Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 26


    ఆ నిర్లజ్జాకరమైన వుదంతం. పురుషుని అహంకార పూరితమైన స్వభావం. పాశవిక చిత్తవృత్తి చెప్పటానికి ఆమెకు నోరు రాలేదు. కాని- తప్పదు.    
    రిజల్ట్సు తెలిసినరోజున దుర్గ సంతోషంగా ఉంది. ఆమెను సుధాకర్ దగ్గరగా తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తానని తప్పు దార్లు త్రొక్కనని సినిమాలు తీయటం ఆలోచనలు మానేస్తానని తీయగా చెప్పాడు. దుర్గ పరవశంలో ఆనందంలో అతన్ని కరచు కొని వుండిన ఆ అతీతయని క్షణంలో. అతడు తన పాశవిక వాంఛను బయట పెట్టాడు.
    చాల కాలంగా తనకు ప్రేమ మీద, సరళ మీద, వాంఛ వున్నదట. వారిద్దరినీ ఎట్లాగైనా తనకు ననుకూర్చి పెట్టమని దుర్గను అడిగాడు సుధాకర్.
    దుర్గకు ఏమీ తోచలేదు. క్షణం సేపు ఆనందం. ఈ క్షణం జుగుప్స, అసహ్యం, కౌగలించుకున్న మగడే రాక్షసుడని తెలిసినప్పుడు ఆమె మనస్సు ఎంత క్షోభించిందో ఎట్లా తెలుస్తుంది!
    ఆ నాలుగుమాటలు చెప్పేసరికి సరళ విలువెల్లా వణికి'పోయింది. ఆమెకు కూడా దుఃఖం వచ్చి చీరకొంగు నోట్లో కుక్కుకున్నది. నిరంజన్, రమణ ఇద్దరూ ఆమెవైపు చూడలేకపోయారు. అంత ఆ సందర్భ ప్రలాపన అది. అటు చూడలేకపోయింది సరళ. ఆ వాక్యాలు పలికి ఇటు తిరిగిపోయింది.
    ద్వారంవద్ద దుర్గ నిలబడివుంది...
    "ఇంతమందికి తెలిశాక ఇంక నేను దాచేదే మున్నది?...... ఆ విధంగా చేయలేనన్నాను. టైం తనుకొని ఆలోచించమన్నారు. టైం అనవసరం. ఎన్నాళ్ళు ఆలోచించినా అంత నీచమైన పని నేను చేయగల్గుదునా! వెంటనే వచ్చేద్దామనుకున్నాను. ఆయన వెళ్ళిపోతూ ఒక చీటివుంచి వెళ్ళారు. తాను తిరిగి వచ్చేసరికి ఇంట్లో వుండదలిస్తే తాను చేయిదలచినపనికి నా సహకారం వుందని నా ఉద్దేశంగా ఉండాలట.... అట్లా కాక పోతే వెళ్ళిపోమని శాసించారు... ... అంతే."

                            *    *    *

                                  28

    "ఏమండి! ఇటు చూడండి" అని ఐరావతమ్మ పెద్దగా అరవటంతో శ్రీనివాసరావు కంగారుగా లేచి వచ్చాడు.
    రెండు రోజులనుండి శంభూకు జ్వరం. డాక్టరు వస్తున్నాడు ఇంజక్షన్లు ఇస్తున్నాడు. ఏమీ మార్పు కనబడలేదు ఆహారం. పానీయం ఇమడక బిడ్డచిక్కి శల్యమైనాడని ఆ తల్లి మనసు కల్లోలితమైంది.    
    "ఏమైంది?"
    ఆమె నోటినుంచి ఏ మాట వెలువడలేదు?
    శంభూ భయంతో ఐరావతమ్మ కేసి చూస్తున్నాడు.
    శ్రీనివాసరావుభార్య వాలకాన్ని చకితుడై చూస్తూ నిల్చున్నాడు.
    "ఏమిటీ?..... ఇలా కూచున్నావు."
    ఆమె ఏడ్చింది. కన్నీరు ధారాపాతంగా స్రవిస్తోంది ఆయనకంతా అయోమయంగా వుంది కుర్రవాని ప్రక్కలో కూచున్నాడు. "శంభు.....కాలు... చెయ్యి చూడండి" శ్రీనివాసరావుగుండెల్లో రాయిపడింది. ఏదో జరిగిందని నమ్మలేకపోయాడు, అప్రయత్నంగా శంభు చెయ్యి ఎత్తాడు.
    అది ఠప్ మని పడకమీదపడింది- అతని గుండె ఝల్లుమన్నది. దుప్పటి తొలగించి కాలుకేసి దీక్షగా చూచాడు కాలు చేతితోపట్టి కొంతపైకెత్తి "అలాగేవుంచు శంభూ అంటూ తనచేయితీశాడు. అతనిచేయి తొలగింపబడగానే దబ్బున కాలు పడకమీదపడింది. ఆ శబ్దం అతని హృదయాన్ని బ్రద్దలు చేసింది. అతని ముఖంలోని నిస్పృహ ఐరావతమ్మ దుఃఖాన్ని ఇనుమడింపజేసింది, శ్రీనివాసరావు హృదయంలో అంతా అంధకారం- డుంబా- ఆయా అతని కళ్ళముందుకు వచ్చి ప్రత్యక్షంగా నిలబడినట్లు- "నా బిడ్డ ఎందుకిలా అయ్యాడు. మీ జవాబు ఏమిటో అని అడిగినట్లయింది ఆయన ముఖం వాడిపోయింది.        
    నిరంజన్ -ప్రేమ మాట్లాడుకుంటూ వచ్చారు. శ్రీనివాసరావు ఆ గదినినడిచి వెళ్ళిపోయాడు- వారిరువురికీ అక్కడ ఏదో విపరీత వాతావరణం స్ఫురించింది ఆ గదిలో అమావాస్య చీకటి ఆవరించినట్లుంది. శంభూకు జ్వరం తగ్గింది. చక్కగ మాట్లాడుతున్నాడు. ఐతే మరి ఈ గంభీర నిశ్శబ్ధమేమిటి?
    ఐరావతమ్మ హృదయం చలించిపోయింది. ఆమె బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. వెక్కిళ్ళ మధ్య సత్యం తెలియజేసింది. నిరంజన్ శంభూ కాళ్ళూ చేతులు ఎట్టి చూచాడు క్షణంలో ఈ వార్త లలిత. నరేన్ లకు చేరింది. వారిద్దరు వచ్చేశారు.    
    అందరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు.    
    "అలా కూర్చుంటే ఏమౌతుంది? ఏం చెయ్యాలో ఆలోచించండి నెల్లూరుకి తీసుకుని వెళ్ళే
    "అక్కడికి వెళితేనా లాభించదేమో."
    "కాని మర్ధనలు చేయటం- చిన్న ఎక్సరీ సయిజులు చేయించటం ఎన్నో నేర్పుతారు. కొన్నాళ్ళకైనా నడవగల్గితే అదిచాలు."
    "మరి ప్రేమ ఇల్లు దిద్డుకుని నిలబడగల్గితే" అని అర్దోక్తిలో ఆగారు శ్రీనివాసరావు.
    "అదెంత భాగ్యం. గు'రు ఈ విషయంలో నిశ్చింతగా వుండండి" అన్నది ప్రేమ.    
    నిరంజన్ అన్నాడు! నాన్నా-మెమెలాగో ఇక్కడ అన్నీ చూచుకుంటాము. మీరు తప్పక అమ్మతో వెళ్ళండి. అంతకన్నా ఉచితం ఏదీలేదు. ఇక్కడ మాకందరికీ దైర్యంగా వుంటుంది." ఈ సలహా అందరికీ ఆమోదమైంది.
    "కబురువిన్న సరళ. రమణ వున్నపళంగా వచ్చేశారు రామారావు భార్య కూడావచ్చి చూచివెళ్ళారు.

                                  29

    "నాన్నా - నాగాపూరీలో నాకుద్యోగం వచ్చింది. వెంటనే వచ్చి చేరమన్నారు..." ఉత్తరం తండ్రి కందించింది గీత.
    రఘుపతి కనుబొమలు చిట్లించాడు. ఉత్తరం సాంతం చదువకుండానే అన్నాడు ఎందుకమ్మా - సమ్మతి తెల్పమన్నారు .... అంత దూరం .... ఒంటరిగా వుండాలి.....వద్దు.....వద్దు.
    "నాన్నా- ఏమిటి మీరనేది"
    "దొరికితే ఇక్కడ చెయ్యి లేకపోతే మానేయ్"
    గీత పేలవంగా నవ్వింది ఆ తర్వాత బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కళ్ళలోనీరు నింపింది ఇక్కడెక్కడా దొరకలేదుగా- నాన్నా! ఇప్పుడు నువ్వు వెళ్ళవద్దని అజ్ఞానినై నేనేం చేయాలి." రఘుపతి మాట్లాడలేదు; గీత మొండిఘటం అని అతనికి భయం .... గీత మాట్లాడ సాగింది.
    "ఎంత డబ్బు - ఎంత శ్రమ ఎన్ని గంటలు రాత్రుళ్ళు కూచునిచదివాను ఎంత ప్రయాసపడ్డాను! దీక్షతో చదివిన చదువిది. అనుక్షణం దాని విలువను గ్రహించాలి. నాకు నూటఏభై అక్కడ ఖర్చయినా - మీకు నూటఏభై పంపగలను అదెంత సహాయ పడ్తుందో. మీకు తెలుసు ... ..."
    "ఆ(.....ఆడపిల్లవు నువ్వు ఎక్కడో పని చేసి మాకు పంపిస్తే మేము కూర్చుని తింటానూ! కూతురికి పెళ్ళిచేయకుండా వాని సంపాదన మీద బ్రతుకు తున్నారన్న అపవాదు మాకు నేనికి తల్లీ .... కొన్నాళ్ళాగు. ఇక్కడే ఎక్కడో నని దొరకవచ్చు." అని తాయారమ్మ అన్నది.
    "చదువుకుంది పనిచేయటానిక్కాదా! ప్రేమలాటి వాళ్ళు చదువుకుని ఆఫీసర్ల భార్యలై హాయిగా వుంటారు. వారి చదువుకు సార్ధకం అంతే మన స్థితిగతులు వేరు. నేను చదువుకుంది పనిచేయటానికి."
    "బంధువులు ఊరుకోరు తల్లీ"

                                   
    "ఎక్కడో తెనాలి దగరున్న బంధువుల ఇష్టాయిష్టాల మీద మన జీవిత గతులు ఆధారపడి వుంటాయన్న మాట.....నాకు పెళ్ళి చేయలేదనేగా వాళ్ళు అనేది! డబ్బివ్వమను. లేకపోతే పెళ్ళికొడుకును తెమ్మను...... లేకపోతే ఇక్కడే వుద్యోగాన్నివ్వమను. అంతే కాని నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే చూడలేకపోవడం దేనికి!"
    కూతురు వెటకారంగా అంటుంటే తాయారమ్మ నేత్రాలు విస్ఫులింగా అయ్యాయి. ఆ మాటలు కేవలం భార్యనుద్దేశించి అన్న మాటలు కావని రఘుపతికూడా గ్రహించాడు. కూతురి వంక సాలోచనగా చూచాడాయన. గీత అంటే అతనికంతరాంతరంలో ఓవిధమైన గర్వం. బుద్దిమంతురాలు. సర్వ లక్షలు సన్నిహితురాలు గీత తన కూతురై పుట్టినందుకెంతో సంతోషంగా వుండేది. ఆమె అనుకున్నది తప్పకుండా నెరవేరాలి! ఆ పట్టుదల. సమయస్పూర్తి విజ్ఞానం శక్తి ఆమెలో ఉన్నాయి. రాను రాను ఆమె విషయంలో ఒక విధమైన భయం అంకురించింది. గీత నాగపూర్ వెళ్తుంది ఒక్కర్తే వుంటుంది. అక్కడ ఏదో జరుగుతుంది. అన్న శంక అతన్ని పీడిస్తోంది.కూతురి వెనక చూచి ముఖం త్రిప్పుకున్నాడు.
    "పెళ్ళి చేయిలేకపోయానని చదివించాను. ఆ చదువుకు నేనేమీ వెచ్చించలేదు. అంతే నువ్వు చూచుకున్నావు. మీరంతా పెద్దవాళ్ళయి పోయారు. చేయి పట్టుకుని మార్గం చూపగల్గే శక్తి మాలోలేదమ్మా నశించిపోయింది.....నువ్వు దూరంగా, ఒంటరిగా, వుండాలే అన్న బాధ తప్పితే "అతని కంఠం రుద్ధమైంది...."
    గీత తండ్రి బాధను వెంటనే గ్రహించింది. కుర్చీవెనక ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్లు ఆమె ముఖంలో నూతన కాంతిప్రకాశించింది.
    "నాన్నా-చాలా కాలేజీలకు అప్లయిచేశాం ఎక్కడా రాకపోతే నాగ్ పూర్ వెళ్తాను. లేకపోతే నాకు తృప్తి ఉండదు. మీరంగీకరిస్తే నామనసు శాంతిస్తుంది. అంగీకరంచకపోయినా వెళ్ళాలనే నిశ్చయించాను.
    ఈ విషయంలో గీత స్థిర నిశ్చయాన్ని ప్రకటించింది. తాయారమ్మ పుష్ప రఘుపతి ఎవరూ తమతమ అభిప్రాయాలను చెప్పలేదు. చెప్పేదేమీ లేదు. గీత తన నిశ్చయం మారదన్నదిగా. పరిస్థితి ఉద్విగ్నంగా ఉన్న ఈ సమయంలో వెంటేష్ ను వెంటబెట్టుకుని వచ్చింది మేనత్త.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS