి బయల్దేరుతున్నావు ఒంటరిగా. నేను నేరస్థులకు సింహస్వప్నంగా వుండాలన్న ఆశయంతో సరంజామా సేకరించుకున్నవాణ్ణి. నీ ఆవేశం నన్నావేశపరిచింది-" అన్నాడు కిల్లర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS