సరిత తనకార్లో స్వంత డ్రయివింగ్ చేసుకుంటూ రాత్రికి రాత్రి ఊరు విడిచి ద్వారకాలాడ్జి చేరుకొని వెనుకనున్న బాత్రూం నుంచి లోపల ప్రవేశించి నిద్రలో వున్న రంగారావు, వనజలను ఫారిన్ సెంట్ ప్రభావానికి గురిచేసి రంగారావును కత్తితో పొడిచేసి చంపేసింది. సరిత యిల్లు వదలలేదన్నట్లుగా పద్మ మసలింది.
ఈ కథవిన్న వెంకన్న షాక్ తిన్నాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అతనికి కాసేపు పట్టింది. ఆ తర్వాత వెంటనే సరిత యింటికి పరుగెత్తాడు.
అతను చెప్పిన కథవిని "ఈ కేసులో ఎందరో అభాగ్యజీవుల జీవితాలు ముడిపడివున్నాయన్న బాధ లేకుంటే నేను నా నేరానెప్పుడో ఒప్పుకోని వుండేదాన్ని!" అంది సరిత.
10
సరిత, నీరజ, వసంత, గౌరి, పద్మ, వనజ, ప్రకాశం, వెంకన్న-సరిత యింట్లో ఓ హాల్లో సమావేశమయ్యారు.
"మీలో రంగారావును చంపిన వ్యక్తి వున్నారు. ఆ వ్యక్తి యెవరో నాకు తెలుసు. రంగారావు వంటి నయవంచకుణ్ణి చంపిన ఆ వ్యక్తిని నేనభినందించినప్పటికీ హత్యానేరాన్ని మన్నించలేను. అయినా ఆ వ్యక్తిని నేను ప్రస్తుతానికి బయటపెట్టడం లేదు. రంగారావులాంటి నయవంచకులు మీలో కూడా కొందరున్నారు. మీ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి నేను మీకు కొన్ని మాసాలు అవకాశమిస్తున్నాను. ఈలోగా సరిదిద్దుకోలేక పోతే రంగారావును చంపిన ఆ వ్యక్తి చేతిలోనే మీరూ మరణిస్తారు. మీకు హెచ్చరికగా ఆ వ్యక్తిని వదిలిపెడుతున్నాను" అన్నాడు వెంకన్న.
ఎవ్వరూ మాట్లాడలేదు.
సరిత వెంకన్న చేతికి ఓ చెక్కు అందించి "ఈ కేసును అపూర్వంగా పరిశోధించారు మీరు. నా కుటుంబపు పరువు మర్యాదలను కూడా కాపాడారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు" అంది.
ఆ చెక్కు విలువ పదివేల రూపాయలు! అది జేబులో ఉంచుకొని-"నేరస్థుల్ని పట్టివ్వడం నా అభిమతంకాదు. నేరాల్ని అరికట్టడం నా అభిలాష! ద్వారకా లాడ్జి ప్రొప్రయిటర్ సూరిబాబు కోరికపై ఈ కేసులో దిగి ఇప్పటికీ-మీ అందరి క్షేమం దృష్ట్యా అతడి కోరికను మన్నించలేక పోతున్నాను...." అన్నాడు వెంకన్న.
* * *
"సీతమ్మా, రాజమ్మా..." అంటూ పిలిచాడు వెంకన్న.
ఇద్దరూ వంటింట్లోకి వచ్చారు.
"ఇది ఫారిన్ సెంటు. దీని వాసన అద్బుతం...." అంటూ వెంకన్న ఇద్దరికీ చెరో రుమాలూ యిచ్చాడు. యిద్దరూ వాసన చూసి ఉన్నవాళ్ళు ఉన్నపళంగా కూలబడిపోయారు.
వెంకన్న చటుక్కున భార్యను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు.
పద్మావతీదేవి కంగారుపడిపోయింది. వెంకన్న మాత్రం తాపీగా ఆమెకు ఫారిన్ సెంటు కథ చెప్పాడు.
"మీకూ, ఆ రంగారావుగాడికీ తేడా ఏముంది? వాడికున్నలాంటి సరదా మీకూ ఉంది...." అంది పద్మావతీ చిరుకోపంతో.
"ఆ రంగారావు బుద్ది మగాళ్ళ కందరకూ యెంతో కొంత ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అదిలా బయటపడుతోంది. అవకాశం రాకుండా చేయడం నా ధర్మం...." అన్నాడు వెంకన్న.
"రహస్యంగా ఉంచాలనుకొన్న ఈ విషయం ఎలా బైట పెడతారు?" అనడిగింది పద్మావతీదేవి.
"నాకు తెలిసిన ఓ రచయిత ఉన్నాడు. అతని రచనలు ప్రచురించే అపన ఉంది. అపనను చదివే పాఠకులు అసంఖ్యాకం. పోలీసుల ప్రమేయం లేకుండా నా పరిశోధనా ఫలితాలను పరోక్షంగా పాఠకుల కందజేసే విధానం అదే!" అన్నాడు వెంకన్న.
"ఈ కేసులో వనజ బయటపడే అవకాశమెంతో ఉంది! బయటపడితే పోలీసులామెనే హంతకురాలంటారు...." అంది పద్మావతీదేవి బాధగా.
"పిచ్చి దేవీ! దిగులుపడకు. ద్వారకా లాడ్జిలోని బేరర్ కు మాత్రమే ఆమె ఉనికి తెలుసు. ఆమెను గుర్తు పట్టగల రిసెప్షనిస్టుకు ఆమె ఉనికి తెలియదు. ఉనికి తెలిసిన బేరర్ నా ఉప్పు తిన్నాడు. వనజకు ప్రమాదంలేదు. ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం వనజ, ప్రకాశంలకు ప్రమాదం తప్పదు...." అన్నాడు వెంకన్న.
పద్మావతీ దేవి నిట్టూర్చింది. వెంకన్న ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆమె అభ్యంతర పెట్టలేదు.
వాళ్ళకు యెదురుగా ఫారిన్ సెంటు మత్తులోవున్న సీతమ్మ, రాజమ్మ యేదో అద్బుత దృశ్యాన్ని చూస్తున్నట్లుగా ముఖంపెట్టి వున్నారు.
:-ఐపోయింది:-
